ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

           భారత దేశం లో సి.ఆర్.అంటే చక్రవర్తుల రాజ గోపాలాచారి అనే రాజాజీ అని అందరికి తెలుసు .ఆంధ్రులందరికీ సి.ఆర్ .అంటే కట్టమంచి రామ లింగారెడ్డి అని పూర్తిగా తెలుసు .ఆ రెండక్షరాలతోనే చిర యశస్సు నార్జిన్చారాయన .చిత్తతూరు జిల్లాలో కట్టమంచి గ్రామం లో 1880 లో జన్మించారు 

 

 

.చిత్తూరు మద్రాస్ లలో చదివి రాజకీయార్ధిక శాస్త్రం లో ,తత్వ శాస్రం లో పట్టా పొందారు .చిన్నప్పటి నుంచి కుశాగ్ర బుద్ధి .స్కాలర్షిప్ తో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో చరిత్రాధ్యయనం చేశారు .మొదటి తరగతి లో ఉత్తీర్ణుడై అక్కడి ‘’రైట్స్ ‘’బహుమతిని తన ప్రతిభకు తార్కణ గా పొందాడు .విద్యార్ధి సంఘాన్ని స్తాపించి ,దాని నాయకుడై సేవలందించాడు .1907  లో అమెరికా లో ఉన్నత విద్యు నభ్యసించాడు .ఆ నాటి గైక్వాడ్ సంస్తాదీశుడు రెడ్డి కి ఆర్ధిక సాయమందించాడు .అమెరికా నుండి తిరిగి రాగానే బరోడా కాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం లో చేరాడు .ఈయన ప్రతిభ ను గుర్తించిన మైసూరు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా శాఖ లో అసిస్టంట్ ఇన్స్పెక్టర్ జెనరల్ గా నియమించి గౌరవించింది .తర్వాత మైసూర్ మహారాజా కాలేజి లో ప్రొఫెసర్ అయాడు .అంచెలంచెల మీద ఆయన తన సామార్ధ్యానికి తగిన ఉన్నత పదవుల నందు కొన్నాడు .యూరప్ ,కెనడా జపాన్ వగైరా దేశాలను పర్య టించి విద్యా విషయక పరిశీలన చేశాడు .1913 లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయి 1916 లో విద్యా శాఖ ఇన్స్పెక్టర్ జెనరల్ అయారు .

300px-Crreddy

 

        ప్రతివిషయం పై నిశిత పరిశీలన చేయటం రెడ్డి గారికి అలవాటు .దేశ రాజ కీయాలను అధ్యయనం చేశారు .జస్టిస్ పార్టి లో చేరి రెండు సార్లు మద్రాస్ యూని వెర్సిటి తరఫున శాసన సభ కు ఎన్నికైనాడు .1926 ఆంద్ర విశ్వ కళా పరిషత్ ఏర్పడింది .దీనికి రెడ్డి గారు మొట్టమొదటి  ఉపాధ్యక్షుడు అంటే వైస్ చాన్సలర్ .అయారు ప్రతిభకు తగ్గ పదవి .తన శక్తి సామర్ధ్యాలను చూపి విశ్వ విద్యాలయ అభి వృద్ధికి ఇతోధికం గా కృషి చేశాడు .1928 లో రెండవ సారి ఉపాధ్యక్ష పదవి వరించింది .తే ప్రభుత్వ  నిరంకుశ చర్యలకు విసి గి పోయి రాజీ నామా చేశాడు అయితేనేం 1935లో చిత్తూరు జిల్లా నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సభ్యుడిగా నిలబడి ఘన విజయం సాధించాడు .పాదరసం లాంటి బుర్ర ఉన్న రెడ్డి గారు ఎక్కడా నిలకడ గా ఉండలేక ,ఇమడలేక పోయాడు .1936లో కాంగ్రెస్ పార్టి లో చేరాడు మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు గా ఎన్నుకో బడ్డాడు చని పోయే దాకా దాని వైస్ చాన్సలర్ గా ఉండి  సేవ జేసిన బుద్ధి జీవి రెడ్డి గారు .1937  లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయాడు .

images (1)

ఆ నాడున్న విశ్వ విద్యాలయాలలో కలకత్తా ,మద్రాస్ విద్యాలయాలకు గొప్ప పేరు ఉంది .ఆ స్తాయి ఆంధ్రా యూని వెర్సిటి కి రావాలని  కల లు గన్నాడు తపన పడ్డాడు అందుకోసం ప్రతిభా సంపన్నులైన సమర్ధులైన అధ్యాపకులను ఎంపిక చేసి నియమించాడు .అందులో రాధాకృష్ణన్ గారొకరు .ఆధునిక వసతులతో విశ్వవిద్యాలయాన్ని తీర్చి దిద్దాడు .ఆయన సేవలను గుర్తించి విశ్వ విద్యాలయం ఆయనకు ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి గౌరవించింది .ఆంద్ర ఆంగ్లాలలో అసమాన ప్రతిభా దురీను డు రెడ్డి గారు .మంచి వాగ్ధాటి హాస్యం చతురత ఆయన మాటల్లో ధ్వనిస్తాయి .రాజకీయ శాస్త్రాన్ని అవపోసిన పట్టిన అపర అగస్త్యుడు .నిర్భీతి ,స్వతంత్రత ఆయన ముఖ్య లక్షణాలు  అనుకొన్నది సాధించే ఓర్పు నేర్పు ఉన్నవాడు

                                సారస్వత సేవ

 రామ లింగా రెడ్డి రాసిన ‘’కవిత్వ తత్వ విచారం ‘’గొప్ప విమర్శన గ్రంధం గా ప్రఖ్యాతి పొందింది .ప్రబంధ కవుల రచనా పద్ధతులను లోతుగా పరిశీలించి విశ్లేషించారు .అయితే అంత తీవ్ర విమర్శకు తట్టు కోలేని వారు ఆ గ్రంధం పై ప్రతి విమర్శ చేశారు విమర్శనా పద్ధతికి కొత్త ఒరవడిని సృష్టించి కొత్త గవాక్షాలను తెరిచాడు విమర్శ మూస విధానం లో నుంచి కొత్త పోకడలు పోయింది .చాలా మంది కవులకు మార్గ దర్శకుడు సి.ఆర్..అందుకనే ఆయన్ను ‘’ఆధునిక ఆంద్ర సాహిత్య విమర్శకు ‘’యుగ పురుషుడు ‘’అన్నారు .తేలికైన భాష ,తెలుగు నుడికారం తో ఆయన రచనలుంటాయి .ఆయనది చాలా విశిష్టమైన శైలి తీక్ష్ణ విమర్శకుడు అని పించుకొన్నాడు

                   నవ్య కావ్యం ‘’ముసలమ్మ మరణం ‘’

   మద్రాస్ క్రిస్టియన్ కాలేజి లోని ఆంద్ర భాశా   రంజని సమాజ కావ్య రచనలలో 1889లో పోటీలు నిర్వహించింది అందులో కట్టమంచి వారి వీరి ముసలమ్మ మరణం కావ్యం ఎన్నికయింది .కధను అనంత పురం చరిత్ర నుంచి గ్రహించి మార్పులు చేర్పులు చేసి కావ్యం గా మలిచారు రెడ్డి గారు అనంత పురం దగ్గర బుక్క రాయ సముద్రం అనే ఊరు లోని చెరువు కట్ట నీటి ఉధృతికి తెగిపోయింది .గ్రామ దేవత ఆ ఊరి లోని‘’ముసలమ్మ‘’ అనే సాధ్వీ లలామ ను బలి ఇస్తేనే ప్రమాదం తప్పుతుంది అని చెప్పింది .ఆ విషయం తెలిసిన ఆఊరి కోడలు ముసలమ్మ గ్రామ సంరక్షణ కోసం ఆ చెరువు నీటిలో పడి  ప్రాణ త్యాగం చేసి గ్రామాన్ని కాపాడింది అని కధనం .ఇప్పుడా చెరువు కట్టకు ‘’ముసలమ్మ కట్ట ‘’అని పేరు .ఆమె త్యాగాన్ని కావ్యం గా మలిచారు రామలింగా రెడ్డి గారు .సమస్ష్టి కోసం వ్యష్టి బలిదానం అన్నదే ఇక్కడి విషయం .కరుణ రస స్పోరక కావ్యం .కదా కొత్తదే కాని రెడ్డి గారి రచన సంప్రదాయ అద్దం గానే సాగింది .కనుక నవ్య కవిత్వం గా నారాయణ రెడ్డి గారు దీనిని గుర్తించలేదు .వస్తువు కొత్తదే విషాదాంతం గా ముగింట మూ కొత్తదనమే .నాయిక సామాన్య గృహస్తురాలు .ఇదీ కొత్త విషయమే .అందుకని దీన్ని నవ్య కవిత్వానికి ‘’సంధి కావ్యం‘’అని ,నవ్య కవితా ప్రభాతానికి వేగు చుక్క అని పింగళి లక్ష్మీ కాంతం గారు పేర్కొన్నారు .ఏమైనా రడ్డి  గారు కొత్త ప్రయోగానికి నాందీ వాచకం పలికారు .బహుముఖ ప్రజ్ఞా శాలి ,కళా ప్రపూర్ణ ,ఆధునిక విమర్శకు మార్గ దర్శి శ్రీ కట్టమంచి రామ లింగా రెడ్డి 71 ఏళ్ళు నిండుగా జీవించి 1951లో తనువు చాలించి చరితార్దులైనారు .  

         మరో ప్రముఖుని గురించి ఈ సారి

           సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –5-3-13-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.