
సాధారణంగా శివాలయాలలో జరిపే పండగలు వేరు. విష్ణాలయాలలో జరిపే పండగలు వేరు. కానీ కార్తీక మాసంలో మాత్రం ఈ భేదం కనిపించదు. అన్ని ఆలయాలలోను ఒకే రకంగా వేడుకలు జరుగుతాయి. దీని వెనకున్న విశేషాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.
కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే, శివాలయాలలో మారేడు దళాలతో, విష్ణాలయాలలో తులసి దళాలతో పూజలు జరుగుతాయి. ఈ శివ కేశవులకు తేడా ఏమిటి? శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు- పరమశివుడు వామదేవుడు, శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని చెప్పేవారు. ఇద్దరికీ ఒకటే అక్షరం తేడా. ఈయనకి ్‌మ* ఉంది ఆయనకి ్‌సు* ఉంది. ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది. ఈ రెండు అక్షరాలు కలిస్తే- సు+ మ= సుమ అవుతుంది. సుమం అంటే పువ్వు. అంటే ఇద్దరూ ఇచ్చేది పువ్వే. ఇక్కడ పువ్వు అంటే జ్ఞానం. పరమాత్మ ఒక్కడే అనే పరమ తూనికతో ఈశ్వరుణ్ణి చూసి పరవశించిపోగలిగిన హృదయం ఉంటే ఆ ఆనందం లభ్యమవుతుంది. లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవించలేరు.
ఈశ్వరాన్రుగహాన్ని అన్నిచోట్లా ఒక్కలా అనుభవించగలిగిన మనఃస్థితి అంకురించదు. అందుకనే మహాత్ములైనవారు పరమేశ్వరుని స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఆ ఈశ్వర స్వరూపాన్ని ఒకటిగానే చెబుతారు. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన గారు, కృష్ణుడిని చూస్తుంటే శివుడిని చూసినట్లుందని అంటారు. పోతనగారికి చిన్నికృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే, ఆ« ధూళి పరమశివుడు రాసుకున్న విభూతిలా ఉంటుంది. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పువేసి ముత్యాలసరాలు చుడితే, తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నట్టి పరమశివుని కొప్పులా ఉందని వర్ణిస్తారు. యశోద చిన్ని కృష్ణుడికి మెడలో హారం వేస్తే ఆ నీలమణి కాంతిలో తనకు నీలకంఠుడైన పరమశివుడు కనబడుతున్నాడంటారు. పోతన అంత ఆనందాన్ని, అనుభూతిని పొంది భాగవతాన్ని రాశారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన కూడా తన కలలో నాభి కమలంలోకి చూస్తే శ్రీమహావిష్ణువు, తల మీదికి చూస్తే చంద్రవంకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం, ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్కచూస్తే తెల్లటి గంగానది, ఒక పక్క చూస్తే నల్లటి యమునానది. రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి దర్శనమిచ్చారని రాసుకున్నారు. శంకరాచార్యులవారి జీవితంలో మొట్టమొదటి శ్లోకం కనకధార. అప్పుడు సన్యాసం తీసుకోలేదు. ఇంకా పిల్లవాడే. వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవవలసి వస్తే
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
సృష్టిస్థితి ప్రలయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై అన్నారు.
అమ్మా ! గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, శాకంబరీతి శశిశేఖర వల్లభేతి అని ముగ్గురు అమ్మలకు స్తోత్రం చేశారు. ఆ ముగ్గురు మూర్తుల శక్తి స్వరూపాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకం చెప్పిన వెంటనే లక్ష్మీదేవి పలికి కనకధారలు కురిపించింది. ఈ విధంగా ఈ ప్రపంచం శక్తిమయం కాబట్టి కార్తీకంలో శివకేశవుల భేదం లేకుండా ఉత్సవాలు జరుగుతాయి.
గరికెందుకు ముఖ్యం?
మన శాస్త్రాలలో గరికకు చాలా ప్రాముఖ్యం ఉంది. ముఖ్యమైన పూజలలో కూడా దీనిని వాడతారు. గరికను ముట్టుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతాయి. అందుకే గణపతికి గడ్డిపరకలతో పూజ చేస్తారు. సుందరకాండలో సీతమ్మ తల్లి- “తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మితా నివర్తయమనోమత్తః స్వజనే..” అంటుంది. అని గడ్డిపరకను ముట్టుకుంటుంది. సీతమ్మ గడ్డిపరకను ఎందుకు ముట్టుకుంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. భర్త పక్కన లేనప్పుడు కామవాంఛతో తనవంక చూస్తున్న రావణుడికి సీత జవాబు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అంటిన పాపం పోవడానికి సీత గరికను ముట్టుకుంటుంది. అంటే ఆ గరరికకు అంత విశిష్టత ఉందని అర్థం.
పరమేశ్వరుడెవ్వడు?
పరమేశ్వరుడెవరు? నిజంగా విభూతి రాసుకొనే ఉంటాడా?- ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు కొందరికి ఉదయిస్తూ ఉంటారు. వేదంలో పరమేశ్వరుడిని “సర్వభూతాధివాసః” అని నిర్వచిస్తారు. అంటే సర్వభూతాలలోనూ ఉండేవాడు ఈశ్వరుడని అర్థం. “సర్వభూతం తదాత్మా కర్మసాక్షీ కేవలోపతిర్గుణశ్చా” అని చెబతారు. అంటే ఆయన నిర్గుణుడు. అన్ని కర్మలకూ సాక్షి. దీనిని మరొక ఉదాహరణతో కూడా చెప్పవచ్చు. పాలలో వెన్న ఎక్కడ ఉందండీ అని అడిగారనుకుందాం. వెన్న ఎక్కడ ఉందని చెప్పగలం? పాలంతటా వెన్న ఉంటుంది. కానీ పైకి కనబడదు. ఎవరైతే పాలను తోడు పెట్టి, దానిని చిలికి బయటకు తీస్తారో వారికి మాత్రమే లభ్యమవుతుంది. ఈశ్వరుడు కూడా అంతే!
