జనం కష్టసుఖాలు బాగా తెలుస్తాయి – గుళ్లపల్లి నాగేశ్వరరావు

 

‘పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే’ అంటున్నారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. మన రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఎల్‌వీప్రసాద్ నేత్ర వైద్య ఆస్పత్రిని నిర్మించి నిర్వహిస్తున్న ఆయన సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. తాను పుట్టిపెరిగిన ఊరి గురించి డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెబుతున్న విశేషాలే ఈ వారం ‘మా ఊరు’

“నేను పుట్టింది కృష్ణా నది ఒడ్డున ఉన్న చోడవరం అనే పల్లెటూళ్లో. అది మా అమ్మమ్మగారి ఊరు. మా నాన్న మెడిసిన్ చదువు కోసం మద్రాసు వెళ్లడంతో నాకు మూడేళ్ల వయసు వచ్చే వరకూ చోడవరంలోనే ఉన్నామట. మా తాతగారు కోవెలమూడి రాఘవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. తర్వాత రోజుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారట. రాజకీయాల్లో తిరుగుతూ ఉన్న ఆస్తినంతా ఖర్చుపెట్టేశారని మా కుటుంబాల్లో చెప్పుకునేవారు. నాకు మూడేళ్లు నిండాక మా అమ్మ మా నాన్న దగ్గరకు మద్రాసు వెళ్లడంతో నన్ను మా పెద్దమ్మ తనతోపాటు ఈడుపుగల్లు తీసుకెళ్లిపోయింది. వాళ్లకప్పటికి పిల్లలు లేరు. అప్పట్నుంచి నేను ఎనిమిది పాసయ్యే వరకూ అక్కడే ఉన్నాను. ఇంత కథ ఉంది గనకే నా సొంతూరేదంటే ఈడుపుగల్లు అనే చెబుతాను.

ప్రముఖుల పుట్టినిల్లు
మా పెదనాన్న మేనల్లుడు వీరమాచనేని వెంకటరత్నంగారిని ఈడుపుగల్లులో అందరూ మైనరుగారు అనేవారు. తల్లిదండ్రుల్లో ఒకరిని చిన్నత నంలోనే పోగొట్టుకున్నవాళ్లను అప్పట్లో మైనరు అనేవాళ్లు. ఆయన సంరక్షణ కోసం మా పెదనాన్న కుటుంబం ఆయన ఇంట్లోనే ఉండేది. అందువల్ల నేను పెద్ద కుటుంబంలో పెరిగాను. ఈడుపుగల్లు చాలామంది ప్రముఖులు పుట్టిన ఊరు. ప్రజానాట్యమండలిని అభివృద్ధి చేసిన కమ్యూనిస్టు సుంకర సత్యనారాయణ, సినిమా రంగంలో పేరున్న విక్టరీ మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు పర్వతనేని దశరథరామయ్య మొదలైనవాళ్లంతా ఆ ఊరివాళ్లే.

సందడే సందడి
నాకు ఊహ తెలిసేనాటికి కూడా మా ఊళ్లో కరెంటు లేదు, శుభ్రమైన మంచినీటి సౌకర్యం లేదు. కాళ్లకు చెప్పులు వేసుకోవడం, నిక్కర్లు గాకుండా ప్యాంట్లు వేసుకోవడం అనేది పెద్ద విలాసం. పెళ్లిళ్లకో లేదా మరేదైనా ప్రత్యేక సందర్భాల్లోనే వాటిని ధరించేవాళ్లం. అప్పట్లో ప్రయాణ సాధనం అంటే ఎడ్లబండే. ఆ బండెక్కి ఏదైనా పొరుగూరికి వెళ్లడమంటే మాకెంతో సంబరంగా ఉండేది. ముందురోజే బండిని, ఎడ్లను అలంకరించి సిద్ధం చేసేవాళ్లం. ఇక మా ఊళ్లోనో, పొరుగూళ్లోనో ఎవరిదైనా పెళ్లి అంటే మహా సందడే. అవసరమై కాదుగాని, సరదా కొద్దీ పొలాల్లో చిన్నచిన్న పనులు చేస్తుండేవాణ్ని. ఇప్పటికీ పచ్చటి పంట పొలాలను చూస్తే నా మనసుకెంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది.

పి.ఎస్.ఆర్ వక్కపొడి తెలుసా
ఈడుపుగల్లు ఊరు మధ్యలో వీరబ్రహ్మంగారి స్థూపం ఉండేది. దాని ఎదురుగా ఒక చిన్న దుకాణం ఉండేది. ఊళ్లో ఏ అవసరానికైనా ఆ దుకాణానికి వెళ్లాల్సిందే. నాకు గుర్తున్నంతలో కృష్ణా జిల్లాలో వక్కపొడి తయారుచెయ్యడం మొదలెట్టింది ఈ దుకాణాన్ని నడిపే పి. సుబ్బారావుగారే అనుకుంటాను. పి.ఎస్.ఆర్. వక్కపొడి అన్న పేరుతో అది మా ప్రాంతంలో చలామణీలో ఉండేది. రాష్ట్రమంతా ఉండేదో లేదో నాకు తెలియదు.

ఎప్పుడైనా, ఎక్కడికైనా
ఊళ్లో చుట్టాలుపక్కాలు – తోచినప్పుడు తోచిన వాళ్లింటికి వెళ్లడం, మాట్లాడుకోవడం, వాళ్లేవైనా పెడితే సుబ్బరంగా తినేసి రావడం – ఇలా ఉండేది మా చిన్నప్పుడు. నాకు తెలిసి ఎవరూ తమ ఇళ్ల తలుపులు వేసేవారే కాదు. తాళాలు వెయ్యడం అన్నది ఎప్పుడో ఊరెళితేనే.

తొలి ఉపాధ్యాయుడి చలవ
అప్పటికి ప్రాథమిక పాఠశాలలు లేవు. అందువల్ల సీతారామయ్యగారు నడిపే బడే మా బడి. నన్ను అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే నా తొలి ఉపాధ్యాయుడు సీతారామయ్యగారి పేరే చెబుతాను. ఆయన బాగా చదువుకుని, పెద్దపెద్ద డిగ్రీలున్నవారేం కాదు. అయినా ఆయన నేర్పించిన క్రమశిక్షణ, మంచి అలవాట్లు నాలో ఈనాటికీ పదిలంగా ఉన్నాయి.

పరుగులు తీసి తీసి…
ఈడుపుగల్లులో హైస్కూలుకు మా ఇంటి నుంచి ఒక మైలు దూరం నడవాలి. బడి ఉదయం పదింటికి మొదలవుతుందంటే సీతారామయ్యగారు తొమ్మిదింటి దాకా కదలనిచ్చేవారు కాదు. తొమ్మిదికి ఇంటికెళ్లి స్నానం చేసి పెట్టినదేదో తిని స్కూలుకు వెళ్లాలంటే సమయం సరిపోయేది కాదు. ఆలస్యంగా వెళితే అక్కడి హెడ్మాస్టరు బెత్తం పట్టుకుని చావబాదేవారు. అందుకని అంత దూరమూ ప్రతిరోజూ పరుగెత్తుకుంటూ వెళ్లేవాళ్లం. వెళ్లేసరికి ఆయాసం వచ్చేది. మా స్కూలు చుట్టూ నేరేడు చెట్లుండేవి. మధ్యాహ్నం కేరేజ్ డబ్బాలో పెట్టిన అన్నం తిన్నాక అవి కడిగేసి ఆ చెట్లెక్కేవాళ్లం. డబ్బా నిండేటన్ని నేరేడు పండ్లు ఎవరు కోస్తే వాళ్లు గొప్పన్న మాట. సాయంత్రం స్కూలయిపోయాక అక్కడే గ్రౌండులో కబడ్డీ ఆడేవాళ్లం.

కరెంటొచ్చిందోచ్
ఈడుపుగల్లుకు 1950 – 52లో విద్యుత్ సౌకర్యం వచ్చింది. కరెంటుతో వెలిగే బల్బు, ఫ్యానులను చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్లం. చెబితే నవ్వుతారేమోగాని, మా ఊళ్లో మొట్టమొదట లావెట్రీ కట్టించింది మైనరుగారే. ఊరుఊరంతా వచ్చి దాన్ని అబ్బురంగా చూసి వెళ్లడం నాకింకా గుర్తుంది. అలాగే ఊరికి బస్సు వస్తే పండగలా ఉండేది. పండగంటే గుర్తొచ్చింది… సంక్రాంతి వస్తోందంటే చాలు, మా ఊళ్లో కోడి పందేలు జోరుగా సాగేవి. పందేలు ఒక ఎత్తు, అవి జరిగే చోట ఉండే కోలాహలం మరొక ఎత్తు. ఊళ్లో పందేల కోసం ఎదురుచూసేవాళ్లు తక్కువ, ఆ కోలాహలం కోసం ఎదురుచూసేవాళ్లు ఎక్కువ.

వేరు చెయ్యగలరా?
ఒక్కముక్కలో చెప్పాలంటే – ఈడుపుగల్లు వంటి పల్లెటూళ్లో పెరగడం అనేది నా అదృష్టం అనుకుంటాను. అక్కడ పెరిగిన కాలమే నా జీవితంలో అత్యంత విలువైన కాలం. పల్లెటూరిలో పుట్టిపెరిగినవారు మెడిసిన్‌లోకి వెళితే మాత్రం మంచి వైద్యులు కాగలరని, బాగా పేరు తెచ్చుకోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే పల్లెటూళ్లో కనీసం కొన్నేళ్లు పెరిగితే సామాన్య మానవుల కష్టసుఖాలు ఏమిటో అర్థమవుతాయి. ఏదో సెలవులకు చుట్టపుచూపుగా వెళితే అర్థమయ్యే విషయాలు కావు అవి. వైద్యులనే కాదు, ఏ రంగంలో రాణించాలన్నా పల్లెటూళ్ల జీవన శైలి తెలిసి ఉండటం మంచిదని నేననుకుంటాను. ‘పుట్టినూరి నుంచి ఒక మనిషిని బైటికి తీసుకురాగలం గాని మనిషిలోంచి సొంతూరిని తీసెయ్యలేం’ అని ఒక ఇంగ్లీషు సామెత ఉంది. అలా నేను ఈడుపుగల్లు నుంచి బైటికొచ్చి చాలా దూరం ప్రయాణించానుగాని, నా లోపల మా ఊరు ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. మా ఊరు నన్ను మంచి వైద్యుణ్ని చేసింది, అంతకన్నా మిన్నగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది.”

ఈడుపుగల్లుతో పాటు ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లన్నిటికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ శాఖ ఒకదాన్ని విజయవాడ సమీపంలోని తాడిగడపలో ప్రారంభించాం. ఇది మా ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిసరాల్లో ఉన్న గ్రామస్థులందరికీ అది ప్రపంచస్థాయి నేత్ర వైద్యాన్ని అందిస్తోంది. నాకు మేనమామ వరసయ్యే మైనరుగారు ఆయన కొడుకు కుటుంబంతో ఈడుపుగల్లులోనే ఉంటున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి ఊరెళ్లి వాళ్లను చూసొస్తుంటాను.

ఈడుపుగల్లు గాంధీ
మా ఊరి గురించి ఇంత చెప్పాను కదాని ఈడుపుగల్లు వెళ్లి ‘గుళ్లపల్లి నాగేశ్వరరావు’ అంటే ఎంతమంది గుర్తుపడతారో చెప్పలేను. ఎందుకంటే ఆ ఊళ్లో నా పేరు గాంధీ. పసివయసులో మా ఇంటి అరుగుల మీద కూర్చుని ఎవరైనా నా పేరడిగితే ‘గాంధీ’ అని చెప్పేవాణ్నట. అందుకని ఊళ్లో ఆ పేరే స్థిరపడిపోయింది నాకు.

మారకపోవడం మా ఊరి చలవే
సాధారణంగా పల్లెటూళ్ల నుంచి వైద్యవృత్తిలోకి వచ్చేవాళ్లు – వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లినప్పుడు, పది పదిహేనేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేద్దామని అనుకుంటారు. కాని వెళ్లిన తర్వాత ఎక్కువమంది ఆ ఆలోచనను మర్చిపోతారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా తొలినాటి ఆలోచనను మర్చిపోకుండా, మారిపోకుండా మళ్లీ మన దేశానికి వచ్చెయ్యడం, ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను ప్రారంభించడం వెనక మా ఊరి ప్రభావం ఎంతో ఉంది.
ం అరుణ పప్పు
ఫోటోలు : గోపి, కస్తూరి చిట్టిబాబు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.