
‘రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే ‘రాహుల్‌కు రాహులే శత్రువు’ అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.
వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు.. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఒకవైపు అన్ని సర్వేలు, ప్రజాభిప్రాయ సేకర ణలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వెలువడుతుంటే, సాధారణ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి ఏ భరోసాతో చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం చెందుతుందని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. సీఎన్ఎన్ ఐబీఎన్‌తో పాటు అన్ని ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోతుందని చెబుతున్నాయి. దాదాపు 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కూడా ఈ సారి గద్దెదిగక తప్పదని అంటున్నారు. నిజానికి ఈ ఎన్నికల ఫలితాలు ఇలాగే వచ్చినా కాంగ్రెస్ పెద్దగా బెంబేలు చెందనక్కర్లేదు. 2008లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాజస్థాన్‌లో తప్ప కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయినప్పటికీ 2009లో యూపీఏ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ప్రధానమంత్రి భరోసాకు ఇదే కారణం కావచ్చు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రధానమంత్రిలా ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపగలవని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎందుకు విశ్వాసంతో వ్యవహరించలేకపోతున్నది? కాంగ్రెస్ శిబిరం ఎందుకు కకావికలైపోతున్నది? అధికారం కోల్పోతున్నామన్న భయం కాంగ్రెస్ నేతల కళ్లలో ఎందుకు కనిపిస్తోంది? అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. కానీ కాంగ్రెస్ నేతలు ఈ సారి అధికారం కోల్పోతే తాము తిరిగి రాగలమనే విశ్వాసం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పదేళ్లకాలంలో చేసిన అకృత్యాలు మరింత బట్టబయలై తాము మరింత అపఖ్యాతి కాగలమనే ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నారు. అధికారంలో ఉండగానే అధికారం కోల్పోతామన్న భయంతో ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్న కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీనేనా ఇది? నిజానికి వాజపేయి హయాంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేదేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. పీవీ నరసింహారావును కాంగ్రెస్ నేతలే ఇంటికి పంపించారు. సీతారాం కేసరి లాంటి దుర్బలమైన నేతల్ని పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్‌లలో పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఉత్తరాదినే కాక దక్షిణాదిన కూడా బీజేపీ బలం పుంజుకుంది. ఎన్డీయేకు మిత్రపక్షాలు ఏర్పడ్డారు. అయినప్పటికీ బీజేపీ చేసిన స్వయం కృతాపరాధాల వల్ల ఆ పార్టీ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంది. ఎన్డీయే కకావికలయ్యేలా చేసింది. తిరిగి వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల బలంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా బీజేపీ వీలు కల్పించింది. ఇప్పుడదే చరిత్ర కాంగ్రెస్ విషయంలో పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.
అంత మాత్రాన కాంగ్రెస్ బెంబేలెత్తడం దేనికి? ఒపీనియన్ పోల్స్‌ను, సర్వేలను నిషేధించాలని ఎన్నికల కమిషన్ తలుపులు తట్టడం దేనికి? ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఎన్నికలు ముగిసే వరకూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం నిషేధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదిస్తూ రాజకీయ పార్టీలను సంప్రదించింది. అభిప్రాయ సేకరణలను ఎన్నికలకు ముందు కాకపోతే ఎన్నికల తర్వాత ఎవరైనా నిర్వహిస్తారా? మీడియా బాధ్యత ప్రభుత్వాల పట్ల, పార్టీల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకోవడం. దాన్ని నిషేధిస్తే ఇక మీడియా స్వేచ్ఛకు అర్థమేమున్నది? ఒకవేళ అభిప్రాయ సేకరణే జరగలేదనుకుందాం. ఓటర్లు తమ అభిప్రాయాలు మార్చుకుంటారా? అభిప్రాయ సేకరణను నిషేధిస్తే వారు తమ ఓటు ద్వారా తమ అభిప్రాయం చెప్పడం మానుకుంటారా? అభిప్రాయ సేకరణలు వెలువడినంత మాత్రాన అవి ఓటింగ్ సరళిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిన దాఖలాలు ఎక్కడా లేవు. 2004 ఎన్నికల్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి. కానీ అవన్నీ ఆచరణలో విఫలమయ్యాయి. ఏమైనప్పటికీ ఒపీనియన్ పోల్స్‌పై రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయాయి.
అభిప్రాయ సేకరణలపై నిషేధం విధించడం భావప్రకటనా స్వేచ్ఛను అరికట్టడమేనని బీజేపీ అంటే, అసలు అభిప్రాయ సేకరణలు శాస్త్రీయం కాదని, అదంతా ఒక రాకెట్‌గా, మోసపూరితమైన ప్రక్రియగా మారిపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో జర్నలిస్టుగా ఎన్నికల సర్వేలు నిర్వహించిన కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ అనేది ఒక బూటకమని, అదొక దందాగా మారిపోయిందని విమర్శించారు. రాజీవ్ శుక్లా జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఇలాంటి దందాలే నిర్వహించి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పగల స్థాయికి చేరుకున్నారని భావించాలా? ఒక ఎన్జీవో తరఫున ప్రతి ఎన్నికల్లో సర్వేలు నిర్వహించి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పే ఒక సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు ఏఐసీసీలో కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒపీనియన్ పోల్స్‌ను కళగా నిర్వహించి, అస్మదీయుల ద్వారా వాటిని ప్రచారం చేసింది, తమ రోజువారీ మీడీయా సమావేశంలో ప్రకటించిందీ కాంగ్రెసే. కానీ ఇప్పుడు పరిస్థితులు అడ్డం తిరిగే సరికి అసలు ఒపీనియన్ పోల్స్‌నే నిషేధించాలని ప్రతిపాదిస్తోంది. రోజులు తమవి కానప్పుడు ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారేమో?
కానీ కాంగ్రెస్ భయం కేవలం తమ పట్ల ప్రజల్లో అభిప్రాయ సేకరణ వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం కూడా ఈ భయానికి కారణంలా కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ నేత నరేంద్ర మోదీ ఎక్కడ కు వెళ్లినా, పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావడం, అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం జరుగుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లిన చోటల్లా ప్రతిస్పందన కరువు కావడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో గత నెలలో ఆయన రెండు చోట్లా ర్యాలీల్లో పాల్గొంటే అక్కడ అధికసంఖ్యలో జనం హాజరుకాకపోవడం, దీని పర్యవసానంగా మరో రెండు సభలను రద్దుచేయాల్సి రావడం కాంగ్రెస్ వాదుల్లో చర్చనీయాంశమవుతోంది. పైపెచ్చు రాహుల్ గాం«ధీ ఎక్కడ ఏమి మాట్లాడినా అది వివాదాస్పదమవుతున్నది. నేరచరితుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాలరాచే విధంగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ వ్యతిరేకించిన తీరు వివాదాస్పదంకాగా ఆ తర్వాత కూడా ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. తన తండ్రి, నానమ్మలను మతతత్వ శక్తులు వధించినట్లే తనను కూడా వధించవచ్చునని ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించి సానుభూతి పొందాలనుకున్నారు.
కానీ ఇందిరాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ తాము చేసిన విధాన నిర్ణయాలు వికటించడం వల్లే చివరకు మృత్యువు పాలయ్యారన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియనిది కాదు. పంజాబ్‌లో ఆధిపత్యం కోసం భింద్రన్ వాలేని సృష్టించిందీ, పెంచి పోషించిందీ కాంగ్రెసేనన్న విషయం చరిత్రలో పలు సందర్భాల్లో రికార్డయింది. ఇందిరాగాంధీని చంపింది మతతత్వ వాదులయితే ఆపరేషన్ బ్లూస్టార్ మాటేమిటి? ఇందిర మరణానంతరం ఢిల్లీ వీధుల్లో జరిగిన సిక్కుల ఊచకోత మాటేమిటి? అన్న ప్రశ్నలకు ఆస్కారం ఉన్నది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సహజంగానే సిక్కుల మనసుల్లో మాసిపోతున్న గాయాలను తిరిగి రేపాయి. అనేక సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించాయి. అంతటితో రాహుల్ గాంధీ ఊరుకోలేదు. మరో సందర్భంలో ముజఫర్ నగర్‌లో అల్లర్లకు గురైన ముస్లింయువకులను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ రెచ్చగొట్టి తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు చూస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తనకు తెలిపాయని రాహుల్ గాం«ధీ ప్రకటించి మరింత సంచలనానికి తెరలేపారు. అసలు రాహుల్‌గాంధీ ఎవరని ఐబి వర్గాలు ఆయనకు సమాచారాన్ని ఇస్తాయి? ఆయన అనధికారిక శక్తిగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు కలిగే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దీనితో రాహుల్ ఏమి మాట్లాడతారో, దాని వల్ల ఎలాంటి విమర్శలు తలెత్తుతాయో అన్న భయాందోళనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు గురవుతున్నారు. పత్రికా సమావేశాల్లో రాహుల్ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమే వారికి సరిపోతున్నది.
అసలు విషయం ఏమంటే రాహుల్ గాంధీకి ఏ విషయం ఎలా ఎత్తుకోవాలన్న విషయంలో ఒక అవగాహన లేకపోవడం. ఒక విషయాన్ని సంచలనం లేకుండా అదే సమయంలో స్పష్టంగా, ప్రతిభావంతంగా చెప్పడం ఆయనకు ఇంకా పట్టుపడినట్లు కనపడడం లేదు. నేరచరితులపై ఆర్డినెన్స్‌ను తాను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నానని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తున్నానని ఆయన చెప్పి ఉంటే మరింత శక్తివంతంగా ఉండేది. నేరచరితుల గురించి ఆయన తన వైఖరిని వివరించి ఉంటే ఇంకా ఆయన ప్రతిష్ఠ పెరిగి ఉండేది. కానీ ఆయన అలా చేయలేరు. గత 9 సంవత్సరాల్లో కాంగ్రెస్‌లోనే పలు నేరచరితులు బయలు దేరారు. నేరచరితులతో మిలాఖత్ కాకుండా మనుగడ సాధించలేని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగం చేశారని తాను కూడా మతతత్వ శక్తులతో పోరాడే క్రమంలో త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ప్రకటించి ఉంటే మరోరకంగా చర్చనీయాంశమయి ఉండేది.
ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో ఐబి నివేదికలను ఉటంకించకుండా మతతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పిఉంటే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయి ఉండేవే కాదు. ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు పంపాల్సిన ఆగత్యం ఏర్పడేదే కాదు. ఈ వ్యాఖ్యల తర్వాత రాహుల్‌ను కాంగ్రెస్‌కు భారంగా పరిగణించేవారే ఎక్కువయ్యారు. ‘రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే రాహుల్‌కు రాహులే శత్రువు అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.

