అన్నమయ్య స్మృతిలో…2
అన్నమయ్య సాహిత్య మథనం
అన్నమయ్య విలక్షణ లక్షణా సమన్వితంగా
వాడిన పదాలు :
‘ఇచ్చకాలు’ అంటే ఇంపైన మాటలా, మెర మెచ్చులా!
‘పన్నీరు’ అంటే ?
‘అలకల కులుకుల’ అంటే ఉంగరాల వెంట్రుకలా!
‘తిరుపట్ల’ అంటే ఒక ఊరా?
ఇలాంటివెన్నో! ఇంకా తేలనివి!!
అన్నమయ్య సాహిత్యం కొన్నివందల సంవత్సరాలు మరుగున పడి వుంది. క్రీ.శ.1816లో ఎ.డి.కాంబెల్ అనే ఒక పాశ్చాత్య వైయాకరణుల వినికిడికి వచ్చింది. కొం డపై వుండే ఒక బ్రాహ్మణుని ద్వారా ఆ రాగిరేకుల మీదవేమిటో తెలుసుకొని ‘ఉన్నదంతా ఆ స్వామిపై పాటలే; ఒకటి మాత్రం వ్యాకరణానికి సంబంధించినది. దీని నకలు తీయించా’నని వ్రాసుకొన్నాడు. బహుశః ఆ వ్యాకరణం సంకీర్తన లక్షణమై ఉంటుందని పెద్దలన్నారు కాని నేననుకోవడం పెదతిరుమలయ్య రేఫ ఱకార నిర్ణయమని. ఇవి చూసింది, ఆ అభిప్రాయం వెలిబుచ్చినది ఆ బ్రాహ్మణుడు. ‘సంకీర్తన లక్షణం’ చూసి అతనది ఛందో విషయమనుకోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. పెద తిరుమలయ్యది వ్యా కరణం అనుకొని ఆ దొరకలాచెప్పడం, తెలుగు వ్యాకరణం వ్రాయబూనిన ఆయన దాని నకలు వ్రాయించుకొనడం జరిగి ఉంటుంది.
ఇది కొన్ని కొత్త ప్రశ్నలకు తావిస్తున్నది. ఆ రాగిరేకులు ఆ నాటికి ఎక్కడున్నవి, యిప్పుడు మనం సంకీర్తన భండారం అని వ్యవహరిస్తున్నదానిలోనేనా? అప్పటికి వేలకొలది యీ రాగిరేకులు అక్కడే నిక్షిప్తమై వున్నవా? ఉంటే కొండపైనుండే ‘ఓ’ బ్రాహ్మడి (అర్చకులలో ఒకరనుకొన్నా సరే!) అందుబాటులోనే వున్నా యా? దొరగారడిగిన వెంటనే చూసి చెప్పగలిగాడా? అయి తే 1922లో తి.తి.దే వారు వీటిని ఎక్కడ కనుగొన్నారు? శ్రీ వేటూరి ఆదేశానుసారం అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు ఆ భండారంలోనివి దిగినప్పుడవన్ని అందులో లేవే? మరెక్కడున్నవి! 1947-48 ప్రాంతాల్లో వీటిని వెలికి తీసి పరిష్కరించి ప్రచురించేకార్యక్రమం తి.తి.దే పలువురు పెద్దల ప్రమేయంతో చేయించింది. వారిలో ప్రథములు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, చివరి నాల్గింటికి ఒక రూపం కల్పించింది కామిశెట్టి శ్రీనివాసులు, మేడసాని మోహన్.
ఈ రాగిరేకులలో లేనివి కొన్ని తాళ్లపాక వంశస్థుల వద్ద చేతివ్రాత పుస్తకాలలో లభించాయి. ‘పొడగంటిమయ్యా, పురుషోత్తమా’, ‘అలుగక కూటమి చవిగాదనుచు’ మొదలైనవి. చిరంజీవి జి.బి.శంకరరావు తాళ్లపాక శేషాచార్యుల వ్రాతప్రతి నుంచి 288, తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి 30 చిల్లరా సేకరించి వేటూరి ఆనందమూర్తి పరిష్కరించగా తయారు చేసినది కొన్నేళ్లుగా తి.తి.దే వారి ప్రచురణకు స్వీకరించబడి, పడివున్నది. ఆనందమూర్తి ప్రతిపాదనలో ముఖ్యాంశం (తన తండ్రిగారు సూచించినదే) యీ తాళ్లపాక వంశంలో అన్నమయ్య, పెదతిరుమల య్య, చిన్నన్నలే కాక పదకర్తలు మరికొందరున్నారు అన్నది యీ పుస్తకం బయటికి వస్తే చర్చనీయాంశం అవుతుంది. ఇంతకు ముందు తెలియనిది, ఎవరికీ తట్టనిదీ ఒకరంటేనే దానిని కాదనేవారు కాదనగలరు, బలపరచేవారౌననగలరు. ఇవి సహేతుకంగా సాగితే జరిగే వడపోత మంచిదే.
అన్నమయ్య సాహిత్యం 6 శతాబ్దాల క్రిందటిది. సాధారణులు దానిని పూర్తిగా అర్థం చేసికొనడం కష్టం. ఆనాటి మాటలు కొన్ని నేడు చలామణిలో లేవు. మరికొన్నిటికి అర్థం మారింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు, శబ్దరత్నాకరం పదసాహిత్యంలో వున్న మాటలను పట్టించుకోలేదు. ఆ కొరత ‘శ్రీహరి నిఘంటువు’ (రవ్వా శ్రీహరి, 2004) కొంత వరకు తీర్చింది. అన్ని వేల పదాలు కాకపోయినా ఆరోపాలన్నీ అన్నమయ్య రచనల నుంచే స్వీకరించిన ‘అన్నమయ్య పదకోశం’ (రవ్వా శ్రీహరి, 2013) మరింత ముందుకు సాగించింది. అన్నమయ్య వాడిన ప్రతి పదానికీ నిర్దిష్టమైన అర్థం సాధించడం గగన పారిజాతం. ఇది చేసిన వారి కృషిని తేలిక చేయ డం కాదు. ఆ తాళ్లపాక సముద్ర మథనం క్షీరసాగర మథనం లాంటిదని గ్రహించడమే. తాళ్లపాక సాహిత్యాన్ని ఆరాధించే వారికి మరికొన్ని వెసులుబాట్లివీ: ‘అన్నమయ్య సంకీర్తనామృతం (సముద్రాల లక్ష్మణయ్య). ఇందులో 150 ఆధ్యాత్మిక సంకీర్తనలకు ఒలిచిన అరటిపండులాంటి అర్థ వివరణ లభిస్తుంది. చివరి రెండూ తి.తి.దే ప్రచురణలు. ‘తాళ్లపాక వారి పలుకుబళ్లు’ (రామలక్ష్మీ ఆరుద్ర, 1971, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ) వలన తెలిసేవి ప్రయోగ విశేషాలే అయినా, యీ సంకీర్తనల పూర్తి పాఠాలు పరిశీలిస్తే మరికొన్ని క్లిష్ట పదాలకర్థాలు తేలికవవచ్చు. ఈ సేకరణ 18 సంపుటాల వరకే పరిమితం.
ఇటువంటి బృహత్కార్యం, ‘తాళ్లపాక పదప్రయోగ కోశం’ అన్ని సంపుటాల నుంచీ తీసికొన్నది పి.నరసింహారెడ్డి అజమాయిషీలో తయారయి గత రెండేళ్లు గా తి.తి.దే ప్రచురణకు ఎదురు చూస్తున్నది.
కేవలం పాటల ఛందస్సు, నిర్మాణం తెలుసుకోవాలంటే ఆంగ్లాంధ్రాలలో ఒక కల్పద్రుమం ‘ది ట్యూన్స్ ఆఫ్ డివినిటీ’! ఒక ప్రక్క తాళ్లపాక చిన తిరుమలయ్య వ్రాసిన సంకీర్తన లక్షణం, మరొక ప్రక్క సాళ్వ కృష్ణమూర్తిగారి సరళానువాదం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, సెమ్మంజేరి, మద్రాసు 600 041 వారి ప్రచురణ 1990). ఇప్పుడిది అచ్చులో దొరకదు. ఆ సం స్థకు దీనిని పునఃప్రచురణ చేసే ఉద్దేశమూ ఉన్నట్లు లేదు. సమర్థులూ, దీని అసామాన్యతను గ్రహించగలవారూ ఆ పని చేపట్టితే తెలుగుభాషకొక ఆమూల్యాభరణం తిరిగి అందగలదు. ఇవన్నీ ఒక ఎత్తు.
అన్నమయ్య సాహిత్యంలోని వేర్వేరు కోణాలను వెలిగించటానికి పనికి వచ్చేవి. తాళ్లపాక సాహిత్యమంతటినీ దృష్టిలో వుంచుకొని, తండ్రి చూపిన దారిలో నడచి మకుటాయమానమైన వివరణలు చేసినది వేటూరి ఆనందమూర్తి. ‘తాళ్లపాక కవుల కృతులు’ మొదటిది. ‘తాళ్లపాక కవుల పద కవితలు’ రెండవది. వీటి సొంత ప్రచురణ 1976లో. అచ్చులో లేవు. వీటిని తి.తి.దే పునర్ముద్రణకు 2007లో స్వీకరించింది. తరువాత వీటి సంగతేమిటో తెలియదు. ఈ పుస్తకాలన్నీ అందుబాటులో వుంటే అన్నమయ్య సాహిత్యమంతా అరచేతి ఉసిరిక అవుతుందా! దశమస్కంధం పారాయణ చేసినంత మాత్రాన ఆ ధూర్తుడు మన వశంవర్తి అవుతాడా? అవదు; అవడు. కానీ యీ ప్రయత్నాల కా పుస్తకాలు తోడ్పడగలవు. కొంత పొగమంచు విడగలదు. కొన్ని తెరలు తొలగగలవు. ఆ రోజు కోసం ఎదురు చూపులు!
– వి.ఎ.కె.రంగారావు

