కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10
సరసుడు బెజవాడ గోపాల రెడ్డి
బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్ అయిదున జన్మించారు .తండ్రి పట్టాభి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రుని శాంతినికేతన్ లో విద్య పూర్తీ చేశారు గాంధీ గారి పిలుపు తో స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని చాలా సార్లు జైలు కు వెళ్ళారు .ముప్ఫై ఏళ్ళు రాక ముందే మంత్రి అయి ఆశ్చర్య పరచారు .రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా సుమారు 15 ఏళ్ళు పని చేశారు .రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్నా సాహిత్యం పై మక్కువ వీడలేదు .
రెడ్డి ఆంద్ర విశ్వ విద్యా లాయానికి ప్రో చాన్సలర్ గా ఎన్నికయి ఆరేళ్ళు పదవిలో కోన సాగారు తెలుగు భాషా సమితి ,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి లకు అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ఆయనది ఆనేక గ్రంధాలు వెలువరించారు .కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షతా ఆయన్ను వరించింది .దీనికి తోడు జ్ఞాన పీఠ పురస్కార సంఘానికి అధ్యక్షులు గాను వ్యవహరించారు .విశ్వ కవి రవీంద్రుడు అంటే రెడ్డి గారికి మహా అభిమానం .రవీంద్రుని రచనలను తెలుగు లోకి అనువ దించారు .రవి కవి న్హృదయాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు .ఉర్దూ భాషలోను పట్టు సాధించి ,ఆరచనలనూ తెలుగు చేశారు .70ఏళ్ళు పై బడిన తర్వాతే స్వంత రచనలు ప్రారంభించారు .తన అనుభవాలను జ్ఞాపకాలను అక్షర బద్ధం చేశారు .ఇరవై కి పైగా కవితా సంపుటాలను వెలువ రించారు .
గోపాల రెడ్డి గారు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు పదవీ విరమణ తర్వాతా రాజకీయాలకు దూరమయ్యారు .ఆయన సరసుడు సహృదయుడు కూడా .కళా పిపాసి నిత్య సాహితీ చైతన్య జీవి .’’గోపాల రెడ్డి ది భారతీయ హృదయం .చూపు విశ్వభారతీయం ,నాలుక తెలుగు జాతీయం ,శ్వాస కోశాలు సంగీత సాహిత్య జాతీయం ,నడక సౌజన్యం ,నవ్వు రసికత్వం ,పిలుపు సహజీవనం తలపు మధుర భావనం, బాట గాంధీయం ,పాటజాతీయం ‘’అన్న ఆచార్య జి.వి.. సుబ్రహ్మణ్యం గారి ఎస్టిమేషన్ సత్య దర్శనమే .రెడ్డి గారు ఆజాను బాహువు .ఆయన వ్యక్తిత్వమూ అంత దొడ్డదే .విస్తృతం గా పర్యటించిన యాత్రికుడాయన .’’నేను విశ్వ నరున్ని .వసుధైక కుటుంబం నా లక్ష్యం .’’అని చెప్పిన సంస్కారి .తనది సార్ధక మైన జీవితం అని సంతృప్తి తోనే తాను జీవిస్తున్నానని ,అన్ని రంగాలలోను తాను గణనీయ పాత్రను పోషించానని మనో వాక్కాయ కర్మలా తానొక వీరుడిగా గడిపానని ఢంకా బజాయించి చెప్పిన సరస సాహిత్య సున్నిత హృదయులు బెజవాడ గోపాల రెడ్డి వరేన్యులు .9-3-1997 న తొంభై ఏళ్ళ ముది ప్రాయాన రెడ్డి గారు తుది శ్వాస వదిలారు .
సశేషం
మీ –గబ్బట దుర్గా ప్రసాద్ 10-4-13- –ఉయ్యూరు

