కథ చెబుతాను… ఊ..కొడతారా

 

ఈ ఫోటోల్లో కనిపిస్తున్నావిడ పేరు దీపా కిరణ్. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తోంది డాన్సరేమో అనుకుంటున్నారా. కానే కాదు. ఈవిడ కథలు చెప్తుంది. గుక్కపట్టి ఏడ్చే చిన్న పిల్లల నుంచి వయోధికుల వరకు ఎవరైనా సరే ఈవిడ చెప్పే కథ విన్నారంటే ఆ కథల లోకంలో మైమరిచి పోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్ఘళంగా, ఆసక్తికరంగా కథల్ని వినిపించే ఈవిడ ఒకప్పుడు స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆకాశవాణిలో కంపీరింగ్ చేశారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పనిచేశారు, రచయిత్రి కూడా. ఇలాంటివెన్ని చేసినా కథలు చెప్పడమే నాకిష్టం అంటున్న దీప గురించి ఆమె మాటల్లోనే…

“స్కూల్స్‌లో పనిచేస్తుండగానే కథలు చెప్పడం ప్రారంభించాను. ఎందుకోగాని కేంద్రీయ విద్యాలయాల్లో జూన్‌లో టీచర్లు తక్కువగా ఉండేవారు. డిసెంబర్‌లోపల సిలబస్ పూర్తయిపోవాలి కదా. ఆ క్లాసుకి సంబంధించిన టీచర్ని కాకపోవడం వల్ల పిల్లల్ని అల్లరి చేయకుండా కూర్చోపెట్టడం కష్టమయ్యేది. అందుకని క్లాసులోకి వెళ్లగానే 20 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే స్టోరీ చెప్తాననేదాన్ని. అలా కథలు చెప్పడం మొదలైంది. సిలబస్‌లోని పాఠాల్నే కథలుగా మార్చి చెప్పేదాన్ని. దాంతో ఆ స్టూడెంట్స్ నన్ను బయట ఎక్కడ చూసినా పాత స్నేహితురాల్ని పలకరించినట్టు పలకరించేవాళ్లు. వాళ్లతో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు భావించేవారు. అది గమనించిన నాకు కథల్లో మ్యాజిక్ ఉంది, అది మనుషులను దగ్గర చేస్తుంది అనిపించింది.

ఆలోచించేలా చేసింది
2008లో మూడు వారాల స్టోరీ టెల్లింగ్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాను. 15 మంది పిల్లలొచ్చినా చాలనుకున్నాను. కాని 25 మంది వచ్చారు. ఈ క్యాంప్ ఏర్పాటుచేయడం వెనక నా వ్యక్తిగత కారణం కూడా ఒకటి ఉంది. అప్పట్లో నాకు కిడ్నీ సమస్య వచ్చింది. చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది. దాంతో కొలెస్ట్రాల్ స్థాయి 650కి చేరింది. బాగవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదన్నారు డాక్టర్లు. అప్పుడు నా పిల్లలకి ఒకరికి ఏడాదిన్నర, మరొకరికి మూడున్నరేళ్లు. డాక్టర్లు అలా చెప్పేసరికి జీవితం గురించి చాలా ఆలోచించాను. ఏదైనా చేయాలనిపించింది. అలా నాకిష్టమైన ‘స్టోరీ టెల్లింగ్ క్యాంప్’కు అంకురార్పణ జరిగింది. చాలా స్కూల్స్‌లో కథల క్యాంపులు ఏర్పాటుచేశాను. అవి చూసిన కొందరు బయట కూడా చేయమని అడిగారు. అప్పట్నించీ కార్పొరేట్ ప్రోగ్రామ్‌లు కూడా చేస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, తెలుగు – మూడు భాషల్లోనూ కథలు చెప్తాను. కథల మధ్యలో పంజాబి, బెంగాలి, తమిళ భాషల్లో పద్యాలే కాక కొన్ని వాక్యాలు కూడా చెప్తుంటాను.

కథ అంటే ఓకే అంటారు
సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లల్ని అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఒక కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో – వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రల్ని ఊహించుకుంటారు. అందుకే కథల్ని అందరూ ఇష్టపడతారు. ‘పిల్లలు తెలివయిన వాళ్లు కావాలంటే వాళ్లకి కథలు చెప్పాలి’ అన్నారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. కెనడాలో మూడేళ్ల క్రితం స్కూల్ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో మాత్రం అది ఎప్పట్నించో ఉంది. మనకి చరిత్ర, పురాణాల వంటివేవి చెప్పాలన్నా కథల ద్వారానే చెప్తారు కదా!
కథ ఎంపిక ప్రేక్షకుల్ని బట్టి, జరిగే ఈవెంట్‌ని బట్టి చేసుకుంటాను. అలాగే ఒకే వయసు వాళ్లా, భిన్న వయస్కులా అనేది కూడా చూసుకోవాలి. ‘వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే’నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడేళ్ల నుంచి 92 యేళ్ల వయసు వరకు ప్రేక్షకులు ఉన్నారు. అలాంటప్పుడు అందర్నీ ఆకర్షించే జానపద కథల్ని తీసుకుంటాను. వాటిలో కూడా భారతీయ జానపద కథల్నే తీసుకుంటాను. ఎందుకంటే అవి చాలా సింపుల్‌గా ఉండి ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. చివరగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. కథల్లో మన జీవితం ఉంటుంది. కాబట్టే అవి ఎప్పటికీ ప్రజాదరణ పొందుతాయి.
కథలు వినే వాళ్లలో కొంచెం పెద్ద పిల్లలుంటే సస్పెన్స్ స్టోరీస్, జడ్జిమెంట్ స్టోరీస్ చెప్తాను. ఎనిమిది నుంచి పదేళ్ల లోపు పిల్లలకయితే కథ చెప్తున్నంతసేపూ ఏదో జరిగిపోతుందన్న ఆసక్తి రేకెత్తించే ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకుంటాను. అదే బుజ్జిబుజ్జి చిన్నారులకయితే జంతువుల కథలు ఎక్కువగా చెప్తాను.

జీవితాన్ని కళ్లెదుట నిలుపుతాయి
వయసులో పెద్దవాళ్లకి చెప్పాల్సి వచ్చినప్పుడు మైథాలజి, సూఫీ కథలు ఎంపిక చేసుకుంటాను. అంటే జీవితం గురించి ఆలోచింపచేసేలాంటివన్నమాట. అందుకు ఉదాహరణ ఈ కథ – పర్వతాల మధ్యనుంచి ఒక నది పారుతుంటుంది. అది కొంతదూరం ప్రయాణించిన తరువాత ఎడారి వస్తుంది. ఆ ఎడారిని దాటాలని ఎంత ప్రయత్నించినా నది ఇసుకలో నుంచి పారలేకపోతుంది. ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుండగా… ఎడారిలో ఉన్న గాలి ‘నువ్వు గాలికి లొంగిపోతే దాటగలవు’ అని చెప్తుంది. ‘అలా చేస్తే నా రూపం మారిపోతుంది’ అని నది ఒప్పుకోదు. ‘నువ్వు ప్రయత్నించి చూడరాదూ’ అని గాలి చెప్పగాచెప్పగా నది సరే అంటుంది. వెంటనే నది మేఘంలా మారిపోతుంది. ఆ మేఘాన్ని గాలి ఎడారి అవతలకి తీసుకెళ్లి వానలా కురిపిస్తుంది. నదిగా దాటలేకపోయినా నీళ్లలా దాటిందన్నమాట. ఈ కథ జీవితం గురించి చెప్తుంది. కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలో నేర్పిస్తుంది.
* * *
ఒకసారి చిన్మయ మిషన్‌లో తల్లిదండ్రుల కార్యక్రమంలో మాట్లాడేందుకు వెళ్లాను. నేను ప్రసంగాలు చేయను. ఒక కథ మాత్రమే చెప్తానన్నాను. సరే అన్నారు వాళ్లంతా. అప్పుడు తల్లిదండ్రుల మనసులు తాకే కథ ఒకటి చెప్పాను. ఇదో ఆఫ్రికన్ జానపద కథ. – ఒకావిడకి పిల్లలు ఉండరు. పూజలు చేస్తే మౌంటెన్ స్పిరిట్ పన్నెండు మంది పిల్లల్ని వరంగా ఇస్తుంది. వాళ్లు మొదట గుమ్మడికాయల్లా ఉండి కొన్నాళ్లకు పిల్లల్లా మారతారు. అందరు పిల్లలు బాగుంటారు కాని ఒక పిల్లవాడు మాత్రం కదలకుండా ఒక దగ్గరే కూర్చొని ఉంటాడు. ఆ పిల్లవాడ్ని చూసి విసుగొచ్చి ‘మిగతా పిల్లల్లా నువ్వు కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడూ అలా కూర్చుని ఉంటావేమిటి? నువ్వు గుమ్మడికాయలాగా ఉన్నా పోయేది’ అంటుంది. అంతే వెంటనే ఆ పిల్లవాడు గుమ్మడికాయగా మారిపోతాడు. తల్లి మనసు తల్లడిల్లి అయ్యో ఎందుకలా అన్నానని దుఃఖిస్తుంది. అప్పుడు మిగతా పిల్లలందరూ వచ్చి ప్రార్ధిస్తే వాడు మళ్లీ పిల్లాడిలా మారతాడు. ఈ కథ విన్న తల్లిదండ్రులందరూ ‘నిజమే పిల్లలకి నచ్చింది చేయనివ్వాలి. మన ఇష్టాన్ని వాళ్లపై రుద్దకూడదు’ అన్నారు.
* * *
విలువల కథ
పిల్లలకి నైతిక విలువలు నేర్పే కథ ఇది… ఓ ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు. వాళ్లు చాలా అందంగా కూడా ఉంటారు. తమలో ఎవరు ఎక్కువ అందమైన వాళ్లో తెలుసుకోవాలన్న కోరిక పుడుతుంది వాళ్లలో ఒకనాడు. వారిద్దరిలో ఒకదాని పేరు కథ, ఇంకో దాని పేరు నిజం. బయటికి వెళ్లినప్పుడు ఎక్కువమంది ప్రజలు ఎవరిని చూస్తే వాళ్లే అందమైన వాళ్లు అని ఒక పోటీ పెట్టుకుంటారు. ముందు కథ వెళ్తుంది. బోలెడు మంది జనాలు బయటికి వచ్చి చూస్తారు. ఆ తరువాత నిజం వస్తుంది ఒక్కరు కూడా వచ్చి చూడరు. ఇలా కాదని తన బట్టలు విడిచి (నేకెడ్ ట్రూత్) వెళ్తుంది. అప్పుడయితే ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రాకపోగా తలుపులు గట్టిగా బిగించుకుని లోపలే ఉండిపోతారు. ‘నేను ఇంత అందంగా ఉన్నా నన్నెవరూ ఎందుకు చూడడం లేద’ని నిజం బాధపడుతుంది. ‘నువ్వు కథని దుస్తులుగా వేసుకుని బయటికి వచ్చి చూడు’ అంటుంది కథ. అలానే బయటికి వస్తుంది నిజం. అప్పుడు దాన్ని జనం ఎగబడి మరీ చూస్తారు.”

డిక్షనరీనీ వదల్లేదు

నేను పుట్టింది కలకత్తాలో అయినా నాన్న ఉద్యోగరీత్యా చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో పెరిగాను. హైస్కూల్ నుంచి హైదరాబాద్‌లోనే చదువు. న్యూట్రిషనల్ అండ్ క్లినికల్ డైనమిక్స్‌లో బి.ఎస్.సి చేశాను. చదువుకునే రోజుల్లో ఎన్‌సిసిలో ఎయిర్‌వింగ్ కాడర్‌లో గ్లయిడర్ పైలట్‌గా ఉన్నాను. ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లాలనుకున్నాను. కాని ఇంట్లో వద్దన్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ ‘ఇంగ్లీష్ లిటరేచర్’ చేశాను. ఆ తరువాత ఇఫ్లు(ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ)లో ఇంగ్లీషు టీచింగ్‌లో స్పెషలైజేషన్ చేశాను. సైన్సు చదివిన నేను లిటరేచర్‌కి మారడానికి దాని పట్ల నా ఆసక్తే కారణం. చిన్నప్పట్నించీ పుస్తకాలు బాగా చదివేదాన్ని. నాన్న పుస్తకాలు బాగా తెచ్చేవారు. వాటిలో ఎన్‌సైక్లోపిడియాలు ఎక్కువగా ఉండేవి. ఫిక్షన్ అంటే బాగా ఇష్టం. హిస్టరీ, జాగ్రఫీ ఏ పుస్తకం వదలకుండా చదివేదాన్ని. పేపర్ మీద ప్రింట్ ఉంటే చాలు చదవడమే. పఠనం అలవాటు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్తాను – ‘ఈత ఎలా నేర్చుకోవాలి’ అనే రష్యన్ పుస్తకం చదివి ఈత నేర్చుకున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలన్న పుస్తకం కూడా వదలలేదు. వేరే పుస్తకాలేవీ అందుబాటులో లేక డిక్షనరీని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.

1989లో హైదరాబాద్ వచ్చినప్పటికీ ఎమ్మే చేసేటప్పుడే మంచి తెలుగు నేర్చుకోగలిగాను. అప్పుడే ఆలిండియా రేడియోలో యువవాణిలో ‘హలో నమస్తే ఆదాబ్’ కార్యక్రమం చేశాను. దీన్ని ముగ్గురం తెలుగు, ఉర్దు, ఇంగ్లీషు భాషల్లో చేసేవాళ్లం. అప్పుడే మీడియా గురించి అవగాహన వచ్చింది. వాయిస్ ట్రైనింగ్ కూడా అక్కడే నేర్చుకున్నా. నా మాతృభాష తమిళమే అయినా కొన్నాళ్లు బెంగళూరులో ఉండడం వల్ల చదవగలిగేంత కన్నడ కూడా వచ్చింది. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ‘కేంద్రీయ విద్యాలయం’లో పదకొండు, పన్నెండు తరగతులకు కొన్నాళ్లు ఇంగ్లీషు బోధించాను. ఆ తరువాత బొల్లారంలో చేశాను. టీచింగ్ పట్ల ఆసక్తి ఉందని అప్పుడే అర్థమైంది నాకు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.