నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్
ఆయన గాత్రం విలక్షణ మైంది .ఆయన ఆహార్యం అచ్చ తెలుగుదనం నిండి ఉండేది .ఆయన అష్టభాషా పండితుడు .రెండు లక్షకు పైగా గజల్స్ రాసి ‘’గజల్ మొగల్ ‘’అని పించాడు .నిండైన విగ్రహం నిలువు బొట్టు తలపాగా చూడగానే ఆయనే ప్రతివాది భయంకర శ్రీనివాస్ అని గుర్తిస్తాం .ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆయన తీరు మారదు .మనల్ని చూసి అంతా నేర్చుకోవాలన్న అయన ఆరాటం సఫలీ కృతం .83 ఏళ్ళ వయసులోనిన్న అమరుడై అమర గాయక శ్రేణిలో చేరిపోయాడు ఆయన వాయిస్ ను’’ శ్రీనివాయిస్ ‘’అని బాపు రమణలు కీర్తిన్చినట్లు గుర్తు .అదో సప్తస్వర స్వర పేటిక .అందులో ఎన్నెన్ని రాగాలు ఇమిడాయో ,ఓదిగాయో లెక్క చెప్పలేము /పక్క రాష్ట్రాలు గుర్తించి కీర్తి కిరీటాలు పెట్టినా కళ్ళు లేని కబోది ప్రభుత్వాలైన మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమూ ఏ బిరుదూ నివ్వకుండా నిశ్చేతనంగా ఉండిపోవటం సిగ్గు పడాల్సిన విషయం దీనికి ప్రయత్నించని శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యుల అచేతనత్వానికి నిదర్శనం .ఆయన వీటికేమీ ఆరాట పడలేదు .ఆయనకు వస్తే మనం సంతోషించేవాళ్ళం .కాలర్ ఎగరేసుకొనే వాళ్ళం .
సందర్భానికి ,సంఘటనకు స్పందించి కవితలు చెప్పిన కవి గాయకుడు శ్రీనివాస్ ..నీల్ ఆర్మస్త్రాంగ్ చంద్రుని పై కాలు మోపి నప్పుడు మానవ అభ్యుదయం ముండగు వేసినందుకు పులకించి ఆంగ్లం లో కవిత రాసి ,పాడి ‘’మామ’’ పైనే కాలు మోపిన’’ అల్లుడుఆర్మ స్ట్రాంగ్’’ ను ,ఆనాటి ప్రెసిడెంట్ నిక్సన్ ను మెప్పించిన ఘనుడు .చిన్నతనం లో మాటలు ఆలస్యం గా వచ్చినా ‘’శ్రీనివాయిసీయం ‘’ఆ తర్వాత ఉధృత సెలయేటి ప్రవాహం లా ముందుకు దూసుకొని ఒడ్డులొరసి ప్రవహించి ధన్య మైంది భక్తీ, రక్తి ,జ్ఞాన వైరాగ్య గీతాలకేన్నిటికో ప్రాణ ప్రతిష్ట చేశాడు .సినీ సంగీత దర్శకత్వమూ వహించి తన సత్తా చాటుకొన్నాడు .ప్రముఖ వీణ విద్వాంశులు ఈమని శంకర శాస్త్రి గారి ప్రోత్సాహం తో సినీ రంగ ప్రవేశం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసుకొన్నాడు .మొట్టమొదటి సారి జెమినీ స్టూడియో లో భక్త కబీర్ దాస్ దోహాలు పాడి ‘’ఆహా ‘’అని పించుకొన్నాడు అదే ఆయన రంగ ప్రవేశం ..
ఘంట సాల వెంకటేశ్వర రావు గారంటే వీర అభిమానం శ్రీనివాస్ కు .ఘంట సాల విగ్రహావిష్కరణకు వచ్చి మహా సంబర పడ్డాడు .నిర్మాత నాగేంద్ర రావు ఆయనకు తోలి అవకాశమిచ్చారు .ప్రముఖ గాయని సుశీల గారితో కలిసి తొలి సినీ పాట పాడారు ..అదే ‘’ప్రేమపాశెం ‘’ఆ పాశం ఇప్పటి వరకు వదలలేదు ‘’అదో అనుకోని యాదృచ్చిక సంఘటన .తెలుగు లో ‘’కత్తి వీరుడు కాంతా రావు ‘’సినిమాలకు ,కన్నడం లో ‘’కన్నడ కంఠీరవుడు’’రాజ కుమార్ కు ,తమిళం లో శివాజీ గణేషన్ కు ఎక్కువ పాటలు పాడిన ఘనత శ్రీనివాస్ దే .హిందీ లోను పాడి అక్కడి ,ఇక్కడి వారిని మెప్పించాడు .దక్షిణాది భాషలన్నిట్లోనూ పాటలు పాడి సెహబాస్ శ్రీనివాస్ అని పించుకొన్నాడు .అయన గీత రచయిత గా కూడా లబ్ధ ప్రతిస్టుడు.
ఆకలి రాజ్యం హిందీ సినిమాలో ‘’తూ హై రాజా ‘’అనే జనాదరణ పొందిన పాట రాసిన గీత రచయిత శ్రీనివాస్ .చాలా కాలం సినీ సంగీత వినీ లాకాశం లో చుక్కల్లో పున్నమి చంద్రుడు గా వెలిగాడు .భక్తీ గీతాలను ఆర్తిగా పాడి మెప్పు పొందాడు ముకుందమాల వెంకటేశ్వర సుప్రభాతం ,మల్లికార్జున స్తోత్రం పాడి భక్తీ భావలహరి ని పారించిన మేటి గాయకుడు .శ్రీనివాయిస్ లో మాధుర్యం పరవశం కల్గిస్తుంది .ఆయన శైలి చాలా విలక్షణ మైనది ఎన్నో పద్యాలకు ప్రాణం పోశాడు .మద్రాస్ లో వుడ్ లాండ్ హోటల్ లో ఆయన సాయంకాలాలు తనకై కేటాయించిన ప్రత్యెక టేబుల్ దగ్గర కోర్చుని గీత రచన చేయటం,పాడి వినిపించి అభిమానులను సంతృప్తి పరచటం అందరికి తెలిసిన విషయమే .ఘంట సాల సినీ రంగం లో ఏకచ్చత్రాదిపత్యం గా ఏలుతున్న కాలం లో ఆ కంఠానికి ఏమాత్రం దరి దాపుల్లో తన స్వరం లేక పోయినా ,విలక్షణ స్వరం తో అంతటి స్తానాన్ని ఆక్రమించటం శ్రీనివాయిస్ ప్రతిభకు నిదర్శనం ..
హిందీలో రఫీ కి మించిన గోతు ఘంటసాలది తలత్ మహమూద్ ను తలపించే స్వరం శ్రీనివాస్ ది అని అందరు మెచ్చిన సంగతి మనకు తెలుసు .’’పక్కింటి అమ్మాయి ‘’సినిమాలో శ్రీనివాస్ జపానీ పాటను పాడిఅలరించి తన ‘’స్వర వైవిధ్యాన్ని’’ నిరూపించుకొన్నాడు .’’నీలి మేఘాలలో నీలాల తారవో ‘’అని పాడినపాట రఫీ పాడిన‘’చౌదవీకా చాంద్ హో ‘’కు ఏమాత్రం తీసిపోదని సినీ విశ్లేషకుల భావన .అలానే భలే రాముడు సినిమాలో‘’భయమేలా ఓ మనసా ‘’పాటలో ఆర్ద్రత గుండెను తాకి వివశుల్ని చేసింది .’’కాలంగల్ ఆదు వసంతం ‘’అన్న‘’పాపమన్నిప్పు ‘’సినిమాలోని పాటతో ఉజ్వల గాయకుడి గా శ్రీనివాస్ ఎదిగి పోయాడు .ప్రేమించి చూడు సినిమా లో పాడిన పాటలు కొంటె తనానికి ,మాధుర్యానికి పెద్ద పీటే వేశాయి .అప్పటి దాకా తన పాటలు తానే పాడుకొనేకన్నడ రాజ్ కుమార్ శ్రీనివాస్ గొంతులోని మాధుర్యానికి, లాలిత్యానికి మురిసి పోయి తన చిత్రాలన్నింటిలో ఆయన తోనే పాడించి తనకూ శ్రీనివాస్ కు యేన లేని కీర్తి తెచ్చారు .హిందీ సౌరాష్ట్ర ,సింహళీ ,బెంగాలి ,పంజాబీ మొదలైన 12భాషల్లో పాటలు పాడిన మహా గాయకుడు శ్రీనివాస్ .ఆయన దగ్గరకు వచ్చే స్తాయి చాలా మందికి లేదని నిరూపించుకొన్నాడు ఇమిటేషన్ పాటలతో మురిపించి ఏలే గాయకుల మధ్య సవత వాణీ బాణీలతోస స్థిర స్థానం సంపాదించుకొన్నాడు వారికి బిరుదులోచ్చాయి ఈయన్ని గుర్తించనే లేదు అదీ వింత . . దీనికీ కుంగిపోలేదు అయన .తన దారి లో తాను అవిశ్రాంతం గా నడచి గమ్యం చేరుకొన్నాడు .హిందీ లో రఫీ ,మన్నాడే గీతారాయ్ వంటి ప్రముఖ గాయకులతో స్వరం కలిపి పాటలు పాడిన మేటి గాయకుడు శ్రీనివాస్ .
‘’ అయిదు స్వరాల రాగాలకు బదులు నాలుగే స్వరాలతో ప్రముఖ కర్నాటక సంగీత వాగ్గేయ కారుడు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ఆలపిస్తే ,స్వర ప్రధానం గా’’ ఏక స్వరం’’ తో రాగాలను ఆలపించి ‘’ఎకేశ్వరి ‘’అని పేరు పెట్టిన స్వర మాంత్రికుడు పి.బి.శ్రీనివాస్ ‘’ అని సంగీతజ్నులచేత ప్రస్తుతింప బడ్డాడు .పట్టుమని పది రోజుల్లో ఉర్దూ భాష నేర్చుకొని అందులో రెండున్నర లక్షల గజల్స్ రాసిన ‘’గజల్ ఘనా పాఠీ’’పి.బి..
పి.బి.అంటే చాలు ‘’ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాలా ‘’’’వెన్నెల కేలా నాపై కోపం’’ ,’’అందాల ఓ చిలకా అందుకో నా లేఖా ‘’’’నీలి కన్నుల నీడలల లోనా ‘’,వెన్నెల రేయీ ఎంతో చలీ ‘’భక్త పోతనలో పోతన్న గారి రస గుళికలైన పద్యాలు గుర్తుకొస్తాయి .ఆయన భౌతికం గా లేక పోయినా ‘’నువ్వు లేవు –నీ పాట ఉంది ‘’అన్న కవి వాక్కు జ్ఞాపకం వస్తుంది .స్వర్లోకం లో ఈ స్వర మాంత్రికుడు సురలోకాదిపతినీ తన అనేక భాషా పాండిత్యం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడేమో ?
‘’ లాంగ్ లివ్ శ్రీనివాయిస్ ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-4-13 ఉయ్యూరు



