తెలుగుకు సైన్స్ పార్శ్వం
– డా. నాగసూరి వేణుగోపాల్
మీకు తెలుసా… కొన్ని దేశాలలో సైన్స్ దినపత్రికలు ఉన్నాయి… అంటూ రవి కళాశాల ప్రకటన మూడు దశాబ్దాల క్రితం నన్నెంతో ఆకర్షించింది. దినపత్రికలే అందరికీ అందని కాలంలో సైన్స్ దినపత్రికల గురించి ఆసక్తి కల్గించటం ఒక్క సి.వి.యన్.ధన్ గారికి చెల్లు! ఈ విషయాలు గమనించే కాలంలో నేను ఇంకా హైస్కూలు, జూనియర్ కళాశాల విద్యార్థినే! గత శతాబ్దం ముగిసే సమయంలో నేను ఉద్యోగరీత్యా విజయవాడలో ఉన్నాను. ఆకాశవాణిలో ప్రసారమయ్యే సైన్స్ కార్యక్రమాలు విని, తరచూ చర్చించే వారు సి.వి.యన్. ధన్. ఒకసారి నాకో ప్రశ్న సంధించారు – చాలా మంది సైన్స్ ప్రసంగాలు రాసుకుని వస్తారు కదా, వాటిలోని సమాచారం ఎంత వాస్తవమో ఎలా తెలుసుకుంటావు? – అని. ఇది చిన్న ప్రశ్న కాదు. అది రేడియోకే కాదు ఏ మాధ్యమానికైనా వర్తిస్తుంది, ఏ విభాగానికైనా వర్తిస్తుంది.
సరే, ధన్ గారి ప్రశ్న నిజంగా ఏ మీడియా సంస్థ నిర్వహాకుడికైనా అవసరం, దాని గురించి ఆలోచించాలి కూడా!సైన్స్‌కు సంబంధించి స్థూలంగా ఏ విభాగమైనా ప్రాథమికమైన సమాచారం ఇవ్వగలిగిన పుస్తకం ‘సైన్స్ మేటర్స్’ అని, దానిని సంప్రదించమని ధన్‌గారు సూచించారు. రాబర్ట్ ఎమ్. హాజన్, జేమ్స్ ట్రిఫిల్ రచయితలుగా వెలువడిన ఈ పుస్తకం లండన్‌లో 1991లో మొదట వెలువడింది, మనదేశపు ఎడిషన్‌ను 1996లో యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఉపోద్ఘాతం, తెలుసుకోవడం, శక్తి, విద్యుత్తు, అయస్కాంతత్వం, పరమాణువు, క్వాంటమ్, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, అణు కేంద్రక కణాలు, ఖగోళం, విశ్వాంతరాళం, సాపేక్షత, భూగమనం, జీవం, జన్యుశాస్త్రం, పరిణామం, జీవావరణ వ్యవస్థలు – ఇలా 18 అధ్యాయాల్లో 300 పేజీలలోపు దాదాపు అన్ని సైన్స్‌రంగాల విషయాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.
ఇప్పటికీ నాకు ఇది ఎంతో దోహదకారిగా ఉంది. ‘ఫాస్ట్ సైన్స్ ఫాక్ట్స్’ అనే సురేంద్ర వర్మ పుస్తకమూ ఎంతో తోడ్పడుతోంది.తెలుగులో రావాల్సిన మహా నిఘంటువు గురించి తెలుగు అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు చాలా కాలంగా అవసరమైన వారితో చర్చిస్తున్నారు. ఇటువంటి మహా నిఘంటువులు చేర్చవలసిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాల గురించి, వాటితో ముడిపడిన పార్శ్వం గురించి ఇటీవల ఆచార్య రవ్వా శ్రీహరి గారు కొంత విపులంగా చర్చించారు. ఆ సంభాషణ తర్వాత ఆలోచిస్తే సైన్స్‌కు సంబంధించి తెలుగులో రావాల్సిన పుస్తకాలు ఏమిటో కూడా మనం దృష్టి పెట్టాలనిపించింది.
ఇదివరకు సి.వి.యన్.ధన్ సూచించిన రీతిలో అందరూ చదవాలంటే తెలుగులో అలాంటి పుస్తకాలు లభ్యం కావాలి. ఈ రకం పుస్తకాలు నిపుణుల అవసరాల కొరకు తయారైనవి. వీటికి మించి సగటు వ్యక్తి తరచూ వాడే లేదా చాలా తరచు అవసరమయ్యే సమాచారం తెలుగులో దొరకాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌లో వాడే ‘సిమ్’కార్డ్ పదంలోని అక్షర క్రమం నుంచి, అదెలా పనిచేస్తుంది, ఎలా తయరావుతుందనే విషయాలు సరళంగా, సూక్ష్మంగా తెలిపే పుస్తకాలు రావాలి. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి సహకారంతో రూపా సంస్థ భారతీయ శాస్త్రవేత్తల జీవిత విశేషాలు సంక్షిప్తంగా వివరించే నిఘంటువు 2002లో సుమారు 1500 పేజీలతో నాలుగు వందల రూపాయల వెలతో విడుదల చేసింది.
ఈ పుస్తకం తెలుగులో ఎందుకు రాకూడదు? సి.యస్.ఐ.ఆర్. సంస్థ పాతికేళ్ళ క్రితం ‘గోల్డెన్ ట్రెజరీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ’ అనే ప్రచురణను ప్రచురించింది. ఈ పుస్తకం కూడా తెలుగులో వస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విగ్సాన్ ప్రసార సంస్థ కూడా మంచి సైన్స్ పుస్తకాలు వేస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే. వీటిని ఇతర భారతీయ భాషల్లో తేవాలి – తెలుగుతో సహా. తెలుగు అకాడమీ నాలుగు దశాబ్దాల క్రితం చక్కటి కృషిచేసి ఎన్నో రంగాలకు సంబంధించిన పారిభాషిక పదకోశాలు విడుదల చేసింది. వీటిల్లో లోటుపాట్లను గమనించి, మెరుగు చేయాల్సిన బాధ్యత ప్రజలదీ, పండితులదీ. అలాగే కొన్నింటికి నిఘంటువులను వెలువరించింది తెలుగు అకాడమి.
వృక్ష శాస్త్రానికి సంబంధించిన పదాలకు తెలుగు అక్షర క్రమంలో నాలుగు వందల పుటల నిఘంటువు 1994లో వచ్చింది. ఇలాంటివి మరిన్ని రంగాలకు విస్తరించే సమయంలో మనకు తెలుగు మీద గౌరవం తగ్గిపోయింది. మరోవైపు జమ్మి కోనేటి రావు వంటి వారు చేసిన కృషి గురించి చెప్పుకోవాలి. జంతు శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి ఇంగ్లీషు – ఇంగ్లీషు – తెలుగు పద్ధతిలో ఒక్క పుస్తకం నాలుగు వందలకు పైగా పుటలున్నదిగా రూపొందించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయుర్వేద నిఘంటువును ఎపుడో రాశారు. ఇలా చాలామంది కృషి చేశారు, చేస్తున్నారు. ఎటొచ్చి అన్నీ ఒక చోట లభ్యం కావాలి.
తక్షణమే సైన్స్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి నిఘంటువు రావాలి. తర్వాతి దశలో విభిన్న రంగాలకు సంబంధించి ప్రత్యేక నిఘంటువులు రావాలి. తెలుగు అకాడమీ ఇదివరకు ప్రచురించిన పారిభాషిక పదకోశాలు ఇటువంటి ప్రయత్నాలకు ఆధారంగా తోడ్పడుతాయి.ఇటువంటి పనికి ఎవరు దిగాలి? ఎవరిని ఆహ్వానించాలి? వస్తు ప్రధానమైన కృషి కనుక, ఆయా రంగాలలో నైపుణ్యం కల్గి ఉండటమే ప్రధాన అర్హత. భాష మీద పట్టు, ఆసక్తి, గౌరవం, సాధన అనేవి అదనపు అర్హతలు. ఇదే క్రమంలో ప్రాధాన్యాలను నిర్ణయించాలి. ఇంగ్లీషులో, ఇతర భాషలలో జరుగుతున్న కృషి, నడుస్తున్న ధోరణి గమనించి ప్రజల ప్రయోజనమే కీలకంగా ప్రయత్నాలు జరగాలి. ఆధునిక అవసరాలకు తగినట్లుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు భాష పరిపుష్టమైతేనే నిజమైన తెలుగు భాషా ప్రగతి, భాషా ప్రయోజనం సాధ్యం!
– డా. నాగసూరి వేణుగోపాల్

