రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ

 

కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు.

గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది వారిని తెలుగు సేవకుణ్ణి చేసింంది. వయోజన విద్యా వ్యాప్తి కోసం గాడిచర్ల ఆనాటి బళ్ళారి జిల్లా ‘కుడ్‌లిగి’ ప్రాంతంలో పర్యటించారు. అయితే గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను కన్నడ భాషలో బళ్ళారి జిల్లావాసులకు అనువా దం చేసే వ్యక్తి అవసరమైంది. ఆ కాలంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి బళ్ళారి జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఆ జిల్లా డీఈవో జానమద్ది పేరును సూచించారు. జానమద్ది వెంటనే సమ్మతించి గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను చక్కగా కన్నడంలో, ఆయన వెంట రేయింబవళ్ళు తిరిగి మూడు వారాల పాటు చేశారు. సరిగ్గా అప్పుడే జానమద్ది గాడిచర్లతో స్ఫూర్తిపొందారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం, గాడిచర్ల సాయంతో జానమద్ది తెలు గు సీమకు, తర్వాత కవుల గడప కడపకు బదిలీ మీద వచ్చారు. జీవితకాల భాషాసేవ చేశారు. జాతీయ అభిమానం, రాష్ట్రాభిమానం, ప్రాంతీయ అభిమానం, మూడూ మేళవించిన సాహిత్య వ్యకిత్త్వం జానమద్దిది.
సీపీ బ్రౌన్ కోసం చేసిన దశాబ్దాల కృషి శాస్త్రిని అందరూ ‘బ్రౌన్ శాస్త్రి’ అని పిలిచేటట్లు చేసింది.

కడప పట్టణం యర్రముక్కపల్లి ప్రాంతంలో ఒకనాడు బ్రౌన్ మహాశయుడు నివసించేవారు. బ్రౌన్ తోట, బ్రౌన్ కాలేజ్ అక్కడ వుండేవి. ఆ బ్రౌన్ కాలేజీలో బ్రౌన్ 12 మంది పండితులను ఏర్పాటుచేసి తన జీతంలోంచి ఆ పండితులకు నెలజీతాలిచ్చి, తెలుగు కావ్యాలను ఉద్ధరింపజేశారు. కానీ కాలగర్భంలో ఆ బ్రౌన్ కాలేజీ మొండిగోడల శిధిల ఆలయంగా మారింది. ఆ చారిత్రక స్థలాన్ని మహాపరిశోధకుడు ఆరుద్ర దర్శించారు. అక్కడ బ్రౌన్‌కు స్మారకంగా ఏదైనా కట్టడం నిర్మించమని జానమద్దిని ఆరుద్ర కోరారు.దీనితో శాస్త్రి ఆ స్థలం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకున్నారు. ఆడిటర్ సంపత్‌కుమార్ ఆ స్థలం యజమానిగా ఉన్నారని గ్రహించారు. వెంటనే ఆయన్ను కలిసి తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఆయన సంతోషంగా బ్రౌన్ స్మారక భవన నిర్మాణం కోసం ఆ 20 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలంలో బ్రౌన్ లైబ్రరీ నిర్మాణానికి హనుమచ్ఛాస్త్రి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరికి 1995 నాటికి బ్రౌన్ లైబ్రరీ భవనం నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.

సరిగ్గా అప్పుడే స్వాతంత్య్ర సమరయోధులు, గాంధేయ వాది వావిలాల గోపాలకృష్ణయ్య అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడైతే వావిలాల గోపాలకృష్ణయ్యను జానమద్ది చూశారో వెంటనే చంద్రబాబుకు పరిచయం చేశారు. అంత గొప్ప మహానుభావుడు ఉన్నపళంగా అక్కడ కనిపించడంతో చంద్రబాబు తన చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని వావివాలతో చేయించడం విశేషం.
ముఖ్యమంత్రిగా వైఎస్ ఒక పర్యాయం జానమద్ది ఆహ్వానంమీద బ్రౌన్ లైబ్రరీని సందర్శించారు. అపుడు రాజశేఖర్ రెడ్డి జానమద్దితో ‘బ్రౌన్ లైబ్రరీ కోసం నన్ను ఏం చేయమంటారు?’ అని ప్రశ్నించారు. వెంటనే జానమద్ది ‘ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏటా ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఇప్పించ’మని కోరారు. తరువాత జానమద్ది, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి బ్రౌన్ లైబ్రరీ నివేదిక సిద్ధం చేసి ఇచ్చారు. వెంటనే రాజశేఖర రెడ్డి ఏటా రూ.30లక్షలు గ్రాంట్ వచ్చేలా చేశారు. దీంతో బ్రౌన్ లైబ్రరీకి జవజీవాలు సమకూరాయి. ఇపుడు జానమద్ది కృషి కారణంగా బ్రౌన్ లైబ్రరీలో దాదాపు లక్ష గ్రంథాలు, 300 వరకు తాళపత్ర గ్రంథాలు, తెలుగు గ్రామాల స్థానిక చరిత్ర తెలిపే మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ లేఖలు, రాతప్రతులు సమకూరాయి. 2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.15 గంటలకు కడపలో ఆయన చివరిశ్వాస తీసుకున్నారు. జానమద్ది ప్రాణదీపంఆరిపోయింది. కానీ కడపలో బ్రౌన్ పేరిట నిర్మించిన గ్రంథాలయ దీపం -మొత్త ం తెలుగు జాతికి వెలుగుదీపం- వెలుగుతూనే ఉంది… ఉంటుంది.
శశిశ్రీ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.