గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్..
శకుంతలాదేవి ఇక లేరు!
బెంగళూరు, ఏప్రిల్ 21: గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి (84) కన్నుమూశారు! శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పదిహేను రోజుల క్రితం.. బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చ గా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8:15 గంటలకు తుదిశ్వాస విడిచారని శకుంతలాదేవి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పబ్లిక్ ట్రస్ట్ ట్రస్టీ డీసీ శివదేవ్ తెలిపారు. శకుంతలాదేవికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పనిచేసేవారు.
మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడం లో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు. అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మై సూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు.
1977లో.. 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమె చెప్పిన సమాధానాన్ని ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు.
కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు. ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.

