కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’
మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి
మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూరు జిల్లా పొట్ల పూడి గ్రామం లో 3-10-1902 లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో తెలుగు ఆంగ్లాలతో నిష్ణాతులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .అనువాద సాహిత్యం లో ప్రఖ్యాతి చెందారు .ఆశువుగా ,మనోహరం గా ఉపన్య శించె మహా నేర్పున్న వక్త .ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు గా పని చేశారు .
రెడ్డి గారి తల్లి గొప్ప సంస్కార వతి .అతిధి సత్కారాలకు పేరు పొందింది .భగవాన్ రమణ మహర్షి శిష్యురాలు .కోదండ రామి రెడ్డి గారు పదవ తరగతి చదువుతూనే గాంధీ గారి బోధనలకు ప్రభావితులై జాతీయోద్యమం లో చేరారు చదువుకు గంట కొట్టేశారు .బందరులో చదువుతుండగానే విశ్వనాధ, బెజవాడ గోపాల రెడ్డి గార్ల తో గాఢ పరిచయమేర్పడింది .ప్రఖ్యాత నటుడు దొరస్వామయ్య గారిపై కాలేజి విద్యార్ధిగా ఉన్నప్పుడే గొప్ప వ్యాసాన్ని ‘’శారద ‘’పత్రికకు రాశాడు .ఫ్రెంచ్ కదా రచయిత బాల్జక్ కధలను అనువాదం చేసి ప్రచురించాడు .మద్రాస్ లో ‘’సమదర్శి ‘’పత్రికా సంపాదకుని గా పని చేశారు తర్వాత ‘’ప్రభాత ముద్రాలయం ‘’స్తాపించి ‘’రంద్రాన్వేషి ‘’అనే పత్రికను నిర్వహించారు తర్వాతా ‘’మందాకినీ ‘’పత్రికను నడిపి ఆంద్ర దేశం లోనే పేరెన్నిక గన్న సంపాదకులని పించుకోన్నారు.
రెడ్డి గారు భారత జాతీయ నాయకుల ఆంగ్ల ప్రసంగాలను అవలీలగా ,ఆశువుగా ధారా శుద్ధితో అనువదించే వారు .ఈ వ్యాసంగం నలభై ఏళ్ళు అవిచ్చిన్నం గా కోన సాగింది .రెడ్డి గారి రచనలలో భావ గాంభీర్యం ,చమత్కారం ,హాస్యం తోణికిస లాడేవి .ప్రపంచ రాజ్యాల పుట్టుపూర్వోత్తరాలు ,బీదల పాట్లు ,హిందూ పర పదశాహి ,షిర్డీ సాయి భగవాన్ ,ఈసప్ నీతి కధలు ,మంజీర గాధ ,వేమన –పాశ్చాత్యులు ,అస్సామీ సాహిత్య చరిత్ర అనేవి రెడ్డి గారి అనువాదిత గ్రంధాలు .కర్ణుడు అనే పేరిట రాసిన విమర్శన గ్రంధం విశ్వ విద్యాలయాలలో పాఠ్య గ్రంధ మైంది .తెలుగు అకాడెమి వారి ‘’మాండలిక పద కోశం ‘’,రెడ్డి గారి ఆధ్వర్యం లోనే వెలువడింది మహా భారతం లో కర్ణ పర్నానికి ,కళా పూర్ణోదయ ప్రబంధానికి విస్తృత పీఠికలు రచించారు .’’క్రియా స్వరూపం ‘’,’’మని మాయ భూషణం ‘’,’’తెలుగు సామెతలు ‘’,గ్రందాల ప్రచురణ కమిటీ సభ్యులుగా రెడ్డి గారు పని చేశారు .రెడ్డి గారి మహా భారత విమర్శ నిసర్గ రమణీయం గా ఉంటుంది ఎన్నో విషయాలు తవ్వి తీశారు .త్యాగయ్య గారి పై అద్భుత విశ్లేషణాత్మక గ్రంధాన్ని రాసి అన్నికోణాల్లోను త్యాగరాజ స్వామి బహుముఖీన ప్రతిభను ఆవిష్కరించి కర్నాటక సంగీతానికి యెనలేని కీర్తి తెచ్చారు .
కోదండ రామి రెడ్డి గారు మంచి బోధనా పరులు .గొప్ప నటులు కూడా .వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం లోని తురక తెలుగు ను అద్భుతం గా పలికి ,నాటకీయం గా బోధించే వారని చెప్పుకొంటారు వారి శిష్యులు .అందరిని సమానం గా ఆదరించేవారు అనేక సార్లు భారత దేశమంతా తిరిగి విషయ సంగ్రహణ చేసిన మహోత్తమ పరిశోధకులు .మరుపుకు రాని వారు మరుపూరి కోదండ రామి రెడ్డి గారు
సశేషం—మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ 7-3-13-ఉయ్యూరు

