రాగం.. తానం.. పల్లవి… రమ

 

సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తునుంచి పొందిన విదుషీమణి ఆమె. ఈ పరిశోధన గ్రంథం ముద్రణకూ నోచుకున్నది.
డా రమగారిది సంగీత కళాకారుల వంశం. వీరి వంశంలో కవులూ, జ్యోతిష శాస్తజ్ఞ్రులూ అనేకులున్నారు. వీరి తల్లిగారయిన పద్మావతిగారు వైణిక. సంగీతం ప్రాథమికంగా వీరు తమ తండ్రిగారయిన శ్రీ పంతుల గోపాలరావుగారి వద్ద అభ్యసించింది. గోపాలరావుగారు ‘సంగీత సాగర’ బిరుదాంకితులయిన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావుగారికి ముఖ్య శిష్యులు. (విజయేశ్వరరావుగారిపై ఈ గ్రంథంలో ఒక అధ్యాయం వుంది). వీరి భర్తగారు శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారు. వారూ వాయులీన విద్వాంసులు.
గాత్ర సంగీతంలో రమగారిని ఆకాశవాణి ‘ఎ-టాప్ గ్రేడ్’ ఇచ్చి వీరి ప్రతిభను గుర్తించింది. గాత్రంతోపాటుగా వీరు వయొలిన్, వయోలా వాద్యాలలో ‘బి-హై’గ్రేడ్‌ని తమ ప్రతిభతో సాధించుకొన్నారు.
తమ 8వ ఏటనే కచ్చేరీ చేసిన ఈమె 1906లో మద్రాస్ సంగీత ఎకాడెమీ నుంచి ‘అవుట్‌స్టాండింగ్ లేడీ వోకలిస్టు’గా అవార్డునీ, 2008లో ఇదే అకాడెమీ నుంచి అత్యుత్తమ పల్లవి అవార్డునీ పొందగల్గింది. అట్లాగే అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఆరాధన సమితి నుంచి 2010లో రాగం తానం పల్లవికి అవార్డుని పొందింది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి 1992-94లకు సీనియర్ స్కాలర్‌షిప్‌నీ, అత్యుత్తమ సంగీతజ్ఞురాలిగా 96-97లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచీ అవార్డునీ పొందింది. పల్లవి పాడడంలో ప్రథమ బహుమతిని 1993లోనే మద్రాసు సంగీత అకాడెమీ నుంచి పొందింది.
ఇట్లా అనేక బహుమతులనూ, స్వర్ణపతకాలనూ పొందిన డా.రమగారు ఇవేళ అగ్రశ్రేణి గాయకురాలిగా స్థిరపడింది. రాగం తానం పల్లవి విద్యలోనూ, స్వరకల్పనలోనూ తన మధుర కంఠస్వరంతో సభను రక్తి కట్టించడంలో వీరు సిద్ధహస్తులు. మద్రాస్ సంగీత ఎకాడమీ నుంచి కూడా వీరి రాగం తానం పల్లవి విద్యకు గుర్తింపు అవార్డు రూపంలో రావడం తెలుగువారందరికీ గర్వకారణం.
కళాకారులలో చాలామందికి లభించని ఒక అదృష్టం వీరికి ప్రత్యేకంగా ఉంది. అది వీరి భర్తగారు అయిన శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారుకూడా, వీరితో సమానమయిన ప్రజ్ఞా పాటవాలు కల్గిన వయొలిన్ వాద్యకారుడు కావడం. ఇట్లా సంగీత క్షేత్రంలో దంపతులిద్దరూ అగ్రశ్రేణి కళాకారులు కావడమన్నది మన రాష్రంలో ఎంతో అరుదయిన విషయం. ఈ అదృష్టం ఈ దంపతులకు దక్కింది. నిరంతర సంగీత సాధనకు, కచ్చేరీలకూ వీలు కల్గించాడు భగవంతుడు. ఇద్దరూ కలిసీ విడిగానూ దేశదేశాలు తిరిగి తమ సంగీత విద్యను ప్రదర్శించారు. సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా వంటి అనేక దేశాలలో డారమ కచ్చేరీలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక సంగీత సభలలో వీరు కచ్చేరీలు చేసి ఖ్యాతి గడించారు. ముంబాయి, ఢిల్లీలలోని షణ్ముఖానంద సభ, మద్రాస్ సంగీత అకాడమీ, నారద గానసభ, శార్వాణి సంగీత సభ, నాదోపాసన, హంసధ్వని, ఉ, కృష్ణగానసభ, టి.టి.డి, సరస్వతీ వాగ్గేయకార ట్రస్ట్, కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, కాపాలి ఫైన్ ఆర్ట్స్, నాద ఇంబమ్ (చెన్నై), త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ (తిరుపతి), కళాంగన్ (్ఢల్లీ) సంగీత విద్వద్పరిషత్ (బెంగుళూరు) వంటి అనేక సంగీత సభలలో వీరు అగ్రశ్రేణి గాయనిగా పాల్గొన్నారు. వర్షాలు కురవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహించిన ‘వర్షిణి’ అన్న కార్యక్రమంలో పాడారు.
వీరు గాయత్రీ సంగీత విద్వన్మణి, నాదవల్లభ, ఇశై పెరోలి బిరుద ప్రదానాల చేత సత్కరింపబడ్డారు. మైసూరు దత్తపీఠం మహాపురుషులైన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి చేత ఆశీర్వదింపబడ్డారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వామి అవతరణ చాలించాక వారి సన్నిధిలో వీరు సుమధుర గాన కచ్చేరి చేశారు. ఆకాశవాణి వైజాగ్ స్థానిక ఆకాశవాణిలో ఆడిషన్ కమిటీలో వీరొకరు. ICCR (Indian Council for Cultural Relation)లో వీరు కళాకారిణిగా తీసికొనబడ్డారు.
శ్యామశాస్త్రుల సంగీత ఔన్నత్యాన్ని గురించి వీరు సోదాహరణ ప్రసంగాలనేకం చేశారు. ‘కర్ణాట సంగీత సాధన’ మీదా, రాగం తానం పల్లవి మొదలైన విద్యాంశాలమీద వీరనేక సోదాహరణ పూర్వక ఉపన్యాసాలిచ్చారు. దక్షిణాది సంగీతంపై 2000ల సం.లో జరిగిన జాతీయ గోష్ఠికి ‘విశేష ప్రయోగాలపై గాఢ అధ్యయన’ అన్న అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ‘నవరసమాలిక’ అన్న శీర్షికతో త్యాగరాజస్వామివారి రచనలలో నవరసాలను ఎత్తిచూపారు. ఇట్లాగే త్యాగబ్రహ్మముల ‘నౌకాచరితా’న్ని సంగీత రూపకంగా నిర్వహించారు. వీరిట్లా మంచి ఎకడమిషియన్‌గా సృజనాత్మక కళాకారిణిగా ఏకవేళలో రాణిస్తున్న కళాకారిణి. సంగీత క్షేత్రంపై వీరి అభిప్రాయాలను గమనించాల్సి ఉన్నది.
సంగీత కళాశాలలు తమ వంతు కృషి తాము చేస్తున్నవనీ, ఐతే సమయం నిర్దేశం, సిలబస్సూ ఉండడంవల్ల మంచి ప్రదర్శన కళాకారులు తయారవడం కష్టమవుతున్నదంటారు వీరు. బోధనా పద్ధతులలో కూడా మరింత మార్పు కోరుతున్నారు వీరు. భర్తగారుకూడా అగ్రశ్రేణి కళాకారుడు కావడం చేత ఇద్దరూ ఒకరికొకరు అన్నివిధాలా సహకరించుకుంటామనీ, అట్లాంటి అవకాశం తమకు లభించడం గొప్ప వరమనీ వీరన్నారు.
చివరగా ఒక విశేష విషయం…!
ఒకమారు వయొలిన్ విద్వాంసుడైన వీరి భర్త శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారు నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మ్యూజిక్‌లో గాత్ర కచ్చేరి చేయగా డా రమగారు వారికి వయొలిన్ సహకారం అందించారు! ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? ఎనె్నన్నో సి.డిలు, రికార్డ్‌లూ, టి.విలోనూ, రేడియోలోనూ కచ్చేరీలు చేసిన వీరికి ఇట్లా పాత్రలు అటు ఇటూ మారిపోయి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించగల్గడం నిజంగా గొప్ప వరమూ, భగవదనుగ్రహ సూచన కూడాను. ఈ తరంలోని ఇలాంటి విద్వత్కళాకారులు ఎందరెందరికో ఆదర్శంగా నిలవగల్గుతారు. మన సంగీత కళకూ, విద్యకూ వారి ప్రజ్ఞావైభవం గొప్ప అలంకారమూ, ప్రాణమూ కూడా!

 

 

నృత్యోత్సవం.. సమ్మోహనం

 

అంతర్జాతీయస్థాయి నృత్యోత్సవం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు కనుల విందుగా సాగింది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ పురస్కార గ్రహీత, నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి సారథి బత్తిన విక్రమ్‌గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. తొలిరోజు నాలుగు నృత్యరీతులు నృత్య ప్రియులను ఆకట్టుకున్నాయి.
ముందుగా బ్రహ్మాంజలి గ్రూప్ కూచిపూడి నృత్యానికి లాలిత్ కుమార్ గుప్తా, గురురాజ్, డాక్టర్ ఎం.మదన్‌మోహన్, వివిఎస్ జగన్నాథరావు, పిఎ సాయికుమార్ తమ నాట్య ప్రతిభతో అంశాన్ని రక్తి కట్టించారు. తర్వాత మణిపురి నృత్యరీతిలో దశావతారాల్ని వౌసం నంది హావ, భావ, పద భంగిమలతో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. వరుసగా ఒడిస్సీ నాట్యాన్ని రస్మిరంజిన్ బారిక్, కూచిపూడి అంశాన్ని వివిఎస్ జగన్నాథరావు, గురురాజ్ మదన్‌మోహన్ వ్యక్తిగతంగా ప్రదర్శించి, తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
కృతులలోని భావాన్ని అభినయం ద్వారా వీక్షకులకు అందించడమే రసోత్పత్తి, అది పురుషులకి ఎంతో సులభమని ప్రారంభోత్సవంలో పాల్గొన్న నృత్య విశే్లషకుడు విఎకె రంగారావు అన్నారు. అనంతరం డాక్టర్ విఎస్ కళాదీక్షితులు దంపతులను నిర్వాహకులు కళాసేవా పురస్కారంతో సత్కరించారు.
నాట్య కళాకారులు తమ ప్రతిభతో వీక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు. జాతీయస్థాయిలో రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో సాగిన పురుషుల శాస్ర్తియ నృత్య యజ్ఞంలో ముందుగా నగరానికి చెందిన డాక్టర్ లాలిత్ కుమార్ గుప్త కూచిపూడి నృత్య గురు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్యపరికల్పనలో అలవోకగా ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
భావకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అసంపూర్ణ రచనకు బాలాంత్రపు రజనీకాంతరావు కొనసాగింపుగా కొలువైతివా రంగసారుూ… అనే ఈ కీర్తన సాగడం విశేషం. తర్వాత విప్రనారాయణ చిత్రం నుంచి దేవ దేవి… అనే రంగనాథ పూజ అంశం కూడా నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమానికే శిఖరాయమానం అనదగ్గ ఒడిస్సీ నృత్య ప్రదర్శన భువనేశ్వర్ వాసి బికాస్ నాయక్ అందించి అందరి హృదయాలను దోచుకున్నారు. గురు బి.చిత్రానంద స్వయన కొరియోగ్రఫీలో జోషా బరారే… పల్లివిలో ఆరంభమైన అవినయ తొలి అంశంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనందభైరవి రాగంలో సాగిన ఈ నృత్తాంశం సుమారు అర్ధగంట పాటు ప్రేక్షకుల ఊపిరిని స్తంభింపజేసిందని చెప్పొచ్చు.
ఆంధ్రనాట్యాన్ని సంజయ్ వాడపల్లి(హైదరాబాద్) త్రిపురాసుర సంహారంతో ఆరంభించింది. ఈ క్రతువులో విష్ణువు బాణంగా, ధరణి రథంగా, మంధరగిరి చాపంగా మారిన వైనాన్ని వివరించారు. మునిపల్లె సుబ్రహ్మణ్యం రచించిన పరశురామ గర్వభంగం అంశంలో సంజయ్ పద భంగిమలు అద్భుతంగా నిలిచాయి.
తర్వాత నాట్యాచార్య వివిఎస్ జగన్నాథరావు(జగన్) కూచిపూడి నృత్యశైలిలో శివస్తుతి అంశం నాటరాజుకు అంజలి ఘటించడంతో ప్రారంభమైంది. ద్వితీయ అంశంగా సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన నారాయణీయం బాలకృష్ణుని లీలల్ని కళ్ళకు కట్టింది. పేరిణి శివతాండవంతో సి.పవన్‌కుమార్ ఆకట్టుకున్నారు. పల్లవ జతులు, సమీకరణ, సమయతి విన్యాసాలు నృత్యకేళిలో వరదలెత్తాయి. చివరి అంశంగా భరత నాట్యాన్ని పవిత్ర కృష్ణ్భట్(ముంబాయి) శ్రీ కృష్ణ కమలనాథో… పల్లవితో ప్రారంభించారు. మా రమణ… ఉమా రమణ కీర్తన శివ కేశవ బేధాల్ని తెలియజెప్పింది.
ఈ కార్యక్రమం సందర్భంగా సంగీత శాస్తజ్ఞ్రలు, సాహితీమూర్తి బాలాంత్రపు రజనీకాంతరావుకు ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమారుడు శరత్‌కు నిర్వాహకులు అందించారు.

ఫోటో… ఒడిస్సీ నృత్యాభినయాన్ని చేస్తున్న బికాస్ నాయక్

 

వైష్ణవి గానం.. మృదుమధుర్తం

 

ఏడనున్నావయ్యా ఏడుకొండలయ్య.. అనే జానపద గేయాన్ని వినసొంపైన జానపద సంప్రదాయ బాణీలో ఆలపించి బహుభాషా గాయకుడు, గానగంధర్వ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అభిమానాన్ని చూరగొన్నారు కోయిల లాంటి కంఠస్వరాన్ని జన్మతహాః సొంతం చేసుకున్న యువ గాయనీమణి ఎన్ వైష్ణవి. గుంటూరు నగరానికి చెందిన నరహరశెట్టి వైష్ణవి నేడు మన రాష్ట్రంలో మధురంగా, సులలితంగా వాగ్గేయకారుల కృతి సాహిత్యాన్నైనా, సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమయ్య కీర్తనలైనా, శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని పొందిన మహా భక్తురాలు మీరాబాయి భజనలైనా, జయ పతాకములెత్తరా దిగ్విజయ శంఖాన్ని పూరించరా అంటూ దేశభక్తి గీతాలను కూడా ఆలపించడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ఎన్ త్రిపుర సుందరరావు, మీనాదేవిల ముద్దుబిడ్డైన వైష్ణవి తొలుత విద్వాంసురాలు కె సుశీల వద్ద ప్రాథమిక శిక్షణ పొంది అనంతరం మున్నంగి అన్నపూర్ణ, పెరవలి నందకుమార్ వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను కొనసాగించారు. బిఎస్‌సి (ఐటి)లో ప్రతిభావంతంగా పట్టాను పుచ్చుకుని, ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
రాష్టవ్య్రాప్తంగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు, కళావేదికలు, వివిధ విద్యాసంస్థలు నిర్వహించిన కళోత్సవాల్లో తన గాన మాధుర్యాన్ని ప్రవహింపజేసి లెక్కకు మిక్కిలిగా అవార్డులు, అదే స్థాయిలో ప్రశంసలు పొందారు వైష్ణవి. తన గురువైన మున్నంగి అన్నపూర్ణతో కలిసి పలువురు విద్వాంసుల సమక్షంలో కృష్ణలీలా తరంగాల సృష్టికర్త సద్గురు శ్రీ నారాయణతీర్థ యతీంద్రుల తరంగాలను తమిళనాడులోని తిరుపొందుర్తిలో వేలాది మంది సంగీతాభిమానుల ఎదుట గానం చేసి శెహభాష్ అనిపించుకున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని ప్రఖ్యాత టెలివిజన్ చానల్స్‌లో వివిధ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో బహుమతులను అందుకున్నారు.అనేక టివీ చానల్స్‌లో తన కోకిల గానాన్ని వినిపించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా పద్మవిభూషణ్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ పర్యవేక్షణలో ఎస్‌వి భక్తిచానల్ ప్రసారం చేసిన ‘సునాద వినోదిని’ కార్యక్రమంలో వెంకటేశ్వరస్వామిపై పలు కీర్తనలను గానం చేసి ప్రశంసలందుకున్నారు.
మాయామాళవగౌళ, కళావతి, సురటి, అభేరి, అమృతవాహిని, శివరంజని, షణ్ముఖప్రియ, శుభ పంతువరాళి, భూపాలం, రాజాజీరాగమాలిక, బిళహరి రాగాల్లో అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, జయదేవ్, ఊత్తుకాడి వెంకట సుబ్బయ్య, నారాయణతీర్థుల సాహిత్యాన్ని మృదుమధురంగా ఆలపించే అసమాన ప్రతిభామూర్తి వైష్ణవి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కచ్చేరీలు నిర్వహించిన వైష్ణవి, మీరాబాయి కృష్ణయ్యను కీర్తించిన ఆయే గిరిధర్‌ద్వారే అనే భజన సంకీర్తనలను ఆలపించి హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో కొత్త ఒరవడిని సృష్టింపజేశారు.
నేటి యువ గాయనీమణుల్లో మొదటి శ్రేణికి చెందిన కళాకారిణిగా అనేక మంది ప్రముఖ గాయకుల అభినందనలు అందుకున్న వైష్ణవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా ‘కళ’తో వైష్ణవి మాట్లాడుతూ నుడికారం మీద సాధికారత కలిగి, భావాన్ని అర్థం చేసుకుని అనుకరణకు అవకాశం ఇవ్వకుండా ఆర్ద్రతతో కీర్తనలు గానం చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుందన్నారు. ఆ విశ్వాసంతోనే తాను కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆమె వివరించారు.

పోటో… ఎస్.పి. శైల అభినందనల అందుకుంటున్న వైష్ణవి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.