వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య

ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో పాటు, విప్లవ వీరుల సాహసోపేత సంఘటనలు కూడా దోహదపడ్డాయి. ఆ విప్లవ వీరుల్లో మొదటిగా చెప్పుకోదగిన వారిలో షహీద్‌భగత్ సింగ్ అగ్రగణ్యుడు. గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ ఇతర భారతీయ నాయకులకు ఇదమిత ్థమైన సూర్తిని రగిలించిన జ్వాలాముఖి భగత్ సింగ్. సైద్ధాంతికంగా శషబిషలు పలికిన వారు కూడా సర్దార్ భగత్ సింగ్ త్రికరణ శుద్ధిని ప్రశంసించారు. భగత్ సింగ్ భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక అపురూప వ్యక్తి. అతడో వ్యక్తి కాదు, మహా ప్రస్థాన ప్రభంజన వ్యవస్థ..
1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ అప్పటికి 12 ఏళ్ళ వయసున్న భగత్ సింగ్‌ను తీవ్రంగా కలచివేసింది. జలియన్‌వాలా బాగ్ మారణహోమం జరిగిన మరునాడే స్కూల్‌కు బయలుదేరిన భగత్ సింగ్ కాల్పుల్లో అమరులైన ప్రజల రక్తంతో తడచిన పిడికెడు మట్టిని తీసుకుని రావి నదిలో నిమజ్జనం చేసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తానని శపథం చేశారు. 1926లో తన గురువు కర్తాల్ సింగ్ శరభాగారి 11వ వర్ధంతి ‘నౌ జవాన్ భారత సభ’ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జరిపించారు. ఆ సభలో బానిసత్వం ఎంత నికృష్టమైనదో, ఎంత కర్కశమైనదో వివరిస్తూ ‘జన్మించిన ప్రాణి మరణించడం తథ్యమని తెలిసిన భారతీయుల్లో ప్రతి ఒక్కరు దేశ, దాస్య విముక్తి కోసం ప్రాణాలను అర్పించాలని నిర్ణయం తీసుకోలేకపోవడం తనకు అర్థం కాని వింత అని’ ఆయన వాపోయారు. 1928లో సైమన్ కమిషన్ గో బ్యాక్ ఉద్యమం దేశమంతటా వెల్లువెత్తింది. సైమన్ కమిషన్ 1928 అక్టోబర్ 31న లాహోర్ వచ్చిన సమయంలో భగత్ సింగ్ బృందం కృషి వల్ల అన్ని ప్రజా సంఘాల వారు సంఘటితమై ఆ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాహోర్ పట్టణంలో పూర్తి హర్తాళ్ జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలపై పోలీసులు కర్కశంగా లాఠీ చార్జి చేశారు. లాఠీ దెబ్బల వలన లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి 18 రోజుల తర్వాత నవంబర్ 17న మరణించారు. ఈ సంఘటనకు ప్రతీకారంగా దానికి బాధ్యుడైన సాండర్స్‌ను హతమార్చడంలో భగత్‌సింగ్ కీలకపాత్ర పోషించారు. జాతియావత్తూ ఈ చర్యకు భగత్‌సింగ్‌ను వేనోళ్ళ కొనియాడింది.
ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో 1929 ఏప్రిల్ మొదటివారంలో ప్రజారక్షణ బిల్లు (నేటి డిటెన్షన్ ఎమర్జెన్సీ లాంటి అధికారాలిచ్చే బిల్లు, కార్మికులకు ప్రాథమిక హక్కులైనా లేకుండా చేసే బిల్లు) చర్చకు వచ్చింది. విఠల్‌భాయి పటేల్, మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, మదన్‌మోహన్ మాలవ్యా మొదలగు రాజకీయ నాయకులు ఈ బిల్లును ప్రతిఘటించి అసమ్మతిని వ్యక్తపరిచారు. అధికార పక్ష సభ్యుడు జార్జ్ మాస్టర్ 1929 ఏప్రిల్ 8వ తేదీన వైస్రాయ్‌గా తనకున్న ప్రత్యేక అధికారాలతో ఈ రెండు బిల్లులను ఆమోదిస్తూ అధికార ముద్ర వేశారు. సరిగ్గా అదే సమయంలో భగత్ సింగ్ ఎవరికీ గాయాలు తగలకుండా ఉండే విధంగా ఖాళీ ప్రదేశంలో బాంబు విసిరాడు. తర్వాత భటుకేశ్వర్ దత్తు విసిరిన బాంబు కూడా పేలింది. భగత్ సింగ్ పారిపోవడానికి అవకాశాలున్నా పారిపోకుండా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టులో కేసు నడిస్తే తాము చేస్తున్న విప్లవపోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం వస్తుందని ఆశించారు.
‘ఇండియన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ’ పేరుతో వేసిన కరపత్రంలో భారత ప్రజల తరపున అభివృద్ధి నిరోధక దమననీతిని పెంచే శాసనాలను నిరసించారు. లాలాలజపతిరాయ్ హత్యను ఆ కరపత్రంలో ఖండించారు. అదే విధంగా ఆ సంస్థ ప్రణాళికను ఆ కరపత్రంలో రేఖామాత్రంగా పరిచయం చేశారు. మనుషులందరినీ సోదరులుగా భావించి అందరి సుఖ సంతోషాలకు కృషి చేసే సమసమాజ స్థాపన కోసం మానసిక విప్లవం కలిగించడానికి అవసరమైతే ఆయుధాలను కూడా ప్రయోగించడానికి మేము వెనకాడము అని ఆయన కోర్టులో ఉద్ఘాటించారు. 1931 అక్టోబర్ 7వ తేదీన ప్రత్యేక కోర్టు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను మరణించే వరకు ఉరి తీయాలని తీర్పు చెప్పింది. విజయకుమార్ సిన్హా, శివవర్మ, కిషోర్‌లాల్ మొదలగు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ జైలులో ఉంచాలని తీర్పు చెప్పింది. మోతీలాల్ నెహ్రూ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టు కోవద్దు, పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం జారవిడుచుకోవద్దు అని విజ్ఞప్తి చేసినా ఆ ముగ్గురు వీరులు తిరస్కరించారు. ఉరితాళ్ళను ముద్దాడారు.
విప్లవవీరులైన తన ముద్దు బిడ్డలను కోల్పోయినందుకు యావద్దేశం ఎంతగానో పరితపించింది. ఈ సంఘటన విప్లవోద్యమానికి శరాఘాతమైంది. భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) అని నినదించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల ఆదర్శంగా ఇప్పటికీ విప్లవకారులు ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఆ ముగ్గురు అమరవీరులకు జోహార్లర్పిస్తూ…
– కాటంనేని ముత్తయ్య
పూర్వపు మధిర తాలూకా భూతనఖా బ్యాంకు అధ్యక్షుడు, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు
(నేడు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీసిన రోజు)

