కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -4
ఆంద్ర సాహిత్య సంస్కృతీ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి –1
రెడ్డి త్రయం లో మూడవ వారే సురవరం ప్రతాప రెడ్డి .తెలుగు వైతాళికుడు అన్న మాట ను సార్ధకం చేసుకొన్నారు .గద్వాల సంస్థానానికి రాజధాని అయిన ‘’బోరవెల్లి ‘’గ్రామం లో 1896 మే నెల 28 న జన్మించారు .స్వగ్రామం అలంపురం తాలూకా ఇటికాల పాడు ..ఆ తాలూకా ‘’మాల్గొవా మామిడి పండ్ల‘’కు ప్రసిద్ధి .మద్రాస్ లో’’ లా ‘’పట్టా పొందారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతాన్ద్రాలను క్షుణ్ణం గా అభ్యసించారు .చిన్నతనం నుంచే తెలుగులో కవిత్వం చెప్పటం అలవడింది .నెమ్మదిగా సాహిత్యం వైపు ద్రుష్టి సారించి జీవితాంతం సాహితీ సేవ చేస్తూ గడిపారు .సాహితీ విరాన్మూర్తి అని పించుకొన్నారు .మానవల్లి రామ క్రిష్నయ్య పంతులు గారితో ఏర్పడిన సాన్నిహిత్యం సాహిత్యోప జీవిని చేసింది .
ఆ సమయం లో హైదరాబాద్ నిజాం నవాబు వశం లో ఉండేది .సురవరం వారు అన్నట్లు‘’తౌరక్యాంధ్ర సంస్కృతికి ఆలవాలం ‘’గా ఉండేది .రెడ్డి గారు తమ మకాం హైదరా బాద్ కు మార్చారు స్వాతంత్ర ఉద్యమం ఉద్ధృతం గా ఉన్న రోజు లవి .తెలంగాణా బాగా వెనక బడి ఉంది .ప్రజలు నిరక్ష రాస్యులు .బీదరికం పెనుభూతమై పట్టి పీడిస్తోంది . ఉర్దూ తప్ప తెలుగు విని పించని పరిస్తితి .ప్రజలకు ప్రాధమిక హక్కులే లేవు .ఇవన్నీ స్వయం గా చూసి చలించి దేశ సేవా ,ప్రజాసేవ తన కర్తవ్యమ్ గా భావించారు .సంఘ సంస్కరణ ,మాత్రు భాషా భి వృద్ధి తక్షణ కర్తవ్యం అనుకొన్నారు .ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలి .దానికి సాధనం పత్రికా నిర్వహణే అని నిర్ణయించుకొన్నారు .అప్పటికే మాడపాటి హనుమంత రావు గారు ఆంధ్రోద్యమం లో పూర్తిగా అంకిత మై పని చేస్తున్నారు.ఆయనతో పాటు‘’గోలకొండ పత్రిక ‘’ను 10-5-1926 న స్తాపించారు .నాంపల్లి అబిడ్స్ నుంచి మకరం జహి మార్కెట్ కు వెళ్ళే దారిలో పత్రిక ఆఫీసు ఉండేది .ఆ దారి గుండానే నిజాం నవాబు కింగ్ కోఠీకి వెళ్ళేవాడు సాధారణ మైన ధోవతి ,షర్టు ధరించే వారు రెడ్డిగారు .గాంభీర్యం తో కూడిన నిండైన విగ్రహం .మాట పెళుసు .మనసు నవనీతం అని అంతా చెప్పేవారు .’’ఆంద్ర భాషా సేవ, కులమత జాతి విచాక్ష ణతలేని విధం గా ఆంధ్రుల అభివృద్దే తమ పత్రిక ధ్యేయం గా ప్రకటించి అనుసరించారు .ఎన్నో ఒడిదుడుకు లకు లోనైనారు .ధనార్జన ధ్యేయం కాదు .త్యాగాన్ని తన మార్గం గా భావించి అభ్యుదయం కోసం అహరహం కృషి చేసిన ధన్య జీవి .చేతలతో ఆదర్శాన్ని నిరూపించిన మార్గ దర్శి మహనీయుడు సురవంరం ప్రతాప రెడ్డి గారు తెలంగాణా కే కాదు సర్వ ఆంద్ర దేశానికి ఆయన ఒక వరం .
బహుముఖ ప్రజ్ఞ
సంఘం లో మార్పు రాలేక పోతే వికాసం ఉండదుకనుక గొప్ప పాండిత్యాన్ని సాదించుకొన్నారు .ఆ మార్పు కై ధన, మన, ప్రాణాలను అర్పణ చేసి పని చేసిన నిస్వార్ధ మూర్తి .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు .విజ్ఞానాన్ని అందిపుచ్చుకొన్నారు .మేధావి గా సంఘం లో గుర్తింపు పొందారు .గొప్ప వక్త గా మంచి విమర్శకుడు గా ఖ్యాతి పొందారు .వీటికి మించి మహా పరిశోధకుడు అని పించుకొన్నాడు .నిరంతర గ్రంధ పఠనం లో మునిగి తేలేవారు .వాటి పై తోటి వారితో చర్చించే వారు .కాని నవాబు శాసనాలు చాలా కఠినం గా ఉండేవి ఆ నాడు .వాక్కు ,పత్రికా స్వాతంత్రాలు మ్రుగ్యమే .సభలు ,సమావేశాలకు అనుమతి లేదు .ఈ స్తితినే రెడ్డి గారు వ్యంగ్యం గా ‘’వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ‘’అన్నారు .1924- 29 కాలం లో ‘’రెడ్డి విద్యార్ధి వసతి గృహ సంస్థ ‘’కు నిర్వాహకులు గా పని చేశారు.అమ గ్ర్సందాలయాన్ని ,అముద్రిత తాల పత్రాలను దానికి అందజేశారు .1927 లో ఏర్పడిన ‘’ఆంద్ర మహాసభ ‘’కు మొదటి అధ్యక్షులయారు .అందరు తెలుగే మాట్లాడాలని తీర్మానించారు .వనపర్తి నియోజక వర్గం నుంచి హైదరాబాద్ కు శాసన సభ్యులు గా ఎన్నికై రాజకీయ ప్రక్షాలనానికి పూను కున్నారు .పెదపాలెం గ్రంధాలయానికి అధ్యక్షులు గా ,ఆంద్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగా ,ఎన్నికయారు .గ్రంధాలయోద్యమాన్ని భుజ స్కందాల పైధరించి అభి వృద్ధికి తీవ్ర కృషి చేశారు .1940 లో‘’గ్రంధాలయోద్యమం ‘’అనే పుస్తకం రాసి ప్రచురించారు .’’ఆంద్ర సారస్వత పరిషత్తు ‘’ను స్తాపించి 1944-45కు అధ్యక్షులైనారు ‘’విజ్ఞాన వర్దినీ పరిషత్ ‘’కు వ్యవస్థాపక అధ్యక్షులయారు .ఆయుర్వేదాన్ని క్షున్నం గా అధ్యయనం చేసి ఆరోగ్య రహస్యాలను జన సామాన్యానికి అంద జేశారు .హైదరాబాద్ ఆయుర్వేద సంస్థ ను స్తాపించి అధ్యక్షులై పెంచి పోషించారు రెడ్డి గారు .
సాహితీ సేవ
ప్రతాప రెడ్డి గారు కవి ,నాటక రచయిత ,నవలా కారుడు ,పరిశోధకుడు గా తమ రచనా ప్రతాపాన్ని చూపించారు .ప్రజలను ప్రభావితులను చేశారు .వివిధ ప్రక్రియలలో సుమారు 40 గ్రంధాలు రచించారు .ఇవన్నీ గ్రాంధికం లో రాసిన రచనలే .’’ఆరె వీరులు ‘’అనే నవల రాశారు .ఇంకో నవల రాసి నట్లుంది కాని అముద్రితం.’’భక్త తుకారాం ‘’’’ఉచ్చల విషాదం ‘’అనే రెండు నాటకాలు రాశారు మొదటి నాటకం లో దేశాభి మానం ,కులరహిత సమాజనిర్మానం కోసం అయితే ,రెండోది అచ్చం గా దేశ భక్తీ ని బోధించేది .పాటలు ,పద్యాలు గంభీర సంభాషణ లతో నాటకాలు రక్తి కట్టాయి .చాలా మంది నటులు వీటిని చక్కగా ప్రదర్శించే వారు .ఆయన మొదటి కావ్యం ‘’చంపకీ భ్రమర విలాపం ‘’తర్వాత ‘’ప్రేమార్పణం ‘’’’హంవీర సంభవం‘’,’’ధర్మాసనం ‘’,’’మద్య పానం ‘’కావ్యాలు రాశారు .ప్రజలలో దేశ భక్తిని రాగుల్కొల్పటానికి మంచి పాటలు రాశారు .అవన్నీ విపరీతం గా ప్రచారం లోకి వచ్చాయి .క్రమంగా పద్య రచన తగ్గించుకొని వచనం లోకి మళ్ళారు .భావ వ్యాప్తికి ,ప్రచారానికి ,ఉత్తేజానికి వచనం బాగా తోడ్పడింది .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –3-4-13-ఉయ్యూరు

