జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2
పురాణాలలో ప్రభాస్
వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ బడింది . వృక్ష శాస్త్ర విభాగం లోనూ ఇంతే ప్రసిద్ధి పొందింది .ఏడు ఎనిమిది శతాబ్దాలలో ప్రభాస్ మరీ వెలుగు లోకి వచ్చింది .అన్ని గ్రంధాలో ఈ క్షేత్రం గురించిన విశేషాలన్నీ ఉన్నాయి .
స్కంద పురాణం ప్రభాస ఖండం లో దీని పై ఎన్నో కధనాలున్నాయి .అందులో కొన్నిటిని తెలుసు కొందాం .ప్రభాస ఖండం పూర్తిగా సోమనాధ లింగ వైభావానికే ప్రాముఖ్యతనిచ్చింది .దక్షప్రజాపతి తన 27గురు పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు .కాని చంద్రుడు అందులో రోహిణి పై మాత్రమె ప్రేమ చూపించి మిగిలిన 26గురిని దగ్గరకు తీయలేదు .వీరు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తండ్రి కి ఫిర్యాదు చేశారు. .దక్షుడు చంద్రునితో అందర్నీ సమానం గా చూడమని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. వినలేదు .కోపగించిన దక్షుడు అల్లుడు చంద్రుని కుష్టు వ్యాధి సోకి బాధ పడాలని శపించాడు .దీనితో చంద్రుడు కాంతి విహీనుడై వెలవెల బోయాడు .దీని ప్రభావం భూమి మీద ,సముద్రాల మీద పడింది .ప్రపంచం అల్ల కల్లోల మైంది .ఈ బాధ నుండి రక్షించటానికి మహర్షులు దక్షుని దగ్గరకు చేరి శాపం ఉపసంహరించమని కోరారు .శాప ఉపసంహారం తన చేతిలో లేదని ,కాని శివ దేవుని అనుగ్రహం సంపాదిస్తే ఉపశమనం కలగ వచ్చునని సలహా చెప్పాడు .
చంద్రుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు .సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తాను చంద్రుని పూర్తీ గా స్వస్తుడిని చేయ లేనని కాని నెలలో పది హీను రోజులు ప్రకాశ వంతం గా ,మిగిలిన పది హీను రోజులు కళ తగ్గి కనిపించేట్లు చేయగలనని చెప్పాడు .సరే అంతవరకైనా నయం అని సంతోషించాడు అందుకే చంద్రునికి నెలలో శుక్ల ,కృష్ణ పక్షాలు ఏర్పడి మొదటి దానిలో కళలు పెరిగి రెండవ పక్షం లో క్రమం గా తరిగి పోతాయి .ప్రభాస తీర్ధం లో సోమనాధ జ్యోతిర్లిన్గాన్ని అర్చించి చంద్రుడు ఈ తపస్సు చేసి శివుడిని మెప్పించాడు .స్వామి కోడి అంగం పోలిక తో దర్శనమిచ్చాడు .ఆ రూప శివ లింగాన్నే చంద్రుడు ఇక్కడ ప్రతిష్ట చేసి యజ్న యాగాలు నిర్వహించాడు. సోముడు అంటే చంద్రుడు ప్రతిస్టించాడు కనుక సోమనాధ లింగం అయింది .
దేవ దానవుల యుద్ధం లో రాక్షసులను జయించటం అసాధ్యం అని భావించిన దేవతలు దధీచి మహర్షి ని ఆశ్రయింఛి ఆయన శరీరం లోని ఎముకలను దానం చేయమని అర్ధిం చారు . వాటి తో దేవతలు ఆయుధాలు చేసుకొని రాక్ష స సంహారం చేస్తారని వేడుకొన్నారు .దేవతల ప్రార్ధన మన్నించి దధీచి మహర్షి యోగ సమాధి చెంది,స్వచ్చంద మరణం పొందాడు .దేవతలు దధీచి మహర్షి ఎముకలను శరీరం నుండి వేరు చేశారు .ఇంద్రుడు దధీచి ప్రక్కటెముక తో వజ్రాయుధం తయారు చేయిన్చుకొన్నాడు .అలాగే మిగిలిన దేవతలు ఎముకలను తీసుకొని తమ తమ ఆయుధాలను తయారు చేయిన్చుకొన్నారు . మహర్షి శరీరం లోని రక్త మాంసాలను కామ ధేనువు నాకేసి ఖాళీ చేసి తోడ్పడింది . ఈ సంఘటన జరిగి నప్పుడు దధీచి మహర్షి కొడుకు పిప్పలాదుడు చిన్న పిల్లాడు .అతను పెద్ద వాడై తన తండ్రికి జరిగిన జరిగిన అవమానకరమైన ,బాధా పూరితమైన మరణానికి ,దేవతలా కుటిలత్వానికి ప్రతీకారం తీర్చుకొవాలను కొన్నాడు .దీనికోసం అగ్ని దేవుడి అనుగ్రహం సంపాదించాలని తపస్సు చేసి మెప్పించి సముద్రం లో ఉండే ‘’బడబానలం ‘’తనలో చేరేట్లు వరం పొందాడు .తన తండ్రి దధీచి మరణాకి కుట్ర చేసిన దేవతల నందర్నీ నాశనం చేయమని బడబానలాన్ని ఆదేశించాడు .దీనికి భయపడ్డ దేవతలు విష్ణు మూర్తి ని శరణు వేడుకొన్నారు .
విష్ణువు ఆదరా బాదర పరిగెత్తుకొచ్చి పిప్పలాదుని రోజుకు ఒక్క దేవతను మాత్రమె చంపెట్లు ఒప్పించాడు .మొదటగా వరుణ దేవుడిని చంపాలని నిశ్చయించుకొన్నాడు .సరస్వతీ దేవిని భూమి మీదకు బడబానలాన్ని తీసుకు రమ్మనమని కోరాడు .అలాగే చేసింది సముద్ర తీరాన బడబాన అగ్ని సరస్వతి చేసిన పనికి సంతృప్తి చెంది వరం ప్రసాదిస్తానన్నాడు .విష్ణు మూర్తి ముందు గా చేసిన హెచ్చరిక తో సరస్వతి దేవి బడబానలాగ్ని మూతి ని సూది బెజ్జం అంత చిన్నది గా చేసుకొని సముద్ర జలాలను పీల్చి ఖాళీ చేయమని కోరింది .ఆ కోరికను మన్నించాడు బడబానలుడు .సరస్వతికి వరం ప్రసాదించాడు .తర్వాత సముద్రాన్ని ఆ బుల్లి మూతి తో తాగి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కాని శక్యం కాలేదు .కనుక వరుణ దేవుడిని సంహరింప లేకపోయాడు బడబానలుడు .ఇచ్చిన మాటకు నిలబడి బడబానలాగ్ని సముద్రం లోనే ఉండి పోయింది .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-14-ఉయ్యూరు

