కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9
హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి
‘’ ఒక అయిడియా జీవితాన్నే మార్చేసి నట్లు ‘’ ప్రముఖులతో పరిచయం కూడా జీవితాన్ని మార్చేస్తుంది .బాల శౌరి రెడ్డి మద్రాస్ లో 1946 లో గాంధీ గారిని చూశారు .ఆటోగ్రాఫ్ కావాలని అడిగితే హిందీ లో రాసిచ్చారు మహాత్ముడు .దానితో హిందీపై అభిమానం పెరిగి ఇరవై వ ఏట ఇల్లు వదిలి కాశీ చేరారు .హిందీ చదవటం ప్రారంభించారు .ఆ సమయం లో భారత కోకిల సరోజినీ నాయుడు చని పోయింది.ఆమె పై మొట్టమొదటి సారిగా కవిత్వం రాశారు .అది అందర్నీ ఆకర్షించింది .అప్పటికి ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు అనే పిల్చేవారు .సంస్కారం లేని వారిగా ,ఆంధ్రులని భావించి తేలిగ్గా చూసే వారు .రెడ్డి గారు దీన్ని సహించే వారు కాదు .ఒక ఉగాది పర్వదినాన రెడ్డి గారు ఆంద్ర భాషా వాజ్మయం పై అద్భుత ప్రసంగం చేసి అందరి నోళ్ళూ మూయించారు .మద్రాస్ నుండి వెలువడే ‘’త్రిలింగ ‘’పత్రిక లో ఆయన రచనలు ప్రచురితమయ్యెవి .హిందీ లో ప్రచురింప బడే ‘’గ్రామ సంసార ‘’పత్రికకు హిందీ రచనలు రాసేవారు .హిందీలో 75 ,తెలుగు లో 13 గ్రంధాలు రాసిన మేటి రచయిత బాల శౌరి రెడ్డి. దేశ ,విదేశాలలో లెక్కలేనన్ని సన్మానాలందుకొన్నారు .
హిందీ ప్రచారం
1950 లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రెడ్డి గారిని హిందీ ఉపన్యాసకుని గా మద్రాస్ కు ఆహ్వానించింది .రెడ్డి గారి ప్రతిభకు పట్టం కట్టింది నార్ల ,జలసూత్రం కృష్ణ శాస్త్రి మున్నగు సాహితీ మూర్తుల తో మంచి సాన్నిహిత్యమేర్పడింది .ఆబ్ (ఈనాడు ),ఆజ్కల్ పత్రికలలో హిందీ రచనలు వస్తూన్దేవి .పారితోషికమూ లభించేది .1954 లో ‘’పంచామ్రుత్ ‘’అనే గ్రంధాన్ని రాశారు .అందులో తెలుగు కవులను పరిచయం చేస్తూ వారి పద్యాలను హిందీ లో అనువాదం చేసి ప్రచురించారు .తెలుగు వాజ్మయ వికాసం పై విపుల మైన పీఠిక రాశారు .పట్టాభి గారు దీన్ని ఎంతో మెచ్చుకొన్నారు .నార్ల వారి అభినందనా లభించింది .ఈ గ్రంధానికి భారత ప్రభుత్వ పారితోషికమూ లభించింది .1956 లో పులి వెందుల లో ఆ నాటి విద్యా మంత్రి సమక్షం లో గడియారం వెంకట శాస్త్రి గారు ,జమ్మల మడక మాధవ రామ శర్మ గార్ల ఆధ్వర్యం లో రెడ్డి గారికి ఘన సన్మానం జరిగింది .’’జిందగీ రాఃహ్ (జీవన పధం )అనే హిందీ సాంఘిక నవలకు బహుమతి నందుకొన్నారు .రాష్ట్ర మంతటా సన్మాన మహోత్సవాలు జరిగాయి .రాష్ట్ర పతి రాధాకృష్ణన్ ముఖ్య మంత్రి కాసు సమక్షం లో హైదరాబాద్ లో ఆంద్ర రాష్ట్ర హిందీ ప్రచార సభ రజత జయంతి నాడు వైభవోపేతమైన సన్మానం అందుకొన్నారు .ఆంద్ర జ్యోతి లో37 వారాలు ధారా వాహికం గా ‘’రామాయణ కాలం లో భారతీయ సంస్కృతి ‘’ప్రచురింప బడి విశేషం గా ప్రజలను ఆకట్టుకొన్నారు
హిందీ లో నవలలు వ్యాసాలూ నాటకాలు ,వాజ్మయ చరిత్ర రాసి బహుమతులు పొందారు .30 పుస్తకాల ద్వారా తెలుగు భాషా ,సంస్కృతి , హిందీ లో రాసి హిందీ భాషాభిమానులకు తెలుగు వైభవాన్ని రుచి చూపించారు .రెడ్డి గారి హిందీ రచనలు తెలుగు లోకి అనువదింప బడి బహుళ ప్రచారం పొందాయి .వీరి ‘’లకుమ‘’నవల ఏడు సార్లు ముద్రణ పొందింది అంటే వీరి వైదుష్యం ఏమిటో తెలుస్తుంది .హిందీ కన్నడ గుజరాత్ భాషల్లోకీ అనువాదం పొందింది .లకుమ కు బెంగళూర్ యూని వర్సిటి అవార్డు ,దావాగ్ని నవలకు రాష్ట్ర పతి పురస్కారం లభించాయి .ఉత్తమ అనువాదకుని గా ‘’ద్వివాగ్రీశ్ ‘’అవార్డు ను రాష్ట్ర పతి శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకొన్నారు .దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాహిత్య అకాడెమీలు రెడ్డిగారికి ,సన్మానాలు చేసి తమ సాహిత్యాభిలాషను చాటుకోన్నాయి అనేక విద్వద్ సభల్లో కీలక ఉపన్యాసాలిచ్చారు .చాలా పత్రికలూ ప్రత్యెక సంచికలు ప్రచురించాయి 2000 లో ‘’అపనే అపనే బాల శౌరి రెడ్డి ‘’అనే 400 పేజీల అభి నందన సంచికను ఢిల్లీ సాహిత్య అకాడెమి ఆవిష్కరించి ఘనం గా సత్కరించింది .
మామా –చందమామా –సన్మాన సీమా
1966 నుండి 1985 వరసకు అంటే 23 ఏళ్ళు రెడ్డి గారు హిందీ’’ చందమామ ‘’సంపాదకులు గా పని చేశారు .ఆ చందమామ ఈ మామ ను ఇలా ఆదరించి గౌరవించింది .దాని సర్క్యులేషన్ ను1,67,000లకు పెంచిన ఘనత బాల శౌరి రెడ్డి గారిదే .కలకత్తా లోని భారతీయ భాషా పరిషత్ కు నాలుగేళ్ళు డైరెక్టర్ గా పని చేసి 30 సెమినార్లు నిర్వహించి రికార్డు సృష్టించారు .విశ్వంభర రాసిన నారాయణ రెడ్డి గారికి బాల శౌరి రెడ్డి గారి సారధ్యం లోనే మొదటి పురస్కారం లభించింది .మాలతీ చందూర్ ,రావూరి భరద్వాజ ,కేతు విశ్వనాధ రెడ్డి లకు కూడా పరిషత్తు తరఫున సన్మానాలను రెడ్డి గారు చేశారు .1998 నుండి తమిళ నాడు హిందీ అకాడెమి అధ్యక్షులు గా పని చేశారు .హిందీ దిన పత్రిక ‘’చమకతా సితారా ‘’కు సంపాదకులు గా మూడేళ్ళు పని చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’నూ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డి.లిట్ బిరుదు నిచ్చి సత్కరించాయి .’’సాహిత్య మార్తాండ ‘’.’’హిందీ రత్న ‘’,’’వాజ్మయ రత్నాకర‘’బిరుదులూ రెడ్డి గారిని వరించాయి .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,మహాత్మా గాంధి వంటి వారు అధ్యక్షులు గా పని చేసిన ‘’ప్రయాగ హిందీ సమ్మేళనం ‘’కు శ్రీ రెడ్డి ఎన్నిక అయారంటే వారి సామర్ధ్యత ఎంతో తెలుస్తోంది .1974 మొదటి హిందీ సమ్మేళనం లో ను మూడవ ఏడవ సమ్మేళనాలలో రెడ్డి గారిని ఘనం గా సన్మా నించారు .
జీవిత విశేషాలు
1928 లో కడప జిల్లా పులి వెందుల తాలూకా గొల్లల గూడూరు లో బాల శౌరి రెడ్డి గారు జన్మించారు .తన మాతృభాషకు ,రాష్ట్రానికి ,సంస్కృతికి గొప్ప పేరు తెచ్చి హిందీ భాష లో అసదృశ పాండిత్యాన్ని సంపాదించి ఉత్తర దక్షిణ భారతాలకు సారస్వత సేతువు గా అజేయం గా నిలిచి సాహితీ మూర్ధన్యులు బాల శౌరి రెడ్డి గారు .బాల్యం లోనే కాక యవ్వనం లో మధ్య వయసులో ముసలితనం లో కూడా నిత్యోత్సాహి గా ఉన్నారు .’’సమాజానికి ,దేశానికి ,ప్రపంచానికి రచయిత బాధ్యతా యుతం గా కృషి చేస్తూ ఒక పౌరుడు గా ఉండాలి ‘’అని సాహిత్య సిరి అయిన బాల శౌరి గారి అభిప్రాయం .ఓర్పు ,కృషి విశ్వాసమే హన విజయ రహస్యం అంటారు రెడ్డి గారు .హిందీ సాహిత్యాకాశం లో ప్రకాశ వంతం గ వేలుగులీనే ‘’చమక్ చమక్ తార‘’శ్రీ బాల శౌరి రెడ్డి ..
మరో ప్రముఖుని గూర్చి తర్వాతా
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –9-4-13- ఉయ్యూరు

