కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )
శాస్త్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి
విజ్ఞాన శాస్త్రం లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి ఆశాఖ లో అధ్యాపకుడై ,స్వయం గా ఇంజినీరింగ్ కాలేజి స్తాపించి ,సాంకేతిక విద్య ను సార్వత్రికం చేసిన వదాన్యుడు ,విద్యా వినయ సంపన్నుడు ,కవి ఉండేల.’’ఒండేల –ఉండేల అన్నిటా సర్వ సమర్ధుడు ‘’ .నేతాజీ ,వి వేకానందుడు ,కాంతి చక్రాలు అన్న కావ్యాలు రాశారు .నిత్యం రాయటం అయన దిన చర్య .తొమ్మిదో తరగతి లోనే కవిత చెప్పిన బాల కవి ..జాతిని తీర్చి దిద్దిన మహాను భావులను ,నాయకులను గా చేసి కావ్యాలు రాసి దేశ భక్తిని చాటుకొన్నారు .’’ఆరు వేల మైళ్ళ కావల బెత్తెడు –దీవులేలుకోనేదడివారు తెల్లవారు–నాల్గు కోట్ల ప్రజలు నలువది కోట్ల పై –ప్రభువులైరి ఎంత పరువు చేటు /’’అని చిన్నప్పుడే పరపీడనం పై విరుచుకు పడ్డారు .ప్రాచీన ఛందస్సునే ఎన్నుకొని కవిత లల్లారు .నవీన భావాలను అందులో అందం గా పొదిగారు .కర్షక పక్ష పాతి అవటం తో ఆ భావాలను ,అనుభ వాలను కర్షక భాష లో వెల్లడించారు .ఆయనకు ‘’జాబిలి రేక వెండి కొడవలి గా తోచింది .’’అది మొలక చీకటి పైరులను తరుగు తోందట .’’మంచి భావం, తగిన పదజాలం .వీరి కవిత్వాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి ,మల్లంపల్లి సోమ శేఖర శర్మ ,దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు మెచ్చారు .’’ప్రాచీనులలో నవీనులు ‘’అని కితాబు నిచ్చారు .
‘’వివేకానందుడు అనే గ్రంధం చక్కని తాత్విక చింతన కల్గిస్తుంది .’’కానందు ‘’ని పై రెడ్డి గారికి భక్తీ ఎక్కువ .పులకించి పోయి వర్నిస్తారా వైతాలికుడిని .వివేకానంద మరణాన్ని జీర్ణించుకోలేక ‘ఆత్మ సామ్రాజ్య పాలనా దక్ష మణికి–నీకు నేటికి నూరేండ్లు నిన్డునేల ?-దైవ సృష్టి రహస్య మర్ధంబు గాదు –త్యాగ గుణశాలి –భారత సన్యాస మౌళి ‘’అని తన బాధ నంతా కవిత్వం లో కుమ్మరించేశారు .
‘’కోడి’’ ని శ్రామిక జీవి అని ,సహృదయత తో మెచ్చారు .’’ఉదాత్త గుణాధ్యము ణనీచరిత్ర బెన్ కబ్బము వ్రాయ వచ్చును ‘’అని కొనియాడారు .శ్రమించే వారు అంటే రెడ్డి గారికి ఎంతో ఆదరం .కోడికి ‘’రుతు బద్ధ రాగ భోగోన్నతి ఉంది‘’అని శ్లాఘించారు .కోడి ని ఆదర్శం గా తీసుకొంటే సోమరితనం పోతుందని ,ఉర్వి సుభిక్షం గా ఉంటుందని హితవు చెప్పారు .
భారతీయ కలలపై రెడ్డి గారికి అభిమానం ,మక్కువా ఎక్కువ .చేనేత పై ‘’వస్త్ర శిల్పి ‘’ఖండిక రాశారు .’’ప్రాణము లేని యంత్రాల పనిని మెచ్చి –జీవ యంత్రము నిను ,పేద జేతురట –‘’అని నేతన్న దైన్య స్తితికి సానుభూతి తో స్పందించారు .ఆడవారు గాజులు వేసుకొంటే అందం గా ఉంటారు .గాజుల్లేని స్త్రీ ‘’శిశిర గీత వ్రాత శిధిల వల్లకి వోలె‘’చిన్న బోతుందని బాధ పడ్డారు .భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై రెడ్డి గారికి విపరీత ఆరాధనా భావం ఉంది
మాల కొండా రెడ్డి గారు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ‘’ఇని మేర్ల ‘’లో 13-8-1932 లో జన్మించారు .సివిల్ ఇంజినీరింగ్ చదివి రాష్ట్ర ప్రభుత్వం లో ఇంజినీర్ గా రెండేళ్ళు పని చేశారు తర్వాత ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి లోను వరంగల్ కాలేజి లోను పని చేసి ప్రొఫెసర్ అయారు .1979 లో ‘’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘’స్తాపించి సాంకేతిక విద్య కు గణనీయ మైన స్తాయి కల్పించారు .ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన యోగ్యుడు రెడ్డి గారు
49 వ ఏట ‘’మొగలి రేకులు ‘’రాశారు 1946 లో ‘’సత్యం శివం సుందరం ‘’రాశారు .అవసాన దశ లో అంటే2003 లో భగవద్గీత ఆధారం గా ‘’మానవ గీత ‘’రాసి జన్మ చరితార్ధం చేసుకొన్నారు .ఎంతో మంది ప్రతిభా వంతులకు పురస్కారాల నందించిన వదాన్యులు,త్యాగశీలి ఉండేలా మాల కొండా రెడ్డి గారు .
14-గోళ్ళమూడి వెంకట రామ రెడ్డి
ప్రకాశం జిల్లా పాకాల ప్రాంత నివాసి .ప్రాధమిక విద్య మాత్రమె నేర్చారు .స్వయం కృషి తో విజ్ఞానం పొందిన సాధకుడు .’’చిత్రాంగి ‘’నాటకం మాత్రమె వీరి నిర్యాణం తర్వాత భార్య ప్రచురించారు ఇది పూర్తీ గ్రాంధిక రచన
15-దిరిశాల వెంకట రామణా రెడ్డి
ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గా పని చేశారు .మంచి కవితా లక్షణాలున్న వారు ‘’పల్లె టూరు ‘’అనే ఖండిక వీరికి సాహిత్యం లో స్థానం కల్పించింది వడ్లు దంపె స్త్రీలను సహజ సుందరం గా వర్ణించి న కవి .యేకులు వడికే స్త్రీని ,సాతాను జియ్యరు ,పంచాంగ శాస్త్రులను తన కవిత్వం లో అందం గా బంధించారు .’’భాగ్య మేదైన ప్రుదివిని బడయ వచ్చు –తొడరి శారదాంశ బడయ దుర్లభంబు –‘’అంటూ ఒంగోలు జిల్లా రచయితల సంఘం వారు ‘’ప్రొద్దు పొడుపు ‘’కావ్యాన్ని అన్కితమిచ్చటప్పుడు చెప్పి ‘’మీరు నేను ఈ రీతి గా బంధువుల మయ్యాం ‘’అని చమత్కరించారు
‘’కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు’’ఇంతటితో పరి సమాప్తం –స్వస్తి
మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –13-4-13- ఉయ్యూరు




