వృత్తిరీత్యా అంటరానివాడిని’

మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వై. నాయుడమ్మ ఒకరు. తోళ్ల పరిశ్రమ ఆధునీకరణకు సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన నాయుడమ్మ జీవిత చరిత్ర ఇప్పటి దాకా రాకపోవటం ఒక లోటే. ఇప్పుడు ఆ లోటును ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కె. చంద్రహాస్ పూరించారు. ‘ది పీపుల్స్ సైంటిస్ట్ ‘ అనే పేరిట నాయుడమ్మ జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
సమాజంలో వెనకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించటంలో ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన స్ఫూర్తితోనే నేను కాలేజ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్‌గా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఆచరణాత్మకమైన నైపుణ్యాన్ని పెంపొందించటానికి శిక్షణ ఇచ్చాం.. ” – (డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, నాయుడమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సమయంలో సన్నిహితంగా పనిచేసిన ఐఎఎస్ అధికారి..)
నాయుడమ్మ విదేశాలలో చదివినా, అనేక ప్రాంతాలు చూసినా, గ్రామీణ భారతాన్నే ఇష్టపడేవారు. తోళ్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ణాతుడు కావటం వల్ల ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చర్మకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డైరక్టర్‌గా పదవి చేపట్టే సమయానికి దేశంలో తోళ్ల పరిశ్రమ చాలా ప్రాథమిక దశలో ఉంది. కొన్ని శతాబ్దాల నుంచి ఆ పరిశ్రమలో ఎటువంటి మార్పులు రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,రసాయనాల ఉపయోగం గ్రామీణ ప్రాంతాల్లోని చర్మకారుల దాకా చేరలేదు. సంప్రదాయపద్ధతులలోని మంచిని వాడుకుంటూనే, చర్మకారులకు ఆధునిక పద్ధతులలో శిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన భావించారు. తోళ్ల పరిశ్రమ వల్ల దేశం ఆర్థికంగాను, పారిశ్రామికంగాను మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
ఆధునిక సమాజంలో అంటరానితనానికి స్థానం లేదని నాయుడమ్మ భావించేవారు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరం? ఆ ప్రణాళికలను ఎలా అమలు చేయాలి? వాటిలో ఎదురయ్యే ఆటంకాలేమిటనే విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండేది. సమాజంలో కొందరిని అంటరానివారిగా పరిగణించటం నాయుడమ్మకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వర్ణవ్యవస్థను సమర్థించే వారిని ఆయన ఇష్టపడేవారు కాదు. వారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సహించేవారు కారు. 1950లలో నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న సమయంలో శ్రీ ప్రకాశ తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించేవారు. శ్రీ ప్రకాశ వారణాసికి చెందిన వారు. ఆయనకు నాయుడమ్మ కులమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. తోలు పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి నాయుడమ్మ నిమ్న (మాదిగ) కులానికి చెందిన వాడని శ్రీప్రకాశ భావించారు.
అయితే ఎవరూ ఆ విషయాన్ని నిర్ధారించలేకపోయారు. దీనితో ఆసక్తి ఆపుకోలేక ఒక రోజు నాయుడమ్మకు గవర్నర్ ఫోన్ చేశారు. మీ కులమేమిటని నేరుగానే అడిగారు. నాయుడమ్మ కావాలంటే తన కులాన్ని చెప్పి ఉండచ్చు. కాని చెప్పలేదు. గవర్నర్ అడిగిన ప్రశ్న ఆయనకు ఆవేదన కలిగించింది. దానిని దాచుకొని- “నేను వృత్తిరీత్యా అంటరానిసమాజానికి చెందినవాడిని” అని సమాధానమిచ్చారు. గవర్నర్ వెంటనే ఫోన్ పెట్టేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తప్పుజరిగిందని విచారం వ్యక్తం చేసారు. ఆ సమయంలో మన దేశంలో తొమ్మది పరిశోధనాశాలలు ఉండేవి. ఇవన్నీ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉండేవి. ఈ పరిశోధనాశాలల డైరక్టర్లకు, సీఎస్ఐఆర్ కార్యాలయానికి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. దీనితో ఈ విభేదాలను పరిష్కరించటానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎనిమిది పరిశోధనాశాలల డైరక్టర్లతో సమావేశమయ్యారు. సీఎస్ఐఆర్‌తో ఉన్న సమస్యల గురించి ఇందిర అందరి డైరక్టర్లతోను ఎటువంటి అరమరికలు లేకుండా చర్చిస్తున్నారు. ఆ సమయంలో నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డైరక్టర్‌గా ఉండేవారు. నాయుడమ్మ వంతు వచ్చింది.
“మేడం, ద్రౌపదికి ఐదుగురు భర్తలు మాత్రమే ఉండేవారు. కాని ఒక పరిశోధనాశాల డైరక్టర్‌కు ఎంత మంది భర్తలు ఉంటారో నేను మీకు చెప్పలేను” అన్నారు. ఇందిర దగ్గర ఆ తరహా వ్యాఖ్యలు చేయటానికి చాలా సాహసం ఉండాలి. వేరే ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇందిర వారిని తీవ్రంగా మందలించి ఉండేవారు. కాని నాయుడమ్మ చెప్పిన తీరును చూసి ఇందిర కూడా నవ్వి ఊరుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకు అమెరికా వెళ్లారు. ఆ సమయంలో నాయుడమ్మ కూడా ఆయనతో అమెరికా వెళ్లారు. అమెరికాలో జర్నలిస్టులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలనే విషయాన్ని ఎన్టీఆర్‌కు నాయుడమ్మ ముందే చెప్పారు.
ఆ సమయంలో ఎన్టీఆర్‌కు, ప్రధాని ఇందిరకు మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉండేది. జర్నలిస్టులు ఇందిర గురించి ప్రశ్నిస్తే- రామారావు తన సహజ ఆవేశంతో సమాధానాలిచ్చే అవకాశం ఉందని నాయుడమ్మ ఆందోళన చెందారు. అనుకున్నట్లే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో- “మీరు, మేడమ్ గాంధీ వేర్వేరు పార్టీలకు చెందిన వారు. మీ ఇద్దరి మధ్య మౌలికమైన విభేదాలు కూడా ఉన్నాయి. మీరు ఆమెను ఎలా మేనేజ్ చేస్తున్నారు?” అని ఒక జర్నలిస్టు అడిగారు. నాయుడమ్మ ముందు చెప్పి ఉండకపోతే- ఎన్టీఆర్ తాను విదేశాల్లో ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి ఇందిర మీద విరుచుకుపడేవారు. కాని ఎన్టీఆర్ సంయమనం పాటించారు. “నేను దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఆమె మొత్తం దేశానికి ప్రధానమంత్రి. మా మధ్య విధానపరమైన విభేదాలు ఉండి ఉండచ్చు. కానీ జాతీయ ప్రయోజనాలే మా ఇద్దరికి ముఖ్యం..” అని సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ సమాధానాన్ని జర్నలిస్టులు కూడా మెచ్చుకున్నారు.
ద పీపుల్స్ సైంటిస్ట్
రచయిత: కె. చంద్రహాస్
ప్రచురణ: పీగాసెస్ ఇండియా పబ్లిషర్స్
ధర: రూ. 200
పేజీలు: 172
ప్రతులకు: 8008449678,

