
హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థినులు వీళ్లు. మరి ఇప్పుడేంటి ఫోటోకు పోజు పెట్టారంటారా? వీళ్లంతా కలిసి తమ అరవయ్యో పుట్టినరోజును ఒక రిసార్టులో సంబరంగా చేసుకున్నారు. అసలు తామంతా ఎలా కలిశారు, కలిసి చేసిన పనులేంటి, బాల్య స్నేహితుల కలయిక తమపై చూపించిన ప్రభావం ఎలాంటిది – ఇవన్నీ సరదాగా చెబుతున్నారు వాళ్లు…
“హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో 1969 – 70 లో పదో తరగతి పూర్తి చేసిన బ్యాచ్ మాది. మాలో కొందరైతే ఏకంగా ఒకటో తరగతి నుంచి క్లాస్‌మేట్స్. ఆ తర్వాత బియ్యే, బీకామ్, మెడిసిన్, ఇంజనీరింగ్ – ఇలా ఎవరికి తోచిన పైచదువులకు వాళ్లు వెళ్లిపోయాం. అటుపైన పెళ్ళిళ్లు, పిల్లలు సంసారాలు… అవన్నీ మామూలే. ‘నాతో పాటు చదువుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో’ అన్న ఆలోచన మా అందరిలోనూ మెదిలేదిగాని ఎలా కనుక్కోవాలో తెలియక ఊరుకున్నారు ఎవరికివారు.
కలిస్తేనే కలదు సుఖం
సమాచార సాధనాలు పెరిగి సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లు ఇంతగా విస్తరించాక కూడా స్నేహితుల జాడ కనిపెట్టలేకపోవడం ఏమిటి అనుకుంది మా నేస్తం అమరిపు రామశేషు. అమెరికాలో స్థిరపడిన ఆమె కొన్నాళ్లు శ్రమించి అక్కడే ఉంటున్న మరో పదిమంది చిరునామాలు, ఫోన్ నెంబర్లు సంపాదించింది. అలా ఎన్నో ఏళ్ల తర్వాత మేం కలిశాం. ఒకర్నొకరు పలకరించుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక ప్రణాళిక వేసుకుని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న సరస్వతి ఇంట్లో 2007లో పద్నాలుగు మంది కలుసుకున్నాం. మా చిన్నప్పటి కబుర్లు, బడి విశేషాలు… అన్నీ కలబోసుకుంటుంటే ఆ భావన ఎంతో అద్భుతంగా ఉన్నట్టనిపించింది. దాని తర్వాత ఏడాదికి ఒకరి ఇంట్లో కలిసేలా ప్లాన్లు వేసుకున్నాం.
కలవడం అంటే ఉదయాన్నే వచ్చి సాయంత్రానికి ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లేలా కాదు. ఇంట్లోని మగవాళ్లను బయటకు పంపేసి రెండు మూడు రోజుల పాటు పూర్తిగా మేమంతా కలిసి ఉండేలా వండుకుని తినడం, సరదాగా ఎటైనా బైటకెళ్లడం వంటివి చేసేవాళ్లం. దీనికి భర్తాపిల్లలు కూడా సహకరించేవారు. అలా కలిసినప్పుడే ఇండియాలో ఉన్న వాళ్ల ప్రస్తావన వచ్చేది. వాళ్లేం చేస్తున్నారో, ఎలా ఉన్నారోనన్న బెంగ మాలో కలిగేది. నెమ్మదిగా ఇక్కడున్న కొందరి ఫోన్ నెంబర్లు కూడా సంపాదించాం. ఇక్కడివారు అక్కడికొచ్చినా, అక్కడివారు ఇక్కడికొచ్చినా మిగిలిన అందరినీ కలిసి వెళ్లడం నియమంగా పెట్టుకున్నాం. మేం అక్కడ కలిసినప్పటి కబుర్లు, ఫోటోలు అందరితో పంచుకునేవాళ్లం. మా స్ఫూర్తితో ఇండియాలో ఉన్న మిత్రులు కూడా ఏడాదిలో ఒకటి రెండు సార్లు కలవడం మొదలుపెట్టారు.
అంతరాల్లేని ఆప్యాయత
‘వాళ్లు మనకన్నా బాగా చదువుకున్నారు. అమెరికాలో ఉంటున్నారు. ఆర్థికంగా బాగున్నారు. వాళ్లు మనతో ఎలా ఉంటారో ఏమిటో’ అని సంకోచించారు ఇక్కడున్న మా స్నేహబృందంలోని ఇద్దరుముగ్గురు. ఒకసారి కలుసుకున్నాక అవన్నీ అకారణ భ యాలే అని అర్థమయ్యాయి వారికి. బడి పిల్లలుగా ఏ భేదాలూ లేకుండా ఒక్కటిగా మెలిగినవాళ్లమే కదా. పెద్దయ్యాక ఎవరి సంసారాలు వాళ్లవి. చదువులు వేర్వేరు అయినట్టే అంతస్తుల్లో అంతరాలు బోలెడు. ఎవరికుండే కష్టసుఖాలు వారికున్నాయి. అందరం కలిసినప్పుడు వీటన్నిటినీ మర్చిపోతాం. మనసు విప్పి మాట్లాడుకుంటాం. ఆటాపాటాతో సరదాగా గడిపే మాట నిజమే. కాని కేవలం వాటికే పరిమితమైపోతే పెద్ద వయసులో స్నేహితులంతా కలిసిన ప్రయోజనం ఏముంటుంది? అదీ ఆలోచించాం.
అందుకే మేమంతా ఒకరికొకరు అండగా ఉండాలన్న ప్రయత్నం చేస్తుంటాం. యోగక్షేమాలు కనుక్కొని సమస్యలకు పరిష్కారాలు అందిస్తాం. అందరమూ అరవ య్యో పడిలోకి వచ్చినవాళ్లమే గనక ఆరోగ్యాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఒకరికొకరు చెప్పుకుంటాం. ‘మనమంతా ఏడాదికోసారి ఇలా కలుస్తుంటే ఒంట్లోకి కొత్త బలం వచ్చినట్టుందే. నాకు ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి ఇంతమంది బ్రహ్మాండమైన స్నేహితులున్నారన్న భావన ఎంత ధైర్యాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.
అరవై కాదు, డె బ్భై వచ్చినా నాకే జబ్బూ రాదు ఇకపై….’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది మా స్నేహితురాలు ఒకామె. మాలో విజయ పాటలు స్వయంగా రాసి పాడుతుంది. ఆమె వేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ ఆ్రర్దంగా పాడిన పాటలు విని మా అందరికీ కళ్లు చెమర్చాయి. ఇలాంటి ఎన్నో ఆనందానుభూతులను మూటగట్టుకుని అమెరికా వెళ్తున్నాను. మళ్లీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న ఆరాటం మా అందరిలోనూ ఉంది.” అని చెప్పారు ఈ స్నేహితులు… సులోచన, విజయ, జయశ్రీ, గీత, శివకుమారి, జయ, రామశేషు, గిరిజ, సులోచన, స్వర్ణ సుందరి, సీత, భారతి.

