మహిళా విద్యా వేత్తకు ఎన్నెన్ని అడ్డంకులో ?
మనదేశం లోపూర్వ కాలం లో మహిళ విద్యకు ప్రాముఖ్యముండేది కాదని మనకు తెలిసిన విషయమే .మరి ఆ .మహిళ ఒక విద్యా వేత్తయే అయితే ,ఆమెకు ఎదురయ్యే ఆటంకాలు ఇన్నీ అన్నీ కావు .పోనీ ఇతర దేశాలలో ఆకాలం లో ఇంతకంటే భిన్నం గా ఏమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి .మరీ ఆధునికం, నాగరికతా నిలయం అని అనుకొన్న యూరప్ లోనూ ఇదే పరిస్థితి .ఒక సారి ఆ కథలూ, గాథలనూ తెలుసుకొందాం ..
సుమారు 350 ఏళ్ళ కిందట ఇటలీ లోని’’ పాడువా కెథడ్రిల్ యూనివర్సిటి’’ నుంచి అరిస్టాటిల్ మాండలికాల మీదప్రపంచం లోనే మొట్ట మొదటి డాక్టరేట్ ను పొందే నిమిత్తం పరీక్షకు హాజరయిన మహిళ ‘’హెలీనా కోర్నాటో పిసోపియ ‘’ ఉదంతాన్ని వింటే ఆశ్చర్యమేస్తుంది .
ఆమె వెనీస్ నగరం లోనే మహా ధనికుడైన ముప్ఫై రెండేళ్ళ వ్యక్తికి జన్మించిన ఏకైక కుమార్తె .చురుకైన తెలివి తేటలు గలవిద్యార్ధిని గా పేరుపొందింది .ఏడో సంవత్సరం నుంచే తత్వ వేత్త అరిస్టాటిల్ ను అధ్యయనం చేయటం ప్రారంభించింది .ఆమె విద్యా విషయం లో చూపే చొరవకు తండ్రి చాలా సంతోషించి అన్ని విధాలా తోడ్పడ్డాడు ..విశ్వ విద్యా లయం లో చేరక ముందే ఆమెకు అతి సమర్ధులైన ట్యూటర్లను నియమించి ఇంటి వద్దనే విద్య నేర్పించాడు .అప్పటికే ఆమెకు గ్రీకు ,ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ ,స్పానిష్ హిబ్రు ,అరబిక్ ,చాల్దైక్ భాషలు పూర్తిగా అలవడ్డాయి .ఈ అసాదారణ ఏకైక మహిళా విద్యావేత్తను గురించి విన్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆమె ఎలా పరీక్షలలో జవాబులు చెబుతుందో ప్రత్యక్షం గా చూడాలనుకొని , కొన్ని వందలమంది జనం చేరుకొన్నారు .కనుక పరీక్ష వేదిక ను విశ్వ విద్యాలయ ప్రాంగణం నుంచి కెథడ్రిల్ కు మార్చాల్సి వచ్చింది
ఎలీనా ముందుగా . థియాలజీ లో డాక్టరేట్ కోసం దరఖాస్తు పెట్టుకోంది.థియాలజీ విభాగం చాన్సెలర్ ,ఆర్చిబిషప్ అయిన కార్డినల్ గ్రేగారియో బార్బెరిగో బిషప్ నిరాకరించాడు ‘’ఆడవాళ్ళు పిల్లల్ని కనటానికి మాత్రమే అర్హులు .చదువు సంధ్యలకు కాదు .’’అని అభిప్రాయ పడ్డాడు .ఈ విషయాన్నేఆయన ఫ్రెంచ్ కార్దినల్ కు చెబితే ఆయన పగల బడి నవ్వాడట .ఆమె పట్టుదలను చూసి బిషప్ ‘’కావాలంటే ఫిలాసఫీ ‘’లో డాక్టరేట్ కు పర్రీక్ష నివ్వచ్చు నని తేల్చి చెప్పాడు .దేనికైనా రెడీ అంది ఆమె. దానికే తయారైంది .పరీక్షాదికారులు ఆమె స్త్రీ అని ఏమాత్రం జాలి తలచకుండా కఠినం గా నే ప్రశ్నించాలని నిర్ణయించారు .లేక పోతే యూని వర్సిటి పరువు గంగలో కలుస్తుందని భావించారు .
ఎలీనా అత్యంత సమర్ధం గా ,బుద్ధి కుశలత తో అడిగిన వాటికన్నిటికీ లాటిన్ భాషలోనే సమాధానాలు చెప్పి,వారిని అప్రతిభులను చేసింది .ఒక అరగంట పరీక్ష లోనే ఆమె ప్రతిభ కు అబ్బుర పడి, ఆమెకు ఫిలాసఫీ లో డాక్టరేట్ ను ప్రదానం చేశారు ‘’డాక్టరల్ రింగ్’’ ను ఆమె వ్రేలికి తొడిగి అరుదైన గౌరవాన్ని కల్పించారు .అక్కడికి చేరిన అశేష జన సమూహం ఒక్క సారి గౌరవం గా లేచినిలబడి హర్ష ధ్వానాలు చేశారు .భగవంతుడిని స్తుతించే ‘’టే డ్యూమ్ ‘’.ఆలపించారు .ఆనందభాష్పాలు రాల్చారు .ఇదీ మొదటి మహిళా విద్యా వేత్త కు జరిగిన పరీక్ష ,ఆమె సాధించిన అపూర్వ విజయ గాధ .
శతాబ్దాలు మారినా పరిస్థితి లో మార్పేమీ పెద్ద గా రాలేదు .ఇక్కడే విద్యా వేత్తలు ,సామాజిక శాస్త్ర వేత్తలు స్త్రీ విద్య నేర్వటానికి నాలుగు ముఖ్య విషయాలు కావాలని సూచించారు .మొదటిది ఆమె జీవించటానికి తగిన ఆధారం ఉండాలి .పదిహేడవ శతాబ్దానికి మహిళా జీవిత కాలం 1750 లో ముప్ఫై రెండు మాత్రమే .పందొమ్మిదో శతాబ్దం లో ఇది నలభై రెండుకు చేరుకొన్నది .స్త్రీ కి వివాహంచేసుకోవటం ,సంతానం కనటం తో సరిపోయి, ఏదో వానా కాలం చదువే అబ్బేది .విద్యా వేత్త గా ఎదిగే అవకాశం తక్కువే .పైన చెప్పుకొన్న ఎలీనా పదకొండవ ఏటనే వివాహం ఆడరాదనే స్థిర ప్రతిజ్ఞ తీసుకొని నిలుపు కొంది .ఆమె జీవిత ధ్యేయం’’ బెనేడిక్తైన్ ఆర్డర్ ‘’లో ప్రవేశించటమే .
రెండవది – స్త్రీ విద్యా వంతు రాలు కావాలంటే ఆమెకు మౌలిక విద్య తెలియాలి అంటే చదవటం రాయటం తెలిసి ఉండాలి .1650 లో లండన్ నగరం లో ఉన్న మహిళల్లో పది శాతం మందికి మాత్రమె సంతకం చేయటం వచ్చు అని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది .మగవారు చర్చి ఉద్యోగాల్లో ,మిగిలిన ఉద్యోగాలలో పని చేస్తూ వంద శాతం అక్షరాస్యులుగా ఉండటం మరీ వింత..క్రింది తరగతి పురుష ఉద్యోగుల్లో మాత్రం పదిహేను శాతం మంది మాత్రమె అక్షరాస్యులు .1700 కాలం నాటికి మహిళల్లో సగం మంది సంతకాలు చెయ్యటం నేర్చారు .మిగిలిన ప్రాంతాలలో మహిళా అక్ష రాస్యత మరీ తక్కువ గానే ఉంది .
మూడవ విషయానికి వస్తే –స్త్రీ విద్యా వేత్త కావాలంటే ఆమె ఆర్ధిక పరిస్థితి బాగా ఉండాలనేది .ధన వంతుల కుటుంబాల్లో పుట్టిన వారికే ఈ అదృష్టం దక్కేది .వారికి ఇంట్లో స్వంత లైబ్రరి ఉండేది ,ప్రైవేట్ గా చదువు కోవటానికి ట్యూటర్లను పెట్టుకొనే సామర్ధ్యం ఉండేది .కాని బీదా బిక్కీ స్త్రీలకూ కనీస విద్య అంటే చదవటం రాయటం కూడా గగన కుసుమమే .చర్చిలు, క్రైస్ట్ హాస్పిటల్స్ లండన్ లో నిర్వహించే విద్యాలయాల్లో బాలురు మాత్రమె చేరే వారు .ధార్మిక విద్యాలయాలలో చదివే ఆడ పిల్లలు కుట్టు పని ,లేసుల అల్లికా ,మొదలైన ఇంటి పనుల్లో ఉపయోగ పడే విద్య నేర్చే వారు .
విద్యా వంతు రాలైన స్త్రీ కి కావలసిన నాలుగవ ముఖ్య విషయం –ఆమెచర్మంమందంగా ఉండాలట .ఆమె బహి రంగం గా వేదిక లేక్కాలంటే ధైర్యసాహసాలు ఉండాలి . .18 వ శతాబ్దపు ఇంగ్లాండ్ లో ప్రసిద్ధి చెందిన మహిళా రచయిత్రి’’ లేడీ మేరీ మాంటేగ్’’ రాస్తూ తన మనవరాలు ఒంటరిగా యే కుంటీ, గుడ్డీ గానో గడపాల్సి వస్తోందని అన్నది .ఇదీ ఆనాటి విద్యా వంతులయిన స్త్రీల దీన పరిస్థితి ..కొద్ది మంది మగ మేధావులు -పదహారో శతాబ్దపు ‘’రిచర్డ్ మాలిస్తర్ ‘’, పదిహేడో శతాబ్దానికి చెందిన ‘’పౌలియన్ డీ లా బారీ’’లు మహిళా విద్యనూ, విద్యా వేత్తలను ప్రోత్స హించారు .అలాగే ‘’బాస్త్యువా మెకిన్ ‘’,’’మేరీ వోల్లెన్ స్టోన్ క్రాఫ్ట్ ‘’వంటి మహిళాభ్యుదయ మహిళా రచయితలు మహిళల మేదావితనాన్ని గుర్తించి పూర్తి మద్దతు నిచ్చారు .చర్చి తో సహా అనేక వృత్తుల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని ఉద్యమించారు .గ్రామర్ స్కూళ్ళలో కూడా బాలికలకు ప్రవేశం కల్పించాలని ఒత్తిడి తెచ్చారు .మగ వారికి, దేనిలోనూ మహిళలు తక్కువ కాదని నిరూపించారు .విద్యా వేత్తలు అవటానికి మహిళలకు అన్ని రకాలా సామర్ధ్యం ,తెలివి తేటలు ఉన్నాయని ప్రపంచానికి ముక్త కంఠం తో చాటి చెప్పారు .మహిళా విద్యకు, ఆమె విద్యా నేతృ త్వానికి అడ్డు నిలిస్తే ఖబడ్దార్ అని ప్రకటించారు .మహిళ ఇప్పుడు వీటన్నిటినీ అధిగమించి అన్నిటా ముందుకు దూసుకొని వెళ్లటం శుభదాయకం ,సంఘానికి శ్రేయస్కరం .
–గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~