చిత్ర ‘సాహితి’

 

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాహితి. ఎనిమిదో తరగతి చదువుతోంది. బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే, బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ బోలెడు బహుమతులు గెలుచుకుంటోంది. ‘ఆటలాడేందుకు టైం లేదని అప్పుడప్పుడు బాధ పడినా, నాకొచ్చిన బహుమతుల్ని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది’ అంటున్న ఆ చిన్నారి చెప్పిన కబుర్లే ఇవి…

“హైదరాబాద్, బోయనపల్లిలోని ‘బేగంపేట కేంద్రీయ విద్యాలయం’లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. ‘కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ’ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పెయింటింగ్ కాంపిటిషన్‌లో మొదటి బహుమతి గెలుచుకున్నాను. ‘శక్తి వినియోగం’ (Energy Conservation), ‘నీటి నిల్వలు అడుగంటకముందే కాపాడుకుందాం’ (Care for water before it becomes Rare) అనే రెండు అంశాలపై పెయింటింగ్‌లు వేయాలి. నీటికి సంబంధించిన అంశాన్ని అక్కడికక్కడే చెప్పి రెండు గంటల్లో వేయమన్నారు. మొదట చాలా భయంగా అనిపించినా పెయింటింగ్ బాగానే పూర్తి చేయగలిగాను. శక్తి వినియోగం అనే అంశాన్ని ముందుగానే చెప్పారు. అందుకని ఇంటి దగ్గర ప్రాక్టీసు చేసుకుని వెళ్లాను. కాని దానికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. అక్కడికక్కడ వేసిన అంశానికే మొదటి బహుమతి రావడం ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఈ పోటీలో గెలిచిన వాళ్లను జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. అలా నేను డిసెంబర్ 27న ఢిల్లీలో జరిగే పోటీలకు వెళ్లబోతున్నాను.

మాస్టారు గుర్తించారు
నేను పెయింటింగ్ బాగా వేస్తాననే విషయాన్ని మా డ్రాయింగ్ మాస్టారు బి. శశిభూషణ్ రావు గారు గుర్తించారు. ‘బాగా వేస్తున్నావని’ నన్ను మెచ్చుకోవడమే కాకుండా, అదే విషయాన్ని మా నాన్నతో కూడా చెప్పారు. దాంతో పెయింటింగ్స్ వేసేందుకు ప్రోత్సహించారు నాన్న. 2011లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కాంపిటీషన్ నా మొట్టమొదటి పోటీ. అప్పుడు ‘ఎనీ లేక్ వ్యూయర్ పార్క్’ అనే అంశం మీద పెయింటింగ్ వేశాను. రెండు వందల మంది పాల్గొన్నారు ఆ పోటీలో. అప్పుడు కూడా నాకు కన్సొలేషన్ బహుమతి వచ్చింది. 2012లో యాక్సిస్ బ్యాంక్ ‘నీటి వినియోగం’ అనే అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి అందుకున్నాను.

హిందు పత్రిక, ‘యంగ్ వరల్డ్’ వాళ్లు ‘ఉమ్మడి కుటుంబం’ అనే అంశం మీద ఈ ఏడాది నిర్వహించిన పోటీలో కూడా పాల్గొన్నాను. అలాగే కేరళలో ‘మ్యాజిక్ ఆఫ్ హ్యాండ్స్’ పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నాను. ఈ పోటీ దేశ వ్యాప్తంగా జరిగింది. ఒక్కో స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేస్తే అందులో పోటీకి ఒకరిని తీసుకున్నారు వాళ్లు. ఎంపిక చేసుకున్న వాళ్లందరికీ కలిపి పోటీ పెట్టారు. ఈ పోటీలో 50 మంది పాల్గొంటే మన రాష్ట్రం తరపున నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ బహుమతులే కాకుండా కొన్ని అవార్డులు కూడా వచ్చాయి నాకు. 2011లో రసమయి ఉగాది పురస్కారం, 2013లో ‘నిపుణ ఎక్స్‌లెన్సీ’, ‘ఇన్‌క్రెడిబుల్ గర్ల్ చైల్డ్’, ‘అభినందన’ మొదలైన అవార్డులొచ్చాయి.

ఇంటికి రాగానే ప్రాక్టీస్
పెయింటింగ్ పోటీల్లో పడి చదువుకోవడం లేదనుకుంటారేమో… కాంపిటీషన్లు లేని రోజుల్లో వీకెండ్స్‌లో మాత్రమే పెయింటింగ్ ప్రాక్టీసు చేస్తాను. మిగతా రోజులన్నీ చదువుకే. కాంపిటీషన్ ఉందంటే మాత్రం స్కూల్ నుంచి నాలుగ్గంటలకి ఇంటికి రాగానే ప్రాక్టీసు మొదలుపెట్టి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు వేస్తాను. సీనరీస్, కరెంట్ ఇష్యూస్ పైన పెయింటింగ్‌లు వేయడమంటే చాలా ఇష్టం. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఒక పెయింటింగ్ వేశాను. ఇప్పటివరకు దాదాపుగా పోస్టర్ కలర్స్ 500, పెన్సిల్ స్కెచ్‌లు 250 వరకు వేశాను. ఇంటర్మీడియెట్ చదివాక బిఎఫ్ఎ, తరువాత ఎమ్ఎఫ్ఎ చేయాలనుకుంటున్నాను. ఐఎఎస్ కావాలనేది నా కోరిక. పెయింటింగ్‌ని మాత్రం వదిలిపెట్టేది లేదు. నాకు అవార్డులు, బహుమతులు వస్తున్నాయంటే మా స్కూల్ ప్రిన్సిపాల్ ఇజ్రాయిల్ గారు, అమ్మానాన్నల ప్రోత్సాహమే అందుకు కారణం”
ఫోటోలు: హరిప్రేమ్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.