1948 హైదరాబాద్ పతనం

1948 హైదరాబాద్ పతనం


భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ హైదర్ రాసిన “October coup’ అనే ఆంగ్లపుస్తకాన్ని ఇటీవల ‘1948-హైదరాబాద్ పతనం’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ నెల 7వ తేదీన విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

సెప్టెంబరు 17…శుక్రవారం ఉదయం ఖాసిం రజ్వీ నుంచి నాకు ఫోను వచ్చింది. అతనితో ఫోనులో మాట్లాడ్డం అదే మొదటిసారి. “లోపలే ఉండండి” అతను సలహా ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు రాకండి. శుక్రవారం ప్రార్థనల సమయంలో నివారించలేని కొన్ని పరిణామాలు జరగవచ్చు” అన్నాడు.
“అప్పటికి భారత సైన్యం నగరంలోకి ప్రవేశిస్తుందని అనుకుంటున్నారా?” అని నేను అడిగాను.
“అబ్బే అదేం కాదు అన్నాడు.
“అది కాకపోతే ఇంకేమిటి?” నేను ఆరా తీశాను.
“అనివార్యమైనది” అని మళ్లీ నొక్కి చెప్పాడు. “మన వాళ్లు ఆయుధాలు చేపడతారు” అన్నాడు.
జరిగిందేంటంటే అతను అప్పటికే తన అనుచరులకు వేలాది తుపాకులు పంచి పెట్టాడు. ఆరోజు మధ్యాహ్నం తర్వాత హిందువులను ఊచకోత కోయాలని వాళ్లకి ఆదేశాలు కూడా ఇచ్చాడు.


నేను చాలా భయపడ్డాను. ఇది చాలా తప్పు అని నేనతనికి చెప్పాను. భారత బలగాలు నగరానికి చేరుకుంటే మొత్తం హైదరాబాదే సర్వనాశనం అయిపోతుందని చెప్పాను. అయితే అతను వినే పరిస్థితిలో లేడు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ముందు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలని నేను అభ్యర్థించాను. అతను వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేశాను. నేను నవాబ్ దీన్‌యార్ జంగ్ దగ్గరకు పరుగు తీశాను. ఖాసిం రజ్వీ అంటువంటి ఆలోచనతో ఉన్నట్లు ఆయనకు అప్పటికే సమాచారం అందింది. వెంటనే రిజ్వీకి ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ అరగంటకు పైగానే మాట్లాడారు. దీన్‌యార్‌జంగ్ పాతికేళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన ఎవ్వరినైనా దేని గురించి అయినా ఒప్పించగల నేర్పరి. అలాంటి దీన్‌యార్‌జంగ్‌కు అతని మొత్తం జీవితంలోనే ఎన్నడూ ఎదురుకాని విధంగా- 1948 సెప్టెంబరు 17 న ఆ అరగంట అతని నైపుణ్యానికి ఓ అగ్ని పరీక్షే అయ్యిందని చెప్పాలి. ఆ రోజు అతను సాధించింది హైదరాబాద్ ప్రజలకు అతను చేసిన అతి గొప్ప సహాయంగా మిగిలిపోయింది.

అరగంట మాటలూ పూర్తికాగానే ఖాసిం రజ్వీ తన అనుచరులను ఆయుధాలు అప్పగించాల్సిందిగా ఆదేశించాడు. అదే రోజు మరికొంతసేపటి తర్వాత లాయక్ అలీ, ఆయన మంత్రి వర్గం (సెప్టెంబరు 17 ఉదయాన) రాజీనామాలు సమర్పించి ప్రభుత్వ పాలనా పగ్గాలు నిజాంకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. లాయక్ అలీ యే ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ నిర్ధారించాడు.

ఆరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సంస్థానమంతటా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. జనరల్ ఎల్ ఇద్రూస్ అంతకు ముందురోజే నిజాం రాజును కలిసి మరింతగా ప్రతిఘటించడం వల్ల ప్రయోజనం ఉండకపోగా ప్రాణనష్టం భారీగా ఉండే ప్రమాదముందని సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ సాయంత్రమే ఖాసిం రజ్వీ తన వాణి వినిపించాడు. అతని గొంతు డెక్కన్ రేడియోలో చివరి సారి వినిపించింది. ఇచ్చిన హామీల మేరకు పనిచేయలేకపోయానని ఒప్పుకున్న రజ్వీ -పరిస్థితులే తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాయని అన్నాడు. ఎవరెంతగా రెచ్చగొట్టినా ముస్లింలంతా ప్రశాంతంగా ఉండాల్సిందిగా రజ్వీ ఉద్బోధించాడు. హిందూ ముస్లింల మధ్యనున్న సంప్రదాయ ఐక్యత ఎట్టి పరిస్థితిల్లోనూ అలాగే కొనసాగాలని రజ్వీ ఆకాంక్షించాడు. గతంలో జరిగిన ఘటనలన్నీ మర్చిపోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆ ప్రసంగం విన్న వారంతా కూడా అతని మొత్తం జీవితంలో అంత రాజనీతిజ్ఞతతో చేసిన ప్రసంగం మరోటి లేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
* * *


మరొక పెద్ద విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. హైదరాబాద్‌కు, భారత దేశానికి మధ్య జరిగిన సంఘటనలను మనం ఎంత వరకు అర్థం చేసుకోగలం? 1947 -48 మధ్య జరిగిన సంఘటనలను సామాన్యంగా మనం భారతదేశం దృష్టి నుంచి, జాతీయోద్యమం దృష్టి నుంచి చూస్తాం. అది అంత ప్రయోజనకరమైన పద్ధతని నేను అనుకోను. ఎందుకంటే, ఆ దృష్టితో చూడడం ప్రారంభిస్తే హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయమని, అంచనాలకు అందని నిర్ణయమని, ఐక్య భారతదేశ ఆవిర్భావమనే ఒక మహా కెరటానికి వ్యతిరేకంగా ఒక చిన్న రాష్ట్రం తన శక్తికి మించి పోరాడి, ఓడిపోయిందని భావించవచ్చు. ఇప్పటికే ఆ భావన స్థిరపడిపోయింది. హైదరాబాద్ అప్పట్లో తీసుకున్న చర్య చాలా అసంబద్ధ నిర్ణయమని, చివరికది తాను చేసిన తప్పుడు అంచనాలకు తానే ఫలితాన్ని అనుభవించిందని సాధారణ ప్రజానీకం చాలామంది భావించవచ్చు.

నిజానికి హైదరాబాద్ పిచ్చిదా? చెడ్డదా? దిద్దుకోలేని తప్పులు చేసిందా? ఒక శత్రువుకు సంబంధించి సాధారణంగా మనం ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తుంటాం. కానీ తనను కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం చర్యలను అర్థరహితంగా, దాన్ని కలుపుకోవడానికి రెండో వర్గం చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటి నుంచో ఆమోదం ఉన్నట్లు మనం భావించడం సరైనదేనా? ఈ విధంగా మనం చరిత్రను విజేతల వైపు నుంచే చూస్తూ, దానికి వక్రభాష్యం చెప్పడం లేదా? దానికి బదులుగా ఒక చిన్న రాష్ట్రమైన హైదరాబాద్, తన కన్నా శక్తివంతమైన ప్రభుత్వంతో పోరాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు మనం పరిస్థితిని కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ పోరాటానికి సంబంధించిన వివరాల్లోకి ఇప్పుడు వెళ్లడం అప్రస్తుతం. కానీ అప్పటి సంఘటనల్లో రెండు అసమాన ప్రభుత్వాల మధ్య జరిగిన పోరులో మనం అవి వ్యవహరించిన సాధారణ తీరుని పరిశీలించడం బాగుంటుంది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.