‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’
తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర పై కూడా హాస్యాన్ని చిందించి తనదైన ముద్ర ను వేశాడు రేలంగి నరసింహా రావు .దాసరికి శిష్యుడైనా ఆ పైత్య ప్రకోపానికి లోను కాని డైరెక్టర్ నరసింహా రావు .నరసింహుడి లో నరత్వం, సింహత్వం ఎలా విడ దీయరాకుండా ఉంటాయో అలాగే ఈ రేలంగి లో కూడా హాస్యం ,సెంటి మెంటు కలిసి హృదయానికి చక్కిలి గింతలు పెట్టటమే కాదు ,మానవీయ విలువలను కూడా ‘’అండర్ కరెంటు ‘’గా ఆవిష్కరించి’’ హేపీ ముగింపుతో ‘’సరస సంభాషణల తోఅందర్నీ పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వించిన ఘనత రేలంగిది .ఇందుకోసం హాస్యం లో పండిన దిగ్దంతులైన రచయితలను వెండి తెరకు పరి చయం చేసి హాస్యపు పంటలు పండింప జేశారు .మూస తరహా గా సినిమాలు తీయ కుండా వైవిధ్యాన్ని చూపాడు .
కొత్త రచయితలైన దివాకర్ బాబు ,శంకర మంచి పార్ధ సారధులను పరిచయం చేసి వారి సమర్ధత ను అతిగోప్పగా ఉపయోగించి హాస్యాన్ని చిలికింప జేశాడు స్వతహాగా నరసింహా రావు మంచి హాస్య రచయిత కూడా .అయన సుమన్ ,రేవతి కిన్నెరఅనే నటులను సినీ రంగానికి పరిచయం చేసి వారి ప్రతిభకు పట్టం కట్టించాడు .
రేలంగి నరసింహా రావు దర్శ కత్వం వహించిన హాస్య రస చిత్రాలలో ‘’ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ,ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ,పోలీస్ భార్య ,చిన్నోడు పెద్దోడు డబ్బెవరికి చేదు? కొంటె కాపురం ,గుండమ్మ గారి కృష్ణుడు ,సంసారం , మామ అల్లుడు’’ అందరు మెచ్చిన చిత్రాలే .నటుడు చంద్ర మోహన్ ను రాజేంద్ర ప్రసాద్ ను హీరో లు గా పెట్టి అద్భుత సినిమాలు తీశాడు .వీరిద్దరూ రేలంగి దర్శకత్వం లో ఆరోగ్య కరమైన హాస్యాన్ని పండించారు వండిం చారు వడ్డించారు తృప్తిగా తిని పించారు .
రేలంగి తమిళం లో ఒక చిత్రానికి కన్నడం లో కొన్ని సినిమాలకు డైరెక్షన్ చేశాడు .’’సుందరీ సుబ్బారావు ‘’అనే .ఫిలిం కు నంది
అవార్డు పొందాడు .1951లో సెప్టెంబర్ ముప్ఫై న జన్మించిన నరసింహా రావు ప్రస్తుతం సినీ ప్రస్తానం లో ‘’కామా ‘’లో ఉన్నాడు కాని ‘’ఫుల్ స్టాప్ ‘’పెట్టలేదు .
నరసింహా రావు మొట్టట మొదటి సారిగా 1971లో బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘’మహమ్మద్ బీన్ తుఘ్లక్ ‘’తెలుగు సినిమాకి అసిస్టంట్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు .తర్వాత మరుసటి ఏడాది కే.ఎస్.ఆర్ దాస్ డైరెక్ట్ చేసిన ‘’ఊరికి ఉపకారి ‘’కి పని చేశాడు .’’సంసారం సాగరం ‘’సినిమాకి దాసరి దగ్గర పని చేశాడు .1980వరకు దాసరి శిష్యరికం లోనే అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేశాడు .ఆ తర్వాతే స్వంతం గా దర్శకత్వం వహించాడు .
‘’ చందమామ’’ అనే హాస్య సినిమాకు 1980లో దర్శకత్వం చేబట్టాడు దురదృష్ట వశాత్తు ఆ సినిమా 1982వరకు విడుదల కాలేదు .. ‘’నేను మా ఆవిడా ‘’,ఏమండోయ్ శ్రీ వారూ ‘’ఇల్లంతా సందడి ‘’,సినిమాలను డైరెక్ట్ చేశాడు .చంద్ర మోహన్ రేలంగికి దొరికిన అపూర్వ వరం .చంద్ర మోహన్ తో రేలంగి 18సినిమాలను డైరెక్టర్ చేశాడు. తక్కువ బడ్జెట్ లో అందరికి నచ్చిన సినిమాలను తీశాడు అందరికి సంతృప్తి కలిగించాడు .
అక్కినేని తో ‘’దాగుడు మూతల దాంపత్యం ‘’,శోభన్ బాబు తో ‘’సంసారం ‘’కృష్ణం రాజు తో ‘’యమ ధర్మ రాజు ‘’తీశాడు .
1991లో నరసింహా రావు తీసిన ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీసు ,ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ‘’సినిమాలు హాస్య చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించి రేలంగి దర్శకత్వానికి గీటు రాయి గా నిలిచాయి .దీంతో ఆయన కన్నడ రంగానికి దారి ఏర్పడింది .ఈ రెండిటిని శశికుమార్ తో కన్నడం లో తీసి హిట్లు కొట్టాడు .కన్నడ రాజ కుమార్ కుమారుడి తో తీసిన సినిమాలూ బాగా ఆడాయి . నవ్వుల పూలు పూయించాయి .మొత్తం ఏడు కన్నడ హాస్యాలు తీశాడు .ఇంటికంటే గుడి పదిలం అని పించుకొన్నాడు .తమిళ హాస్య నటుడు నగేష్ కొడుకు ఆనంద బాబు తో ఒక తమిళ సినిమా తీసి గట్టెక్కించాడు .
రేలంగి నరసింహా రావు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో 32 హాస్య చిత్రాలు తీశాడు .దాదాపు అన్నీ హిట్లు సూపర్ హిట్లే .హాస్య రచయిత ఆది విష్ణుతో సంయుక్తం గా సుందరి సుబ్బారావు కు బెస్ట్ స్క్రీన్ ప్లె కు నంది బహుమతి నందుకొన్నాడు . ఈ సినిమాలో చంద్ర మోహన్ వైజయంతి నటించగా ప్రొడ్యూసర్ రామోజీ రావు ఉషా కిరణ్ బానర్ పై నిర్మించాడు
డిల్లీ తెలుగు అకాడెమి వారు ‘’బెస్ట్ లో బడ్జెట్ డైరెక్టర్ ‘’అవార్డ్ నిచ్చి 1991లో సత్కరించారు .2007లో ‘’పదిహేనవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్స వానికి ఏషియన్ పనోరమా జూరీ మెంబర్ ‘’గా గౌరవం పొందాడు .2005-6నందీ అవార్డుల కమిటీలో జూరీ చైర్మన్ గా వ్యవహరించాడు మన రేలంగి . ‘’ బుజ్జి బుజ్జి బాబు ‘’అనే టి.వి ఫిలిం ను ఈ.టివి.కి తీశాడు .సాయి లక్ష్మిని పరిణయ మాడిఇద్దరు మగపిల్లలు కిరణ్, సతీష్ లకు తండ్రి అయ్యాడు రేలంగి నరసింహా రావు .
రేలంగి తీసిన డెబ్భై సినిమాలలో అన్నీ హాస్య గుళికలే .నాకు మాత్రం ‘’కొంటె కాపురం ‘’సినిమా పిచ్చ పిచ్చగా నచ్చింది .అందులో నూతన్ ప్రసాద్ ,వై విజయ దంపతుల మధ్య హాస్యం భలే రుచికరం గా ఉంది. చంద్రమోహన్ కూడా ఉన్నాడు నిర్మలమ్మ కూడా బాగా కద ను నడిపించింది. ఇందులో హాస్యమే కాదు పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతను కూడా నొప్పించకుండా తీశాడు నరసింహా రావు .నేను ఈ సినిమాను కనీసం పాతిక సార్లు చూసి ఉంటాను .ఇవాళ టివి.లో ఉదయం ‘’ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ‘’సినిమా చూసి ఆ ఆనందంతో రాసిన విషయాలివి .
అయితే రేలంగి నరసింహా రావు కు రావలసినంత పేరు ,ప్రచారం రాలేదు .అందుకే బాధ పడుతూ ఈ వ్యాసం రాస్తూ అతని ప్రతిభ ను మరో సారి గుర్తుకు తెచ్చి నా బాధ్యతా నేర వేర్చానని సంతృప్తి గా ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13-ఉయ్యూరు

