శిల్పకళా శోభితం
– డా. సంగనభట్ల నరసయ్య

రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం… కర్ణాటక రాష్ట్రంలో రామప్ప గుడికి సమ ఉజ్జీలైన హోయసల శిల్పారామాలు, హళేబీడు, బేళూరు దేవాలయాలు చుట్టూ అందమైన పూల తోటలతో, మంచినీటి సౌకర్యాలతో, పర్యాటక శాఖ వారి ప్రజా సౌకర్యాలతో, రాజమార్గాలతో అలరారుతున్నాయి. రామప్ప గుడి మాత్రం ఏ సౌకర్యమూ లేక ఉంది. దీన్ని అందమైన పర్యాటక స్థలంగా మార్చవచ్చు.
నేడు చైత్యశుద్ధ అష్టమి, విజయనామ సంవత్సరం. సరిగ్గా నేటికి 800 సంవత్సరాల క్రితం శ్రీముఖ నామ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు రోజు క్రీ.శ. 1213లో రామప్ప దేవాలయాన్ని పాలంపేటలో రేచర్ల రుద్రారెడ్డి విగ్రహ స్థాపనాది క్రతువులతో ప్రారంభం చేసి శాసనం వేయించాడు. కాకతీయ సామ్రాజ్య వైభవాల్లో – తెలుగు నేల ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు రావడం, తెలుగు భాషలో, అమరభాషలో కావ్యాల్లాంటి అందమైన కవితా పరిమళాలతో గుబాళించే శాసనాలు రావడం, ప్రజాహిత విధానాల ద్వారా ప్రభువులు ధర్మాత్ములని పేరుగాంచడం, విస్తృతంగా తెలుగు నేలతో విదేశీ వ్యాపారాలు జరగడం, అందమైన అపురూపమైన దేవాలయాల నిర్మాణం జరగడం పేర్కొనదగ్గవి. కాకతీయ ఆలయ శిల్పసంపద అనగానే రాశీభూతమైన సౌందర్యం, మానవ మేధకు పరాకాష్ఠ అయిన స్థాపత్యం, నిర్మాణ దృఢత్వానికి మారుపేరైన రుద్రదేవుని వేయిస్తంభాల గుడి, రుద్ర సేనాని రామప్ప దేవాలయం జ్ఞాపకం వస్తాయి.
రుద్ర సేనాని పాలంపేట సమీపంలో, ఆతుకూరు గ్రామంలో ఆలయం నిర్మించి, ఆలయంలో శాసనం వేయించారు. ఈ శాసనం బట్టి చాలా విశేషాలు తెలుస్తున్నాయి. 31వ పంక్తిలో ‘వీరస్య శ్రీరుద్ర చమూపతే:’ అని తనను రుద్ర సేనానిగా పేర్కొన్నాడు. ఇతని పూర్తి పేరు రేచర్ల రుద్రారెడ్డి. ఇతని జీవితం, కుటుంబ విశేషాలు అనేకం ఇందులో తెలుపబడ్డాయి. రుద్రుడొక్కడే కాక ఇతని పూర్వీకులు సైతం కాకతీయ ప్రభువులకు తండ్రి తాతల నుంచి చాలా విధేయతలతో సేవలందించారు. ఇతని వంశంలోని మూల పురుషుడు రేచర్ల బ్రహ్మన లేదా బమ్మారెడ్డి కాకతీయ ప్రభువు మొదటి ప్రోలరాజు వద్ద సైన్యాధిపతిగా పనిచేసి క్రీ.శ. 1052లో కాంచీని గెలిచి యుద్ధమందు ప్రభువు విజయానికి కారణమయ్యాడు. ప్రోలడు పశ్చిమ చాళుక్య సామంతుడై ప్రభువుల పక్షాన యుద్ధం చేశాడు. ఇతని మునిమనుమడు రేచర్ల కామయ లేదా కామారెడ్డి కాకతీయ రెండవ ప్రోలరాజు (గణపతి దేవుని తాత) వద్ద సైన్యాధిపతిగా పనిచేసి మాతెన గుండ రాజుతో యుద్ధం చేసి తన భుజబలంతో ప్రభువు విజయానికి కారణమయ్యాడు. కామయ కుమారుడు కాటయ కూడా రెండవ ప్రోలరాజు కొలువులోనే ఉన్నాడు. ఈ ఇమ్మడి కాటయ (భార్య బెజ్జమ్మ) కుమారుడైన రేచర్ల రుద్ర చమూపతి (శాసన పంక్తులు 59, 60) తొలుత కాకతి రుద్రుని వద్ద, పిదప ఆయన తమ్ముడు మహాదేవుని వద్ద, ఆపై మహాదేవుని కుమారుడు గణపతి దేవుని వద్ద సర్వ సైన్యాధ్యక్షుడుగా పనిచేశాడు.
రేచర్ల రుద్రుడు ‘మహాశూరుడు. స్వామిహిరుడు. సునిశ్చితమతి’ అని పాలంపేట శాసనంలో పేర్కొనబడినాడు. నిజంగా రుద్రుడే లేకుంటే కాకతీయ సామ్రాజ్యం గణపతి దేవుని కంటే ముందే సమాప్తమయ్యేది. కారణం, మహా దేవుడు దేవగిరి, ప్రభువుల తోటి యుద్ధంలో పరాజయం చవిచూసి యుద్ధనిహతుడైనాడు. రాజు చనిపోవడమే గాక యువరాజు గణపతి దేవుడు బందీ అయి చెరసాల చేరినాడు. ఆ విపత్కర పరిస్థితుల్లో రుద్రుడే ఒంటిచేత రాజ్యభారాన్ని వహించి, సైన్య సమీకరణ గావించి, శత్రువులను సంహరించి, యువరాజు గణపతి దేవుని విడిపించి, తిరిగి కాకతీయ సామ్రాజ్యానికి (ఓరుగల్లు నగరంలో) పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మధ్యకాలం స్వల్పమే అయినా కాకతి సామ్రాజ్యానికి గడ్డు కాలం. ప్రభువు మరణం, యువరాజు చెరసాలలో బందీ, సామంతుల తిరుగుబాట్లు, వీటన్నిటినీ చక్కదిద్ది కొంతకాలం కాకతీయ సామ్రాజ్యాన్ని తానే నడిపాడు. కానీ ఆతడా విషయాన్ని స్పష్టంగా పేర్కొంటే రాజును ధిక్కరించినట్టవుతుందని గూఢంగా రామప్ప దేవాలయ శాసనంలో సూచించాడు.
‘కాకతీయ శ్రియాపాదే భూరిషు కంటకేషు నిహితే తీక్ష్ణేషు మోహాత్‌క్షణం’ అన్న రామప్పగుడి శాసనంలో కాకతీయుల అదృష్టదేవత ముళ్లపై నడుస్తున్న సమయంలో ఆ రాజ్యరమను కాపాడినాడని పేర్కొనడం ఈ సూచన. ఆ సమయంలో తానే రాజ్యాన్ని నిర్వహించానని సూటిగా చెప్పడం అవిధేయత కిందకు వస్తుంది. ‘కాకతీయ రాజ్య సమర్థం’, ‘కాకతీయ రాజ్య భార ధేరేయః’ ఇత్యాది బిరుదులు ఉప్పరపల్లె, దాక్షా రామ శాసనాల్లో పేర్కొనబడ్డాయి. (ఇంతకంటే స్పష్టంగా తానే ఏలినట్టు చెప్పడం భావ్యం కాదు గదా!)
ఆతుకూరు రుద్రేశ్వరాలయం అంటే ఎవరికీ తెలియదేమో కానీ పాలంపేట రామప్ప దేవాలయం అంటే అందరికీ తెలుసు. ఆలయంలో రుద్ర సేనాని వేయించిన శాసనం చాలా విశేషాలు చెబుతోంది. శాసనాన్ని అందంగా రాయించి, అందంగా చెక్కించి, మరింత అందంగా మంటపం కట్టించి, దేవుణ్ణి ప్రతిష్ఠించినట్టు నిలబెట్టిన వైనం చరిత్రలో భారతదేశంలో ఏ ఆలయంలో బహుశా కనబడదు. ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభనిస్తే, దీని పక్కన రుద్రుడు తవ్వించిన రామప్ప చెరువు ప్రాకృతిక శోభకు, సస్యశ్యామలత్వానికి చిరునామాగా, రుద్రుని ధర్మాభి నిరతిని తెలుపుతోంది.
సంస్కృత భాషలో రచించబడ్డ దేవాలయ శాసనం ప్రాఢమైన రచన. 204 పంక్తులతో అనేకంగా వృత్తాలతో రచితమైంది. వేయి స్తంభాల గుడిలో గణపతి దేవుని పెద్ద తండ్రి కాకతి రుద్రుడు వేయించిన శాసన శైలిని పోలి ఉంది. ఈ శాసనాన్ని బట్టి ఆలయ ప్రధాన దైవం పేరు శ్రీ రుద్రేశ్వరుడు. ఆలయ నిర్మాత పేరు ఆలయ దైవం పేరులోకల్సి రుద్ర+ఈశ్వర అయినది. ఈ ఆచారం కాకతీయుల కాలంలోని విశేష లక్షణం. మిగిలిన చిన్న దేవాలయాలు తన తండ్రి తాతల పేర కాటేశ్వర, కామేశ్వర అనే పేర్లతో నిర్మించి, వాటికి అంగరంగ వైభోగాలకు ఉప్పరపల్లి, బొర్లపల్లి గ్రామాలు రుద్రసేనా ని దానం చేశాడు. ఈ ఆలయం గ్రామ మధ్యలో ఉన్నట్టు, ఆ గ్రామం పేరు ఆతుకూరు అని పేర్కొనబడింది. ప్రస్తుతం ఈ ఆలయం చుట్టూ పొలాలే తప్ప గ్రామం లేదు. కాలగర్భంలో కలిసిపోయింది. ఆ గ్రామం పక్కన చెరువు నిర్మించబడిందని, ఆ చెరువు ‘తత్పురీ దర్పణ నిభ:’ అని ఊరికి ము ఖం చూసుకోవడానికి అద్దంలా ఉందని వర్ణన ఉంది. చెరువు పేరు లేదు.
నేడు రామప్ప దేవాలయం, రామప్ప చెరువు పేరుతో పిలువబడుతున్నా ఈ రామప్ప ఎవరో తెలియదు. శాసనాల్లో లేదు. శిల్పి అని కొందరు చెప్పినా అది ఊహే. శిల్పి పేరుతో ఆలయాలు ఎక్కడా లేవు. నారప్ప అని పశ్చిమ చాళుక్య సేనాని ఒకడు నాటి శాసనాలలో ఉన్న పేరు (నగునూరు (కరీంనగర్ జిల్లా) వీరగల్లు లఘుశాసనం). అలాంటి వాడే ఓ సేనాని రుద్రునికి సన్నిహితుడై ఆలయ, తటాక నిర్మాణ పర్యవేక్షణ చేసి ఉండి ఉండును. లేదా రుద్రునికి ముందే ఈ ఆలయం ఒక చిన్న ఆలయంగా రామప్ప చేత నిర్మితం అయి అన్నా ఉండాలి. ఇవన్నీ ఊహలే. చెరువు మాత్రం రుద్రుని నిర్మాణమే. రుద్రుడు మరిన్ని చెరువులు తవ్వించినట్టు ఇతర ఆధారాలున్నాయి. తండ్రి కాటయ వలెనే రుద్రుడు కూడా చెరువులు తవ్వించాడని గొడిశాల శాసనం (శ.సం.1157 = క్రీ.శ. 1236) చెబుతోంది. రామప్ప దేవాలయ శాసనానికి 23 ఏళ్ల తరువాతి శాసనమిది.
(రామప్ప చెరువు ఒడ్డున మరొక ఆలయం నీళ్లలో ప్రతిఫలించేంత దగ్గరగా గట్టునే ఉంది. ప్రస్తుతం శిథిల స్థితిలో ఉంది. దీన్ని పునరుద్ధరిస్తే – దీంట్లో ఏదైనా శిథిలాల కింద శాసనం లభించవచ్చు. అప్పటికి ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో!) రుద్రేశ్వరునికి ‘నడికుడి’ అనే గ్రామం దానంచేసినట్టు రామప్ప దేవాలయ శాసనం చివరి వాక్యంలో ఉంది.
కాకతి రాజన్యులే ధర్మాత్ములు. రెండవ ప్రోలడు ‘దారిద్య్ర విద్రావణ’ బిరుదాంకితుడు. అనగా ప్రజల దారిద్య్రం పోగొట్టినవాడు. అనేకములగు సముద్రముల వంటి చెరువులు నిర్మించిన ప్రభువు ప్రజల దరిద్రము పోగొట్టడా? వారి కర్షక సంక్షేమ విధానములట్టివి. ప్రోలునికి, రుద్రునికి పరనారీ సోదరులన్న బిరుదములున్నవి. శత్రురాజ కాంతలను ఆ విధంగా గౌరవించారు. తురక ప్రభువుల విధానం దీనికి భిన్నం. ఇంకొక్క విశేషం. ప్రపంచంలో ఏ రాజ వంశానికి దక్కని అపురూప గౌరవం కాకతి ప్రభువులకు దక్కింది. ఈ రాజ్యం అంతరించాక రెండు శతాబ్దాల తరువాతి కాలంలో ప్రజలింకా ఆ ప్రభువులను ధర్మాత్ములైన ప్రభువులని స్మరించుకొన్న వైనం చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1504 నాటి ఓరుగల్లు షితాబుఖాన్ శాసనంలో ‘పూర్వం కాకతి వంశ్య రాజ నివహై: ఆపాలితా ధర్మాత్మభి:’ (పూర్వం కాకతీయ వంశీకులు అయిన ధర్మాత్ములైన రాజులచే పాలించబడిన ఈ భూమి) అని పేర్కొనబడింది. ఆ ధర్మాత్ముల ఆలయ శిల్ప కళను, తటాక జలాలను కన్నుల కద్దు కుంటారు తెలంగాణ ప్రజలు నేటికి కూడా. వారి సేనాని రుద్రుడు ధర్మమూర్తి, వారి బాటలోనే నడిచాడు.
రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం.
సుందర సువిశాల ప్రాంగణంలో వితర్దిక మీద ప్రదక్షిణా పథానికి వేసిన రాతి ఫలకాల విశాలత్వం వెనుక ప్రధాన ఆలయం చుట్టూ పిట్టగోడలా పేర్చిన రాతిఫలకాలు, వాటిపై తోరణాల్లా వరుసలు తీర్చిన గజసైన్యపు కవాతు, సింహాల వరుసలు, నాట్య భంగిమలు, దేశీయమైన జానపద నృత్య, వాద్యకారులు మనోహరంగా దర్శనమిస్తారు. త్రికూటాలయం, ఆలయానికి తూర్పుముఖ ద్వారం, ద్వారం ఎదురుగా హుందాగా కూర్చు న్న నందీశ్వరుని విగ్రహం దర్శనమిస్తాయి. మెడపట్టెలు, చిరుగంటలు మొదలు అందమైన ఆహార్యం, బలిష్ఠ శరీర సౌష్ఠవంతో ఈ నందీశ్వరుని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఆలయం ప్రవేశించే ముందే కప్పు ను మోస్తున్న నాగిని లేదా మదనిక శిల్పాలు, ద్వాదశ మూర్తులు ఈ ఆలయ వైశిష్ట్యానికి మూలస్తంభాలు. అసామాన్య నాట్యకోవిదలు ఆభరణాలే ఆచ్ఛాదనగా, మరికొన్ని నగ్నంగా కనబడే ఈ శిల్పాల సౌందర్యం వర్ణించడం ఎవరి తరంగాదు. తైలస్నానం చేసి, అనాచ్ఛాదితంగా స్నానశాల నుంచి బయటికి వచ్చినట్టు కొందరికి కనిపిస్తే శాస్త్రీయమైన నృత్య భంగిమలతో, మృదంగ వాద్యకారిణులుగా, ఆభరణ ధారిణులుగా వివిధ మూర్తులుగా మరికొందరికి కనిపిస్తాయి.
గజకేసరి శిల్పాలు, రుద్రుని (భార్యాసహిత) శిల్పం, వివిధ భంగిమల నాట్యకారిణులు, పురాణ గాథలు గోడలకు స్తంభాలకు దర్శనమిస్తాయి. జాయసేనాని నృత్త విధానాలు, పేరిణి శివనాట్యం, కుండలాకార నృత్యాలు ఇలా ఆలయం నృత్య కళాకారులకు పాఠాలు నేర్పే ఒక నృత్య కళాశాలగా అలరారుతుంది. ప్రధాన ద్వారం దాటి మధ్య మంటపంలోకి వెళితే తల పైభాగాన గల శిల్పాలు, బహుభుజ రుద్రమూర్తి లాస్యం, అష్టదిక్పాలకుల శిల్పాలు, వృత్తాకార శిల్పాలు, మధ్యమంటప స్తంభాలపై నాలుగువైపుల ఫలకాలపై వేసిన ఒకే ఫ్రేములో బిగించిన సమగ్ర చిత్రాల వంటి శిల్పాలు, గర్భాలయ ద్వార బంధ శిల్పాలు, ఆలయంలో నిలిచిన మహాశివలింగ రూపం ఒక్కటేమిటి ఆలయంలో దశ దిశలు మెడతిప్పక, మడమతిప్పక, కన్నార్పక ఆ్రర్ద హృదయంతో నయనానందకర శిల్పాలే చూడగలం. రోజులుగా ఆరాధించవలసిన, అధ్యయనం చేయవలసిన, హృదయ మర్పించవలసిన శిల్పనిధి రామప్ప దేవాలయం. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయ దర్శనం చేయని వారి జీవితం వ్యర్థమే.
ఒకప్పుడు దీని గోపురం చాలా అందమైన ఎనిమిది తంతెలతో ఇటుక నిర్మాణం. ఈ ఇటుక ఎంతగట్టిదో అంత తేలికైనది. నీటిలో వేస్తే తేలేదని ప్రసిద్ధి. ఇపుడా నిర్మాణం శిథిలమై, పునర్నిర్మాణం జరిగింది. గోపుర శోభ పాతది అందంగా ఉండేది. ఈ ఆలయంలోని మదని శిల్పాలు రాణీ రుద్రమదేవివని, రామప్ప రుద్రమదేవిని ఇష్టపడి ఆమె విగ్రహాలు చెక్కినాడని, అమరశిల్ప జక్కననే ఈ ఆలయ శిల్పి అని, ఈ ఆలయం కట్టినవారు 15, 20 అడుగుల ఎత్తువారని, దేవాలయ నంది దినదినము పెరుగుతున్నదని, గుడి వంగిపోతే సెనగలు పోసి నాన్చి, అవి ఉబ్బగా గుడిగా సరిగా నిల్చినదని ఇలాంటి అనేక కట్టుకథలు దీనికి సంబంధించినవి వినబడుతున్నాయి. ఆలయ విశిష్టత గొప్పదే కనుక కట్టుకథలు బాగానే పుడతాయి.
కర్ణాటక రాష్ట్రంలో రామప్ప గుడికి సమ ఉజ్జీలైన హోయసల శిల్పారామాలు, హళేబీడు, బేళూరు దేవాలయాలు చుట్టూ అందమైన పూలతోటలతో, మంచినీటి సౌకర్యాలతో, రాష్ట్ర పర్యాటక శాఖ వారి ప్రజా సౌకర్యాలతో, చక్కటి రాజమార్గాలతో అలరారుతున్నాయి. రామప్ప గుడి మాత్రం ఏ సౌకర్యమూ లేక ఉంది. దీన్ని అందమైన పర్యాటక స్థలంగా మార్చవచ్చు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ, పర్యాటక శాఖ, పురావస్తు శాఖలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయాలి. 800 సంవత్సరాల ఉత్సవాలు సంవత్సరం పొడుగునా జరపాలి. దేవాలయ చరిత్రపై గ్రంథాలు, సమాచారం అచ్చువేయాలి. నంది మంటపం పూర్తి నిర్మాణం జరగాలి. అప్పుడే ఈ ఉత్సవాలకు సార్థకత. లేకుంటే మన అసమర్థత, అజాగ్రత్త, అనాదృతి వల్ల రేచర్ల రుద్రుని హృదయం క్షోభిస్తుంది.
– డా. సంగనభట్ల నరసయ్య
(నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు)
(నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం)

