ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది!–కోన వెంకట్

ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది!


ఎవరో రాసిన కథకు తాము మాటలు రాయడం కన్నా కథ, మాటలు ఒకరే రాయడంలో ఎంతో సౌఖ్యం ఉంది. అది మన జీవిత నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నట్లుగా ఉంటుంది. గమనిస్తే కథ-మాటల రచయిత కోన వెంకట్ విజయ రహస్యం వెనుక ఈ విషయం కూడా ఉందనే అనిపిస్తుంది. ఈ మధ్య విడుదల అయిన ‘బాద్ షా’,త్వరలో విడుదల కానున్న ‘షాడో’, ‘బలుపు’ సినిమాలతో కలిపి దాదాపు 30 సినిమాలకు ఆయన కథ-మాటలు సమకూర్చారు. తొలినాటి ఓటమితోనే తన జీవితం ముగిసిపోతుందనుకున్న ఆయన ఇప్పుడు సినీ ఆకాశంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. కోన వెంకట్ వ్యక్తిగత, సినీజీవిత ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’ 
అసంతృప్తి ఎవరినీ ఉన్నచోట ఉండనివ్వదు. ఉన్న ప్రపంచాన్ని వదిలేసి, కొత్త ప్రపంచంలోకి వెళ్లేలా ప్రేరేపిస్తుంది. కాకపోతే ఆ కొత్త ప్రపంచం గురించి ఎంతో కొంత తెలియకుండా అమాంతంగా దూకే స్తే ఒక్కోసారి అది మన ఉనికినే కూల్చివేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో చేశాను. కానీ, ఎక్కడా సంతృప్తి లేక ఒకదాని తరువాత ఒకటిగా వదిలేస్తూ వచ్చాను. అయితే అప్పటికే సినిమాల పట్ల ఒక పాషన్ ఉండేది. అది నన్ను నిరంతం అటు వైపే లాగేది. దాంతోనే నేనీ రంగంలోకి వచ్చాను. సినిమా అనుకోవడమే గానీ, ఆ రంగంలోని ఏ విభాగానికి నేను సరిపోతాను? అన్న విషయంలో మాత్రం నాకు స్పష్టత లేదు. ఏ విభాగంలోనూ ప్రవేశం గానీ, ప్రావీణ్యం గానీ లేకపోవడం వల్లేనేమో సినిమా నిర్మాణానికి సిద్ధమైపోయా!

పాతాళంలో పడిపోయి…
అది 1996. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ సినిమా తీశా. ఫ్లాప్ అయ్యింది. పెట్టిన 72 లక్షల్లో ఒక్క పైసా కూడా తిరిగి రాలేదు. చేతిలో చిల్లిగ వ్వ లేదు. భార్య, ఇద్దరు పిల్లలతో నా బతుకు రోడ్డున పడింది. రాము (రామ్‌గోపాల్ వర్మ) తమ్ముడు కోటి నా క్లాస్‌మేట్. అలా రాముతో కూడా నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ సమయంలో రాము మద్రాసులో ఒక ఆఫీసు తీసుకుని ‘సత్య’ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. నా విషయం తెలిసి నాకు ఫోన్ చేసి “నేను ఎంత చె ప్పినా నువ్వు వినలేదు. నేను ముంబయ్ నుంచి మద్రాసు వస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చేయ్” అన్నాడు. వెంటనే మద్రాసుకు వెళ్లాను. నాలుగు రోజులయినా అతను రాలేదు.నా దగ్గరున్న డబ్బులేమో అయిపోతున్నాయి. నాకిక ఏ ఆశా కనిపించలేదు. జీవితం తిరిగి పుంజుకునే అవకాశమే లేదనిపించింది. అందుకే జీవితాన్ని ముగించడమే మేలనిపించింది.

నిద్రమాత్రలు, వాటర్ బాటిల్ తీసుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో మెరీనా బీచ్‌కు వెళ్లా. ఇంతలో కాళ్లూ చేతులు సగం సగమే ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి బీచ్‌లో బెలూన్‌లు అమ్ముతూ కనిపించింది. నా దృష్టి అంతా ఆ అమ్మాయి మీదే నిమగ్నమైపోయింది. అంతటి శారీరక వైకల్యం ఉండి కూడా ఆమె కళ్లల్లో ఏ కాస్త విషాదమూ లేదు. పైగా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ బీచ్ అంతా తిరుగుతూ అందరి దగ్గరికీ వెళుతూ బెలూన్లు అమ్ముకుంటోంది. ఆ దృశ్యం చూడగానే నా ఆలోచనల్లో మార్పు మొదలయ్యింది. అన్ని లోపాలు ఉండి కూడా ఆ అమ్మాయి అంత ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అన్నీ సవ్యంగా ఉండి ఏదో ఓటమి పేరుతో నేను ఆత్మహత్యకు సిద్ధం కావడమేమిటి? అనిపించింది.

నాలోని దిగులూ, ఆవేదన మెల్లమెల్లగా అదృశ్యమైపోయాయి. ఏదో ఆవేశం మనసంతా నిండిపోయింది. సమస్యే లేదు. ఇక, ఏదైతే అది అవ్వనీ, జీవితంతో పోరాడదాం అనుకున్నాను. నిద్రమాత్రల్ని నీళ్లలోకి విసిరికొట్టి బీచ్‌లోంచి బయటపడ్డాను. ఆ మరుసటి రోజు ఉదయమే రాము ముంబై నుంచి మద్రాసు వచ్చేశాడు. నా మాటల తీరును గమనిస్తూ ఉన్నాడేమో మరి! తాను తీయబోయే’ సత్య’ సినిమాకు డైలాగులు రాసే అవకాశం నాకిచ్చాడు. అక్కడితో నా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. నేను బీచ్‌లో కూర్చున్న సమయాన ఆ అమ్మాయే కనిపించకపోయి ఉంటే ఆ రోజుతో నా జీవితం ముగిసిపోయేదేమో! కాకపోతే, పడిపోయిన అన్నిసార్లూ, అందరికీ అలా తిరిగి లేచే అవకాశం రాకపోవచ్చు. ఎక్కడ పడిపోతామోనన్న భయంతో అసలు అడుగే ముందుకు వేయొద్దని కాదు గానీ, ఆ అడుగు వేయడానికి ముందే ఆ రంగం గురించిన లోతైన అధ్యయనం ఉండాలన్నది ఆ చేదు అనుభవం ద్వారా నేర్చుకున్నాను.

రెండు సున్నిత అంశాల మధ్య

మా నాన్నకు 1981లో ఒకసారి అమెరికాలో బైపాస్ సర్జరీ అయ్యింది. ఆ తరువాత నెల్లూరులో డిఎస్‌పిగా ఉన్న రోజుల్లో అంటే 1986లో రెండవసారి మళ్లీ అదే అమెరికాలో ఆయనకు సర్జరీ అయింది. వాస్తవానికి అదొక విషమ స్థితే. ఏ రకమైన మానసిక ఒత్తిళ్లకూ తావులేని వాతావరణం అప్పుడాయనకు ఉండాలి. నాన్నగారు నాలుగు రోజుల్లో వచ్చేస్తారన్న సమయంలో నా సమస్య ఒకటి మొదలయ్యింది. కాలేజ్ ఫైనలియర్లో ఉన్న నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం ఖాయం చేశారు. మరో ఇంట్లో ఎక్కడో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయడం మొదలెట్టారు. నేను వెళ్లి ఎలాగోలా ఆ అమ్మాయిని తీసుకువచ్చేసి ఎవరికీ తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్నాను.

రెండుసార్లు సర్జరీ కావడం వల్ల విషయం ఆయనకు చెప్పే పరిస్థితి లేదు. మా తాతయ్యతో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆ విషయాన్ని ఆయనకే చెప్పేశాను. అప్పుడాయన మహారాష్ట్ర.గవర్నర్. విషయం విని తాతయ్య ఏమీ ఆశ్చర్యపోలేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని రాజ్‌భవన్‌కు వచ్చేయమన్నారు. నేను అమ్మాయిని తీసుకుని బాంబే వెళ్లాను. ఆ తరువాత నాలుగు రోజులకే నాన్నగారు అమెరికా నుంచి అక్కడికి వ చ్చేస్తున్నారు.

ఈ విషయమై మా నాన్నను ఒప్పించడం కష్టమేమో అన్న ఆలోచనలో పడిపోయాడు తాతయ్య. పైగా రెండవసారి గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్న సమయంలో ఇలాంటి విషయాలు చెప్పడం ప్రమాదమేమో అన్న భయాందోళన ఆయనను పీడించసాగింది. అమెరికా నుంచి వచ్చిన మరుసటిరోజు తాతయ్య నాన్నగారి ముందు నా విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. “ఒరే నువ్వు పోలీస్ ఆఫీసర్‌వు కదా! ఒక ఇష్యూలో నీ అభిప్రాయం కావాలి” అన్నాడు. “విషయం ఏమిటో చెప్పండి నాన్నా!” అన్నాడు నాన్న కూల్‌గానే. తాతయ్య తన ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి విషయంగా నా సమస్య అంతా చెప్పాడు. “ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకు వచ్చేసి అలా పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటావా?” అన్నాడు.

నాన్న ఎలా రియాక్ట్ అవుతాడోనని విపరీతమైన ఆందోళనకు గురయ్యాను. దానికి నాన్న “ఆ పెద్దలు అమ్మాయినో, అబ్బాయినో కన్విన్స్ చేయాలి. లేదా వాళ్లయినా కన్విన్స్ కావాలి. అమ్మాయిని కొట్టి హింసించి బలవంతంగా మనసు మార్చాలనుకోవడం తప్పు. అందువల్ల ఆ కుర్రాడు చేసింది నూరు శాతం కరెక్ట్. ఒక పోలీస్ ఆఫీసర్‌గానే కాదు. ఒక సిటి జన్‌గా కూడా చెబుతున్నాను” అన్నాడు. ఆ వెంటనే తాతయ్య ‘ఆ కుర్రాడు ఎవరో కాదు నీ కొడుకే’ అన్నాడు. ఆ సమయంలో నేను వాళ్లకు దగ్గరలోనే ఉన్నాను. నాన్న నా వైపు అదోలా చూశాడు. ఏమంటాడో అనుకున్నాను. నాకేసి చూస్తూ “వీడు ఇలాంటిదేదో చేస్తాడని నేను ఎప్పుడో అనుకున్నాలే. సరే! వెళ్లి అమ్మాయిని తీసుకు రా!” అన్నాడు. అప్పటిదాకా ఆయనలోని గంభీరమైన పార్శ్వాన్ని మాత్రమే చూసిన నేను దాని వెనకున్న ఒక సున్నితమైన మనసును చూసి చాలా ఆనందపడ్డాను.

తాతయ్య విషయాన్ని బయటపెట్టిన తీరు ఆయన పట్ల నాకున్న గౌరవభావాన్ని మరింత పెంచింది. రెండవసారి గుండె ఆపరేషన్ చేయించుకుని అప్పుడే వ చ్చిన కొడుకు ఒక పక్క, తాను ప్రేమించిన అమ్మాయి తనకు శాశ్వతంగా దూరమైపోతుందేమోనని ఆందోళన పడే మనవడి జీవితం మరో పక్క ఎంత సంఘర్షణకు గురిచేశాయో నేను ఊహించగలను. రెండు అత్యంత సున్నితమైన విషయాల మధ్య నిలుచుని తాతయ్య ఆ సమస్యను పరిష్కరించిన తీరును నేను ఎప్పటికీ మరిచిపోలేను. అధికారాలు, హోదాలు కాదు… సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యమే మనిషిని సమున్నత స్థాయిలో నిలబెడతాయని నేను ఆరోజు గ్రహించాను. దూరాలే మిగిలాయి

రెండవసారి గుండె ఆపరేషన్ అయిన నాటి నుంచి నాన్నలో ఏదో మార్పు కనిపించడం మొదలయ్యింది. దానికి కుటుంబ సభ్యులతో ఏనాడూ ఆత్మీయంగా ఉండలేకపోయానన్న ఆవేదనే కారణమని ఆ తరువాత తెలిసింది.

పోలీసు ఆఫీసర్ (డిఎస్‌పి)గా నాన్నగారు ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవారు. నేను, అక్కయ్య స్కూలుకు వెళ్లే సమయంలో ఆయన నిద్రపోతుండేవారు. స్కూలు నుంచి వచ్చేసరికి డ్యూటీకి వెళ్లిపోయేవారు. ఆయనంటే మాకు చాలా భయం. ఆదివారాల్లో ఎప్పుడైనా చూడగలిగినా నేనూ మా అక్కయ్య ఇద్దరమూ ఆయన్ని దూరదూరంగా ఉండే చూసేవాళ్లం. ఏడాది మొత్తంలో మహా అయితే, ఒకటి రెండు సార్లు మాట్లాడే సందర్భం వచ్చేదేమో. అదీ పొడిపొడిగానే. డిగ్రీ పూర్తయ్యే దాకా ఆయనతో నేను మాట్లాడిన సందర్భాల్ని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో. నేను మా ఇంట్లో టెంత్ క్లాస్ వరకే ఉన్నాను. ఆ తర్వాత కాలమంతా మా తాతయ్య వద్దే ఉన్నాను. అది నాన్నకూ నాకూ మధ్య మరింత దూరాన్ని పెంచింది.

అయితే కుటుంబ అనుబంధాల విషయాల్లో తాను పెద్ద తప్పే చేశానన్న పశ్చాత్తాపం నాన్నగారిలో రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే మెల్లమెల్లగా నామీద ఆయనకు ప్రేమ కలగడం మొదలయ్యింది. ఒకసారి డ్యూటీలో భాగంగా వైజాగ్ వెళ్లినప్పుడు ఆయనకు జాండీస్ వచ్చింది. అది బాగా ఎక్కువై ఒక దశలో మంచాన పడ్డారు. నేను రోజూ హాస్పిటల్‌కు వెళ్లి, ఆయన మంచం పక్కన కూర్చునే వాడ్ని. ఆ సమయంలో ఒకరోజు ఆయన జీవితంలో తొలిసారి ఆత్మీయంగా నా చేయి పట్టుకున్నారు. నేను ఇద్దరు పిల్లల తండ్రినయ్యాక జరిగిన ఘటన అది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశానన్న వ్యధ ఆయన ప్రతిమాటలో ధ్వనించేది. ఆ స్థితినుంచి బయటపడటానికి నాతో ఎక్కువగా మాట్లాడటం మొదలెట్టాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు నన్ను తన వెంట పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లకు తీసుకువెళ్లేవాడు. అయితే నాతో మనసు విప్పి మాట్లాడటం మొద లలైన నెలరోజుల్లోనే ఆయన కన్నుమూశారు. నేను సినీ రచయితనయ్యింది 1996లో.

ఈ రంగంలో నా ప్రయాణాన్ని గానీ, నా విజయాన్ని గానీ, కాస్తో కూస్తో వచ్చిన నా పేరును గానీ ఆయన ఎలాగూ చూడలేకపోయారు కానీ, కనీసం ఆ ఆత్మీయతనైనా మనసారా పొందలేకపోయాను. విధి నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగానైనా ఉండవచ్చు. కానీ, అదే సమయంలో అయినవాళ్ల విషయంలో పట్టనట్లు ఉండకూడదన్న పాఠాన్ని నేను మా నాన్నగారిని చూసి తెలుసుకున్నాను

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.