
కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.
“బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి భాగమేమో హిమగిరి దుహితా-అంటే హిమవంతుడి కుమార్తె పార్వతి. ఆమె కూడా చల్లని తల్లే. వీటిన్నింటికీ తోడు తెల్లవారు ఝామున అభిషేకం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఈ జగమంతా సుభిక్షంగా ఉండటానికి. ఈ బ్రహ్మండమంతా అండాకారంలో ఉంటుంది. శివుడి తలపై చంద్రబింబం ఉంటుంది. అందుకే చంద్రబింబాకారంలో ఉన్న పాత్ర నుంచి ఎప్పుడూ అమృతధార పడుతూ ఉండాలి. ఆ నీళ్లు పడుతున్న సమయంలో శివలింగాన్ని ముట్టుకుంటే- అది చల్లగా ఉండాలి. అప్పుడు ఈ లోకమంతా చల్లగా ఉంటుంది. దీనికోక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. మనసు కోరికల తాపం వల్ల వేడెక్కుతుంది. దీనిని చల్లబరిచే ప్రయత్నం చేయగలిగిన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే ఎటువంటి బాధలు, కోరికలు ఉన్నా అభిషేకం చేయమని చెబుతారు. ఈ అభిషేకం చేసే పంచామృతాలకు కూడా విశిష్టత ఉంది. ఈ పంచామృతాలు- మన అంతర్మాతను శుద్ధి చేస్తాయి. వీటిలో ఒకో దానికో ఒకో విశిష్టత ఉంది.
పంచామృతాలలో మొదటగా ఆవుపాల గురించి తెలుసుకుందాం. ఆవుపాలు సమీకృత ఆహారం. అన్ని వయస్సుల వారు వీటిని తాగుతారు. వేదాంతంలో జ్ఞానాన్ని పాలతో పోలుస్తారు. మానవులకు జ్ఞానం- ఆవుపాల అభిషేకం వల్ల సిద్ధిస్తుంది. ఈ పాలతో అభిషేకం చేస్తూ- ” ఈశ్వరా! ఈ ఆవుపాల అభిషేకము చేస్తున్నాను.. నాకు జ్ఞానం ప్రసాదించు తండ్రి..” అని భక్తుడు కోరుకుంటాడు. రెండోది తేనె. తేనె ఆపాతమధురం. తియ్యగా వుండే తేనె ఎటువంటిదో విషయములయందు వుండే అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అలాగే విషయాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు. తేనెతో అభిషేకం చేస్తూ- “ఈశ్వరా! నాకు ఈ విషయములయందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అదీ వైరాగ్యసుఖం! దానిని నాకు ప్రసాదించు..” అని భక్తుడు ప్రార్థిస్తాడు. మూడోది పంచదార. ఇది గరుగ్గా ఉంటుంది. కానీ తీయగా ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చాలా గొప్పవాడినని అహంతో విర్రవీగుతూ ఉంటాడు. కాని అది ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉం టుంది. అందుకే పంచదారతో అభిషేకం చేస్తూ- “నాకు అవినయాన్ని తీసేసి, నాకు వినయాన్ని కృప చేయి” అని భక్తుడు శివుడిని ప్రార్థిసా ్తడు. ఆ తర్వాత ఆవునేతితో అభిషేకం చేస్తారు. ఆవునేయికి పాపాలను దహించే శక్తి ఉంది. అందుకే “నా పూర్వజన్మములోను, ఈ జన్మములోను తెలియక చేసిన పాపాలేవైనా ఉంటే వాటిని నీ కృప చేత కాల్చే యి..” అని ప్రార్థిస్తూ ఆవునేతితో అభిషేకం చేస్తారు. కార్తికమాసం ఉపాసనకాలం కాబట్టి పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఫలితం లభిస్తుంది.
బిల్వార్చన రహస్యం!
ఈశ్వరుడికి పూజచేసే మారేడు దళాలకు కూడా చాలా విశిష్టత ఉంది. మారేడుదళాన్ని చూడకుండా వేసినప్పుడు- ఆ ఆకు వెనకున్న ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు. మారేడుదళం బోర్లాపడితే జ్ఞానకటాక్షం లభిస్తుందంటారు. అంటే ఆకు ఎటువైపు తగిలినా కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతే కాదు.. లక్షల ఆకులతో ఈశ్వరుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు. ‘ఏకబిల్వం శివార్పణం..’ అనుకొని ఒక్క మారేడుదళాన్ని సమర్పిస్తే చాలు! ఒక సారి భగవాన్ రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వెళ్లి- “సహస్ర బిల్వార్చన చేద్దామనుకుంటున్నాను. ఓ వంద బిల్వాలు తక్కువైనాయి. ఏం చేయమంటారు?” అని అడిగిందట. ఆయన వెంటనే ‘నీ ఒళ్లు గీరుకో..’ అన్నారట. ఈ మాటలకు ఆవిడ ఆవాక్కయింది. అప్పు డు మహర్షి- “పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు పీక్కొచ్చేయటమేగా ? వంద తక్కువయిందని చెట్టు గిల్లుతుంటావు? అంతకన్నా బుద్ధేం నిలబెడుతుంది? వందమాట్లు చెట్టును గిల్లటం బదులుగా నిన్ను నువ్వే గిల్లుకుంటే సరిపోతుంది కదా.. ।” అన్నారట. అంటే పూజ చేసేటప్పుడు దానిపై బుద్ధి నిలపటం ప్రధానం. అంతే తప్ప లెక్కలు కట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
108 ఎందుకు?
పూజలలోను, అష్టోత్తర శతనామావళిలలో తొమ్మిది సంఖ్య కనిపిస్తూ ఉంటుంది. శ్రీమహావిష్ణువుకు 108 తులసిదళాలతో పూజ చేస్తారు. అష్టోత్తర శతనామావళి అని నూట ఎనిమిది నామాలు చదువుతారు. దీనికి కూడా ఒక అర్థముంది. ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రాలలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి నాలుగుపాదాలు ఉంటాయి. దీనికి గుర్తుగా 108 నామాలను చెబుతారు. ఈ 108 నక్షత్ర పాదాలలోను పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసీదళాలు, 108 నామాలతో ఈశ్వరునికి పాదార్చన చేస్తారు.


శ్రీ దుర్గాప్రసాదు గారికి, నమస్కారములు.
అభిషేకం లోని తత్త్వం గొప్పగా వున్నది. అయితే, ” మారేడుదళాన్ని చూడకుండా వేసినప్పుడు- ఆ ఆకు వెనకున్న ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు. మారేడుదళం బోర్లాపడితే జ్ఞానకటాక్షం లభిస్తుందంటారు. అంటే ఆకు ఎటువైపు తగిలినా కటాక్షం తప్పకుండా లభిస్తుంది” – ఇటువంటి మాటల్లో, అనాదిగా, మన జనం పడిపోయి, బయటకురాక, భగవంతుడి ముందు,అంటే, అభిషేకం లేదా పూజలు చేసేటప్పుడు తమ అంతులేని కోరికల చిట్టాను విప్పుతూనే వుంటూ, మనస్సును అంతర్లీనం చేయటం మరిచిపోయి, చివరకు వయసుడిగి పోతున్నారు. అందుకేనేమో, శ్రీ శంకరాచార్యులవారు ‘భజగోవిందం, భజగోవిందం… ….’ అంటూ తత్త్వబోధ చేశారు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
LikeLike