కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3

కృషీవల కవి కోకిల దువ్వూరి  రామి రెడ్డి

రెడ్డిత్రయం లో రెండవ వారు దువ్వూరి రామి రెడ్డి .కవికోకిల బిరుదాంకితులు .1895 లో నెల్లూరు లో జన్మించారు .ఇరవై ఏళ్ళకే ‘’నలజారమ్మ అగ్ని ప్రవేశం కావ్యం1917 లో  రాశారు అర్వాత ఏడాది ‘వనకుమారి ‘’రచించారు .విజయ నగర కావ్య పరీక్ష లో ఉత్తీర్నుడైనారు వనకుమారి కావ్యం లోని ప్రకృతి వర్ణనలు అందర్నీ ఆకర్షించాయి .రామి రెడ్డి గారికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ‘,’కృషీవలుడు ‘’గ్రామీణ జీవితాన్ని కవిత్వీకరించిన వాడు రైతు పక్షాన నిలిచి అతని కృషికి మొదటి సారిగా కావ్య గౌరవం కల్పించినవాడు రామి రెడ్డి గారే .స్వీయప్రతిభ తో దేశీయ కావ్యం గా రాశారు ఆంగ్లం లోని పాస్టరల్ పోయిట్రీ ప్రభావం ఉన్నది .’’నా కవిత వనలత ‘’అని పత్రాలతో పుష్పాలతో దినదిన ప్రవర్ధమానమవుతోందని చెప్పుకొన్నాడు .’’జలదాంగన ‘’యువక స్వప్నం ,కడపటి వీడ్కోలు అనే ఖండకావ్యాలూ రాశాడు .మంచి భావుకత ,మనస్తత్వ పరిశీలన ఉన్నకవి గా ప్రసిద్ధి .పార్శీ భాషలో పండితుడైనాడు .

       ఉమరఖయాం రాసిన రుబాయీలను ‘’పాన శాల ‘’పేర అనువదించాడు .దీనితో రెడ్డి గారి ప్రతిభ పూర్తిగా వికశించింది .స్వతంత్రకావ్యమేమో నన్నంత గా తెలుగుదనాన్ని ఆ కావ్యం లో సొగసుగా అందించాడు .పాన శాల లో రెడ్డి గారు రాసిన ఉపోద్ఘాతం పండిత ప్రశంశలను పొందింది .ప్రేమకు ,ప్రకృతికి అడ్డం పట్టింది .1917 లో నెల్లూరు లో కట్టమంచి రామ లింగా రెడ్డి గారి చేతుల మీదుగా స్వర్ణ పతకం పొందారు .విజయవాడ లో ఆంద్ర మహాసభ వారు‘’కవికోకిల ‘’బిరుదు ప్రదానం చేశారు .మీరాబాయి ,మాధవ విజయం అనే రెండు నాటకాలు కూడా రాశారు .చివరి రోజుల్లో ‘’పలిత కేశం ‘’గులాబి తోట కావ్యాలు రాశారు .వివిధ విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు .ఇవన్నీ కలిపి‘’సారస్వత వ్యాసాలూ ‘గా పచురించారు .’’కాంగ్రెస్ వాలా ‘’అనే వ్యావహారిక నాటకమూ రెడ్డి గారు రాశారు .

      విజ్ఞాన శాస్త్రం పై రెడ్డి గారికి మక్కువ ఎక్కువ .అందులో విశేష కృషి చేసి తన ప్రజ్ఞ నిరూపించుకొన్నాడు .’’అణువునందున్న తేజస్సు యధిక మగును –ఒక్కభువనంబు జూర్నించి యూదివైవ ‘’అని అణుశక్తి సామర్ధ్యాన్ని ఆ నాడే తెలిపిన వైజ్ఞానిక కవి .,దార్శనికుడు .అయన కవిత్వం పద లాలిత్యం తో అర్ధ గాంభీర్యం తో అలరారుతుంది .విశ్రుత బుద్ధి వివేక పూర్ణ విద్యా నిలయాలు సంస్థలు ఉదార గుణమూ కలవారు ,పూజ్యులు మానవులే నాగరకత కు మూలం అన్నారు .

‘’మునుపటి నుండి మానవ సమూహము గాంచిన యున్నతస్తితిన్

పోనరిచి నట్టికార్యము లపూర్వ మనో బలసిద్ధులుం జిరం

తన మగు దేశానాగరకత ల్ ,బహు శాస్త్ర సముపార్జనంబు ,జే

ప్పిన బది ఏండ్లు పట్టు ప్రుధివిం గల దంతయు జెప్ప సాధ్యమే ‘’

                  కర్షక కవి

శ్రీ రామి రెడ్డి కి స్వంత ఆశయలున్నాయి .స్వేచ్చ కోరాడు .జాతీయ భావం తనువంతా నిండింది .పాశ్చాత్య పారశీక అధ్యయనం వల్ల,ఆ భావ ధారా ను తెలుగు జాతీయం గా తీర్చి దిద్దాడు .జీవితాన్ని అన్నికోణాల్లోనుంచి పరిశీలించారు .పొలం గట్టుకు పరిమిత మైన కర్షక కవి .గ్రామీణ జీవితానికి ‘’కృషీవలుడు ‘’కావ్యం లో అద్దంపట్టారు .రైతుకు ఇంతవరకు ఎవరూ కీర్తికిరీటం పెట్ట లేదు .ఆ పని మొదట చేసిన వాడు రామి రెడ్దియే .

‘’అన్నా హాలిక నీదు జీవితము నెయ్యంబార  వర్ణింప ,మే

 కొన్నాన్ ,నిర్ఝర సారవేగమున వాక్పూరంబు మాధుర్య సం

 పన్నంబై ప్రవహిన్చుగాని ,యితరుల్ భగ్నాశులై ,ఈర్ష్యతో

నన్నుం గర్షక పక్షపాతి యని నిందా వాక్యముల్ బల్కరే ‘’

అని తన కర్షక పక్ష పాతాన్ని నిరూపించుకొన్నారు ‘’పైరి కుడు ‘’రైతు )భారత క్షమ తలాత్మ గౌరవ పవిత్ర మూర్తి ‘’అని కీర్తించాడు .చేతుల్లో ‘’హలం కులిశ ‘’రేఖ లుంటేనే రాజులవుతారని జోస్యం చెప్పారు .రైతు బుజాల పై నాగలి చాల్లున్నంత వరకే రాజు కాళ్ళ లో ఆ చిహ్నాలు ఉంటాయి అంటారు .  .కవులు కూడా అజ్ఞానాన్ని పారద్రోలి యుద్ధం లో పాల్గొనాలి అని అభిప్రాయ పడ్డారు .రెడ్డిగారు భవ్య భవిష్యత్తు ను దర్శించారు .’’సకల మానవ జాతి సంతతులు కుల వర్ణ భేదాలు పాటించకుండా ఒక్క కడుపునా బుట్టి ఒక్క చనుబాలు త్రాగిన రీతి ‘’గా చూడాలని లలు కన్నాడు అప్పుడు ధర్మ దేవత శుద్ధ స్పటిక పాత్రలో ‘’శాంతి అనే ఆసవం తెచ్చి అందర్నీ తని యింప జేస్తుంది అని కమ్మ ని కల కన్నాడు .ఆకాల నేటికీ నిజం కానందుకు బాధగానే ఉంది .సామ్య వాదం రావాలని రెడ్డి గారు ప్రగాఢం గా వాన్చించారు .

    రామిరెడ్డి చలన చిత్ర పరిశ్రమ లో ప్రవేశించి దర్శకుదయారు .తన కవితలను తానే ఆంగ్లం లోకి అనువదిన్చుకొని‘’voice of the read ‘’గా ప్రచురించారు .చిత్రలేఖనం లోను ప్రావీణ్యం సంపాదించారు .ఆరుద్ర అన్నట్లు ‘’కట్టమంచి కవిత్వ తత్వ విచారం మాత్రమె చేస్తే ,రామిరెడ్డి కవిత్వ నిరూపణ చేశాడు ‘’చదివింది థర్డ్ ఫారమే అయినా స్వయం కృషి ఓ ఎనిమిది భాషల్లో పాండిత్యం సాధించాడు .’’నీతి స్పర్శ లేని సౌందర్యం పరిపూర్ణం కాదు ‘’అని త్రికరణ శుద్ధి గా నమ్మాడు .ఆ నీతినే ప్రజల గీతిగా పాడాడు .సర్వ మానవ సమానత కై కవితా గళం విప్పాడు .1947 లో దువ్వూరి వారు దూర తీరాలకు చేరి కీర్తి శేషులయ్యారు .

    దేశ భక్తీ తనువంతా జీర్ణించుకొన్న కవి రామి రెడ్డి .’’తిప్పవే రాట్నమా దేశ చరితంబు –విప్పవే రాట్నమా విజయ కేతనము ‘’అని పులకించి పాడిన దేశ భక్త  కవి .ద్రౌపదీ సందేశం అనే నాటకం లో జాతీయ భావ ప్రబోధం చేశాడు .’’లేవమ్మ స్వాప్నికా శయ్యవీడి –కనుమా యందందు సూర్యంశులన్ ‘’అని భారత మాత్రు ప్రబోధం లో జాతిని మేల్కొల్పాడు .స్వాతంత్ర రధానికి ‘’లేవు దివ్య తురంగముల్ లేవు రధాలు  –ప్రజలే యా తేరు మోకులు పట్టు వారు‘’అని జాగృతి గీతం పాడారు .కర్తవ్య బోధ చేశారు .స్వాతంత్ర ఉద్యమం ఎలా ఉండాలో తెలిపే విధానమంతా ‘’కాంగ్రెస్ వాలా ‘’నాటకం లో తెలియ జెప్పారు .కట్టమంచి బుద్ధి జీవి అయితే ,రామి రెడ్డి హృదయ జీవి .,కవితా స్వాప్నికుడు మాత్రమే కాదు కర్తవ్యమ్ బోధించిన కార్య శూరుడు .స్వాతంత్ర్య భానూదయం కోసం తపించి చూడకుండానే దివికేగిన దేశ భక్తుడు . లోక బాంధవుడు ..తెలుగు కవితా వనం లో కావ్య గానం చేసిన కవికోకిల దువ్వూరి రామి రెడ్డి .

          మరో కవి గురించి మరో మారు

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-13-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.