శ్రీ విజయ ఉగాది కవికోకిల స్వనాలు -6

 శ్రీ విజయ ఉగాది కవికోకిల స్వనాలు -6

   13-పరామర్శ –మినీ కధ –శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు –  విజయ వాడ 9494649967

           అర్ధరాత్రి రెండింటికి ఫోన్ మోగి మెలకువ వచ్చింది .గతం లో’’ టెలిగ్రాం ‘’అని కేక వినపడగానే హడలి చచ్చే వాళ్ళం ఏం కొంప మునిగిందో నని .ఇప్పుడు వేళకాని వళ సెల్ మోగితే అదే కంగారు ఏ వార్తైనా పాట తో మొదలెట్టి చెబుతుంది .మంచేదో చెడేదో దానికేం తెలుసు ? .వైజాగ్ నుంచి అన్నయ్య ఫోన్ .వదినకు సేఎరియస్ అని i.c.u.లో ఉందని నీరసం గా చెప్పాడు .రెండు ఉపశమనం మాటలు ఊది, తయారై స్టేషన్ కు బయల్దేరా .అసలు మా అన్నయ్యకు ఆరోగ్య సమస్యలున్నాయి .ఆ మధ్యనే రెండు సార్లుi.c.uలో చేరి గండం గడిచి బయట పడ్డాడు .మా వదినకు మొదట్లో ‘’శంఖం ‘’మాత్రమె ఉండేది .ఈ మధ్యనే‘’చక్రం ‘’కూడా వచ్చి చేరింది .(అదే నండి బి.పీ.,సుగరూ )అయినా ఆరోగ్యం గానే ఉంటుంది .ఇప్పుడేమయిందో మరి ?

               నేను వైజాగ్ చేరకుండానే వదిన పై లోకాలకు చేరుకొన్న సంగతీ తెలిసింది .ఇల్లు చేరుకొన్నాను .పిల్లలు బంధువులు చేరుకొంటున్నారు .’’జరగ వలసిన కార్యక్రమం చూడండి ‘’అన్నాడు పక్క ఫ్లాట్ ఆయన నన్ను చూసి .శవాన్ని ఎక్కువ సేపు కారిడార్ లో ఉంచటానికి ఇష్టపడటం లేదుఇరుగుఊరుగు .మా వదిన నిన్నటి వరకు ఎంతో కలివిడి గా మసలిన మనిషి .ప్రాణం ఎంతో విలువైనదీ అంటే ఇదే నన్న మాట .

                అన్నయ్యతో మాట్లాడుతుంటే వచ్చింది మా మేనత్త ‘’అయ్యో !ఎంత పని జరిగి పోయిందిరా ! తను బాగానే ఉండేది కదా అసలు పోయింది తను అంటే నమ్మలేక పోయానురా ‘’అంది .దాదాపు అందరిది అదే మాట .అంటే అన్నయ్య పోయాడు అంటే తేలిగ్గా నమ్మే వారన్నమాట .’’నేనూ ముందు నమ్మలేదే .తను శుభ్రం గా నే ఉండేది కదా ?’’అన్నాడు మామయ్య.ఫార్మాలిటీ గా కాఫీ తాగుతూ .నేను వచ్చిన గంటలో మామయ్యకాఫీ తాగటం ఇది మూడో సారి ..

       ‘’అవును నేను పోయి ఉంటె బాగుండేది .’’అని అప్పటికి చాలా సార్లు అన్న అన్నయ్య కూడా మౌనం గా ఉండి పోయాడు .అందరు అదే మాట పలు సార్లు అంటుంటే చేష్టలుడిగి .

  ‘’బాడీ ని ఈ రోజే తీసేస్తారా /ఇంకా ఎవరైనా రావాలా ?’’ఎవరో చెవులు కొరుక్కుంటున్నారు .మా అన్నయ్య రెండో కొడుకు బొంబాయి నించి ఫ్లైట్ లో వస్తున్నాడు .వాడికోసమే చూస్తున్నాం .

          ఆటో ఆగిన శబ్దం విని బయటకు వచ్చాను .మా అన్నయ్య తోడల్లుడు(తోడేలల్లుడు ?) దిగాడు .నన్ను చూసి ‘’వార్త వినగానే షాక్ తో అవాక్కయ్యా నండీ .పోయింది ఆవిడా ,ఆయనా అని అనుమానం కూడా వచ్చింది . ఆవిడ బాగానే ఉండేది కదా ?ఏమయ్యింది ఇంతలో ?’’అని యక్ష ప్రశ్నలు సంధించాడు .నేను సమాధానం చెప్పకుండా మౌనం గా నిష్క్రమించాను .ఇదీ మన పరామర్శ తంతు .

 

14—తాజ్ మహల్ –కవిత –శ్రీమతి ఎస్.ఉషారాణి –  పెదఓగిరాల — 9346705908

        ఓ అపురూప చారిత్రిక విన్యాసమా !

        షాజహాను ప్రేమ పారవశ్యం లో స్నానించి

         పర్షియన్ అగరు ధూప లతికల్లో

        గులాబీ అత్తరు పరిమళాలలో

        విహరించిన మొఘల్ సోయగమా !

                 నీపాల రాతి చెక్కుటద్దాలలో

                 ఒదిగిపోయిన శరచ్చంద్రికలు

                 నీ రత్న ఖచిత కాంతి రేఖల్లో మెరిసి

                 ఎగిసి పడుతున్న యమునా జల తరంగిణులు

  ఒకానొక అవ్యక్త దుఃఖ భారంతో

  అనుక్షణం నీ తలపుల్ని స్పృశించే

  హాజహాను హృదయ విపంచిక నుండి

  జారిపడిన రస రాగ మాలిక వై

  ప్రపంచాన్ని వివశుల్ని చేస్తున్నావు .

             నీ నిశ్చల నిద్రా సౌందర్య భారాన్ని

             యమున మాత్రం ఎంతకాలమని మోయ గలదు ?

             శోకమా /విరహమా ?సౌందర్యమా ?

             ఎటూ తెలియక మనసు మాటి మాటికీ తడ బడుతోంది

    వెన్నెల లేని దీర్ఘ హేమంత యామినిలో

    యమునా జలాలాలలో నీ నీడ కనీ పించని వేళ

     షాజహాన్ శోక గీత మొకటి నిన్ను వెదుక్కుంటూ

      స్వర్గ ద్వారాల చెంత పదే పదే పడిగాపులు పడుతోంది

               చక్రవర్తీ !

              బ్రద్దలైన జీవన మధు కలశం నుండి ఒలికి పోతున్న

             సౌందర్య ప్రవాహాలను నీ కం దించే దెవ్వరు ?

              భరత ఖండ మంతా నీకు దాసోహమంటున్న వేళ

              నీప్రేమను పరీక్షించటానికి

              విరహోద్యాన వనాల్లోకి పారిపోయిన నీముంతాజ్

                         యమునా నదీ సైకత శ్రేణుల్లో

                         మలి సంజలో నిశ్చేస్టుడవై

                         ఒంటరిగా నిలబడిన నువ్వు,

                         కాలం చెక్కిలి మీద

                         గడ్డ కట్టిన కన్నీటి చుక్కలా

                          ఈ తాజ్ మహల్ !

 

      15–  అమ్మ భాష (కవిత )శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –(మచిలీ పట్నం )-9247558854

             భాషే కదా –మనం పుట్టినప్పుడే మన పో(తొ )లి కేకతో మన బతుకు ను బయట పెట్టింది

          భాషేకదా –ఉయ్యాలలో ఉలిక్కి పడ్డప్పుడు –‘’వస్తున్నా కన్నా’’ అన్న అమ్మ పిలుపై                   ధైర్యాన్నిచ్చింది ?

          భాషేకదా –అల్లరి చేష్టలతో అలసిన వేళ –అమ్మ లాలి పాడి మనల్ని నిదుర పుచ్చింది ?

          భాషేకదా –ఉప్పు కప్పురంబు అంటూ భిన్న మైన మనుషులకు

                     రూపాలోకటే నంటూ ఒకటో తరగతి లోనే –బతుకు పాఠంనేర్పింది ?

        ఈ భాషే కదా –కులమత ప్రాంతీయ భేదాలకతీతంగా

                           విశాల భావం తో ‘’భాషా ప్రయుక్త ఆది రాష్ట్రం గా ‘’

                           ఆంద్ర రాష్ట్రాన్ని అవతరింప జేసింది ?

       మన తల్లి  భాషే కదా –మన ఆనందాన్ని బాధల్ని కోపాల్ని

                                     అభిమానాల్ని ,అవమానాలని పది మందితో

                                     మనసు విప్పి పంచుకొనేందుకు మాధ్యమమై

                                     నిలిచి మన భావ జాలానికి బలాన్నిచ్చింది /?

           అలాంటి అమ్మ భాష ను మరిచి –ఆర్ధికాభివృద్ధి సాకుతో నో ,ఉన్నత జీవనమన్న మైకం తోనో

             ఎంతగా అమ్ముడై పోయాం మనం

          మన తల్లిని వదిలి మన తల్లి చేతే ఊడిగం చేయించు కొంటు –కర్ర పెత్తనం చేస్తున్న ఆంగ్ల దొరసాని ని నెత్తి  కెక్కించు కొని

       ఊరేగిస్తున్నాం మన సౌభాగ్యాన్ని సర్వం కోల్పోయాం .

                 అవధానం వాడిని ,ఆవకాయ వేడినీ –గోముగా వడ్డించే గొంగూరనీ

                 సంక్రాంతికి ఎదురొచ్చే బసవన్నల్ని

                  పడమటి గోపురం మీదవాలి పోయే పొద్దుల్ని –

                  ఇలా ఎన్నిటినో ఎంతో కోల్పోయాం .

                               పంట పొలాల్ని చితి పెట్టి పరిగ లేరుకొంటున్నాం

                              చివరికి తల్లి భాషలో మాట్లాడి తే శిక్షలు పొందే స్తాయికి దిగజారాం  

                              ఆంగ్లాంధకారం నుండి ఇకనైనా మేల్కొందాం

                              అమ్మని ప్రేమిద్దాం –అతిధి ని గౌరవిద్దాం

                              అవసర మున్నంత వరకే  అవతలి భాషల గురించి ఆలోచిద్దాం

                              తెలుగు పునర్జీవానికి పూనుకొన్న ‘’విద్వన్ మండలి ‘’కి అండగా నిలుద్దాం

                      ఈ మెయిల్ లలో నో ఏ మెయిల్ లలోనో విహరిం చినా నా –తల్లి  మేలు మరచి పోకుండా ఉందాం

                      అంత రిక్షం లో ప్రసరించే అంతర్జాల ,శాస్త్ర ,సంకేత తరంగాలలో

                      తెలుగు అంత రంగాన్ని ఆవిష్కరిద్దాం

                     అంతరించి పోతోంది అంటున్న తెలుగు తేజాన్ని

                     ఖండ ఖండాంత రాలలో అఖండం గా ప్రకాశింప  జేద్దాం

                     విజయం చేస్తున్న విజయ నామ సంవత్సర సాక్షి గా బాస చేసి చెబుదాం

                     

       ‘’నా తల్లి బాస మరే భాష కు బానిస కానివ్వమని

      అమ్మకాలకు కాక ,అమ్మ కాళ్ళకే మనం అనవరత అవనత శిరస్కులమని ‘’

      మంచి మార్పు కోరే మనసే భాషా వికాసానికి పునాది

      దానిని ఆరంభించిన తొలి నాడే మనకు అచ్చమైన ఉగాది ..

                 సశేషం –మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –13-4-13 ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవి కోకిల స్వరాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.