మరో కోణంలో సర్దార్ పటేల్ – ఎ.జి.నూరానీ

 

మన దేశంలో ఉన్న వేర్వేరు రాజ్యాలను విలీనం చేసి ఒక యూనియన్‌గా చేసిన ఘనత సర్దార్ పటేల్‌దేనా? ఈ విషయంలో అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటెన్ ఎలాంటి సాయం చేశారు? ఈ విషయంలో ఆయన పాత్రను చరిత్ర తక్కువ చేసిందా?- ఈ అంశాలను ఎ.జి. నూరాని తాజాగా రాసిన ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తకంలో విశ్లేషించారు.

‘అమెరికాలోని రాష్ట్రాలను విలీనం చేసి ఒక దేశంగా మార్చటంలో అబ్రహం లింకన్‌కు, వల్లభాయ్ పటేల్‌కు ఒక తేడా ఉంది. అబ్రహం లింకన్‌కు దక్షిణాది రాష్ట్రాలంటే ద్వేషం లేదు. వల్లభాయ్ పటేల్‌కు హైదరాబాద్ అస్థిత్వమన్నా, దాని సంస్కృతి అన్నా, ముస్లిములన్నా ద్వేషభావముంది. నెహ్రూ అభిప్రాయాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేవి. నెహ్రూకు హైదరాబాద్ సంస్కృతి అంటే ఆరాధనా భావముండేది. 1956లో హైదరాబాద్ సమగ్రతను కాపాడటానికి నెహ్రూ ప్రయత్నించాడు. ముస్లిములపై జరిగిన అత్యాచారాలకు చాలా బాధపడ్డాడు. అయితే లింకన్ మాదిరిగానే నెహ్రూ లక్ష్యం కూడా యూనియనే. నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న తేడాలు మనకు స్పష్టంగా తెలుసుకోవటానికి ఒక ఉదాహరణ ఉంది. 1945లో ముంబాయి మెరైన్ డ్రైవ్‌లో ప్రాణ్‌సుఖ్‌లాల్ మఫత్‌లాల్ హిందూ స్విమ్మింగ్‌బాత్‌ను పటేల్ ప్రారంభించాడు. ఇది కేవలం హిందువుల కోసమే. ముస్లిములకు దీనిలో ప్రవేశం లేదు. నెహ్రూ ఈ స్థాయికి దిగజారేవాడు కాడు. మహమ్మద్ ఆలీ జిన్నా ఈ విషయంలో పటేల్‌ను దుయ్యపట్టాడు. 1945, నవంబర్ 18వ తేదీన విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో- “హిందువులు, ముస్లిములు సోదరులని.. భారత్ ఒక దేశమని లాంటి ప్రకటనలు పటేల్ చేయకుండా ఉంటే బావుంటుంది. ఒక వేళ ఆయన చెప్పిన విలువలనే పాటించే వ్యక్తి అయితే హిందువులకు మాత్రమే ఉద్దేశించిన స్విమ్మింగ్ బాత్‌ను ఎందుకు ప్రారంభోత్సవం చేస్తాడు? ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వ్యతిరేకంగా కొందరు యువకులు చేసిన ప్రదర్శనను ఆయన గమనించలేదా?” అని జిన్నా పటేల్‌పై విరుచుకుపడ్డాడు.

ఇక పటేల్ ప్రేరేపిత పోలీస్ యాక్షన్ నిజాంతో పాటుగా నెహ్రూను కూడా ఉద్దేశించినదే. కాశ్మీర్ విషయంలో తనను పూర్తిగా నిర్లక్ష్యం చేసారనే భావనతో ఉన్న పటేల్ హైదరాబాద్ విషయంలో పూర్తి నిర్ణాయాధికారం తనదేనని నిరూపించదలుచుకున్నాడు. అందుకే నెహ్రూను ఈ విషయంలో ఎక్కువ సంప్రదించలేదు. వాస్తవానికి కాశ్మీర్ విషయంలో పటేల్‌ను నెహ్రూ ఎక్కువ సార్లు సంప్రదించాడు. ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పట్ల, ముస్లిముల పట్ల పటేల్ ప్రవర్తన ఆయన సైద్ధాంతిక పక్షపాతాన్ని స్పష్టంగా చెబుతుంది. హిందు భావజాలాన్ని ప్రోత్సహించే గ్రూపులకు పటేల్ ఒక ఉక్కుమనిషిగా మారాడు. ఆయనను భారత బిస్మార్క్‌గా కీర్తించే వ్యక్తులు- తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ ఉంటారు. భారత యూనియన్‌లో రాజ్యాల విలీనం రెండు దశలలో జరిగింది. మొదటి దశలో అవి భారత్‌తో విలీనమయ్యాయి. రెండో దశలో వాటి పునర్‌వ్యవస్థీకరణ, దేశంలోని ఇతర ప్రాంతాలతో ఏకీకృతం జరిగింది. రెండో దశలో పటేల్‌కు ఎక్కువ పాత్ర ఉందని ఎవ్వరూ అనలేరు. ఇక రాజ్యాలు భారత్ యూనియన్‌లో విలీనం కావటంలో వైస్రాయ్ మౌంట్ బాటెన్, ఆయన దగ్గర పనిచేసే సంస్కరణల కమిషనర్ వి.పి. మీనన్‌ల పాత్ర చాలా కీలకం. ఈ పాత్రలను చరిత్రలో తక్కువగా చూపించారనే చెప్పాలి. ఈ విషయాన్ని హడ్సన్ రాసిన చరిత్ర స్పష్టం చేస్తుంది.
సంస్థానాలకు సంబంధించిన సమస్యలను మౌంట్‌బాటెన్ తొలి సారి పటేల్‌తో చర్చించినప్పుడు- ఇంకా స్టేట్స్ మినిస్ట్రి (రాజ్యాల విలీనం కోసం ఏర్పాటు చేసిన శాఖ) ఏర్పడలేదు.

ఈ చర్చ జరగటానికి ఒక నేపథ్యముంది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాజ్యాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అక్కడ నివసించే ప్రజలు పాలకులపై తిరగబడి, అధికారాన్ని కాంగ్రెస్‌కు అప్పగిస్తారని పటేల్ భావించారు. ఈ విషయాన్ని మీనన్‌కు చెప్పారు. మీనన్ ఈ విషయాన్ని మౌంట్‌బాటెన్‌కు చెప్పటంతో ఆయన పటేల్‌తో ఈ విషయాన్ని చర్చించారు. ఈ చర్చలో- స్వతంత్ర రాజ్యాల దగ్గర సుశిక్షితులైన సైనికులు ఉన్నారని.. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఒక డివిజన్ సైనికులు ఉన్నారని, చిన్న చిన్న రాజ్యాలలో రాజుల బాడీగార్డులు ఉన్నారని పటేల్‌కు మౌంట్ బాటెన్ వివరించారు. తిరుగుబాటుదారులను కాల్చివేయటానికి ఈ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయని- దీని వల్ల హింస తప్పదని మౌంట్ బాటెన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల భారత్‌కు వచ్చే లాభం కన్నా జరిగే నష్టం ఎక్కువ ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఈ మాటల అర్థాన్ని వివరించాలని మౌంట్‌బాటెన్‌ను పటేల్ కోరారు. ఈ సమస్యలకు శాంతియుత పరిష్కారం మంచిదని భావిస్తున్నానని- అందువల్ల రాజుల బిరుదులు, వ్యక్తిగత ఆస్తులు, సివిల్ లిస్ట్‌లో ఉన్న అంశాలను వదలేసి- రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్‌ను మొదలైనవి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచుకోవాలని మౌంట్ బాటెన్ వివరించారు. ఈ విషయాన్ని తాను ఆలోచిస్తానని చెప్పి పటేల్ వెళ్లిపోయారు.

మళ్లీ వైస్రాయ్‌ని కలిసినప్పుడు పటేల్ మౌంట్‌బాటెన్‌తో- “మీ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తాను. కాని ఒక్క షరతేమిటంటే – నాకు బుట్ట నిండుగా యాపిల్స్ కావాలి” అని పటేల్ పేర్కొన్నారు. మీ ఉద్దేశమేమిటి? అని మౌంట్‌బాటెన్ రెట్టించారు. “565 యాపిల్స్ (అప్పట్లో ఉన్న మొత్తం రాజ్యాల సంఖ్య) ఉన్న బుట్టనే నేను కొంటాను. ఒకటి, రెండు యాపిల్స్ తక్కువయినా నేను కొనను” అని పటేల్ తెగేసి చెప్పారు. “దీనిని నేను పూర్తిగా అంగీకరించలేను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఒక వేళ 560 యాపిల్స్ ఉంటే కొంటారా?” అని మౌంట్‌బాటెన్ అడిగారు. “కొంటానేమో?” అని పటేల్ సమాధానమిచ్చారు. రాజ్యాలు విలీనం కావటంలో తమకు సహకరించాలని మౌంట్‌బాటెన్‌ను భారత ప్రభుత్వం కోరింది. ఆయన హోదా తమకు ఉపయోగపడుతుందని భావించింది. దీని ప్రకారం చూస్తే- రాజ్యాల విలీనంలో మౌంట్ బాటెన్ కీలక పాత్ర పోషించాడని.. దేశం ముక్కలు కాకుండా అడ్డుకున్నాడని అర్థమవుతుంది. ఈ రాజ్యాలు అప్పటికే ఉన్న రాష్ట్రాలతో కలిపి, ప్రజాస్వామ్య పాలన ప్రారంభమయ్యేలా పటేల్ చూశాడు. అయితే సమస్యలు ఎదురయినప్పుడు సైనిక చర్యకే పటేల్ మొగ్గు చూపించేవాడు.

జూనాగఢ్ రాజ్యం పాకిస్థాన్‌లో విలీనం కావాలనుకున్నప్పుడు – ఆ రాజ్యంపై సైనిక చర్య తీసుకోవాలని పటేల్ యోచించాడు. నెహ్రూ ఆయనకు మద్దతు ఇచ్చాడు. 1947, సెప్టెంబర్ 17న సైనిక చర్య ఒకటే సమాధానమని కేంద్ర కేబినెబ్ తీర్మానం చేసింది. 1948లో అప్పటి దాకా ఉన్న సంప్రదాయాలకు విరుద్ధంగా- హైదరాబాద్‌లో సైనికచర్యను బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎర్నస్ట్ బెవిన్ విమర్శించారు. “దురదృష్టకరమైన విషయమేమింటే – ఈ కొత్త రాజ్యం యుద్ధ స్ఫూర్తిని అభివృద్ధి చేసుకుంటోంది. దీనిని మనందరం ఖండించాల్సిన అవసరముంది” అని ఆయన హౌస్ ఆఫ్ కామన్స్‌లో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న పద్ధతి వల్ల భారత్ పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దీని వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతింది. సెక్యూరిటీ కౌన్సిల్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా విదేశాంగ మంత్రి స్పందించారు.

హైదరాబాద్‌కు సంబంధించిన విషయంలో రెండు అంశాలున్నాయన్నారు. మొదటిది- ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం హైదరాబాద్‌కు ఉన్న చట్టపరమైన హక్కులు. హైదరాబాద్ హోదాను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ కౌన్సిల్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఆయనకు ఎటువంటి సందేహం లేదు. స్టాండ్‌స్టిల్ ఒప్పందం, హైదరాబాద్ సారభౌమత్వానికి ముగింపు పలకటం, మిగిలిన అంశాలపై విదేశాంగ శాఖకు చెందిన న్యాయవాదులు వేర్వేరు వాదనలను విన్నవించారు. అయినా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. హైదరాబాద్, ఐరాసకు చెందిన మరో చార్టర్‌కు చెందుతుందా? అనేది రెండో అంశం. ఈ విషయంలో సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం ఎలా ఉన్నా- ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ వద్దకు ఈ అంశం వెళ్లాలని ఆయన భావించారు..”

– ఎ.జి.నూరానీ
(నేడు హైదరాబాద్‌లో ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ ఆవిష్కరణ జరుగుతుంది)

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.