భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత స్వచ్ఛమైన నీటితో కూడిన పురాతన ఇసుక తిన్నెలు (ఏన్షియంట్ డ్యూన్స్) ప్రకృతి అతిశయంగా అవతరించాయి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా, చిల్లకూరు మండలంలోని అద్దేపల్లి, బల్లవోలు, చింతవరం, వేళ్ల పాలెం, ఏరూరు రెవెన్యూ గ్రామాలు, కోట మండలంలోని కర్లపూడి, కొత్తపట్నం, సిద్ధవరం రెవెన్యూ గ్రామాల పరిధిలో ఇలాంటి తిన్నెలు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతం తీరానికి రెండు కిలోమీటర్ల దూరం ఇవతలి నుంచి 17 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో అర్ధ చంద్రాకారంగా ఈ పురాతన ఇసుక తిన్నెలు వ్యాపించాయి. ఈ తిన్నెల మ«ధ్య పడమటి దిశగా ప్రవహిస్తున్న, సహజ సిద్ధంగా ఏర్పడిన ఊట నీటి ప్రవాహాలను సొన కాలువ లు (స్ప్రింగ్ ఛానెల్స్) అని స్థానికంగా పిలుస్తారు.
‘సొన’ నీట వనరుల ఆ«ధారంగా వ్యవసాయ సంస్కృతి నెలకొంది. తీరంలో నేర్పుతో కట్టిన పిచ్చుక గూళ్ళులా ఉన్న ఆ గ్రామాలు. చూడగానే ఎడారి శాపంలా ఎటు చూసినా ఇసుకతో పెనవేసుకున్న పల్లె జీవనం. ఇసుక కుదుళ్ళలోకి వేళ్ళూనుకున్న గ్రామసీమలు. ఇళ్ళనానుకుని పరుచుకున్న పచ్చని పొలాలు. అక్కడక్కడా దిబ్బలపై ఏపుగా పెరిగిన పచ్చగడ్డితో మైళ్ళకొద్దీ విస్తరించిన ఇసుక తిన్నెలు. మినరల్ వాటర్ కంటే స్వచ్ఛమైన ఊటనీటి కాలువలపై ఆధారపడి శతాబ్దాలుగా గ్రామాలు విలసిల్లాయి. తాటి తోపులు, పశువుల మందలు, పాడి పంటలతో నేల నాగకరికతల అతిశయోన్నతమైన సమతుల్యత. ప్రకృతి-సంస్కృతి (రెండవ ప్రకృతి) మధ్య అపురూప సమ్మేళనం. ప్రకృతి వనరులను మానవీకరించిన అద్భుతంలా సాగే పల్లెసీమలు. నోరూరించే మంచి నీళ్ళున్నా, రాక్షసంగా పరచుకున్న ఇసుక వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించిన ప్రాంతమది. మానవ సమష్టి-సహకార కార్యకలాపంతో సొన కాలువ సాగువిధానం (స్ప్రింగ్ ఛానెల్ కల్టివేషన్) ఆవిర్భవించింది. ఒక వ్యవసాయ సాంస్కృతిక అద్భుతం ఆవిష్కృతమైంది. అలాంటి ప్రాంతంపై నేడు సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) రూపంలో ‘అభివృద్ధి’ నీలినీడలు కమ్ముకున్నాయి.
సాధారణంగా సారవంతమైన నేలలున్నప్పటికీ సాగునీళ్ళ కోసం పోరాడవలసిన పరిస్థితి. అయితే ఈ సొన కాలువల ప్రాంతం అందుకు పూర్తిగా విరుద్ధం. నీళ్ళున్నాయే గానీ వ్యవసాయానికి అనివార్యమైన సారవంతమైన మట్టి లేదు. నిస్సారమైన ఇసుక మనిషికి సవాలు విసిరింది. దాంతో జీవనం కోసం మట్టిని తరలించవలసిన విచిత్రం. సుదూర ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి, సొనలు చుట్టూ పరచుకొని ఉన్న ఇసుక పర్రలను సాగుయోగ్యమైన భూములుగా ప్రజలు మలచుకున్నారు. ఈ తిన్నెల వద్ద వాటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వర్షంపడినా తిన్నెలలోని నీటి ఊటల నుంచి ఏడాది పొడవునా మంచి నీటి ప్రవాహాలు ఏర్పడుతాయి. నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో మాత్రమే వర్షం పడినా ఏడాది పొడుగునా సొన కాలువల్లో నీటి ప్రవాహాలు ఉంటాయి. ఇక్కడ 35కు పైగా చిన్నా పెద్దా సొన కాలువలున్నాయి. కాలువకు కాలువకు మధ్యన సగటున రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. నీటి ఊటల నుంచి వచ్చే మంచినీటి ప్రవాహాల్ని చెరువులలోకి సమీకరించి, సాగుకు వినియోగిస్తారు. నీరు పుష్కలంగా లభించడంతో ప్రధానంగా వరి పండిస్తారు. దాంతోపాటు వేరుసెనగ, సవక, జీడిమామిడి, పుచ్చ, నువ్వు పంటలు పండిస్తారు. పన్నెండు వేల కుటుంబాలకు పైగా ఈ సొన కాలువల ఆధారంగా వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు విక్టోరియా స్ట్రీట్స్, ట్రింప్, గ్యాప్, అడిడాస్, నైక్, స్పీడో, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటివి భాగస్వాములుగా ఉన్న ‘మాస్ అప్పారల్ హోల్డింగ్స్ లిమిటెడ్’ (మాస్) అనే సంస్థ ‘టెక్స్‌టైల్స్, అప్పారెల్ పార్క్’ను ఈ సెజ్‌లో ఏర్పాటు చేయబోతోంది. ఈ సంస్థ ద్వారా 30వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 45వేల మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తామన్న హామీతో దీన్ని నెలకొల్పుతున్నారు. ఈ సొన కాలువలకు అత్యంత సమీపంలో దుగరాజపట్నం వద్ద నిర్మించబోతున్న భారీ రేవుపట్నంలో సాగే కార్యకలాపాలు అనేక కాలుష్యాలను వెదజల్లుతుంది. ప్రభుత్వం, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సం స్థలు, రాజకీయ పార్టీలు కుమ్మకై అభివృద్ధి, ఉపాధి పేరుతో సరైన ప్రమాణాలను పాటించ క పోవడమే కాకుండా, వంచించి స్థానిక ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయి.
ఇక్కడి ఇసుకలో పారిశ్రామిక అవసరాలకు పనికి వచ్చే పలు రకాల ఖనిజాలుండడంతో అక్రమ మైనింగ్ కార్యక్రమాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఏడాదికి 6.8 లక్షల టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఇసుక అక్రమ మైనింగ్, సెజ్‌ల కారణంగా ఈ ఇసుక తిన్నెల్లోని సొన కాలువలు అంతరించి పోతున్నాయి. పర్యావరణ విధ్వంసం వల్ల సేద్యం దెబ్బతినడమే కాకుండా, సెజ్‌ల కోసం ఆ గ్రామాల్లో సాగిన అక్రమ భూసేకరణతో ప్రజలు బతుకుదెరువు కోల్పోయి అల్లాడుతున్నారు. చిత్తడి నేలలతో సమానంగా భారీ మంచినీటి కేంద్రాలుగా ఉన్న ఇసుక తిన్నెలను కూడా పరిగణించాలి. సోంపేట మండలంలోని బీల భూముల్లో (చిత్తడి నేలలు) ప్రభుత్వం నెలకొల్పబోతున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణవేత్తల ఉద్యమ ఫలితంగా థర్మల్ స్టేషన్ నిర్మాణం ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వం ఆ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు కేటాయించిన భూమిని కూడా వాపసు తీసుకునే ట్టు చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. సోంపేట నేపథ్యంలో సొన వ్యవసాయం, పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా ఉన్న చింతవరం సెజ్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించేలా ప్రజలు ఉద్యమించాలి.
n వెన్నెలకంటి రామారావు

