
దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల వరుస. అందుకే దీపావళి అమావాస్యనాడు ఒక ప్రత్యేకత వుంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైన జలాలతో స్నానం చేస్తే కురు అంటాము. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటిలో ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరు ఉన్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే అంటే దీపావళి అమావాస్యనాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. దీపావళి అమావాస్యనాడు ప్రాతఃకాలంలో మజ్జనం లేని స్నానం చేయకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం. లేకపోతే గౌరవ స్నానం అంటారు. అన్నివేళలా యథార్థంగా చెంబుతో నీళ్ళు తీసుకుని పోసుకుంటాం అంటారు.
నదీస్నానం గానీ, ప్రవాహ జలంలో గానీ స్నానం చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్యనాటి ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెను ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే! అంటారు. నువ్వుల నూనె ఒంటికి రాసుకుని, తెల్లవారు ఝామున స్నానం చేస్తారు. దేనికి? ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం! లక్ష్మీ స్పర్శలో అలక్ష్మి పోతుంది. ఇక గంగాస్నానంలో పాపనాశం అవుతుంది. ్‌భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశుః । అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో బాలకాండలో. పరమశివుని శరీరానికి తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. గంగ ఒంటికి తగిలితే పాపాలన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండానే తనే వచ్చి ఆవహిస్తుంది దీపావళి అమావాస్యనాడు. అందుకనే అభ్యంగనం చేయాలంటే నూనెను ఒంటికి రాసుకుని తల మీద నుంచి నీళ్ళు పోసుకోవాలి. ఇక రెండవ రోజు తప్పకుండా ఆ దీపాలను వరుస పేరుస్తారు. దీపాలను పేర్చి ఆ దీపాల కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి తైలాభ్యంగనం చేసి, దీపాల వరుస పెట్టి లక్ష్మిని ఆవాహనచేసి ఆంతరంలో జీవుడున్న స్థితిని, బాహ్యంలో లక్ష్మి అన్రుగహాన్ని పొందుతాం అని చెప్పటానికి అలక్ష్మిని పోగొట్టుకోవటానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధ రకాలైన బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చటానికి కారణం నరకాసుర వధ అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మీ పరిహారార్థం. అలక్ష్మిని తరిమిగొట్టడానికి లక్ష్మిని నిలబెట్టుకోవటానికి చేస్తారు. పితృ దేవతలకు మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి దీపం వెలిగించాలి.
ఎక్కడ దీపం వెలిగించాలి?
కార్తీక దీపం అన్నదొక్కటే అంత ప్రాశస్తం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు! వెలిగించమన్నారు కదా అని కర్పూరపు బిళ్లలు పట్టుకెళ్లి ఎక్కడపడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనువైన ప్రదేశమో అక్కడే దీపాల్ని ఉంచాలి. కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి. భక్తి ఎక్కువై నందీశ్వరుని వెనకభాగంలో పెడతారు. అదేమన్నా పద్ధతేనా? ఇంకొకరు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటారు అక్కడ? ఇబ్బంది కాదూ? ఒక పని చేస్తున్నామంటే ఏదో చెయ్యడం కాదు. కొంచెం మనసు పెట్టి విచారణ చేసి, మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో, పరిణతితో చెయ్యవలసి ఉంటుందో, ఆ పరిణతితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప, యావత్ లోకానికి ఉపకారం కోసం నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. ఇందుకే కార్త్తీక మాసానికి, నదికి అంత దగ్గర సంబంధం.
ఉపనిషత్తోల్లో దీపం
దీపం గురించి ్్‌న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో….. త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం** అని ఉపనిషత్తులు చెబుతాయి. పరమేశ్వరుడు ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగుముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగుముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబట్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ వుంటాడు. కాబట్టి ప్రకాశిస్తున్న ఆ కాంతిపుంజమున్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. దీనినే పోతనగారు –
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగుపెం
జీఁకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. (భాగ. 8-75)
వీళ్ళందరూ మహా ప్రళయంలో పడిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల గమనమాగిపోతే ఈ కటిక చీకటి కావల ఒక్కడు వెలిగిపోతూ వుంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగుకు వెలుగైనదొక్కటున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో.

