సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -2 వివాహం –దాంపత్యం

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -2

      ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్

        వివాహం –దాంపత్యం

           5-శ్రీమతి వారణాసి సూర్య కుమారి (మచిలీ పట్నం )

సీ.చూడ చక్కని పెళ్లి చూచివద్దము రండి – ముడులు వేయ ముచ్చటండి

 వేల్పులు సహితము వేడుక చూడగా -వేంచేయును సుమండీ వేగ రండి

  వరుని కాశీ యాత్ర వరమౌను కనగనూ –కన్య దానము కడు రమ్య మండి

  సుముహూర్త సమయాన శోభిల్లు తెర సెల్ల –జీలకర్రయు బెల్ల మలదు రండి

  ముసి ముసి నగవుల మరియు నా  ఇరువురూ –కన్నుల పంటయే కాదు టండి

  ఆ వదూవరులపై అక్షతలను జల్లి –ఆ తలంబ్రాలను చూతమండి

  మంగళ కరమగు మంగళ సూత్రముల్ –కట్టు సంబరం కనగ రండి

  సప్త పదియును సత్సంప్రదాయము మెచ్చి –దీవించ వచ్చు నా దివ్యు లండి

  కొంగులు ముడి వేసి కొత్త దంపతులకు –కళ దెచ్చు నీ పాణి గ్రహణ మండి

   పరి పూర్ణత లభించు పరిణయమ్మటంచు –విజ్ఞులు నుడువగా విందు మండి  

 తే.గీ.కులము గోత్రములు వరని గుణము చూచి –కొమరిత కుశల మాశించి ,కోరి తెచ్చి

       పెండ్లి చేసిన యా తల్లి దండ్రి మనసు –తీర దీవించ వర్ధిల్లి తీరు నండి.

సీ.అంబుదంబు జలము ,అనిలమ్ము తావియై –శశియు రోహిణీ చందమలరి

   సూర్యుండురశ్మిగ శోభస్కరం బైన –సంద్రమ్ము నలలు  సతియు పతియు

  అన్యోన్య దాంపత్య మాదర్శ ప్రాయమై –మాట బాట లొకటై మనుటే ఘనము

 సద్భావ సాంప్రదాయ భరిత గృహమును –స్వర్గ సీమ యనుట సహజ మగును

తే.గీ.మనసులు కలిసి ప్రేమగా మసలు చుండ –అదియే ఆదర్శ దాంపత్య మనగ తగును

    సంతు గూడియును నెంతయు సంతసముగ-ఆయురారోగ్య సంపద నాలు మగలు

    ధరణి సుఖ జీవనము నొంది ధన్యులగును .

                   6- శ్రీమతి కందాళ జానకి (మచిలీ పట్నం )

పంచ భూతముల సాక్షి వివాహము –అతి పవిత్రము వివాహ సంప్రదాయము

ఏడు తరాల విజ్ఞత చూపు వివాహము –మూడు ముళ్ళ బంధము కలిగించే అనురాగం

నిలిచేను నిండు నూరేళ్ళ బంధముగా –భాగస్వామి తో బాంధవ్యం వెలుగొందును

తోడూ నీడయై జీవితం సాగును

జన్మ జన్మ ల బంధం దాంపత్యం –సుస్తిరమై వెలుగు దాంపత్యం

వంశ వృక్షం శాఖోప శాఖలుగా చేయు దాంపత్యం –దాంపత్యానికి లేదు వృద్ధాప్యం

ఆనంద మయమై నిత్య నూతనముగను-విలసిల్ల వలెను అనురాగ శోభ తో దాంపత్యం

జయ జయ నినాదాలతో సాగాలి జగమంతా .

         7-శ్రీమతి కొమర్రాజు కనక దుర్గా మహాలక్ష్మి (మచిలీ పట్నం )

వేద మంత్రాల నడుమను విధియే కూర్చె –నవని కళ్యాణ మనుచు

నిదియే పవిత్రమై యుగముల నిల్చి సాగే –భారత జాతికి దొరికిన భాగ్యమనగ.

   శుభ ముహూర్తము నిరువురు చూచు కొనగ –తాళి బంధాన సతిగాను తాను మారే

   సప్త పది సాక్షి పాటి తొడ సాగు గాదె –పుడమి జన్మ ల బంధమీ పురుషుడనుచు  .

అయిదు రోజుల పెళ్ళియె ఆగిపోయే –అయిదు గంటల పెండ్లిగా అలర సాగే

ధర్మ నిరతియే తొలగేనే ధనమదమున –విలువ తరగి పోయే వివాహ వేడ్క కిపుడు .

ధరణి దంపతులగుట ఏ ధార్మికతను –నిండు నూరేళ్ళ నవ్యత నిండ వలయు

ఆది దంపతులను రీతి అవని నిలువ –ధర్మ మోక్షాల కిది యేను తావు గాగ .

కష్ట సుఖముల కడలి లో కరగి పోవ –వంశ వ్రుద్దియే దాంపత్య భావ మనుచు

ఏబది వసంతములు నిల్చి ఈదినారు –పుత్ర పౌత్రాదుల సుఖము పొందినారు .

ఏడడుగుల నేవ్వరికిపుడేరుక లేదు –పాలు నీరుగా పతి సతులుండ వలయు

ఉప్పు నిప్పైన సంసార ఓడ మునుగు –నేటి యువత దీని నెరిగి మెలుగ వలయు .

            8-ఆతను ప్లస్ ఆమె –శ్రీమతి గుంటూరు మేరీ కృపా బాయి (మచిలీ పట్నం )

అతని చిరునవ్వే సెల ఏటి గలగలలా –ఆమె చిరు దరహాసం పున్నమి వెన్నెలలా

వెలుగొందే వేళ ఆ అనురాగ బంధం మాంగల్య బంధం –అదే పెళ్లి నాటి మూడు ముళ్ళ బంధనానికి దర్పణం

అతని మాటల సవ్వడిలో పరవశిస్తూ ఆమె –ఆమె పలుకుల మధురిమలు ఆతను

ఆస్వాదించే వేళఅవి మాటల మంత్రాలు –పెళ్లి మంత్రాలకు ప్రతి బింబాలు

అవగాహన ఆరాధన అనుబంధం మూడు సూత్రాలు –ఆమె మనసుకు నచ్చిన తత్వాలు

మంగళ సూత్రాలను తలపించే నేస్తాలు –

సంసారమందే సరిగమలు అంటూ అతను –బాంధవ్య మందే పదనిసలు అంటూ ఆమె

మురిసి పోయే వేళ అదే వివాహ బంధం –వివాహ బంధాన్ని రంగ రిస్తే జనించేను దాంపత్యం

ఉగాదికీ  దాంపత్యానికీ  ఉంది సంబంధం –తీపి చెడుల కలయికే ఉగాది

తీపి చెడుల సంగమమే దాంపత్యం –అతను ప్లస్ ఆమె ప్లస్ అనురాగం దాంపత్యం .

                  9-శ్రీమతి పద్మావతి శర్మ –(విజయ వాడ )

పెళ్లి చూపులు కట్న కానుకలు –శుభ లేఖల అందాలు పట్టు చీరెల రెప రెపలు కావు వివాహం అంటే

మంగళ  వాయిద్యాలు ,ఏడడుగులు ,సూత్ర ధారణా ,తలంబ్రాలు కావు వివాహమంటే

అల్లుడి గారి అలకలు ,మామ గారి బుజ్జగింపులు –మరదళ్ల సరసాలు ఘుమ ఘుమ వంటకాలు కావు వివాహమంటే

అగ్ని ప్రదక్షిణాలు ,అరుంధతి వీక్షణాలు ,అప్పగింతలు ఊరేగింపులు కావు వివాహమంటే

రెండు జీవితాలు రెండు కుటుంబాలు –కలసి నేసె వస్త్రమే వివాహం

అటు యిటూ ఏడు తరాలు తరింప జేసేదే వివాహం

ఆర్దికావసరాలు  భౌతిక సుఖం తీర్చటం కాదు దాంపత్యం

సమాజం ,పిల్లల కోసం అయిన వారికీ కాని వారికీ కాదు దాంపత్యం

వారి కోసం వారిద్దరికోసం మాత్రమె –అతడి కోసం ఆమె ఆమె కోసం అతను

బ్రతికేదే దాంపత్యం ఆమె పెదవి సైగాకే ఆటను స్పందిస్తే

అతని గుండె చప్పుడే ఆమె నవ్వుల జలపాతమైతే –అదే దాంపత్యం

ఆమెకూ అతనికి’’ కాళ్లు’’ పెరిగినపుడు –వారు ఇంకా వారి కోసమే బతికి

ఒక్కసారే నవ్వుతూ రాలి పోతే –అదే దంపతుల జీవితానికి ముక్తి మోక్షం .

               10-శ్రీ మైనే పల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )

 ఏ యుగానికైనా మనిషి ధర్మ మోకటేరా –బాల్య మందు భవిత బల ముండునురా

చదువు నేర్పిన విద్య చల్ల కుండరా –తెలుగుతల్లి చేతిలోని కలశ భాగ్యమదేరా

యవ్వనానికి ఎల్లలు లేవురా జీవితానికి జడ ఉందిరా

జడ లోని ఆంతర్యం అల్లి బిల్లిల ఆనంద మేరా

ప్రక్రుతి రహస్యం చెట్టు నుండి తెలుసుకో –ఆవును చూసి ఆహార్యం తెలుసుకో

గిట్టను చూసి బలమెంతో తెలుసుకో  -వెన్ను మణి పూస లన్నీ వరుస తప్ప రాదురా

ముద్దుగా మూడు మణుల వద్ద మూడు ముళ్ళు వేయగా

దశమి నాటి జాబిలీ నుండి పంచమి వరకు ప్రళయమేనురా

కరడు కట్టిన కామ కేళి కళా పోషణ కాదురా

యవ్వనమే యువతికి ఆభరణం –పదిల పరచుట ఆమె వంతు

దొంగిలించే దరహాసం మానరా

కూరిమి తోనే కుడి ఎడమలు కొలువు తీరు

మనుధర్మం ,ముని ధర్మం నీలోనే ఉందిరా

యుగానికో ధర్మం పరమ రహస్యం గా ఉండును రా

ఆది దంపతులకు ఆకాశమే ఇల్లూ లోకమే వాకిలి

కళా ఖండాల సృష్టి కర్తవు నీవే కదరా

నిన్ను సృష్టించింది అబలే కదరా –ఆమె కుటుం బయ్య   ధర్మ పత్ని అని మరవకు రా .

            11-శ్రీ చిత్తజల్లు భవానీ శంకర రావు (ఉయ్యూరు )

విజయుడు జయుడై రావటానికి ఒక రోజు ముందే –అర్ధ శతాబ్ది వివాహ మహోత్సవానికి

కవి మిత్రులు సాహితీ వేత్తలు విజ్ఞులు యేతెంచి ఉయ్యూరులో సందడి చేస్తున్నారు

కన్యాశుల్కం పోయి కట్న కానుకలోచ్చి జరుగుతున్నాయి నేడువివాహాలు

భార్యా భర్తల మధ్య సయోధ్య లేదు ఉన్నదంతా అయోధ్య మాత్రమె

ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అప్పుడే వికశిస్తుంది దాంపత్య పుష్పం

మనసులెరిగి పెద్దలు చేయిస్తే వివాహం –అవుతుంది ముదావహం .

యువత నేర్వాలి ఎన్నో సుద్దులు లేకుంటే జీవితం అవుతుంది పిడిగుద్దులు.

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.