షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు

షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు

కేవలం ఇద్దరంటే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు కలిసి ‘ప్రొడక్షన్ హౌస్’ పెట్టడమేమిటి? తొంభై తొమ్మిది లఘుచిత్రాలు తీయడం ఏమిటి? అంతే కాదు. వాళ్లు తీసిన షార్ట్‌ఫిల్మ్స్ వల్ల ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సెంచరీకి చేరువలో ఉన్న ఆ ఇద్దరు మిత్రులు సుభాష్‌చంద్ర, ధీరజ్‌ల లఘుచిత్ర ప్రయాణం గురించే ఈ కథనం…

ఇప్పటి వరకు ‘ఎం.ఆర్.ప్రొడక్షన్స్’ బ్యానర్ కింద వీరిద్దరూ తీసిన అన్ని షార్ట్‌పిల్మ్స్‌ను కలిపి యూట్యూబ్‌లో తొంభై లక్షల మంది తిలకించారు.
షార్ట్‌ఫిల్మ్స్ తీయడంలో కేక పుట్టిస్తున్న ఎం.ఆర్.ప్రొడక్షన్స్‌లో నటిస్తే చాలు.. సినిమాల్లోకి వెళ్లొచ్చు అనే స్థాయికి వెళ్లిందీ ప్రొడక్షన్ హౌస్.
“వందో లఘుచిత్రం పూర్తవుతూనే మేమిక వీటిని తీయడం నిలిపేస్తున్నాము. సినిమాల్లోకి వెళ్లాలన్నదే మా లక్ష్యం..” అన్నారు సుభాష్, ధీరజ్.

సుభాష్‌చంద్రది భీమవరం దగ్గరున్న రేలంగి. ధీరజ్‌ది విజయనగరానికి చెందిన కొట్టం. వీళ్లిద్దరు వైజాగ్‌లో కలిశారు. “నేను మహారాజ కాలేజ్‌లో బీటెక్ చేసేవాణ్ణి. ధీరజ్ రఘు కాలేజ్‌లో చదివేవాడు. ఆ రెండు కాలేజీలలోని మొదటి అక్షరాలైన ‘ఎం’, ‘ఆర్’ లను తీసుకుని ‘ఎంఆర్ ప్రొడక్షన్స్’ అని పేరుపెట్టాము. ఇప్పటి వరకు మా ప్రొడక్షన్ హౌస్ తొంభైతొమ్మిది లఘుచిత్రాలను నిర్మించి రికార్డు నెలకొల్పింది. వందో చిత్రం తీస్తున్నామిప్పుడు” అని చెప్పారు సుభాష్ చంద్ర. వీళ్ల జర్నీ చిత్రంగా మొదలైంది. వైజాగ్‌లో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పుడు కలిసినా.. చదువు మీద కాకుండా టాపిక్ సినిమాల మీదికి మళ్లేది. సెకెండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు వైజాగ్‌లోని గీతం ఇంజనీరింగ్ కాలేజీలో షార్ట్‌ఫిల్మ్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అది విన్నాక “అవును, మనం కూడా ప్రయత్నిద్దాం. చిన్న ఐడియాతో ఫిల్మ్ తీద్దాం” అనుకున్నారీ విద్యార్థులు. “ఆలోచన బాగుంది. అయితే అందులో నటించేందుకు ఆడపిల్లలు ముందుకు రావాలి కదా? ఎవర్ని అడిగినా ఒప్పుకోలేదు. అప్పట్లో పరిస్థితి అలా ఉండేది. ఆఖరికి మా చెల్లెలు ముందుకొచ్చింది. ‘ఎడిక్టెడ్’, ‘మిస్టర్ డైరెక్టర్’ అన్న లఘుచిత్రాలను తీశాము..” అన్నారు సుభాష్‌చంద్ర. వీరు తీసిన ‘సక్సెస్’ అనే చిత్రానికి గీతం పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. దానితో కొంత మొత్తం నగదు వచ్చింది. “ఆ మొత్తంతో సోనీ హ్యాండీ కామ్ కొనుక్కున్నాం. అంతకు ముందు ఇంట్లో ఉన్న చిన్న కెమెరాతోనే తీసేవాళ్లం. ఇప్పుడు హ్యాండీకామ్ చేతికొచ్చాక ఏ రోజూ ఇళ్లలో నిలిచేవాళ్లం కాదు” అని చెప్పిన ఈ ఇద్దరు మిత్రులూ.. బయటికి వెళితే చాలు.. కెమెరాతో వెళ్లాల్సిందే అన్నట్లు తయారయ్యారు. ఎప్పుడు స్టోరీ ఐడియా వస్తే అప్పుడు స్క్రిప్టు రాసుకోవడం, నటుల్ని ఎంపిక చేసుకోవడం, స్పాట్‌కు వెళ్లిపోవడం.. ఇదే పని. ఫటాఫటా ఇలా సుమారు 20 లఘు చిత్రాలను తీశారు.

ఇదే లోకం..
“మా ‘బ్లయిండ్ డేట్’ చిత్రానికి కాస్త పెద్ద పేరొచ్చింది. మేము ఒకరం ఉన్నామని, మా ఎం.ఆర్.ప్రొడక్షన్స్ ఒకటి ఉందని అప్పుడే తెలిసింది అందరికీ. ‘పెళ్లి పుస్తకం’, ‘పొజెసివ్‌నెస్’, ‘మిస్ అండర్‌స్టాండింగ్’, ‘లవ్ లాజిక్ లెస్’, ‘సాంబార్ ఇడ్లీ’ వంటివన్నీ యువతను ఆకట్టుకున్న ఫిల్మ్‌లే..” అన్నారు ధీరజ్.

సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ జర్నీకి మధ్యలో కాస్త బ్రేక్ పడింది. “బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూలో టెక్‌మహీంద్రలో నాకు ఉద్యోగం వచ్చింది. ధీరజ్ అమెరికాలో చదువుకునేందుకు జీఆర్ఇకి ప్రిపేర్ అవుతున్నాడు. అప్పటికే షార్ట్‌ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఇద్దరికీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇలా ఎవరి దారి వారు చూసుకుంటే భవిష్యత్తు ఏమిటి? అనుకున్నాం. ఇద్దరం వెళ్లిపోవడానికి ఆరునెలల సమయం ఉంది. ఆ టైమ్‌లో వరుసపెట్టి లఘుచిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నాం” అన్నారు సుభాష్‌చంద్ర. అనుకున్నట్లే పలు లఘు చిత్రాలను తీశారు.

“మేము నిర్మించింది లఘుచిత్రాలే కావొచ్చు. కాని కొన్ని అద్భుతాలు జరిగాయి. మా హీరోహీరోయిన్లు రాజ్‌తరుణ్, చాందినీ చౌదరి. నలభై తొమ్మిది షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించిన రాజ్‌కు ఈ మధ్యనే వచ్చిన ‘ఉయ్యాల జంపాల’లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. పది షార్ట్‌ఫిల్మ్స్‌లో చేసిన చాందినీకి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ‘పెళ్లిపుస్తకం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పెట్టిన ఒక పాట టీవీల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటను పాడిన దీప్తి పార్థసారథి అనే అమ్మాయికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాకు పాడే అవకాశం వచ్చింది. ఇక, ఆ పాటను రాసిన దినేష్‌గౌడ్‌కు అయితే బోలెడు సినీగీతాలను రాసే అదృష్టం దక్కింది. మ్యూజిక్ డైరెక్టర్‌లయిన రాజేష్ ఆర్య, కేశవ్ కిరణ్‌లకూ సినిమాల్లోకి వెళ్లేందుకు దారి దొరికింది” అంటున్నారీ మిత్రులు. దాంతో – షార్ట్‌ఫిల్మ్స్ తీయడంలో కేక పుట్టిస్తున్న ఎం.ఆర్.ప్రొడక్షన్స్‌లో నటిస్తే చాలు.. సినిమాల్లోకి వెళ్లొచ్చు అనే స్థాయికి వెళ్లిందీ ప్రొడక్షన్ హౌస్. అందుకే మిగతా ఆలోచనల్ని మానేసి ఈ రంగంలోనే ఉండిపోవాలనుకున్నారీ ఫ్రెండ్స్.

డబ్బు అక్కర్లేదు..
“మేము ఇప్పుడు తొంభైతొమ్మిది పూర్తి చేసి.. వందో షార్ట్‌ఫిల్మ్ తీయబోతున్నాం. కొందరంటున్నారు ఇన్నేసి చిత్రాలు తీశారు.. డబ్బు బాగా ఖర్చు అయ్యుంటుందే? అని. ఏమీ కాలేదు. చేతి నుంచి పెట్టిందేమీ లేదు. గీతంలో ఇచ్చిన క్యాష్‌ప్రైజ్‌తో కెమెరా కొనుక్కున్నాము అని చెప్పాము కదా! దాంతో షూటింగ్ చేసిన తర్వాత – ఇంటికొచ్చి కంప్యూటర్‌లోనే ఎడిటింగ్ చేసుకునేవాళ్లం. నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న సోనీ వేగాస్ అనే సాఫ్ట్‌వేర్ బాగా పనికొచ్చింది. ఇక, రాత్రిపూట అందరూ నిద్రపోయాక.. ఎలాంటి డిస్ట్రబెన్సులు లేని టైమ్‌లో డబ్బింగ్ చెప్పేవాళ్లం. దీనిక్కూడ ఆడాసిటీ అనే సాఫ్ట్‌వేర్ ఉపకరించింది. రెండొందలు పెట్టి ఒక మైకు, వెయ్యి పెట్టి ట్రైపాడ్ కొన్నాం. అంతే మా ఖర్చు” అన్నారు సుభాష్‌చంద్ర.

ఇప్పటి వరకు ‘ఎం.ఆర్.ప్రొడక్షన్స్’ బ్యానర్ కింద వీరిద్దరూ తీసిన అన్ని షార్ట్‌పిల్మ్స్‌ను కలిపి యూట్యూబ్‌లో తొంభై లక్షల మంది తిలకించారు. అంటే ఒక్కో షార్ట్‌ఫిల్మ్‌ను దాదాపు 90 వేల మంది చూసినట్టు. “వందో లఘుచిత్రం పూర్తవుతూనే మేమిక వీటిని తీయడం నిలిపేస్తున్నాము. సినిమాల్లోకి వెళ్లాలన్నదే మా లక్ష్యం..” అని చెప్పారు ఇద్దరూ. ప్రస్తుతం సినిమా ఆఫర్లు వస్తున్నా.. తమ ప్రతిభా నైపుణ్యాలను మరింత పదును పెట్టుకునేందుకు- మద్రాసులోని ‘ఎల్.వి.ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ’లో ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు సుభాష్‌చంద్ర. అతని దోస్తు ధీరజ్ హైదరాబాద్‌లోని ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’లో డైరెక్షన్‌లో మాస్టర్ కోర్సు చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ కోర్సుల్ని పూర్తి చేసుకుని ఫిల్మ్‌నగర్‌లోకి ఎంటర్ కావడానికి సిద్ధం అవుతున్న ఈ ఇద్దరు కుర్రాళ్ల ‘సినిమా కల’ త్వరగా పండాలని ఆశిద్దాం.
ం మల్లెంపూటి ఆదినారాయణ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.