నా దారి తీరు -64
మామయ్య స్థాపించిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ
మా ఉయ్యూరు లో ఏవైనా ఆధ్యాత్మిక కార్య క్రమాలు విష్ణ్వాలయం లోనే జరిగేవి .హరికధలు కాపుల వీధి రామాయలం లో ,శివాలయం లో కూడా జరిగేవి . అవీ ఎప్పుడో ఒకటి రెండు సార్లు జరిగేవి .నిరంతరం నిర్వహించటానికి తగిన వేదిక లేదు .దానికోసం పూను కున్న వారూ లేరు .ఆ ఆలోచన ఉన్న వారూలేరు .అప్పుడు తెరమీదకు వచ్చాడు చోడవరపు చంద్ర శేఖర రావు గారి పెద్దబ్బాయి .ఆయన బొంబాయి లో ఏదో పెద్ద ఉద్యోగస్తుడే రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడని అందరు అనుకొనే వారు .ఏడాదికి ఒకటి రెండు సార్లు ఉయ్యూరు వచ్చి తలిదండ్రులైన చంద్ర శేఖర రావు గారిని అమ్మ అమ్మన్న గారిని ,సోదర సోదరీలను చూసి వెళ్ళుతూ ఉండేవాడు .అలా ఒక సారి ఉయ్యూరు వచ్చినప్పుడు ఆయన మనసులో ఇక్కడ ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది .మా మేన మామ గంగయ్య గారితో ఆయనకు మంచి చనువు ఉండేది .మామయ్య విష్ణ్వాలయం లో పురాణాలు చెప్పటం సప్తాహాలు నిర్వహించటం అందరికి తెలిసిన విషయమే .చంద్ర శేఖర రావు గారు మా నాన్నగారికి మంచి స్నేహిలు .,’’ఒరే’’అని పిలుచుకొనే చనువున్న వారు మా మామయ్యా అమ్మన్న గారి తమ్ముడు క హెడ్ కరణం గారైన ఆదిరాజు నరసింహా రావు గారి అక్క గారు .మామయ్య ఈ కరణం గారూ ‘’ఒరే’’అని పిల్చుకొనే వారు .విష్ణ్వాలయ కార్యక్రమాలకు ఈయనే ఆధ్వర్యం వహించేవాడు .మామయ్యా తో చోడవరపు వారి పెద్దబ్బాయి చర్చించి ,వారింటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్తలం లో రెండు నిట్టాళ్ళ తాటాకుల పాక ఏర్పాటు చేసేట్లు అందులో ‘’శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’పేర ఒక ఆధ్యాత్మిక సంస్థ ను ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు .ఖర్చు అంతా ఆయనే పెట్టుకోనేట్లు మామయ్య సభను అన్ని విధాలా అందరికి ఉపయోగ పడేట్లు , నిర్వహణ చేసేట్లు అనుకొన్నారు .అలా ఈ సభ చోడవరపు వారి ఆర్ధిక సహాయం తో మామయ్యా నిర్వహణ లో వెలిసింది .
మామయ్య చాలా నిక్కచ్చి మనిషి ప్రతి రూపాయిని జాగ్రత్త చేస్తాడు .లెక్కలు రాస్తాడు .అందుకనే ఈయన మీద ఆయన పూర్తీ బాధ్యతను పెట్టాడు .మామయ్య కూడా దాన్ని తన శక్తి సామర్ధ్యాలతో తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు .పురాణాలు చెప్పే వాడు .హరి కధలు చెప్పే వాడు ధార్మిక ప్రవచనాలను చెప్పించేవాడు .శివ రాత్రికి అభిషేకాలు నిర్వహించేవాడు..
మామయ్యనిర్వహించిన మరొక ప్రత్యెక కార్యక్రమం ‘’వేద సభల నిర్వహణ ‘’.రాష్ట్రం లోని వేదం పండితులందరూ మామయ్య ఆహ్వానం మేరకు ఉయ్యూరు వచ్చే వారు .వారందరికీ మామయ్య గారింట్లోనే భోజనం వసతికి మా ఇల్లు కూడా ఉప యోగ పడేది .వారందరికీ మా అత్తయ్య మహా లక్ష్మమ్మ గారే మడి తో వంట చేసేది,వడ్డించేది . లడ్డూ లు మొదలైన స్వీట్ల తో భోజనం ఎత్తేవారు .మేమూ వాళ్ళింట్లోనే భోజనం .వేదం పండితులు శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’లో ఉచ్చైస్వరంతో అంతా కలిసి ఏక స్వరం తో వేద పనసలు చదువుతుంటే ఏమీ తెలీక పోయినా అర్ధం కాక పోయినా మహా ఆనందం గా ఉండేది .చెవులు రిక్కిన్చుకొని ఆసాంతం వినే వాళ్ళం .అదొక దివ్యాను భూతి ,సాయంత్రం వేళ ఈ సభ జరిగేది .అందరితో బాటు ఒక లావుపాటి ఆచార్యుల వారు వచ్చే వారు .వారు మహా పండితులని తెలిసింది వారు ఒక అరగంట సేపు’’ వేదార్ధాన్ని ‘’చాలా సరళమైన భాష లో అందరికి అర్ధమయ్యే రీతి లో స్పష్టమైన ఉచ్చారణ తో వివ రించేవారు .ఈ కార్యక్రమం లో వీరి వాక్కులే హై లైట్ .ఆ తర్వాతా క్రమ, ఘనా ,జటా లతో ఎవరి పాండిత్యాన్ని వారు ప్రదర్శించేవారు .దాదాపు రెండు గంటలు జరిగేది . మామయ్యా కు ఎవరి అర్హతత ఏమిటో క్షున్నం గా తెలుసు .దానిని బట్టి తాంబూలం దక్షిణా ఏంతో మర్యాద పూర్వకం గా అంద జేసే వాడు .ఈ సభలకు వీలైతే చోడవరపు వారి పెద్దబ్బాయి వచ్చేవాడు .యదా శక్తి ఆయనా దక్షిణ లిచ్చి ఉత్సాహ పరచే వాడు .మామయ్యఅందరిని చక్కగా పరిచయం చేస్తూ వారి విద్వత్ ఏమిటో వివరిస్తూ ఆహ్వానించి వారి వేద విద్యా ప్రదర్శన చేయించే వాడు .తర్వాత అందరూ మామయ్య గారింటికి వచ్చి భోజనాలు చేసే వారు .ఇక్కడా మామయ్యా యదా శక్తి దక్షిణ తామ్బూలాలిచ్చి సత్కరించి పంపేవాడు .చాలా మంది ఆ రాత్రికే బయల్దేరి తమ స్వగ్రామాకో లేక వేరే చోట జరిగే సభలకో వెళ్ళే వారు మిగిలిన వారు మామయ్యా గారింట్లోను మా ఇంట్లోను నిద్రించే వారు .మర్నాడు ఉదయం కార్య క్రమాలు పూర్తీ చేసుకొని బయల్దేరి వెళ్ళే వారు .లేక ఊళ్ళో అందరిళ్ళకు వెళ్లి ,వేదం విని పించి దక్షిణ పొంది తర్వాత మరో ఊరు వెళ్ళే వారు .ఇలా మహా వైభవం గా మామయ్య అందరికి సంతృప్తి కలిగేట్లు సభలను న భూతో న భవిష్యతి గా నిర్వ హించాడు .ఇది ఆయన కు ఒక సవాలు గా నిలిచి ఆయన పేరు బాగా వ్యాప్త మైంది .
వైదిక సభలో మామయ్య ప్రతి మాస శివ రాత్రి నాడు పగలు సీతా రామ కల్యాణాన్ని ఉత్సాహ వంతులైన దంపతుల తో చేయించేవాడు .మా దంపతులం రెండో నెల లోనే కల్యాణం చేశాం .వెంటనే మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి వివాహం నిశ్చయమై వెంటనే పెళ్లి జరిగింది ఇది ఒకశుభ సూచకం గా అందరికి తెలిసి మున్డుకోచ్చేవారు .ఇలా రెండేళ్ళు కళ్యాణాలు నిరాఘాటం గా సాగాయి .వేదసభలకు అందరిని ప్రోత్సహించటానికి మామయ్యా ఎవరింట్లో వివాహ మైనా ఉపనయనం అయినా ఏదైనా శుభ కార్యక్రమం జరిగినా ఆ కుటుంబం వారిని నూట పదహారు రూపాయలు శాశ్వత నిధికి చందా ఇచ్చేట్లు ఏర్పాటు చేశాడు .అందరూ ఇది చాలా మంచి కార్యక్రమం, ఆలోచన అని భావించి స్వచ్చందం గా ముందుకొచ్చి విరాళాలు అందించారు .సంస్థ ఆర్ధికం గా బలోపేతం చేయటానికి సహకరించారు ఆ డబ్బును మామయ్య బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేసి దాని పై వచ్చే వడ్డీ తో కార్య క్రమాలు చేసేవాడు ఇదొక ఆదర్శం గా మిగిలింది .చోడవరపు వారబ్బాయి పూనికా సంకల్పం మామయ్య వల్ల నెర వేరి ఈ సభ రాష్ట్రం లోనే మంచి పేరు తెచ్చుకొని అందరికి అనుసర ణీయం అయింది .ఉయ్యూరు చరిత్ర లో మామయ్య పేరు శాశ్వతం గా నిలిచి పోయింది .
ఈ సభ గురించిన మరిన్ని వివరాలు మరో సారి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014 –ఉయ్యూరు

