జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1
భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా మొదలై యెంత ఉత్కృష్ట దశ అనుభవించి పతన మైనదీ , మళ్ళీ ఏ విధం గా పునర్వైభవం తో భక్తజన సందోహానికి ఏ విధం గా స్పూర్తి దాయకం అయిందీ మొదలైన అంశా లను ఇందులో తెలియ జేసే ప్రయత్నం చేస్తున్నాను .ఇది ‘’శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ ‘’గారి చారిత్రిక నవల కాదు .అన్ని అంశాల ప్రస్తావన ఉన్న వ్యాస పరంపర .ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తున్నాను .
చరిత్రకు పూర్వ ప్రభాసం
‘’దేవతేర్పి దుష్ప్రాకో మెహ్ సంగ్యంస్య రూపో సర్వాంశముం –తీర్దానా ప్రధాన తీర్ధస్య రూపః ప్రభాస్ తీర్ధ ముత్తమం ‘’
అన్ని తీర్ధాలలో ప్రభాస తీర్ధం ఉత్తమ మైనదని దీని భావం .భారత దేశ పడమటి భాగం లో సౌరాష్ట్ర ప్రదేశం అరేబియా సముద్ర తీరం లో లో ‘’ప్రభాస తీర్ధం ‘’విరాజిల్లింది .ఇదే ప్రఖ్యాత సోమనాధ మహా లింగ క్షేత్రం .ఈ ప్రభాస తీర్ధం లోనే భగవాన్ శ్రీ కృష్ణుడు తన అవతార సమాప్తి చేశాడు .సముద్ర తీర ప్రాంతం కనుక ఇక్కడ వేసవిలోనూ శీతాకాలం లోను ఉష్నోగ్రతలలో పెద్దగా వ్యత్యాసం ఉండదు .ఇక్కడ వేసవి చల్లగా ఆహ్లాదకరం గా ఉండటమే ప్రభాస తీర్ధం ప్రత్యేకత .ప్రభాస తీర్దానికి దాగ్గర రైల్వే స్టేషన్ నాలుగున్నర కిలో మీటర్ల దూరం లో ‘’వేరేవాల్ ‘’లో ఉంది .1948వరకు ప్రభాస తీర్ధాన్ని ‘’ప్రభాస పట్టణం ‘’అనే వారు ఆ పేరుతోనే తాలూకా ,మునిసిపాలిటీ కూడా పిలువ బడేది .పూర్వపు జునాగద్ రాష్ట్రం లో ఇది ప్రధాన పట్టణం .1948తరువాత ఈ మునిసిపాలిటీ తాలూకా ను ‘’వేరేవాళ్ ‘’మునిసిపాలిటీ లో కలిపేశారు .దీని వలన ఈ ప్రాంత సాంఘిక ,రాజకీయ ,వాణిజ్య ప్రాముఖ్యత తగ్గి పోయింది .
ప్రభాసా తీర్ధం వైశాల్యం 2180ఎకరాలు .దీనికి దక్షిణం లో సముద్రం ,ఉత్తరం వైపు వ్యవసాయ భూములు ,ఫల వృక్షాలు ,ఉద్యాన వనాలున్నాయి .పడమర అంతా ఇసుక ఎడారి, స్మశానం .తూర్పున అంతా నిరూప యోగ భూమి ఉంది .కనుక దీని అభి వృద్ధి తూర్పు వైపుకే సాధ్యం గా ఉంది .ఎవరికీ శ్రద్ధ లేక పోవటం తో చాలా కాలం ఇది అభి వృద్ధికి నోచు కోలేదు .సోమనాధ దేవాలయ ట్రస్ట్ మాత్రం తన పరిధిలో కొంత అభివృద్ధి పనులు చేస్త్తూ ఉంది .
పూర్వకాలం లో ప్రభాస తీర్ధం ‘’శీట్లా’’ లో సూర్య దేవాలయం వరకు విస్త రించి ఉండేది .నగ్రాదిల్ లో సూర్యాలయము ఉన్న ప్రాంతాన్ని ‘’నగర్ పూర్ ‘’అనే వారు .ఇక్కడే గంగానది ,హిరణ్య సరితా నదులు సంగమిస్తాయి దీన్ని సంగం ఆని పిలుస్తారు .ఇక్కడ త్రవ్వకాలు జరిపిన పురా వస్తు శాఖ వారికి వేదకాలం కంటే ముందు న్న వస్తువులు లభించాయి .ఇదీ దీని ప్రాధాన్యత .500కు పైగా నాగరకత లు ఇక్కడ వెళ్లి విరిశాయని ఆ శాఖ పేర్కొన్నది .చరిత్రకు పూర్వమే ఇక్కడ అనార్య సంతతి అయిన ‘’మీనూర్ ‘’అనే జాతి ఉండేదని పరిశోధనలో తెలిసింది .ఇక్కడి నుండి అనేక ఆర్య ఓడరేవులకు వర్తక వాణిజ్యాలు ఎగుమతి దిగుమతులు జరిగేవి .ఇలా కొన్ని శతాబ్దాలు గడిచాయి తరువాత సూర్య వంశానికి చెందిన ఆర్యులు సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకొని స్థానిక జాతులను వెడల గొట్టారు .వారు ఇక్కడ ‘’అర్క తీర్ధం ‘’లేక భాస్కర తీర్ధం ‘’అనే పేర యాత్రా స్థలం ఏర్పాటు చేశారు .కొంతకాలం తరువాత చంద్ర వంశానికి చెందిన వారు ఇక్కడికి వచ్చి,బలాన్ని పొంది ‘’సోమ తీర్ధం లేక చంద్ర తీర్ధం గా మార్చారు .మరి కొంత కాలం గడిచిన తర్వాత సూర్య ,చంద్ర వంశీయుల మధ్య సయోధ్యత కుదిరి ‘’ప్రభాస తీర్ధం ‘’గా ఈ ప్రదేశాన్ని పిలుచుకొన్నారు .అప్పటి నుంచి ఆ పేరే స్తిర పడి పోయింది .
ప్రభాస్
స్కంద పురాణం లో ఒక కద ఉంది .దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుడు ఒక్క రోహిణి నే చేర దీసి మిగిలిన భార్యలను దూరం చేసి నందువల్ల దక్షుడు కోపించి చంద్రుడికి ‘’కుష్టు వ్యాధి ‘’సోకాలని శపించాడు .అప్పుడు శాప విమోచనం చెప్పమని మామ ను ప్రార్ధిస్తే సోమనాధుని అర్చించ మని చెప్పాడు. చంద్రుడు ఇక్కడికి వచ్చి శివుడిని గూర్చి తపస్సు తో సోమనాదార్చన చేసి వ్యాధి నుండి విముక్తుడైనట్లు ఉంది .అందుకే ‘’ప్రభాస తీర్ధం ‘’అయింది .ఈ ప్రాంతం లో సూర్య ప్రకాశం చంద్ర శీతలం రెండూ సమానం గా ఉంటాయి కనుక ‘’ప్రాభాస తీర్ధం ‘’అనే పేరు సార్ధకమయింది .ప్రభాసం అంటే ఉద్యయించే సూర్యుడుఉన్న ప్రభాతం .స్కంద పురాణం మొదటి అధ్యాయంలో దీనికి నందన,శివ ,ఉగ్ర ,భద్రకా ,సమిదాన్ ,కామద్ ,వశ్వరూప్ ,పద్మనాభ్ ,సుదర్శన్ ,మోక్ష మార్గ్అనే పేర్లున్నాయి .
మహా భారత కాలం లో దీనికి భాస్కర తీర్ధం అని పిలిచారు .భాస్కర తీర్ధం ,అర్క తీర్ధం,సోమ తీర్ధం అని కూడా పిలువ బడింది .సరస్వతీ తీర్ధం అనీ పేరుంది .శివ పట్నం అనీ అంటారు .జైన సాహిత్యం లో ‘’చంద్ర ప్రభాస్ పట్నం ‘’అన్నారు .గుజరాతీ సాహిత్యం లో ‘’ప్రభావ దేవ పట్నం ‘’అంటారు .మొగలాయిలు పట్టణ దేవ్ అంటే సోమ్ పూర్ అని ,సంవత్ అని విల్విపూర్ పట్నం అని ,సుర్ పట్నం అని సోమనాద్ పురం అని పేర్లున్నాయి .
మహా భారత కాలం లో ప్రభాస్ ఒక గొప్ప ఆధ్యాత్మిక తపో కేంద్రం గా ,పవిత్ర తీర్ధం గా ప్రసిద్ధి చెందింది .శ్రీ కృష్ణ విహార భూమి అవటం తో దీని ప్రాశస్త్యం మరీ పెరిగి పోయింది .పాండవులకు యాదవులకు యాత్రా స్థలం అయిందని భారతం అరణ్య పర్వం లో ఉంది .’’సౌరాష్ట్ర దేశీయ స్తితే –సాగర తటే ప్రభాస తీర్ధః ‘’అని ఉంది .కృష్ణుని అన్న బల రాముడు ఈ క్షేత్ర దర్శనం చేసినట్లు భారతం లో శల్య పర్వం లో ఉన్నది .వన పర్వం లో యాదవ ,పాండవులు ఇక్కడ ఆవాసం ఉన్నట్లు ఉంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-14-ఉయ్యూరు

