ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం
– స్కైబాబ

ఆకలి బాధలకూ పురస్కారం వచ్చింది. అత్యున్నత గౌరవం దక్కింది. ఎనిమిదవ తరగతి కూడా చదవలేని ఒక నిరుపేద మనిషిని అక్షరాలే ఆదుకున్నాయి. కలలో కూడా ఊహించలేని జ్ఞానపీఠమనే అందలమెక్కించాయి. ఆ మనీషి పేరు రావూరి భరద్వాజ. ఆయన రాసిన ‘పాకుడురాళ్ల’పై ఆయన మాటలివిగో..
– మొదట కథగా వచ్చిన రచన ‘పాకుడు రాళు’్ల నవలగా ఎలా మారింది?
– మొదట ఏదో పత్రికలో మాయజలతారు పేరుతో కథ గా వచ్చింది. దానిని మల్లంపల్లి సోమశేఖరశర్మ చదివి చాలా మెచ్చుకున్నారు.. కానీ పదిమంది కూర్చొనే చోటులో వందమందిని కూర్చుండపెట్టినట్లు ఉందన్నారు. అది ఐదొందల, ఆరొందల పేజీల్లో రావలసిన విస్తృతి ఉన్న రచన అన్నారు. ఆయన సూచనను పాటిస్తూ, అప్పట్లో హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణాపత్రికలో సీరియల్‌గా రాసాను. మూడున్నర సంవత్సరాలపాటు ప్రచురించారు. ఆ పత్రికలో పనిచేసే శీలావీర్రాజు గారు ఆ సీరియల్‌కు పాకుడురాళ్లు అని పేరు పెట్టారు.
-పాకుడురాళ్లు నవలా నాయిక మంజరికి ప్రేరణ ఎవరు?
-పేర్లు చెప్పను. అప్పట్లో పరిశ్రమలో ప్రధాన స్రవంతిలో ఉన్న నటులు, నటీమణులు ఆ పాత్రకు ప్రేరణ. అలా ఎంతోమంది గుణగణాలను ఆ పాత్రలో చొప్పించడవల్ల అది చక్కగా, చిక్కగా రూపొందింది. – ఏ పాత్రతో ఐడెంటిఫై అయ్యారు మీరు? మంజరితోనా, మాధవరావుతోనా?
– నేను ఎవరి ద్వారా ఐడింటిఫై కాను కాను కాను. నాకు బాగా తెలిసిన వ్యక్తుల గురించిన లక్షణాలు మంజరి పాత్రలో నిబిడీకృతం చేసాను. అనేకమందిలో కలిసిన వైవిధ్యభరితమైన లక్షణాలను ఆమెలో పొందుపరిచాను.
– ఆ రచనపై అప్పట్లో వచ్చిన ప్రశంసలు, విమర్శల గురించి…
-ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. సినిమావాళ్ల తప్పులు, అక్రమాలు ఎత్తిచూపానని విమర్శించారు. వారిపట్ల తక్కువ చూపుతో, హేళన చేస్తూ రాసానని విమర్శలు సంధించారు.ఆ రచనపై కోర్టులో దావా వేస్తామని కొందరు బెదిరించారు. ‘వేయండి. చెక్కులో 5వేలరూపాయలని రాసి 50 వేలు తీసుకోవడం అక్రమం కాదా?’ అని ప్రశ్నిస్తూ నేనూ వారికి సవాల్ విసిరాను.
– ఆ అంశం మీదనే ఎందుకు రాయాలనుకున్నారు?
– పరిశ్రమకు సంబంధించిన వారితో రోజువారీ అనుభవాలను రాయకుండా ఉండలే కపోయాను. రాసాను.
– ఈ రచనలో ప్రయోగాలు చేసారా?
– ఈ రచనలో ప్రత్యేకంగా ప్రయోగాలు చేయలేదు. ఆయా సందర్భాలను బట్టి, సన్నివేశాలను బట్టి భాషను, శైలిని ఉపయోగించాను.
-మంజరిని ఎందుకు ‘ఆత్మహత్య చేయించారు’?
– ఆ వాతావరణంలో పెరిగి, బతికి సాధించేదేమీలేదని అనుకుని ఆత్మహత్య చేసుకుంది. మార్లిన్ మన్రో ఎందుకు చేసుకుందో అందుకే ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మంజరి చనిపోతుందని ముందుగానే తెలుసు నాకు.
– చిత్రసీమ అనే పత్రికకే పరిమితమయ్యారు. సినిమా పరిశ్రమలో పనిచేయాలనిపించలేదా?
-చెప్పాను కదా. దగ్గరగా అక్కడి చెడుగులన్నీ చూసాకా అందులో పనిచేయడం వద్దనుకున్నాను.
– చలంతో మీ మరపురాని అనుభవాలు?
– చలంగారంటే నాకు పిచ్చి. ఆయన రచనల్లో పేరాలకు పేరాలు కంఠతా వచ్చు. పరిచయం చేసుకున్నాను. నా ‘రాగిణి’కి ముందుమాట అడిగాను రాసారు. అది నా అదృష్టం.
-చేయాలనుకున్న రచనలు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా ?
– కొన్ని ఉన్నాయి. అవి ఒక రూపానికి వచ్చాక అప్పుడు రాస్తాను. అంతవరకు వాటి గురించి చెప్పను.
– మీరు చేసిన ప్రయోగాల గురించి చెప్పండి.
– ముందుగా ముగింపు చెప్పి తర్వాత కథ నడపే ప్రయోగం ఎక్కువగా చేశాను. అలా రాస్తే పాఠకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని అలా చేశాను. ఇంకా ప్రయోగాలు చేయాలని కూడా ఉంది. – ఇతర భాషల, ఇతర దేశాల సాహిత్య అధ్యయనం గురించి..
– నాకు తెలుగు మాత్రమే వచ్చు. ఇంగ్లీషులో సరళంగా వున్నవాటిని చదివాను. అవి నాకు అర్థమైన రీతిలో వాటి ఆధారంగా కూడా రచనలు చేసాను. అలా స్ఫూర్తి కలిగించిన ఇంగ్లీషు రచనల వివరాలు కూడా నా పుస్తకాల్లో రికార్డు చేసాను.
– ఆకలి తీర్చుకోవడం కోసం, బతుకుదెరువుకోసం మీరు రచనారంగంలోకి వచ్చారని అన్నారు. మరి మీ ఆలోచనలను, అనుభూతులను వ్యక్తం చేసిన రచనలున్నాయా?
– ఔను.. చాలా రచనలు ఆకలి తీర్చుకోవడం కోసమే చేసాను. సొంత ఫీలింగ్స్, సొంత ఆలోచనలు వ్యక్తం చేసిన రచనలు కూడా ఉన్నాయి. అవి ‘కాదంబరి’ ‘సశేషం’ ‘నేను ఎందుకు రాస్తున్నాను’.
ం హైదరాబాద్ స్టేట్‌లో పుట్టానన్నారు.. తెలంగాణ ఉద్యమం గురించి మీ అభిప్రాయం?
– రాజకీయాలతో బొత్తిగా నాకు సంబంధం లేదండి. మా ఊరు మాకివ్వండి, మా దేశం మాకు ఇవ్వండి అని అడిగాము. ఇచ్చాక ఏం చే సాము. ఒకప్పుడు బ్రిటిష్‌వారిపై పోరాడాము. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ అన్యాయాలు జరిగాయి. ఏం చేద్దాం? చెరువులో నీళ్లు తాగామా? బావిలో నీళ్లు తాగామా అన్నది ముఖ్యం కాదు, నీళ్లు తాగామా? లేదా? అన్నది ముఖ్యం. -విశ్వబ్రాహ్మణ చైతన్యంతో ఏవైనా రచనలు చేసారా?
– ఇంతవరకూ ఏమీ రాయలేదు. రాయాలనుకోలేదు. రాయాలనిపించనపుడు వద్దనుకునే అవకాశం ఎక్కడుంది? అయినా కులం ముఖ్యం కాదు వర్గమే ముఖ్యం.
– మీమీద విమర్శ ఉంది- నిలకడగా ఉండేవారు కారని.. అనార్కిస్టు భావుకుడు మీలో ఉన్నారని..
– నాకు ఫలానా సిద్ధాంతం నచ్చితే నచ్చిందని చెబుతా. నచ్చినట్టు నటించడం ఉద్యోగంలో భాగమైతే నటించా. న టించే బతికా.
– ఒకప్పుడు కమ్యూనిస్టులకు దగ్గరగా ఉండి, తరువాత ఎందుకు దూరమయ్యారు?
– ‘నువ్వు ఏ సిద్ధాంతం చెపుతున్నావో, అది నువ్వు పాటించడం లేదు. అపుడు నేను నీకు దగ్గరగా ఉండాలనుకోను’. అదే జరిగింది కమ్యూనిస్టు భావాల విషయంలో.
– చలంగారు గాక మీకు నచ్చిన ఇతర రచయితలు..
– లోకోద్ధరణకోసం రాస్తున్నాము అనేవాళ్లను నేను పట్టించుకోను. మాకు ఇష్టంలేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల, నిజాయతీగల రచయితల పాదాలకు నమస్కరిస్తాను. – ‘జీవన సమరం’ రచన గురించి..
– దిక్కుమొక్కూ లేకుండా బతుకుతున్నవారి వద్దకు వెళ్లి వారిగురించిన విషయాలను కథనాలుగా రాసాను. అది ఈనాడులో సంవత్సరంపాటు వచ్చింది.
– అవమానాలు, ఛీత్కారాలు ఎన్నో అనుభవించి ఈ స్థాయిలో కొచ్చారు మీరు. అవి ఎదుర్కొన్న క్షణాల్లో మీకెలా అనిపించింది.
– అలాంటివి నేను పట్టించుకోలేదు. ఉద్యోగంలో కూడా పైవారు చెప్పిన పనిని,చెప్పని పనిని కూడా చేసుకుంటూపోయాను…
– మిమ్మల్ని ప్రోత్సహించిన వారు..
నా మొదటి పారితోషికం ఐదు రూపాయలు, ఆంధ్రజ్యోతి మాస పత్రిక నుంచి వచ్చింది. ధనికొండ హనుమంతరావు నా మొదటి కథను ఆ పత్రికలో 1947 ప్రాంతంలో ప్రచురించారు. ఉద్యోగం ఇచ్చింది త్రిపురనేని గోపీచంద్. ఆకాశవాణిలో చేరాక ఉద్యోగ విషయాల్లో మెలకువలు నేర్పి, తోడ్పడినవారు ప్రొడక్షన్ అసిస్టెంట్ వాడ్రేవు పురుషోత్తంగారు.
– యువరచయితలకు మీరిచ్చే సందేశం..
-నేను ఇంకా నేర్చుకునేస్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ఇలా రాయండి అని ఎలా చెప్పగలను?
– ఇంటర్వ్యూ: యింద్రవెల్లి రమేష్
99854 40002
– స్కైబాబ


సరసభారతి నిర్వాహకులకి నమస్కారం
స్కై బాబా అనబడే ఈయన గారి కవిత్వం మీరు చదివారా! ఆయన అద్భుత సాహితీ వేత్త. మచ్చుకు కొన్ని చదివి ఆనందించండి.
http://www.scribd.com/doc/46460845/Quit-Telangana-Singidi-Rachayitala-Sangham
LikeLike