
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా కొన్ని చీరలకు డిజైన్ చేయాలనుకుంటున్నారు.అగ్గిరవ్వ మమత లోపల ఒక డిజైనర్ ఉన్నట్టు ఇంతకు ముందే కొన్ని సందర్భాల్లో బయటపడింది. అది ఎలాగంటే – కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు లోగోలను డిజైన్ చేశారామె. తన ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ఏయే రంగులు వాడాలో కూడా ఆమె నిర్ణయించేవారు. బెంగాల్‌లో చిన్న, సన్నకారు పరిశ్రమలను ఎలా ప్రమోట్ చెయ్యాలో ఆమె సూచించేవారు. బాలికల కోసం నెల రోజుల క్రితం చేపట్టిన కొత్త పథకం ‘కన్యాశ్రీ’ కూడా ఆమె డిజైన్ చేసిన లోగోతోనే ప్రారంభమయింది.
తమ రాష్ట్రంలోని ఔషధ మొక్కల ప్రచారానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాటిని మార్కెట్ చేయడానికి మంత్రుల, కార్యదర్శుల కమిటీలను ఏర్పాటు చేశారు మమత. ఆ పనిలో ఉన్నప్పుడే – మూలికలతో తయారయ్యే రంగులను చీరల తయారీకి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందామెకు. కొత్త డిజైన్లు, సహజ రంగులతో రూపొందించిన చీరలతో ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావాలని ఆమె ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నికగన్న 400 మంది చేనేతకారులను రప్పించి, వారితో ఆమె ఆలోచనలను పంచుకోవాలన్నది దీనిలో మొదటి మెట్టు. రెండో మెట్టుగా ప్రతి సంవత్సరం రెండు లక్షల చీరలను తంతుజా సొసైటీ నుంచి కొనుగోలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంతకు ముందు 75 వేల చీరలను మాత్రమే కొనుగోలు చేసేది. ఈ చర్యల ద్వారా బెంగాల్లోని 488 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 7000 మంది చేనేతకారుల భవిష్యత్తు మారిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రజలకూ లాభం ఉంది. ఒక్కొక్కటీ 184 రూపాయల విలువ చేసే చీరలను పేదలకు రూ. 104లకే అందిస్తారు. ప్రస్తుతానికి ఈ డిజైన్ సెంటర్‌కు రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. ‘ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వచ్చిన నాటి నుంచి మా అమ్మకాలు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కిందటేడు పాతిక కోట్ల రూపాయల ఎక్కువ ఆదాయం లభించింది మా సంస్థకు. దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చెయ్యనిదంటూ లేదు…’ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తంతుజా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కేరాయ్. ‘ఇప్పుడు ఆమే స్వయంగా డిజైన్ చేస్తున్నారంటే ప్రముఖులంతా మా దుస్తులను తెగ కొంటారు…’ అని కూడా సంబరపడుతున్నాడాయన.

