
కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.
మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం చేస్తాడు. అందుకే ఆ రోజు తులసి చెట్టుకు, ఉసిరిచెట్టుకు పూజలు చేస్తారు. ఈ మాటలు విన్న వెంటనే మీలో కొందరికి మహావిష్ణువు నిద్రపోతే లోకాల్ని ఎవరు పరిపాలిస్తారు? అయినా దేవుడు నిద్రపోవటమేమిటి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. “కృతఘ్నఘ్నాయ దేవాయ బుద్ధిషాం పతయే నమః..”. ఉదయాన్నే ఈశ్వరుడు వచ్చే సమయానికి లేచి స్వాగతం చెప్పాలి. ఎవరైతే లేవరో వారు కృతఘ్నులే. ఈశ్వరుడికి స్వాగతం చెప్పకుండా నిద్రపోతే జీవుడు పరమేశ్వర స్వరూపం కాలేడు. అలాంటిది- దేవుడే నిద్రపోతే? కానీ, మహావిష్ణువు నిద్రపోడు. కేవలం నిద్రపోయినట్లు నటిస్తాడు. అందరినీ భ్రమింపచేస్తాడు. కానీ అనుక్షణం కనిపెట్టుకొనే ఉంటాడు. అయినా వాసుదేవుడు, వామదేవుడు ఒకరేనని ముందే చెప్పుకున్నాం. అందుకే కార్తీక మాసాన్ని వైష్ణవులు కూడా జరుపుకుంటారు. కార్తీక దామోదరుడిని కోలుస్తారు. అసలు కార్తిక దామోదరుడు అంటే ఏవరు? ” ఉదరే దామ యస్యేతి..” అని అమరకోశం చెబుతుంది.
కడుపు మీద తులసిమాల ఉన్నటువంటివాడిని దామోదరుడు అని పిలుస్తారు. అలాంటి వాడు ఎవరు? దీనికి కూడా “దామ్యే ఉదర మాత్రా బద్ధ ఇతి దామోదరః” అని అమరకోశంలో ఒక శ్లోకం ఉంది. ” అమ్మతో, ఒక తాటితో కట్టబడి నడుం ఒరిసిపోయినవాడు దామోదరుడు.” అంటే శ్రీకృష్ణుడు. అయితే ఇదంతా విన్న తర్వాత “అసలు పరమేశ్వరుడికి అమ్మ ఎవరు?” అనే అనుమానం కూడా రావచ్చు. పరమేశ్వరుడు లేనినాడు ఈ లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. అలాంటి వాడికి తల్లేమిటి? ఈ భూమిపైకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి తల్లి ప్రేమ తెలిసి వచ్చింది. ఆయన ఆ ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు. అప్పటి దాకా ఆయనకు అమ్మ తెలియదు. అమ్మ పాలు తెలియదు. యశోద పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ బంధంలో చిక్కుకుపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోతన తన భాగవతంలోని దామోదర లీలలో అత్యద్భుతంగా వర్ణించారు. దామోదర లీల విశేషమేమిటంటే- బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు- ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారు దీనిని వింటారు.
ఈశ్వర రూపం
ఈశ్వరుడి రూపం ఎలా ఉంటుంది? ఇది చాలా మందికి వచ్చే అనుమానం.
ఏకో దేవః సర్వ భూ, సర్వభూతేషు….
సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాసః
సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ, కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః- అని చెబుతారు. “పరమేశ్వరుడికి రూపమే లేదు. నిర్గుణుడు. నిర్జనుడు..” అని దీని అర్థం. అలాంటి వాడు కూడా మానవులకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. అందుకే గీతలో కృష్ణభగవానుడు
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని చెబుతాడు. “నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకునే పరమభాగవతోత్తములైన వారి కోర్కె తీర్చడం కోసం వారి మాంస నేత్రానికి దర్శనమవటానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపం కాదు. నా అసలు స్వరూపం వ్యాపకత్వం. అంతటా నిండి నిబిడీకృతమైపోయాను” అనేది ఈ శ్లోక తాత్పర్యం. దీనిని భాగవతంలో మరింత సరళంగా ప్రహ్లాదుడి నోట-
ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రిసర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవ్రాగణి వింటే.. (భాగ. 7-275) అని పలికిస్తాడు. “నాన్నా, నువ్వు విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటావేంటి? వ్యాపకత్వం వల్ల అంతటా నిండిపోయాడు” అని హిరణ్యకశపుడికి వివరిస్తాడు. మనం ఈశ్వర స్వరూపంలో కూడా శివకేశవుల ఐక్యతను చూడవచ్చు.
సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళమ్.. అని ఒక శ్లోకం ఉంటుంది. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు వున్నాయో అంతవరకు మహావిష్ణుడు పెరిగిపోయి ఉంటాడు. శివుడు ఈ బ్రహ్మండమంతా నిండిపోయి ఉంటాడు. మనకు ఏది ప్రీతిపాత్రమో- ఆ నేత్రం నుంచి ఆ దేవదేవుడిని చూస్తాం.
కానీ ఈ రెండింటికీ ఉన్న భేదం ఏమి లేదు. వస్తువు ఒకటే. దానిని నిర్ధారించేది మార్గశీర్షం. ఉపాసనలో చిట్టచివరకు వెళ్లిపోయిన తర్వాత ద్యోతకాలు కావాల్సినది అదే. అందుకోసమే ఉపాసనా కాలమైన కార్తీకం తర్వాత మార్గ శీర్షం వస్తుంది.
ఉపాసనకు ఉత్తమమైన కాలం కార్తీకం

కార్తీక మాసం ఉపాసనా కాలమని మనకు తెలుసు. పరమేశ్వరుడికి చేరువ కావటానికి అనువైన కాలం ఇది. అలాంటి పరమేశ్వరుడిని ఎలా చేరుకోవాలో చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడ వివరిస్తున్నారు.
ఆషాడం నుంచి కార్తీకం వరకూ ఉన్న కాలాన్ని ఉపాసనా కాలం అంటారు. ఈ సమయంలో భక్తులందరినీ పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. వారి భక్తికి తగినట్లుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తి అపారమైనప్పుడు ఆయన వశమయిపోతాడు. వారు తిట్టినా, కొట్టినా ప్రీతిగా స్వీకరిస్తాడు. ఈ ఉదాహరణ కోసం ఎక్కడి దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. మహా పుణ్యక్షేత్రం తిరుమలలో అనంతాచార్యుల వారు గునపం విసిరితే శ్రీవారి గడ్డానికి తగిలింది. అందుకే ఇప్పటికీ స్వామి వారి గడ్డానికి గంధం పెడతారు. శివార్జునల యుద్ధం కూడా అలాంటిదే. భగవంతుడికి, మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధం తెలియనప్పుడు చేసే పూజ యాంత్రికమవుతుంది. ఇప్పుడు మీలో కొందరు మనకు భగవంతుడిపై ప్రేమ ఎందుకుండాలని అడగవచ్చు. మనలో చాలా మందికి కుటుంబమంటే ప్రేమ ఉంటుంది. మనం ఏ పని చేసినా వారిని కూడా గుర్తు పెట్టుకుంటాం.
వారిని నొప్పించే పనులు చేయం. మనకు వారిపై ఉన్న ప్రేమ ఈ విధంగా చేయిస్తుంది. కానీ మనకు కనిపించని పరమేశ్వరుడిపై ప్రేమెందుకు ఉండాలి? ఎందుకంటే మన జీవం, జీవితం ఆయన ప్రసాదమే.
దీనినే అన్నమాచార్యుల వారు- “వడిబాయక తిరిగే ప్రాణబంధుడా! ” అని అద్భుతంగా చెప్పారు. మన శ్వాసకు, మన పుట్టుకకు, మన అస్తిత్వానికి అన్నింటికీ కారణం ఆయనేనని దీని అర్థం. మానవ జన్మలో జీవుడు ఉన్నంత కాలం శరీరంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఉన్నంత కాలం ఈశ్వరుడిపై ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు ఒక రూపం భక్తి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భక్తి అంటే అరగంటసేపు పూజా మందిరంలో కూర్చోవటం కాదు. ఈ ప్రపంచాన్నే ఒక పూజామందిరంగా చూడగలగటం. అలా ఉపాసన చేయగా చేయగా పరమేశ్వర కృప కలుగుతుంది. ఇది ఒక రోజో, రెండు రోజులో చేసే ప్రక్రియ కాదు. జీవితాంతం చేయాల్సిన యజ్ఞం. దక్షిణాయనంలో ఉపాసన చేశాం, పరమేశ్వర సాక్షాత్కారం కలగలేదని ఆగిపోకూడదు. ప్రయత్నిస్తూ ఉంటే పరమేశ్వరుడిని చేరుకుంటాం.
భక్తులకు ఒక లక్ష్యం నిర్దేశించటానికి ఒక ఆకృతిని సృష్టిస్తారు. ఉదాహరణకు, కర్రతో గోడను దూకే వారు ఉంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరుగెత్తుకొస్తారు. కర్రను భూమికి తాటించి ఆ కర్రను ఆధారం చేసుకొని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెళతారు. గోడ మీద వరకు వెళ్ళిన తరువాత కర్రను ఇటువదలి తానటు పడిపోతాడు. అప్పుడు కర్ర కిందపడిపోతుంది. అంతే తప్ప, “ఓ కర్రా! గోడ దూకడానికి నాకింత దూరం సహకారంగా వచ్చి, నా శరీరాన్ని పైకెత్తడానికి ఉపయోగపడ్డావు. నువ్వు కూడా నాతో రా అనడు.” అంటే కర్రతో పాటు ఆ వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈశ్వర ఉపాసన కూడా అలాంటిదే.
అనుగ్రహం ఎలా పొందాలి?
వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాడు. ఉపాసన క్రమంలో మొదటి పెట్టుబడి పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరం. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, జీవుని కష్టపెట్టడం, సామ్రగి తెచ్చుకోవటం, కూర్చోవడం, పూజ చెయ్యడం, పుష్పార్చన చెయ్యడం – ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టడానికి. ఈశ్వరుడి అనుగ్రహం అంత సులభం కాదనే విషయాన్ని తెలియజేయటానికి. ఉపాసనలో తొలి అడుగు అమ్మవారి అనుగ్రహం పొందటం. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి పోదు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు-“సింధూరారుణ వ్రిగహాం త్రినయనాం, మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శశిశేఖరాం, స్మృతముఖాం ఆపీతవక్షోరుహాం, పాణిభ్యామలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం” అని వర్ణిస్తారు. “అమ్మవారి చేతిలో ఒక అమృత పాత్రవంటి పాత్రను పట్టుకుంటుంది. ఎవరిని అన్రుగహించాలో వాడికి భక్తి పాశాలు వేస్తుంది.
ఎవడు భక్తి భావన లేకుండా కేవలం లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె భక్తి పాశాలు దొరకవు. వాడు ఇంద్రియ లౌల్యంతో నశించిపోతాడు” అని దీని అర్థం. అందుకే ఉపాసనను అశ్వనీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్వయుజ మాసంతో మొదలుపెట్టమంటారు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహించాల్సిన తల్లి లక్ష్మీదేవి. శరీరంలో బలం, తేజస్సు, ఉపాసనను కొనసాగించే శక్తి అన్నీ ఆమె ఇవ్వాలి. అందుకే ఆమెను శ్రావణ మాసంలో కొలుస్తారు. ఇక కార్తీకం ఉపాసనా కాలం కాబట్టి పార్వతీదేవిని కొలవమని చెబుతారు.
కార్తీకంలో త్రిలోచన గౌరీ వ్రతం

కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయటం వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.
సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాక్కు, అర్థము- ఈ రెండింటినీ విడదీయలేరు. వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు, అర్థములాంటివారేనని ఈ శ్లోక అర్ధం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతినుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా – శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతిపురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా వుంటుంది. శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి. కార్తిక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటా యి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంది. దీనికి సమాధానమే
– శంకరాచార్య విరిచిత
పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవటానికి, రెండు జన్మాల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మ«థుడిని తన మూడో కంటి మంట చేత దహనం చేసిన వాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు, పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో.. అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. అందుకోసమే కార్తిసమాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తారు.

