మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. తీవ్రవాదిగా బయలుదేరిన రాయ్ క్రమంగా అం తర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడుగా రూపొంది, చివరికి రాడికల్ హ్యూమనిస్టు సిద్ధాంతకర్తగా పరిణతి చెందాడు.
1946లో రాయ్ 22 సిద్ధాంతాల రూపంలో రాడికల్ హ్యూమనిస్టు తత్వాన్ని ప్రతిపాదించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలపై ఆధారపడి నిర్మించిన తాత్విక సిద్ధాంతమే రాడికల్ హ్యూమనిజం. ఈ నవ్య సిద్ధాంతం తాత్విక రంగంలో భౌతిక వాస్తవికవాదాన్ని, సామాజిక రంగంలో సమతావాదాన్ని, రాజకీయ రంగంలో పార్టీరహిత నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని, ఆర్థికరంగంలో సహకార ఆర్థిక విధానాన్ని ప్రతిపాదిస్తుంది. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి స్వేచ్ఛగా, హుందాగా జీవించే హక్కును గుర్తించే వైఖరిని, తత్వాన్ని మానవవాదంగా నిర్వచించవచ్చు. అన్నిటికీ మానవుడే ప్రమాణమనేది దాని మౌలిక సూత్రం. మానవుడు తనకుతానే లక్ష్యం. మరొక లక్ష్యానికి అతడు సాధనం కారాదు. సమాజం మానవుని సృష్టి. తన సుఖ సంతోషాల కోసం స్వేచ్ఛ కోసం తాను చాలా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి వాటికి తానే బానిసగా మారిపోయాడు. కులం, మతం, జాతి, వర్గం వంటివన్నీ సమష్టి మిథ్యా భావనలు. వాటి కోసం వ్యక్తులను బలిచేయడం జరుగుతోంది.
స్వార్థ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అందుకోసమే తమకు అధికారం కావాలంటాయి. చివరికి అధికారం కోసం పోరాటంలో అనేక రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయి. జాతి, కులం, మతం, వర్గం, ప్రాం తం వంటి సంకుచిత భావాలను రెచ్చగొట్టి విద్వేషాలను పురిగొల్పుతున్నాయి. లక్ష్యం ప్రజాసంక్షేమం నుంచి అధికారం మీదకు, అక్కడి నుంచి ధనార్జన మీదకు మారుతుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అంతమై పార్టీస్వామ్యం, పార్టీ నాయకస్వామ్యం అవతరించింది. అంటే పార్టీ నాయకుల నియంతృత్వమే ప్రజాస్వామ్యంగా పరిణమించడం జరుగుతుంది. ఈ కారణం చేతనే పార్టీ రహిత ప్రజాస్వామ్యం కావాలంటుంది రాడికల్ హ్యూమనిజం.
ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోడానికి చిన్న చిన్న స్థానిక ప్రజాసంఘాలుగా ఏర్పడాలి. ఈ స్థానిక సంఘాలు రాజ్యానికి పునాదిగా ఉండాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ సంఘాలు ఏర్పడాలి. రాజకీయ విధులన్నీ వికేంద్రీకరించబడాలి. ఈ ప్రజాసంఘాలు స్థానిక స్వపరిపాలనాంగాలుగా పనిచేయాలి. అప్పుడు పిరమిడ్ ఆకారంలో ఏర్పడే రాజ్యవ్యవస్థ, రాజ్య విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. శాసనసభలకు సభ్యులను ఎంపిక చేయడమే గాక కొత్త చట్టాలను ప్రవేశ పెట్టడానికి, ప్రజాప్రతినిధులను వెనుకకు పిలిపించడానికి (రీకాల్) ప్రధాన సమస్యల విషయమై అభిప్రాయ సేకరణకు అధికారం ఉండాలి. ఈ భావాలనే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తన ‘సంపూర్ణ విప్లవం’లో ప్రతిపాదించారు.
పార్టీ లేకుండా రాజకీయాలు సాధ్యమా అని సందేహించే వారున్నారు. ఆ దిశగా ప్రయత్నించకుండానే నిర్ణయాలకు రావడం తొందరపాటవుతుంది. అయితే పార్టీరహిత రాజకీయాలు విజయవంతం కావాలంటే ముందుగా ప్రజలంతా విద్యావంతులు, చైతన్యవంతులు కావాలి. అందుకే అన్నిటికన్నా ముందుగా భావాలలో మార్పు రావాలి. భావాలలో వచ్చే మౌలిక మార్పునే ‘భావ విప్లవం’ అంటాం.
గుమ్మా వీరన్న
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం
(నేడు ఎం.ఎన్.రాయ్ 128వ జయంతి)

