తెలుగే తెలంగాణ భాష

ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మలయాళ నవల అనువాదం ‘స్మారక శిలలు’కు ఈ అవార్డు లభించింది. నలిమెల భాస్కర్ అనువాదకులే గాకుండా కవి, రచయిత, పద్నాలుగు భారతీయ భాషల్లో ప్రవీణులు. అన్ని భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. భాస్కర్ ‘తెలంగాణ పదకోశ’ సృష్టికర్త కూడా. తెలుగు భాష ఆంధ్ర భాష వేరు వేరే అంటున్నారు. తెలుగే తెలంగాణ అని కూడా నిక్కచ్చిగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలంగాణ రచయితల వేదికకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. భాస్కర్‌తో అదే జిల్లాకు చెందిన కవి అన్నవరం దేవేందర్ సంభాషణ…

ం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో తెలంగాణ పదకోశ నిర్మాతగా ఈ పురస్కారం పొందటం పట్ల ఎట్లా అనుభూతి పొందుతున్నారు?
– సంతోషం సహజమే. అయితే ఈ పురస్కారం కేవలం వ్యక్తిగా నాకు మాత్రమే వచ్చిందని అభిప్రాయపడడం లేదు. నా సమకాలికులు అందరికీ, సమవయస్కులు అందరికీ ఈ బహుమతి వచ్చిందన్నదే నా భావన. యావత్ తెలంగాణ ప్రాంతానికి, ఇంకా విస్తృతార్థంలో తెలుగు వాళ్లందరికీ ఈ అవార్డు వచ్చినట్లు లెక్క. అయితే పురస్కారాలు, సన్మానాలు రచయితల్లో మరింత బాధ్యతను కూడా పెంచుతాయి. తెలంగాణ సాధించుకున్న ఒకానొక మహోన్నత సన్నివేశంలో జాతీయస్థాయి పురస్కారం వచ్చిన మొదటివ్యక్తిగా నిలవడం సంతోషం కాక మరేమిటి?

ం సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉన్నది కదా! ఇలా అనువాదం మీదనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు?
– అవును. ఎన్నో ప్రక్రియల్లో ప్రవేశమున్నా ఒక మేరకు కృషి చేసినా నన్ను అమితంగా ఆకట్టుకున్నది మాత్రం అనువాదమే! అనువాదాలు లేకపోతే అడుగు ముందుకు పడని పరిస్థితి. సమాచార యుగం ముఖ్యం గా అనువాదాల మీద ఆధారపడి ఉన్నది. తెల్లవారి లేచింతర్వాత మనం చదివే జాతీయ అంతర్జాతీయ వార్తల అనువాదం, రామాయణ, మహాభారతం, భాగవతం, ఖురాన్, బైబిల్ గ్రంథాల అనువాదాలు లేకపోతే ఆధ్యాత్మిక వికాసమే లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల అనువాదాలు లేకపోతే సమాజ పురోగతి సున్నా. పైగా కీర్తి కాంక్ష పెద్దగా లేనివాళ్లే అనువాదాలు చేస్తారు. రెండు భాషలు తెలిసివున్నప్పుడు అవతలి భాషలో జరుగుతున్న పరిణామాలను మాతృభాషీయులకు అందించకపోవడం మహాపరాధంగా భావిస్తాడు అనువాదకుడు. ఇరుగుపొరుగు విషయాలను స్వంతభాషీయులకు చేరవేసే ఒక గొప్ప అవకాశం అనువాదకులకే ఉంటుంది. కనుక నేను వాటి మీదనే దృష్టి ఎక్కువ కేంద్రీకరించాను.

ం తెలుగు సాహిత్యంలో అనువాద ప్రక్రియ ఎలా ఉంది? మన భాష ఇతర భారతీయ భాషల్లోకి వెళ్లుతున్నదా? ఇతర భాషా సాహిత్యం తెలుగులోకి విరివిగా వస్తుందా?
– ఒక్క తెలుగు భాషకు మాత్రమే సీమితమై ఆలోచిస్తే బాగానే ఉంది. కాని ఇతర భాషలతో పోల్చిచూస్తే మాత్రం తెలుగులోనికి వస్తున్న అనువాదాల సంఖ్య స్వల్పం. ఇంక మన సాహిత్యం ఇతర భాషల్లోకి చాలా తక్కువగా వెళుతున్నది. దానిక్కారణం అటు అనువాదకుల అనాసక్తీ, ఇటు మూల భాషా రచయితల ఉదాసీనతా. మూల రచయితలు తమ భాషలోనే ఇంకొక పుస్తకం వేసుకుంటే బాగుండును అనుకుంటున్నారు తప్పితే అనువాదకులను గుర్తించి వారి ద్వారా తెలుగు సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాలనుకోవడం లేదు.

ం తెలుగు సాహిత్యంలోని తెలంగాణ, కళింగాంధ్ర, రాయలసీమ అస్తిత్వంతో వచ్చే కథలు కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదానికి సునా యాసంగా లొంగుతాయా?
– అస్తిత్వ చైతన్యంలో భాగంలో వచ్చే రచనలు సాధారణంగామాండలికాల్లో ఉంటాయి. ఇవి అనువాదాలకు కొంచెం కష్టంగానే లొంగుతాయి. ఏమీ చేయకుండా వుండడం కన్నా ఎంతో కొంత చేయడం సంతోషించదగ్గ పరిణామం కనుక కష్టమైనా చేయకతప్పదు. అయితే దీనికి ఒక వెసులుబాటు ఏమంటే తెలుగు తెల్సిన ఇతర భాషీయులు తమ భాషలోనికి ఇటువంటి అనువాదాలు చేస్తే పకడ్బందీగా వస్తాయి.

ం తెలుగు సాహిత్యం ఇంకా ఇతర భాషల్లోకి వెళ్లడానికి ఉన్న అడ్డంకులేమిటి? ఇంకా విస్తృతం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది?
– ప్రధానమైన అవరోధం మూలభాష, లక్ష్యభాష- రెండూ తెలిసిన వాళ్లు తక్కువగా వుండడం. అట్లాంటి వ్యక్తులు ఉన్నా అనువాదాన్ని ఒక తపస్సుగా భావించకపోవడం. అట్లా అదొక మహత్తర కార్యం అని భావించినప్పటికీ వాళ్లు చేసిన అనువాద గ్రంథాల్ని వాళ్లే స్వయానా అచ్చు వేయించవలసి రావడం. వెరసి ఈ పరిస్థితులన్నీ అనువాదాలకు అడ్డంకులు అవుతున్నై. మరేం చేయాలి? మూలభాషా రచయితలు సైతం కొంత తమ చేతి చమురు అనువాద రచనలకు వదిలించుకోవాలి. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే- ప్రత్యేకంగా అనువాదాల కొరకు సంస్థలు ఏర్పడాలి. ప్రధానంగా విశ్వవిద్యాలయాలు, అకాడమీలు విశాల దృక్పథంతో అనువాదాల మీద దృష్టి సారించాలి.

ం తెలంగాణ పదకోశ నిర్మాణం చేసిన మీరు తెలుగు భాష వేరు ఆంధ్ర భాష వేరు అని పలు సందర్భాల్లో అన్నారు కదా! అట్లాగే తెలంగాణ భాష కూడా వేరే అంటున్నారు. దీన్ని విశ్లేషించండి.
– తెలుగు, ఆంధ్రం, తెనుగు.. పర్యాయ పదాలు అని భాషాశాస్త్రవేత్తల భావన. నా అభిప్రాయం ఏమంటే.. తెలుగు, తెనుగు పర్యాయ పదాలైనా ఆంధ్రం కాదని. ఆంధ్ర పదం ముందు జాతివాచి. తర్వాత భాషావాచకం. పైగా ఆంధ్రపదంలో ఉన్న మహాప్రాణాక్షరం ‘ధ’, అది తెలుగు అక్షరం కాదని తెలియచేస్తున్నది. తెలుగులో మొదట మహాప్రాణాలు లేవు. ఈ ఒత్తక్షరాలన్నీ సంస్కృతం నుండి దిగుమతి అయినవి. అందుకే చిన్నయసూరి ‘తెలుగు భాషకు వర్ణములు ముప్పదియారు’ అన్నట్లున్నాడు. ప్రౌఢవ్యాకర్త బహుజనపల్లి ‘ఆంధ్ర భాషకు వర్ణములు యాభై ఐదు’ అన్నాడు. ఈ రెండూ వేర్వేరు భాషలని ఆ వ్యాకరణవేత్తలే తేల్చిచెప్పారు. అయితే భాషావేత్తలు మాత్రం అంగీకరించరు.

తెలుగు పదం మొదట భాషావాచి. తెలుగు భాష దేశిసాహితీ సంప్రదాయానుసారి. ఆంధ్ర భాషా సంస్కృతాలు మార్గానుయాయులు. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ మనం మాట్లాడుతున్న భాష కేవలం తెలుగే అనీ, కేవలం ఆంధ్రే అనీ నిర్ధారించలేని పరిస్థితి. రెండూ విడదీయలేనంతగా కల్సిపోయాయి. వర్గయుక్కుల్ని సైతం స్వీయం చేసుకున్నాం.
ఇంక తెలంగాణ భాష ముచ్చట. తెలుగు భాషనే తెలంగాణ భాష. ఆ లెక్కన చూసినప్పుడు ఆంధ్ర భాష, తెలంగాణ (తెలుగు) భాష రెండూ వేరు వేరు అవుతాయి. అస్తిత్వ ఉద్యమాల కారణంగా కూడా తెలంగాణ ప్రాంతంలోని కవులు రచయితలకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మా భాష వేరు, మా ప్రాంతం వేరు, మా సంస్కృతీ సంప్రదాయాలు వేరు అన్న ఒక అనివార్య స్థితి వచ్చింది. చాలా ఏండ్లు వెనుకబాటుతనానికి గురైన కారణంగా కూడా తెలంగాణ భాషలో పాతకాలం నాటి అసలు సిసలు తెలుగుపదాలు అట్లాగే మిగిలిపోయిన పరిస్థితిని గమనిస్తున్నాం.

ం ‘తెలంగాణ పదకోశం’ ఇంకా విస్తృత పరుస్తున్నారా! దీని నిర్మాణంలో కష్టనష్టాలేమిటి? గతంలో మీ అనుభవాలేమిటి?
– పదకోశం మొదట ఆరువేల పదాలతో వచ్చింది. అది కేవలం ఒక ఆరునెలల పాటు ప్రామాణిక భాషకు బదులుగా తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అని ప్రశ్నించుకొని సమాధానాలు పొందిన పరిస్థితి. రెండవసారి దాదాపు పదివేల పదాలతో తెరవే ముద్రించింది. ఈసారి కనీసం 15000 పదాలకు తగ్గకుండా తీసుకొని రావాలన్నది సంకల్పం. సంప్రదాయ నిఘంటువుల నిర్మాణం కొంత సులభం. ఆ మార్గంలో అంతకుముందు కొంత పని జరిగివుండడం దానిక్కారణం. ప్రాంతీయ పదకోశాలు వేయడం నల్లేరు మీద నడక కాదు, అది పల్లేరు కాయల మీది పడక. పైగా సాహిత్యంలో ఇది కవిత్వాలు, కథలు, నవలలకు మాత్రమే పరిమితమైన కాలం. మునుపటివలె పరిశోధన, విమర్శ, సమీక్ష, నిఘంటు నిర్మాణం, భాషా చరిత్ర, వ్యాకరణాది ప్రక్రియలు చలామణిలో వున్న సమయం కాదిది. తెలుగులోని సాఫ్ట్‌వేర్ కూడా చాలా సందర్భాల్లో అకారాది క్రమానికి మూడు అక్షరాల తర్వాత సపోర్టు చేయడం లేదు. కార్డు సిస్టమ్‌తో నిఘంటు నిర్మాణం ఒక్కరితో కాని పని.

ం మీకు పద్నాలుగు భారతీయ భాషలు వచ్చుడు సామాన్యమైన విషయం కాదు. ఎట్లా నేర్చారు? ఆయా భాషా సాహిత్యాల పట్ల అధ్యయన ఆసక్తి ఎట్లా కలిగింది?
– నేను కొలమార్ (రైల్వే స్టేషన్)లో 1979లో మొదట ఉపాధ్యాయుడిగా నియుక్తున్ని అయినాను. ఆ వూళ్లో గ్రంథాలయం లేదు. ఊరికి పేపర్ రాదు. నాకేమో బాగా చదవడం అలవాటు. ఇంకొక వ్యాపకం తెలియదు. అప్పటికి నా పుస్తకాలు మూడు అచ్చయినాయి. కాలక్షేపం చేయాలి. బోలెడంత తీరిక వుంది. అందుకని మొదట ’30 రోజులలో కన్నడ భాష’ పుస్తకం పట్టాను. అది ఒక మేరకు వచ్చింది. తర్వాత తమిళం మొదలైన భాషలతో కుస్తీ. ఏకకాలంలో రెండు మూడు భాషల్ని తులనాత్మకంగా పొల్చుకుంటూ నేర్చుకున్నాను కనుక పలు భాషల అధ్యయనం సులువైంది. తులనాత్మక వివేచనతో నేర్చుకోవడం వల్ల ఏకకాలంలో చాలా భాషలు నేర్చుకోగలం అన్న స్పృహ పెరిగింది నాలో.

ం అనువాదంలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు? సాహిత్యంలో స్ఫూర్తి దాతలు ఎవరు? ఎట్లా మీకు సాహిత్యం పట్ల ఆసక్తి అబ్బింది?
– అనువాదంలో పాతతరం అనువాదకులు చాలా గొప్పవాళ్లు. వాళ్లకు అనువాద సిద్ధాంతం మొదలైన శాస్త్ర విషయాలు తెలియకపోవచ్చు. కానీ వాళ్లు పాఠకుని దగ్గరికి చక్కని అనువాదాలు తీసుకొని వెళ్లారు. మద్దిపట్ల సూర్తి, సూరంపూడి సీతారాం, గన్నవరపు సుబ్బరామయ్య, యజ్ఞన్నశాస్త్రి, వాకాటి, చల్లా రాధాకృష్ణశర్మ, సహవాసి ఇట్లా ఎందరెందరో వున్నారు స్ఫూర్తి ప్రదాతలు. సాహిత్యంలో రంగనాయకమ్మ, శ్రీశ్రీ, తిలక్ తదితరులు చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. మా వూరు నారాయణపురంలో వున్న శ్రీరామా చందాదారుల గ్రంథాలయంలోని పుస్తకాలే నాలో సాహిత్యాసక్తిని పెంచాయి.

ం తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యం ఎట్లా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు?
– తెలంగాణ సాహిత్యం ఇప్పటివరకు వివక్షతో ఏర్పడిన ఖాళీలు ఏమైనా ఉంటే పూరించాలె. కవిత్వం, కథలు, నవలలు మొదలైన ప్రక్రియలు కొత్త రాష్ట్రంలో కూడా సుభిక్షంగా, సలక్షణంగా వుంటాయి. అందులో సందేహం లేదు. కానీ పరిశోధనాత్మక విశ్లేషణ బాగా జరగాలి. తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలంగాణ భాషా చరిత్ర, తెలంగాణ వ్యాకరణం, తెలంగాణ చరిత్ర, ఆయా తెలంగాణ కవుల పదప్రయోగ సూచికలు, నిఘంటువులు మొదలైన వాటితో తెలంగాణ సాహిత్యం పరిపుష్టం కావలసిన అవసరం వున్నది.

ం ‘స్మారక శిలలు’ నవల విషయం కొంచెం వివరించండి.
– ‘స్మారక శిలలు’ మలయాళ నవల. ఆ నవలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు ఏనాడో వచ్చింది. రచయిత డా.పునత్తిల్ కుంజబ్దుల్ల. ఇది ముస్లిమ్ జీవన విధానానికి సంబంధించిన నవల. ఒక చిన్న పల్లెటూరు. ఆ వూళ్లో ఒక శ్మశానవాటిక. ఓ మసీదు. వీటి నేపథ్యంలో.. అంటే శ్మశాన వాటికలోని సమాధుల్లోంచి ఒక్కొక్క పాత్రా మళ్ళీ పునరుత్థానం చెంది తమ అనుభవాలను ఏకరువు పెడుతాయి. రచయిత ఒక కొత్త శిల్పంతో ఈ నవలను రచించాడు. స్త్రీలోలుడైన ఒక పెద్దమనిషి ఎట్లా హత్యకు గురైతాడు; తనకూ, ఒక స్త్రీకీ కల్గిన కొడుకును ఎట్లా పెంచి పెద్దచేస్తాడు; అట్లా పెరిగిన పిల్లవాడు చివరికి అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్లవలసి వస్తుం ది; దయాలు భూతాల నమ్మకాలు ఎట్లా ఉంటాయి మొదలైనవన్నీ ఇతివృత్తంలో భాగాలే!

ం రానున్న కాలంలో మీ ప్రణాళికలు ఏమిటి?
– రానున్న కాలంలో మొదట బసవ పురాణాన్ని ఆధారంగా చేసుకొని పాల్కురికి సోమన పదప్రయోగ సూచికను వెల్వరించడం. నన్నయ, నన్నెచోడుడు, తిక్కన, శ్రీనాథుల పదప్రయోగ కోశాలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యాయి. అందుకే ఇప్పుడు దేశి కవితా సంప్రదాయ సారధి సోమనకు సూచిక సిద్ధం చేయడం. ఆ పిదప పోతన, భక్త రామదాసాదుల సూచికల తయారీ. ‘తెలంగాణ సామెతలు’ ఒక సంకలన గ్రంథంగా తీసుకొని రావాలె. మరొకవైపు అనువాదాలు కూడా విరివిగా చెయ్యవలసిన అవసరం ఉన్నది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to తెలుగే తెలంగాణ భాష

  1. aksastry's avatar aksastry says:

    పాపం ఈయన నాచన సోముడూ వగైరాల గురించి తపిస్తూంటే, కొంతమంది వీర తెలంగాణులు హైదరాబాదు తెలుగూ, కేసీ ఆర్ మాట్లాడేదే తెలుగు అంటున్నారు. దానికి తెలంగా అనో, త్లంగా అనో పేరుకూడూ పెట్టారంటున్నారు కొందరు.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.