నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’

వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి (అప్పటి పత్రికా ప్రకటన ఆధారంగా). అంటే దాదాపు ఉన్న జనాభాకు మించి నాలుగు రెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా సాధించిన అసాధారణ రికార్డు ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ రోజున ఇలాంటి ఆదరణను ఏ సినిమా అయినా పొందిందంటే అది రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమా అవడం ఖాయం! ‘లవకుశ’ చిత్రం విడుదలై యాభై ఏళ్లయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు…

రామాయణం అంటే ఓ నీతి కథ. సమాజానికి మంచిని బోధించడానికి ఆదర్శప్రాయుడైన ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక రాజు… వంటి పలు రకాల పాత్రల్ని చూపించిన గొప్ప కావ్యం. ప్రధానమైన ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించడం ‘లవకుశ’ ప్రత్యేకత. ఎలాంటి శృంగార భావనలకు చోటు కల్పించకుండా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు ప్రాతినిథ్యం లేకుండా ఒక సినిమా తీయడం, అది అఖండ విజయాన్ని సాధించడం ఏ రకంగా చూసినా అపూర్వమైన చరిత్ర.
మూడు గంటల యాభై నిమిషాల నిడివి కలిగిన చిత్రంలో దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల కాలం 36 పాటలు, పద్యాలతో ప్రేక్షకుల్ని రంజింపచేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకుడు ఘంటసాలదే. ‘తెలుగునాట రామాలయం లేని ఊరు లేదు, ‘లవకుశ’ పాటలు మోగని గుడిలేదు, వాటిని వినని తెలుగువాడు లేడ’నేది ఒక నానుడిగా మారింది. ఇప్పటి వాణిజ్య పరిభాషలో ఇది రూ. వంద కోట్ల ఆడియో అని చెప్పాలి.
అనితర సాధ్యమైన ప్రజాదరణ
మొదట 1963 మార్చి 29న విడుదలైన 26 కేంద్రాల్లోనూ శత దినోత్సవం జరుపుకుని, లేట్ రన్‌లో 46 కేంద్రాల్లో వంద రోజులు నడిచిన ఏకైక చిత్రంగా నేటికీ నిలిచింది ‘లవకుశ’. తెలుగునాట మొట్ట మొదటిసారి 500 రోజులు ఆడిన సినిమా ఇదే. అదివరకు రికార్డు రామారావే నటించిన ‘పాతాళభైరవి’ది. అది 245 రోజులు ఆడింది. అంటే దానికంటే రెట్టింపు పైగా రోజులు నడవడం ‘లవకుశ’ ప్రత్యేకత. రిపీట్ రన్‌లలోనూ ఈ సినిమా మాదిరిగా ఆడిన సినిమా మరొకటి లేదు. 
రిపీట్ రన్‌లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాల్లో ఏడాది పైగా రన్‌ను నమోదు చేసిన సినిమా దేశంలో ఇదొక్కటే అవుతుంది. తమిళ వెర్షన్ సైతం ఘన విజయం సాధించి మధురైలో 40 వారాలు ఆడటం, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకోవడం ద్వారా దేశమంతటా నీరాజనాలు అందుకుంది. భారత సినీ చరిత్రలో ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషల్లో రెండు సార్లు విజయాలను సాధించడం (మొదట ‘పాతాళభైరవి’, తర్వాత ‘లవకుశ’) నాటికీ, నేటికీ ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి బహుమతి అందుకుంది. ఒకే సంవత్సరం ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘కర్ణన్’ (తమిళం) వంటి మూడు అవార్డు చిత్రాల్లో నటించినందుకు గాను రామారావు సైతం రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతిని అందుకోవడం విశేషం.
ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని ఇప్పటిదాకా మరే నటుడూ అందుకోలేదు. తెలుగులో మొదటి వర్ణ చిత్రమైన ‘లవకుశ’ విడుదలై యాభై ఏళ్లయినా ఇప్పటికీ థియేటర్ల ద్వారా, డీవీడీల ద్వారా, టీవీల ద్వారా, ఆడియో ద్వారా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. ఈ విషయంలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలు మాత్రమే ‘లవకుశ’తో సరితూగుతాయి.
మహామహుల కలయిక

అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందులోని పాత్రధారుల గురించి. మహామహులు నటించినా వారు కనిపించరు, వారి పాత్రలే తెరమీద కనిపిస్తాయి. శ్రీరామునిగా నటించిన రామారావు, సీత పాత్రతో అంజలీదేవి అప్పట్లో ప్రేక్షకులకు దైవ సమానులైపోయారు. ఎక్కడికి వెళ్లినా వారికి పాదాభివందనాలు చేసి, హారతులు పట్టి తమ భక్తిని చాటుకునేవారు జనం. వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణునిగా కాంతారావు, లవకుశులుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, భూదేవిగా ఎస్. వరలక్ష్మి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
దర్శకులైన తండ్రీ తనయులు చిత్తజల్లు పుల్లయ్య, సి.యస్. రావు, రచయిత సదాశివబ్రహ్మం, ఛాయాగ్రాహకుడు పి.ఎల్. రాయ్, ట్రిక్స్ నిపుణుడు రవికాంత్ నగాయిచ్ తదితర సాంకేతిక నిపుణులంతా ఈ చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. నలభై తొమ్మిదేళ్ల తర్వాత ఇదే సినిమాని ‘శ్రీరామరాజ్యం’ పేరుతో తీయగా ఎన్టీ రామారావు కుమారుడైన బాలకృష్ణ హీరోగా నటించి మెప్పించడం, దానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు రావడం గమనార్హం. అలా నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శ్రీరామునిగా ఎన్టీఆర్ ముద్ర కొనసాగుతూనే ఉండటం విశేషం!


It is a very good review. We do not know many things event hough we liked this movie very well.
LikeLike