కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7
సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా రెడ్డి
ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలు గా తన దక్షతను చాటిన మేటి విద్యా వేత్త ఆచార్య పాకాల యశోదా రెడ్డి .ఆమె పి.యశోదా రెడ్డి గానే అందరికి సుపరిచితురాలు .గొప్పసాహిత్య విమర్శకురాలుగా పేరొందారు . 78 సంవత్సరాలు నిండు జీవితం గడిపి సార్ధక జీవి గా గుర్తిమ్పబడి కీర్తి శేషులయ్యారు .
సుప్రసిద్ధ చిత్రకారులు పి.టి.రెడ్డి గారిని పరిణయమాడి యశోదా రెడ్డి అయారు .ఆయన అంతర్జాతీయ చిత్రకారుని గా గుర్తింపు పొందారు .యశోదా రెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయం లో 33 ఏళ్ళు అధ్యాపకులు గా పని చేసి ,ఆచార్యులు గా పదవీ విరమణ చేశారు .ఆమె సాంప్రదాయ సాహిత్య విమర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు .తెలంగాణా మాండలికానికి తన రచనలలో గొప్ప పీట వేసిన విదుషీ మణి. 1929 లో మహబూబ్ నగర్ జిల్లా బిజినె పల్లి లో జన్మించారు .నిజాం ప్రభుత్వం లో నగర కమీషనర్ అయిన రాజబహదూర్ బిరుదాంకితులు వెంకట రామా రెడ్డి హైదరాబాద్ కు ఆమెను తీసుకొని వచ్చి రెడ్డి హాస్టల్ లో చేర్పించారు .1969 లో పి.హెచ్.డి. చేశారు . .1955 లో కొంతకాలం ఉపాధ్యాయిని గా పని చేశారు . . హైదరాబాద్ ఆకాశ వాణి లో కొంతకాలం ఉద్గించారు .1976 లో లో ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించారు .1990-93-కాలం లో ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంగాధ్య్క్షులు గా బాధ్యతలు నిర్వహించారు .
సాహితీ సేవ
తెలుగుదేశం లో తెలుగుదనం వెల్లివిరియాలని యశోదా రెడ్డి సంకల్పం తో అధికార భాష సంఘాధ్యక్షురాలిగా గొప్ప కృషే చేశారు .తెలుగును అధికార భాష చేయాలన్న ఆమె సంకల్పం మాత్రం కార్య రూపం దాల్చలేదు అది ఆమెకే కాదు అందరికి బాధగానే ఉంది .ఆమెను సంగీత నాటక అకాడెమి జనరల్ కౌన్సిల్ సభ్యత్వం ,ప్రపంచ సంస్కృత అధ్యయన కేంద్ర సభ్యత్వం వరించాయి .అనేక భాషా సాహిత్య సంఘాలలో సభ్యురాలుగా పని చేశారు .1991 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నారు .డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తమ భార్య పేర నెలకొల్పిన అవార్డును స్వీకరించారు .తెలుగులో సుమారు 30 అమూల్య గ్రంధాలను రచించారు .అందులో పారిజాతాపహరణం ,హరివంశం ,ఆంద్ర సాహిత్య చరిత్ర వికాసం ,అమరజీవులు ,తెలుగు సామెతలు పుస్తకాలు ఆమెకు యెనలేని కీర్తి ని తెచ్చి పెట్టాయి .తెలంగాణా మాండలికం లో రాసిన కధలు ,మా ఊరి ముచ్చట్లు ,ఎచ్చమ్మ కధలు ,ప్రజల్లో బాగా చొచ్చుకు పోయాయి .మంచి ప్రభావమూచూపాయి .ఆమె లో తెలంగాణా భాషాభిమానం నిండుగా ఉండేది .ఎంతో గొప్ప పండితురాలైనా సంప్రదాయ సాహిత్యాన్ని కాచి వడబోసినా వాడుక మాటలతో అందరికి అర్ధమయ్యే పదాలతో ,జాతీయాలతో ,నానుడులతో ఆకర్షణీయం గా ప్రసంగించే నేర్పు యశోదా రెడ్డిది .అందరు ఆమెను ఆప్యాయం గా ‘’అక్క ‘’అని ఆత్మీయం గా పిలిచే వారు .కీ.శే.సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వం లో వెలువడిన గ్రంధానికి ముందు మాట రాసిన యోగ్యురాలు .ఎన్నో సాహిత్య సాంస్కృతిక సభలలో ప్రసంగించి ప్రేరణ కల్గించిన విజ్నురాలు యశోద .నిజం గా ఆమె యశో’’ధరా ‘’రెడ్దియే .
చిన్నతనం లోనే యశోదా రెడ్డి తల్లిని కోల్పోయింది తండ్రికి విరోధిగా మారింది .అందువల్ల అనాధ గానే బతికింది .భర్త పి.టి.రెడ్డి తో అనేక దేశాలు సందర్శించింది .జీవితం ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది .భర్త ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన చిత్రకారునిగా ,లలిత కళా అకాడెమి అధ్యక్షులుగా పని చేసిన యోగ్యులు .కళ ఏ పరమావధిగా భర్త తో సహజీవనం సాగించిన అర్దాంగియశోద .1966 భర్త మరణించారు .’’సుధర్మ ఆర్ట్ గేలరి ‘’అనే సంస్థను యశోదా రెడ్డి ప్రారంభించి భర్తను చిరస్మరణీయుని చేసిన భార్య యశోదా రెడ్డి .
100 కు పైగా కధలు నాటికలు ,ప్రసంగాలు కవితలు రాసి న రచయిత్రి యశోద .ధర్మ శాల అనే కదా సంకలనం వెలువరించింది .ఉగాదికి ఊయల ,భావిక అనే కవితా సంకలనాలు తెచ్చింది .బడి పెద్ద ,నక్క బావ ,బుచ్చి గాడు అనే పిల్లల కధలు రాసి పేరు తెచ్చుకోంది .కదా స్రవంతి ,పోతన భాగవత సుధ ,భారతం లో స్త్రీ ,ఎర్రాప్రగడ వంటి పరిశోధనా గ్రంధాలు ఆమె కీర్తి కిరీటం లో కలికితురాళ్ళు .విశ్వనాధసత్యనారాయణ గారితో కలిసి రెండు భాగాలుగా‘’తెలుగు సామెతలు ‘’అనే గ్రంధాన్ని వెలువరించింది .రచ్చబండ , ,నందిని , పరివ్రాజక దీక్ష నాటకాలను రాసి ప్రదర్శించింది .కంచి కామకోటి పీఠం లో ధార్మిక ఉపన్యాసాల నిచ్చి స్వామి వారల మన్ననలు పొందిన ఆస్తిక విద్వద్ వరేన్యురాలు .యశోదా రెడ్డి మరణం తెలంగాణా కే కాదు యావదాంధ్ర దేశానికి తీరని లోటే
మరో రెడ్డి కవిని రేపు తెలుసుకొందాం ..
సశేషం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -6-4-13- ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

