సినిమా కష్టాలు దాటాల్సిందే…

విలన్ పాత్రల్ని కూడా హీరోపాత్రలంత రసాత్మకంగా పోషించిన వారు కైకాల సత్యనారాయణ. ‘నవరస నటసార్వభౌముడు’గా కీర్తించబడే ఆయన ఇప్పటికి 780 సినిమాలకు పైగా నటించారు. గతంలో అనేకానేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయనను ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్యనాయడు అవార్డు కూడా వరించింది. ఐదు దశాబ్దాల ఆయన సినీ జీవిత ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
ఎంచుకున్న రంగం మీద ఎంత ప్రేమైనా ఉండవచ్చు. ఆ రంగంలో ఎంత ప్రావీణ్యమైనా ఉండవచ్చు. అంతమాత్రాన వెళ్లీ వెళ్లగానే ఏ రంగమూ అక్కున చేర్చుకోదు. సినిమా అవకాశాల కోసం నేను 1957లో మద్రాసు వెళ్లాను. ఎప్పుడూ ఏవో ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లేవి. నెలలు, ఏళ్లు గడిచినా ఏ ఒక్క అవకాశమూ లేదు. ఏరోజుకారోజు డబ్బులకు కటకటగా ఉండేది. అప్పుడప్పుడు పస్తులు పడుకోవాల్సి వచ్చేది కూడా. ఒక ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు దాదాపు ప్రతిదీ మనల్ని పరీక్షిస్తుంది. ఆ అగ్ని పరీక్షకు జడిసి ఏ కాస్త వెనుకడుగు వేసినా ఇంక ఎప్పటికీ ఆ పొలిమేరల్లోకి వెళ్లలేకపోవచ్చు. ఎదురీదే తత్వమే లేకపోతే, కాళ్లకు అడుగడుగునా సంకెళ్లే పడతాయన్న పాఠాన్ని ఆ పరిణామాలు నాకు నేర్పాయి.
వైఫల్యాలు వెంటాడి తే…..
మద్రాసులో నానా అవస్థలూ పడుతున్న సమయంలో డి ఎల్ రావుగారు తాను తీయబోయే ‘సిపాయి కూతురు’ అనే సినిమాకోసం నన్ను హీరోగా ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ పూర్తయి విడుదల కూడా అయ్యింది కానీ, ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. మనసులో తీవ్రమైన అలజడి మొదలయ్యింది. జీవితాన్ని ఒక అయోమయం కమ్మేసింది. తాత్కాలికంగానా, శాశ్వతంగానా అలా ఏమీ అనుకోలేదు కానీ, ఊరికి వెళ్లిపోదాం అనిపించింది. సరిగ్గా అదే సమయంలో విఠలాచార్య గారు నాకోసం కబురు పెట్టారు. తనకు తెలిసిన ఒకరు తాము నిర్మిస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలోని ముగ్గురు కథానాయకుల్లో ఒకరికోసం గాలిస్తున్నారు.
‘సిపాయి కూతురు’ సినిమాలోని నా నటన చూసి విఠలాచార్య గారికి నా పేరు సిఫార్సు చేశారు. ఆ సినిమా దర్శకుడు వేరే అయినా ఆ సంస్థ తీయబోయే రెండవ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్న చనువుతో విఠలాచార్య గారే ఆ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. చిక్కేమిటంటే, ఆ సినిమా డి స్ట్రిబ్యూషన్ హక్కుల్ని అంతకు ముందు ‘సిపాయి కూతురు’ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన వ్యక్తే తీసుకున్నారు. ఆయన ‘సిపాయి కూతురు’ సినిమా ఫెయిల్ అయిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో నన్ను తీసుకోవడానికి వీల్లేదన్నారు. నా గుండె బరువెక్కిపోయింది.
విజయాలు కొన్నాళ్లుపోతే కనుమరుగైపోవచ్చు కానీ, కొన్ని వైఫల్యాలు జీవితాంతం వెంటాడతాయేమో అనిపించింది. ఆ విషయం తెలిసిన విఠలాచార్యగారు ఆ డిస్ట్రిబ్యూటర్‌ను ఉద్దేశించి “చూడండి మంచికో చెడుకో నేను అతడ్ని ఎంపిక చేశాను. రేపు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఎవరికి తెలుసు? అలా అని మిమ్మల్ని నే ను బలవంతపెట్టను. తొలి రెండు రోజుల షూటింగ్‌కు నేనే దర్శకత్వం వహిస్తాను. ఆ రషెస్ చూడండి. అవి మీకు నచ్చితే అతన్ని కొనసాగించండి. నచ్చకపోతే తీసివేద్దురు గానీ.
ఒకవేళ తీసివేస్తే అప్పటిదాకా అయ్యే ఖర్చంతా నే నే భ రిస్తాను” అన్నారట. వాళ్లు సరేనన్నారు. రెండు రోజుల షూటింగ్ తరువాత విఠలాచార్య నన్ను తన వద్దకు పిలిపించుకుని, తె రవెనుక జరిగిన విషయమంతా చెప్పారు. నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాను. తొలి వైఫల్యాలు మనిషిని ఒక్కోసారి ఎంత దారుణంగా వెంటాడ తాయో అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకవేళ నా పర్‌ఫార్మెన్స్ నచ్చక నిజంగానే నన్ను తొలగించేస్త్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. దీనవదనంతో తిరిగి మా ఊరికి ఎలాగూ వెళ్లలేను. అందుకే ఇక బతకడమే దండగ అనిపించింది.

రేపటి మాటేమిటి?
అయితే అందరికీ నా పర్‌ఫార్మెన్స్ బాగా నచ్చింది. నన్ను ఆ పాత్రకు కొనసాగించారు. ఆ సినిమా విడుదలై శతదినోత్సవం కూడా జరుపుకుంది. అయితే, సరిగ్గా అదే సమయంలో విఠలాచార్య మనసులో నా భవిష్యత్తు గురించిన ఒక ఆలోచన మొదలయ్యింది. ఆ విషయం చె ప్పడానికే నన్ను ఆయన తన వద్దకు పిలిపించుకుని “సత్యనారాయణ గారూ! హీరో పాత్రధారులకు ఇక్కడ బాగా పోటీ ఉంది. అయినా ఒకటీ అరా అవకాశాలు రావచ్చు కూడా. కొన్నిసార్లు రాకపోనూ వచ్చు. సమస్య ఏమిటంటే, పరిశ్రమలో మీకు సపోర్టుగా నిలిచే వారు ఎవరూ లే రు. అందుకే పెద్దవాడిగా చెబుతున్నాను.
మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు విలన్ పాత్రలకు సిద్ధమైపోతే అది మీకు అన్నివిధాలా మంచిది”అన్నారు. నాకు ఆయన చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది. విలన్ పాత్రలకు నేను సిద్ధమైపోయాను. ఇచ్చిన మాట ప్రకారం విఠలాచార్య గారు తన సొంత దర్శకత్వంలోనే తొలిసారిగా విలన్ పాత్ర వేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇంక ఒక్కొక్కటిగా విలన్ అవకాశాలు రావడం మొదలయ్యింది. ‘అగ్గిపిడుగు’ సినిమాలోని నా విలన్ పాత్రకు బాగా ప్రశంసలు వచ్చాయి.
ఆ ప్రస్థానంలో విలన్‌గా, క్యారెక్టర్ యాక్టర్‌గా 780 సినిమాలకు పైగానే నటించాను. హీరో పాత్రలే వేస్తానంటూ భీష్మించుకుని కూర్చుంటే నేను ఇక్కడిదాకా వచ్చే వాడ్ని కాదేమో! అంతకు ముందు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వెళ్లాల్సివస్తే ఎవరికైనా ముండు బాధగానే ఉంటుంది. కాకపోతే ఆ బాధ తాత్కాలికమే.మళ్లీ ఒక నిర్ణయం తీసుకుని, నాలుగు అడుగులు వేశాక ఆ భాధ మటుమాయమవుతుంది. విజయాలకు అన్నివేళలా ఆయావ్యక్తుల శక్తిసామర్థ్యాలే కారణం కాదు, అప్పటి ఆయా పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని తీసుకునే నిర్ణయాల మీద కూడా ఎంతో ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని నాకు ఆ సంఘటన నేర్పింది.
ఏదీ అన్నింటికీ వర్తించ దు
నటుడిగా కొంత నిలదొక్కుకున్న తర్వాత నే నొక సెకండ్‌హ్యాండ్ కారు కొనుక్కున్నాను. సంక్రాంతి పండగ రావడంతో నా భార్య, ముగ్గురు పిల్లలు, డ్రైవర్ అందరమూ కలిసి మద్రాసు నుంచి మా ఊరు గుడివాడకు కార్లోనే బయల్దేరాం. నాయుడుపేటకు వచ్చేసరికి బాగా రాత్రి అయ్యింది. రోడ్డు పక్కన లారీ ఆపి నిలుచున్న కొందరు, మా కారు ఆపి, మీరొచ్చే దారిలో ఎక్కడైనా ఒక కుర్రాడు కనిపించాడా? అన్నారు. లేదన్నాం. “ఇంతకూ విషయం ఏమిటీ?” అంటే, వెళుతున్న తమ లారీని ఆపి, వాళ్ల క్లీనర్‌ను లాక్కుని వెళ్లిపోయారట. “ఫ్యామిలీతో వెళుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని కారు ఆపమని సైగ చేస్తే ఎట్టిపరిస్థితిలోనూ ఆపకండి.
ఆపితే ప్రమాదంలో పడతారు” అన్నారు. వాళ్లకు థాంక్స్ చెప్పి మళ్లీ ముందుకు కదిలాం. కొంతదూరం వెళ్లాక వాళ్లు చెప్పినట్లే రోడ్డు మీద బాగా బలంగా ఉన్న ఓ వ్యక్తి కారు ఆపమని సైగ చేశాడు. మాకు వెంటనే లారీ వ్యక్తులు చెప్పిన విషయం గుర్తొచ్చింది. కారు ఆపకుండా ముందుకు పోనీయమన్నాను. ఆ వ్యక్తిని దాటేసి కారు ముందుకు వెళుతోంది. అంతే కొద్ది క్షణాల్లో మా కారు నీళ్లల్లో మునగబోయింది. ఇంతలో ఆ పక్కనే ఉన్న లారీ వాళ్లు మా కారును పట్టుకుని బయటికి లాగేశారు. మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం. చాలాసేపటిదాకా అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు. తీరా చూస్తే అక్కడో పెద్ద వాగు ఎంతో ఉధృతంగా పారుతోంది.
ఆ విషయాన్ని చెప్పడానికే అతడు మమ్మల్ని కారు ఆపమన్నాడు. ఆ లారీ వ్యక్తులు కలిగించిన అనుమానంతో అతను దొంగల ముఠాలో భాగం అనుకున్నాం. అది ఎంత పొరపాటో మా కారు వాగులో పడిపోయేదాకా తెలియలేదు. జీవితం అన్నప్పుడు ఎన్నెన్నో సత్యాలు తెలుస్తుంటాయి. తెలిసిన ప్రతిసత్యాన్నీ అన్నింటికీ అన్వయించాలని చూస్తే అది ఎంత ప్రమాదమో ఆ సంఘటన ద్వారా తెలిసొచ్చింది. అందుకే ప్రతి సంఘటననూ ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలే గానీ, అన్నిటినీ అప్పటికే ఏర్పరుచుకున్న దృక్పథంతో చూడటం తగదన్న విషయం నాకు ఆ సంఘటన ద్వారా బోధపడింది.

