నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

 

 

కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది?
దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది?
నేత్రావధానమవుతుంది.
దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….?

అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది.
అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో నేత్రావధానం మరీ కనుమరుగైపోయే దశలో ఉంది. విశాఖపట్టణానికి చెందిన లలితకుమారి, రమాకుమారి జంటగా ఏర్పడి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నేత్రావధాన ప్రదర్శనలిస్తున్నారు. వారి తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగానా అన్నట్టు అందరి ముందుకు వచ్చారు ఎన్.వి. శిరీష, కె. శిరీషల జంట. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినులు వాళ్లు.

అభ్యాసం + సాధన =
ముచ్చవరం బడిలో తెలుగు పండిట్, ప్రధానోపాధ్యాయుడు కూడా అయిన ఆదినారాయణస్వామికి నేత్రావధానమంటే ఆసక్తి. చదువులో రాణిస్తున్న శిరీషల జంటను చూసినప్పుడు ‘వీళ్లకు అది నేర్పిస్తే ఎలా ఉంటుంది’ అన్న ఆలోచన తళుక్కుమంది ఆయనలో. వెంటనే వారిని పిలిచి ‘నేర్పుతాను, నేర్చుకుంటారా’ అని అడిగారు. ముందు భయపడినా, తర్వాత ముందుకొచ్చారు విద్యార్థినులు. విరామ సమయం దొరికినప్పుడల్లా తనకు తెలిసిన నేత్రావధాన కళను శిరీష ద్వయానికి నేర్పించారాయన. “గతంలో నేర్చుకున్నప్పటికీ ఈ విద్యను ప్రదర్శించే అవకాశం నాకు రాలేదు. వీళ్లిద్దరూ చదువులో ముందుండటాన్ని గమనించి నేత్రావధానాన్ని నేర్పించడం ప్రారంభించాను. నా తపనకు సహోద్యోగి సుధాకర్ సాయం తోడైంది. మా ఇద్దరితోపాటు విద్యార్థినులు కూడా రెండేళ్ళు కష్టపడి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు. ఆంధ్రజ్యోతి వారి ఏబీఎన్ వార్తా ఛానెల్లో రెండు గంటల సేపు నేత్రావధానం లైవ్ షో ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పిల్లలకు గుర్తింపు లభించింది” అని చెప్పారు ముచ్చవరం స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణస్వామి. అదే స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న సుధాకర్ మాట్లాడుతూ “నేర్చుకున్న విషయం ఏదైనా పదును తేలాలంటే నిరంతర సాధన తప్పనిసరి. అది చేస్తున్నారు గనుకనే మా విద్యార్థినులు అవలీలగా నేత్రావధానాన్ని చేయగలుగుతున్నారు” అన్నారు. ఈ విద్యార్థినులు అవధానాన్ని క్రమం తప్పకుండా అభ్యాసం చెయ్యడంలో ఆయన పాత్రే కీలకం. నేత్రావధాన ప్రదర్శనల్లో సుధాకర్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.

పేదరికమున్నా…
అవరోధాలను తల్చుకుంటూ చతికిలపడితే దేన్నీ సాధించలేం. అంకితభావం, ఏకాగ్రత, పట్టుదల ఉండాలేగాని నేర్చుకోలేనిదంటూ ఏమీ ఉండద ని ఈ గ్రామీణ బాలికలు ఋజువు చేశారు. ఎందుకంటే వాళ్లిద్దరివీ నిరుపేద కుటుంబాలే. ఒక శిరీషకు తండ్రి లేరు. మరో శిరీష తండ్రి పక్షవాతంలో లేవలేని స్థితిలో ఉన్నారు. దాంతో వీరి తల్లులు వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ వీరిని చదివిస్తున్నారు. పేదరికం అడ్డని భావించకుండా ఈ బాలికలు రెండేళ్ల పాటు క్లిష్టమైన నేత్రావధాన విద్యను నేర్చుకుని సాధన చేశారు. ఇప్పటికే సత్తుపల్లి, భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చారు వీరు. అటు చదువునూ నిర్లక్షం చెయ్యడం లేదు. భవిష్యత్తులో ఇతర భాషల్లో కూడా నేత్రావధానాన్ని నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయుడు వారిని సిద్ధం చేస్తున్నారు.
-మాదిరాజు సుధాకర్,
అబ్దుల్ మునాఫ్-సత్తుపల్లి

ఎలా చేస్తారంటే…
అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పుష్పావధానం, నాట్యావధానం, గంటావధానం మొదలైన ఎన్నో అవధానాలున్నప్పటికీ వాటికన్నా నేత్రావధానం భిన్నమైనది. ఇది మొత్తం మౌనంగా కేవలం కళ్ల సైగలతోనే సాగుతుంది. వేదికపై ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుంటారు. ప్రేక్షకులెవరైనా ఒక పదమో, వాక్యమో కాగితంపై రాసి అవధానుల్లో ఒకరికి ఇస్తారు. దానిని అందుకున్నవారు తమ కళ్లతో సంకేతాల ద్వారా అభినయిస్తూంటే మరొకరు వాటిని అర్థం చేసుకుని అక్షరీకరిస్తారు. ఇదెలా సాధ్యమంటే ఒక్కొక్క అక్షరానికి కనుల భాషలో ఒక సంకేతముంటుంది. అక్షరానికి ఒత్తులు, గుణింతాలు ఉంటే మరి కొన్ని భంగిమలుంటాయి. విరామ చిహ్నాలకు కూడా కొన్ని సంకేతాలుంటాయి. పృచ్ఛకులు కాగితంపై ఏది రాసిస్తారో జిరాక్స్ తీసినటుగ్లా అవధాని తన కాగితంపై అదే రాయడం ఆ కనుల సైగల ద్వారానే సాధ్యం. దాన్నే నేత్రావధానమంటారు. మరో విశేషం కూడా ఉంది. అదేమంటే – పృచ్ఛకులు గనక అక్షరాలు తప్పుగా రాస్తే అవధాని అక్షరానువాదంలో సైతం అవే తప్పులు రావడమనేది అవధానం కచ్చితత్వానికి నిదర్శనం. అవధానుల్లో ఎవరికే సందేహం వచ్చినా దాన్ని వారు కళ్లతోనే ప్రశ్నించుకుంటారు తప్ప నోరు మెదపరు.

మొదట్లో కష్టపడ్డాం
నేత్రావధానం నేర్పిస్తానని ఆదినారాయణస్వామి సార్ చెప్పినప్పుడు వద్దన్నాం. కానీ ఆయన ఎంతో ప్రోత్సహించి మాకిది నేర్పించారు. మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. సాధన చేసి ప్రదర్శనలిస్తుంటే, వెళ్లిన చోటల్లా మాకు మంచి గుర్తింపు వస్తూంటే ఆనందంగా ఉంది.
-ఎన్ .వి. శిరీష

నిత్యం సాధనే
మాకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు సాధన తప్పనిసరి అని చెప్పారు. దాంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట సేపు సాధన చేస్తున్నాం. ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది.
– కె. శిరీష

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

  1. వంశి అంటున్నారు:

    చక్కటి సమాచారాన్ని అంద చేసినందుకు ధన్య వాదములు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.