ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -1
నాచిన్నతనం నుండే పండితుల వారి గురించి మా నాన్న గారు మామయ్యా ఎప్పుడూ మాట్లాడుకొనే వారు నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత బెజవాడ లో రామకోటి ఉత్సవాలు ఇప్పుడున్న క్షేత్రయ్య కళా క్షేత్రం ఉన్న చోట శివ రామ కృష్ణ క్షేత్రం లో జరిగేవి .ఒక్కోసారి నెల రోజులు ఉండేవి .రోజు సభలూ సమా వేశాలు ధార్మిక ఉపన్యాసాలు, హరి కధలు భజనలు ,అఖండ రామ నామ కీర్తనలు సంగీత కచ్చేరీలు నిర్వహించే వారు .నేను మా మామయ్య గంగయ్య గారు, మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారలతో మా కుటుంబం తో సహా వెళ్ళే వాళ్ళం .అందరికి భోజన సదుపాయాలు ఉండేవి అని జ్ఞాపకం ..మా నాన్న ,మామయ్య ల ఉపన్యాసాలు కూడా ఉండేవి .అదుగో అప్పుడు చూశాను పండితుల వారిని .’’గంభీర సాగర ఘోష లాంటి వాగ్ధాటి ,అందులో వేదం విజ్ఞాన గంగ ,ఉపనిషద్ విజ్ఞాన యమునా ,పురాణ విజ్ఞాన సరస్వతి ,,భగవద్గీతా విజ్ఞాన గోదావరి ,పురాణ విజ్ఞాన కృష్ణ వేణీ,కావ్య విజ్ఞాన కావేరీ ,సనాతన ధర్మ విజ్ఞాన పినాకినీ మొదలైన నదులన్నీ ఉత్తుంగ తరంగాలై ఎగసి పడేవి . ఆ శైలి శైలూషీ ప్రవాహమే ..ప్రశ్నించే వారి ని సంతృప్తి పరచే విజ్ఞాన సర్వసం .అడ్డం గా మాట్లాడే వారి పాలిట వజ్రాయుధం .ఉపన్యాస చక్రవర్తిగా సనాతన హిందూ ధర్మ పరి రక్షుకుడైన, ఆంద్ర వివేకా నందులుగా స్వర్గీయ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు ఆదర్శ మూర్తి .అనిపించారు మొదటి సారి చూడంగానే .అలాంటి మహోన్నత వ్యక్తీ భువిని వదిలి దివిజ కవి వరుల గుండెలు దిగ్గురనగా దివిని చేరారు .అయన రాసిన పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి .చెప్పింది చేసి ఆచరించే సాధనా పరులు .అలాంటి వారిని జాతి మరచి పోతోందేమో నని ఈ మధ్యనే నాకు అని పించింది .ఆయన గురించి ఏదైనా సమాచారం పుస్తక రూపం గా దొరుకుతుందేమో నని ఎదురు చూస్తున్నాను .కొద్ది నెలల క్రితం బేజ వాడ ‘’లెనిన్ సెంటర్ ‘’లో ఉన్న పాత పుస్తకాల షాపుల్లో ఒకటి సాహితీ మిత్రుడైనజనార్దన రావు గారి షాపు వుంది .అక్కడ లభించని పాత గ్రంధమే లేదు .అక్కడే దొరికింది శ్రీ పండితులపైవారి శత జయంతి ఉత్సవ సంరంభం నాడు ఉత్సవకమిటీ గుంటూరు జిల్లా పొన్నూరు నుండి ముద్రించిన పుస్తకం కొని మహా దానంద పడ్డాను .కాని దాన్ని ఈ వారం లోనే చదవ గలిగాను .వారి జీవిత విశేషాలు స్పూర్తి దాయకాలు .అందుకనే అందరికి తెలియ జేయాలనే ఉత్సాహం తో దీన్ని రాస్తున్నాను .పండితుల వారికి నా వంతు ఋణం తీర్చుకొంటున్నాను .
పండితుల వారి జీవిత విశేషాలు
26-11-1890 లో వికృతి నామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ బుధ వారం వృశ్చిక లగ్నం లో గుంటూరు జిల్లా సత్తెన పల్లి తాలూకా గుడి పూడి గ్రామం లోప్రభాకర ఉమా మహేశ్వరుల వారు జన్మించారు .తండ్రి వెంకట కృష్ణ శాస్త్రి
గారు శ్రౌత ,స్మార్తాలలో నిష్ణాతులు . ,తాత గారు నాగేశ్వర పాకయాజి . ప్రభాకరులకు రామ చంద్ర శర్మ ,సూర్య నారాయణ శర్మ తమ్ములు .వీరిది భారద్వాజస గోత్రం
ప్రభాకరులు చిన్నప్పటి నుంచి ఏకాంతం గా శివ ధ్యానం లో గడిపే వారు .గుంటూరు హిందూ హైస్కూల్ లో (ఆ నాటి పేరు టౌన్ హైస్కూల్ )ఫస్ట్ ఫారం లో చేరారు .పుంభావ సరస్వతి ,ఆంద్ర ఆస్థాన తొలి కవి శ్రీ కాశీ కృష్ణా చార్యుల సంస్కృత గురువులు .ఒక రోజు స్కూల్ మైదానం లో ఉన్నావ లక్ష్మీ నారాయణ పంతులుగారి ఉపన్యాసం విన్నారు స్వరాజ్యం కోసం అందరూ కలిసి రావాలనే వారి బోధ పండితుల వారి గుండెల్ని సూటిగా తాకింది .స్వదేశీ భావన మనసంతా నిండింది .కాలేజి లో చదవటానికి ఇస్ట పడక ఇంగ్లీష్ నేర్వ రాదనీ చదువే మానేశారు .
స్వగ్రామం గుడిపూడిలో విదేశీయులు డేరాలు వేసి క్రైస్తవ ప్రచారం చేయటం చూసి ‘’హిందూ ధర్మ ప్రచారం ‘’చేయాలని నిశ్చయించుకొన్నారు .అప్పుడే వివేకానందుల చికాగో ఉపన్యాసాలు చదివి స్పూర్తి పొందారు .హిందూ ధర్మ ప్రచారమే తన జీవిత ఆదర్శం గా భావించి కృత నిశ్చయం తో జీవితాంతం కోన సాగించిన ధర్మ పరిరక్షకులు .దీనికి వేదం వేదాంగాలను చదివి అర్ధం చేసుకోవాలి .వెంటనే కనుపర్తి కోటేశ్వర శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేసి ,హయగ్రీవ ఉపాసకులై ప్రియ శిష్యులై అన్నీ నేర్చి ‘’అపర శంకరులు ‘’అని గురువు గారిచేత అనిపించుకొన్న మేధావి .బెల్లం కొండ రామ రాయ కవి వద్ద సంస్కృత ,సాహిత్యం ,తర్కం, వ్యాకరణం ,వేదాంతం, అనేక శాస్త్రాలను చదివి ఔపోసన పట్టారు .వివిధ శాస్త్ర పరిచయం తో ధర్మ రహస్యాలన్నీ ఆకళింపు చేసుకో గలిగారు .గురువులకు తగిన శిష్యులయ్యారు .’’ప్రతిభా ప్రభాకరు’’లయ్యారు .అకుంఠిత దీక్ష ,సాధన ,నిస్వార్ధత ,త్యాగం ,దేశ భక్తీ కి వీరు నిలువెత్తు దర్పణం .
‘’స్వ ధర్మ ప్రతి పాదిక పై స్వరాజ్య పాలన ‘’అనే ప్రత్యెక నినాదం తో మేఘ గంభీర స్వనం తో, ఉపన్యాసాలతో దేశాన్ని ఉర్రూత లూగించారు .ఆయన ధోరణి అనితర సాధ్యం .అన్యమత ఖండనం లో అరివీర భయంకరులు .నిరంకుశం గానే ఈవిషయం లో వ్యవహరించేవారు .’’సనాతన ధర్మ మంత్రం ‘’ను పండితుల వారు జపించి నన్ని సార్లు మన రాష్ట్రం లో వేరెవ్వరూ జపించాలేదంటే పండితుల వారి ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది ..శాస్త్ర విజ్ఞానాని ,తత్వ విజ్ఞానానికి ,మతానికి హేతు వాదానికి ,ప్రాక్ పశ్చిమ సంస్కృథీ సభ్యతల మధ్య ,గతానికి ,వార్త మానానికి మధ్య సమన్వయాన్ని సాధించిన మహా వ్యక్తీ .సనాతన ధర్మం లోని మానవతా వాదాన్ని ,శాస్త్రీయ దృక్పధాన్ని ,విశ్వ జనీనతను సింహ గర్జనం తో ధ్వనింప జేశారు .క్షాత్ర వీర్యం తో బ్రహ్మ తేజాన్ని మేళ వించి భారతీయులు పురోగమించాలని ఉద్బోధించారు .
భారత భూమి వేదభూమి ,తపో భూమి ,జ్ఞాన భూమి ,త్యాగ భూమి ,పుణ్య భూమి,,యోగ భూమి అని పదే పదే గుర్తు చేసే వారు . రోమన్, గ్రీక్ ఈజిప్ట్ ,జోరాస్ట్రియన్ మొదలైన నాగరకత లన్నీ కొద్ది పాటి ఉపద్రవాలకే తట్టుకోలేక కాల
గర్భం లో కలిసి పోయాయని చెప్పేవారు .కాని ఇరానియన్లు ,గ్రీకులు శిదియన్లు ,కుషానులు ఆంగ్లేయాది ఇతర దేశీయులేందరోభారత దేశం పై దురాక్రమణ చేసి వశ పరచుకొని వెయ్యి ఏళ్ళు ఇబ్బందులు పెట్టినా మన సంస్కృతీ గంగ అవిచ్చిన్నం గా పురోగమిస్తూనే ఉంది .వీటి నన్నిటిని తన లో లయింప జేసుకోంది కూడా అంటారు .ఇలాంటి విలక్షణ విశిష్ట సంస్కృతికి మనం వారసులం అని గుర్తు చేస్తారు.‘’నేను హిందువును .నా ధర్మం సనాతన ధర్మం .నా దేశం భారత దేశం ‘’అని ప్రతి హిందువు ఎలుగెత్తి చాటాలని పండితుల వారు ఉద్బోధించేవారు. ఆధ్యాత్మిక చింతన ,ధార్మిక జీవనం వల్లనే పర పీడన నుంచి విముక్తి లభిస్తుందని అనే వారు .హిందువు మనసా వాచా ,కర్మణా హిందువుగా జీవించాలిఅని వారి ప్రబోధం .హిందూ మతం లో ఉన్న విభిన్నత ,శ్రుతి స్మ్ర్తుతి ,పురాణాల లోని పరస్పర విరుద్ధ విషయాలు మన వాళ్లకు అర్ధం కాక పోవటం వల్ల ఇతరులు వేసే ప్రశ్నలకు దీటైన సమాధానాలు చెప్పలేక పోవటం వల్ల ఇబ్బంది ఏర్పడిందని భావించారు .సహేతుకం గా ,అనుభవ పూర్వకం గా సమన్వయించి చెప్పగల శక్తి ఉన్న పండితులు లేక పోవటమే ఈ దుస్తితికి కారణం గా భావించి ఈ పవిత్ర జ్ఞాన యజ్ఞం కోసం జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి ప్రభాకర పండితులు . ఆ నాడు మన రాష్ట్రం లో వీరు తప్ప వేరెవ్వరూ లేరనటం నూటికి వెయ్యి శాతం యదార్ధం
పండితుల ఉపన్యాస గంగా స్నాన ఫలితాలు తరువాత తెలుసుకొందాం .
దీపావళి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-11-13-ఉయ్యూరు

