ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు -2
ప్రభాకర వాక్ మహేంద్ర జాలం
ఇరవై ఏళ్ళ వయస్సులో ఆర్ష విజ్ఞాన ప్రచారోద్యమానికి శ్రీ కారం చుట్టారు ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు .ఆయనది దైవ వాణి గా భావించారు .ప్రజల మనసులో అమృత ధారల్నివర్షించింది .
ఆజాను బాహువులు ,వైదిక వర్చస్వి ,గంబీర ముఖ కవలిక లతో భాసించేవారు .కనులలో కార్య దీక్ష కనిపించేది .జాతీయ వేష దారణ తో ధీరోదాత్తం గా చూపరులను ఆకర్షించే వారు .దివ్యర్షి సమానం గా ఆరాధించే వారు .మారు మూల ప్రాంతాలలో ఉపన్యాసాలను ప్రారంభించి పట్నాలకు తమ వాగమృతాన్ని వ్యాపింప జేశారు ..ప్రజలను దేశ భక్తీ ప్రపూరితులుగా ,ధర్మావలంబకులుగా తీర్చి దిద్దే ఉపన్యాస ధారల తో పరవశింప జేసే వారు .గంగా యమునా సరస్వతీ సంగమ స్థానం నం గా వారి వాక్కు ధ్వనించేది .గుంటూరు మండలం లో ఉపన్యాసాలను మొదట ప్రారంభించి ,కృష్ణ దాటి, గోదావరి ప్రాంతం చేరి, రాజ మండ్రి లో నెలకు పైగా ఉపన్యసించి నాస్తికులనే కాక ఇతర మతస్తులనూ ఆకర్షించిన నేర్పు పండితుల వారిది .
జనా కర్షణ ,తెలీని మత్తు వారి ప్రసంగాలలో ద్యోతక మయ్యేది .వేదం ప్రాశస్త్యాన్ని గురించి చెప్పినా ,పురాణ వివరణ చేసినా ,దేవతల కధల్లో ఉన్న దేవ రహస్యాలు వివరించినా ,కుల భేదాలను పరిష్కరించే మార్గాలనేలా చెబుతారో ,అస్పృస్యత ను గురించి ,శాస్త్రీయ దృక్పధాన్ని ఎలా ఆవిష్కరిస్తారో అని కళా శాల విద్యార్ధులు ,డాక్టర్లు ,న్యాయ వాదులు ,న్యాయాధిపతులు ,ఉద్యోగులు ,సామాన్యులు ముఖ్యం గా మహిళలు విశేషం గా హాజరై అతి ఆసక్తి గా వినే వారు .సమయ పాలన పాటించటం లో వారికే సాటి .సమయానికి ముందే సభకు వచ్చే వారు ప్రజలు మైమరచి తన్మయత్వం తో వినే వారు వారి ప్రసంగం కనీసం రెండున్నర గంటల వరకు ఉండేది .ఇందులో వేదోపనిషత్తులు ,భగవద్గీత ,పురాణ గాధలు శ్లోకాలు కావ్య పద్యాలు ఉదాహరణలు ,గంభీర గర్జనలు ,విదేశీ మతాలపై వాక్ శస్త్రాలు నాస్తికులకు సవాళ్లు ,ఛలోక్తులు తో ఒక శబ్ద మహేంద్ర జాలం గా భాసించేది .
ధార్మిక ఉపన్యాసాలకు వేలాది ప్రజలు ఆకర్షణ గా రావటం పండితుల వారితోనే ప్రారంభ మైంది .పల్లెలు ,పట్టణాల నుండి బండ్లు కట్టుకొని వచ్చి వినే వారు .రైల్ పెట్టెల మీద ,బస్ టాపులపైనా కూర్చుని చేరుకొనే వారు.ఎందరో వాలంటీర్ల అవసరం అయ్యేది .విజయ వాడ లో శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో నిర్వ హింప బడ్డ కార్య క్రమాలు న భూతో న భవిష్యతి గా జరిగేవి .పండితుల ప్రసంగం లేకుండా ఏ సభా జరగ లేదు .వారి ఉపన్యాసం లేక పోతే జనం క్షేత్రానికి చందాలుఇచ్చే వారు కాదు విరాళాలు ఇచ్చే వారూ కాదు . అంత క్రేజ్ ఉన్న ఉపన్యాసకిశోరం ప్రభాకరులు .ఇంతటి స్తాయిని ధార్మిక ప్రసంగాలకు తెచ్చిన ఘనత వారిదే .
దేశ హితం కోసం ,సనాతన ధర్మ ప్రచారం కోసం వారి కృషి అమూల్యమైనది .పర మతం స్వీకరించిన హిందువులు వీరి ప్రభావం తో మళ్ళీ స్వమతం లోకి ప్రవేశించారు .దీనికి ఇబ్బంది పడ్డ గుంటూరు క్రైస్తవ బిషప్పులు పండితుల వారి పై గుంటూరు కోర్టు లో కేసు వేశారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య ,ఉన్నావ లక్ష్మీ నారాయణ ,నడింపల్లి నరసింహా రావు ,గోవింద రాజుల శ్రీని వాస రావు ,ఏకా లక్ష్మీ నరసింహం ,మొదలైన ఉద్దండులైన న్యాయ వాదులు పండితుల వారి పక్షాన ప్రతి వాదనలు చేసి జడ్జి గారిని మెప్పించారు .న్యాయ మూర్తి బిషప్పులదేదోషం అని తీర్పు నిచ్చారు ఇలా పండితుల వారు న్యాయ పోరాటం లోను విజయం సాధించారు .
పండితుల వారి ధార్మిక జైత్ర యాత్ర గురించి తరువాత తెలుసు కొందాం .
సశేషం
రేపటి నుంచి పవిత్ర కార్తీక మాస సందర్భం గా సుభా కాంక్షలతో
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-13 –ఉయ్యూరు

