ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’
నాకు అత్యంత ఆప్తులు సాహితీ స్వరూపులు మిత్రులు శ్రీ ఒగిరాల సుబ్రహ్మణ్యం గారిది ఉయ్యురు దగ్గర పెదఒగిరాల . పంచాయత్ రాజ్ లో గుమాస్తాగా గన్నవరం దగ్గర పెదవటపల్లి లో పని చేసి రిటైర్ అయారు .దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది .మా సాహిత్య సభలకు తప్పక వస్తారు .ఒక సారి వారికి మా తలిదండ్రుల పేరిట ఆత్మీయపురస్కారం అందజేశాం .మా ఇళ్ళల్లో శుభకార్యాలకు ఆయన భార్య తో సహా వచ్చే వారు .మేమూ వారింట శుభకార్యాలకు హాజరయ్యేవారం .మంచి ఆశుకవి. సహజ కవి. భక్తితో శతకం రాసి నా అభిప్రాయం కోరి రాయించుకొన్నారు .దాని ఆవిష్కరణ పెదవటపల్లిలో ఆ నాటి గన్నవరం శాసన సభ్యులు గద్దె రామ మోహన రావు గారు చేస్తే నేనూవ వెళ్లాను .మళ్ళీ ‘’అర్ధ శతకం ‘’రాసి నా అభిప్రాయం కోరితే16-1-2009 న రాసి పంపాను .అందులోని విషయాలే ఇప్పుడు మీకు తెలియ జేస్తున్నాను ‘
ఓగిరాల వారు కవిత వాగ్ధారగా ప్రవహింప జేసే నేర్పుస్వయం సిద్ధం గా అబ్బిన కవి .భావం కోసం ,పదం కోసం వెదుకులాట ఉండదు .ఎన్నో శతకాలు భావ బంధురం గా రాశారు అన్నీ నాకు చూపించే ప్రచురించారు .ఎంతటి భక్తీ కవో అంతటి సామాజిక స్పూర్తి ఉన్న ప్రజాకవి కూడా .కవి క్రాంత దర్శి అన్నది జగమెరిగిన విషయమే .కవి సమాజం లని లోపాలు గుర్తించి రంద్రాన్వేషకుడూ కావాలి .అంటే ‘’కంత దర్శి ‘’అవాలి .అప్పుడే చెడును చెరిగి మంచిని ప్రోదు చేయటం సాధ్యం .కవులంతాయేదేవుని పై శతకం రాసినా ఈ సూక్ష్మాన్ని వదిలి పెట్టలేదు .ఆ మార్గం లోనే సుబ్రహ్మణ్య కవీ ప్రయాణం చేశారు .’’వారిజాక్ష మాల ‘’గా 54 పద్యాలు అల్లారు .అందుకే దాన్ని ‘’అర్ధ శతకం అన్నాన్నేను .అర్ధ వంత మైన భావాలున్న శతకం అని కూడా అర్ధం .
కవి సహజం గా సమాజ హితైషి .ఉద్యమాలు చేసి చైతన్యం కల్గిస్తారు .అయితే అందరు కవులు ఉద్యమ కారులు కాలేరు .,కారు కూడా .వెనక ఉండి చైతన్యం కల్గిస్తారు .అలాంటి తెర వెనుక కవే వీరు .సమాజం లోని రుగ్మతలను నిత్యం చూస్తూ బాధ పడుతూ ఏమీ చేయలేక నిట్టూరుస్తూ కనీసం ఆ వారిజాక్షుడైనా తన విత్ఫుల్ల సరోజ నేత్రాలను తెరచి లోకం లో జరిగే అన్యాయాన్ని చూసి జనానికి బుద్ది చెప్పి సమాజ ప్రగతికి తోడ్పడి బహుజన హితాయ బహుజన సుఖాయ గా కర్తవ్య బోధ చేస్తాడనే వీరి నమ్మకం .అందుకే గజేంద్రుని లా ‘’నీవే తప్ప ఇతః పరం బెరుగ ‘’అన్నట్లు దీనం గా ప్రార్ధించి తన గోడు విన్న వించారు ‘’మన్య కవి ‘’,సుబ్రహ్మణ్య కవి గణ్యకవి .ఆశయం మహోత్రుస్టమైంది .అంతా భగవంతునిదే భారం .అన్నంత గా శరణా గతులయ్యారు .ఇదీ ఓ మార్గమే .ప్రత్యక్ష కార్యా చరణకు బదులు పరోక్ష తోడ్పాటు .ఆ వేదన బాధా చింతన ,మనోవేదన ,నిట్టూర్పు నీరవ స్తితి నుంచి ఉద్బుద్ధమైంది ఈ శతకార్ధం .
విందులు వినోదాల పేరిట జనాన్ని పిలిచిఆహారాన్ని ఇష్టం వచ్చి నట్లు తిన్నంత తిని మిగిలింది పారేసే మూర్ఖులను చూసియేవగించుకొన్నారు కవి .ఆ మిగిలింది అవసర మైన నిర్భాగ్యులకు పెడితే వారి పొట్టలు నిండవా వారిజాక్షా అని నిలదీశారు పోనీ ఆ మిగిలిన ఎంగలాకుల్లోని పదార్ధాలను కాకులాకు పెడితే వాటికీ పితరులకూ తృప్తి కాని వాటిపై బడి తిండికోసం వెంపర్లాడే నిర్భాగ్యుల్నిచూసి జాలి .పాప భీతి తగ్గి దైవం సోమ్మ కాజేయటం లోక సహజమైనదని ఆకాశ హర్మ్యాల లు , అందులో జరిగే పాపాల వల్ల నేల కుంగి పోతోందని మనసు లో కున్గిపోయాడుకవి .అకాల వర్షాలు అన్నం పెట్టె రైతు నడ్డి విరుస్తున్నాయి పంట చేతికొచ్చే సమయానికి వరుణుడు కడుపు కొడుతున్నాడు .
ఏ మతం వారైనా స్వార్ద పరులే .పరహితం తక్కువ .ఆడంబరం జాస్తి .ఏదో చిన్న పొరబాటు జరిగిందని వైద్యుని పై చెయ్యి చేసుకోవటం ధర్నాలు చేయటం సిగ్గుచేటు అంటారు .కానీ పెంచి పెద్ద చేసే తలిదండ్రుల కాస్త సుఖాలు చూడని పుత్రులు పుట్టనేమి గిట్టనేమి అని వేమన్న లా బాధ పడ్డారు .పెంచలేక పిల్లల్ని అమ్ముకోవటం ఆత్మ హత్యకు పాల్పడటం తప్పు అన్నారు .విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిన కాలం లో విచక్షణ లోపించి ప్రాణికోటికి ముప్పు ఏర్పడుతోందని వ్యధ చెందారు .
నిస్వార్ధ జీవితం అత్యున్నతమైనదని నడిరోడ్డు మీద గప్పాలు కొడుతూ అమూల్య కాలాన్ని వృధా చేస్తున్నారని వాపోయారు .రాగింగ్ ,ప్రేమ పేరుతో యువత హద్దు మీరి ప్రవర్తించి నాగరక లక్షణాలు కోల్పోతోందని అది హర్షణీయం కాదని భావించారు .ఇది సగటు మనిషి ఆవేదనే .రక్షక భటులు భక్షకులౌతున్నారు .ఉదాసీనత పెరిగింది .కర్తవ్య పాలన లేదని మౌన రోదన చెందారు .అన్నిటా అవినీతి కోర్టులు కూడా దీనికి భిన్నం కాదు .కోర్టు తీర్పుల్లో అస్తవ్యస్తత ,న్యాయాదీశుల్లో లంచ గొండితనం జాతిని సిగ్గుపడేట్లు చేస్తున్నాయి .ధర్మాన్ని రక్షించే సంస్థలే దిగజారి పోతే జాతికి రక్షణ ఏది అన్నారు
ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ట్లు ప్రకటనలు గుప్పించి వారికి అందకుండా మధ్యలోనే గుట్కా యస్వాహా చేసే దేశముదుర్లని ఈసడించారు .మనదేశం మొదటి నుంచి వ్యావసాయక దేశమే నని రైతే దేశానికి వెన్నెముక అని అన్నదాత అని గుర్తు చేశారు .అలాంటి పంట భూములను సెజ ల పేరిట నంజుకు తింటూ రైతు కడుపు కొడుతున్నారని బాధ పడ్డారు .ఫాషన్ల మోజులో వెర్రి చేస్టలతో జాతి పరువు మంట గలుపుతున్నారని ఆవేదన చెందారు .అనుకరణ కొంతవరకే మేలు .అదే దారి పడితే అధోగతే .తస్మాత్ జాగ్రత్త గా హెచ్చరించారు .
గ్లోబల్ వార్మింగ్ పెరిగి వాతావరణం లో అనూహ్య మార్పులు వచ్చి మంచు భూములు కరిగి వర్షాభావం ఏర్పడి ప్రజా జీవనం అస్తవ్యస్తమైందనిదని ఆవేదన చెందారు .వసుధైక కుటుంబం భావన బల పడాలని కోరుకొన్నారు .జాతికి పట్టని చీడ లేదు మళ్ళీ గాంధీ పుట్టి ఉద్ధరించాల్సిందే నంటారు గాంధీగిరి యేశరణ్యం అంటారు దొంగనోట్ల ముద్రణ కుటుంబ పరిశ్రమ అయింది .నేర పరిశోధన కంటి తుడుపే .తిలా పాపం తలా పిడికెడు .అంతా నకిలీ అసలేదో కానిదేదో ఆ దేవుడే కనీ పెట్ట లేదన్నారు .ఓ వారిజాక్షా ఏమిటీ పరీక్ష అని మొత్తుకొన్నారు కవిగారు. కని పించిన ప్రతి అన్యాయాన్ని హింసా దౌర్జన్యాలనుఉతికి ఆరేశారు .కవిత్వం లో మంచి ధారా శుద్ధి ఉంది .తగిన పదాలతో భావ గాంభీర్యం గా ఉన్నాయి పద్యాలు .మనసులో నాని నాని, చింతనలో పండి పండి ,ఆవేశం తో రగిలి రగిలి ,ఆక్రోశం తో ఒదిగి ఒదిగి ,ఆవేదన లో కనలికనలి నిండు మనసుతో వెలువడిన పద్యాల మాల ఇది .ఇది ఆ వారిజాక్షునికి సమర్పించిన ‘’అర్ధాక్షర శతక మాల .అందర్నీ ఆలోచింపజేసే పద్యాలు .కవి గారి పరిణత అధ్యయ నానికి కవితాదారకు అద్దం పట్టే పద్యాల మాల .మనో రంజకం గా భావ సుగంధ బంధురం గా ఉన్న్నాయి మా ఉయ్యూరు కు ఆయన ఆస్థాన కవి .మాన్య కవి .చదివి ఆనందించండి .అభినందించండి ఇలాంటివి మరిన్ని సుబ్రహ్మణ్య కవి గారి నుండి రావాలనిమనసారా ఆశిస్తున్నాను .
మీ—గబ్బిటదుర్గాప్రసాద్ -1-4-13-ఉయ్యూరు

