సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం-3
ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్
వివాహం –దాంపత్యం
12-దాంపత్యమా జయీ భవ –శ్రీమతి ఎస్.ఉషా రాణి (పెద ఓగిరాల )
అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు –ఇప్పుడు కాదు ఎప్పుడో చారిత్రిక విభావ సంధ్యలోనే
సృష్టి స్తితి ప్రళయ కేళి మొదలైనప్పుడే –కావ్యేతి హాసాల ఆరంభ సంరంభం లోనే –వాళ్ళిద్దరూ ఒకటైనారు
ఆర్ష మో ప్రాజాపత్యమో ,గాన్ధ్వర్వమో స్వయం వరమో –ఏదైతేనేం అరుంధతి సాక్షిగా ఒకటయ్యారు
సునామీలు సైమానులు బాధించినా ప్రయాణం ఆగలేదు –ఉగాదులు ఉషస్సులు ఊసర క్షేత్రాలూ
నిర్జల తీరాలు నిబిడాం ధకారాలు వాళ్ళ గమనాన్ని ఆపలేక పోయాయి –
స్వప్నించిన కలల రత్న మంజూషను బుజాల కెత్తుకొని నడుస్తూనే ఉన్నారు
యుగాలు గడిచి తప్పిదాలు జరిగి దాంపత్యం నడి వీధి పరిహాసమైనా
పరాభవానల జ్వలిత త్రేతాగ్నులనీ –కాల నాలిక పై గ్రంధస్తం కాని కధలనీ కన్నీళ్ళనీ
కల్లోలాలు ప్రణయ కలహాలూ కబళించినా –ఒకరికొకరు తోడూ నీడై శోభిస్తూనే ఉన్నారు
దాంపత్య రహస్యోపనిషత్తు లోని బీజక్షరాలై నడుస్తూనే ఉన్నారు
ఒకటి మాత్రం నిజం –ఏ నాగరకతా మహీ రుహమైనా
దాంపత్య క్షేత్రం లో కుటుంబ కదళీ వనాలలో పరిఢవిల్లి నప్పుడే
పది కాలాల పాటు నిలుస్తుంది –దాంప త్యమా జయీ భవ విజయీ భవ .
13-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ (విజయ వాడ )
వివాహం విడదీయరాని బంధం –దైవ నిర్ణయం తో ముడి పడిన అద్వితీయఅనురాగ బంధం
వ్యక్తీ గత రక్షణకు చట్ట బద్ధ బంధం –జీలకర్రా బెల్లం తో అయస్కాంత శక్తిలా అంటి పెట్టుకొని ఉంటుంది
అద్వైత భావానికి అంకురమవుతుంది –ప్రేమ నమ్మకం అనే నీరు పోసిపెంచి పోషించాలి
నవ నాగరకతా వ్యామోహం లో విడాకులు తమల పాకుల్లా చేతులు మారిపోతున్నాయ్
వివాహం కంటే సహజీవనమే ముద్దు అను కొనే యువత వ్యామోహం లో పడి వ్రేళ్ళనే కూల్చుకొంటున్నారు
వ్యక్తికీ సమాజానికీ హితం కోరే వైవాహిక వ్యవస్థకు నియమాలోచ్చాయి
దాంపత్య జీవితం సుఖ శాంతులతో కూడి దండిగా పండి దశ దిశలా వర్ధిల్లాలి .
14-శ్రీమతి సింహాద్రి వాణి(విజయవాడ )
పదవులెన్ని యున్న ,పరివారమున్నను –చదువు లెన్ని యున్న సంపదున్న
పరిణ యంబు లేక పరి పూర్నతయే రాదు మానవాళి కెపుడు మహిని చూడ .
వేదమంత్రములు వేల దీవెనలతో –అగ్ని సాక్షితోడు అక్షతలును
ముడులు మూడు చేరి అడుగులేడు నడిచి-ఇంటి వారలగుదు రొంటి వారు.
కష్ట సుఖము లందు కలిమి లేముల యందు –ఒకరికొకరు చాల ఓర్పు తోడ
కలిసి మెలిసి బ్రతుక కడ దాక తోడుగా –పరిణయంము వేయు బంధనమ్ము .
ధర్మ మార్గ మందు దాంపత్య పయనమ్ము –సాగ వలయు నిలను చక్క గాను
మాట కలుపు కున్న మమతాను రాగాలు –పొంగి పొరలు నెపుడు నింగి కెగయ .
జనుల కెల్ల నిల్లు జగతి లో తొలి బడి –ఆదిగురువులచట అమ్మ నాన్న
చిన్న తనము నుండే మిన్నగా సుగుణాలు –నేర్ప వలయు వారు నేర్పు తొడ .
సద్గుణాల బాట సంతానమును పెంచ –మానవతతో వారి మనసు నిండి
శాంతి కరుణ ప్రేమ సాగరమ్మైసాగు –తల్లి దండ్రి జన్మ ధన్య మవగ.
15-శ్రీమతి పెళ్ళూరి శేషుకుమారి (నేప్పల్లె )
వివాహం కుటుంబ వ్యవస్థకు పునాది –ఆలు మగల అనురాగానికి ఆలంబన దాంపత్యం
ఒకరికొకరు పాలు నీరు లా-ముందు తరాలకు బాసట గా
ముద్దు మురిపాల కలబోత కాపురం లో ఆసరా బలహీన క్షణాలలో ఏంతో అవసరం
కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమైతే –నైతిక విలువలు దిగజారి
పరిమితి తనం తెలీని సంపాదనల సమకాలీనం లో
సదవ గాహన లోపించి –ఆవేశ కావేషాలతో
ఆత్మీయతాను బంధాలను కాల రాచుకొంటూ –కులాసాల పలకరింపులు లేని నైజాలు
వివాహం పవిత్రం –దాంపత్యం అను బంధ సుమ హారం అని గ్రహిస్తే జీవితం ప్రగతి పధం లో నడుస్తుంది .
16- శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు (విజయ వాడ)
గృహస్థాశ్రమమ
ఆశ్రమంబుల కెల్లా నత్యుత్తమంబైన –ఆశ్రమంబది గృహస్తాశ్రమంబు
ఇహలోక పరలోక ఈయ లీడేరంగ-ననువైన ధర్మాల కాశ్రయంబు
ధర్మార్ధ కామాల కర్మ సూక్ష్మము నెంచు –సన్మార్గ గాముల స్వర్గ సీమ
రాజ యోగము కన్న రమ్య యోగము లేదు –సర్వార్ధ సాధక సత్య పధము
విమల గార్హస్త్య జీవన వైభవంబు –తలప నత్యంత సమ్మోద ధర్మ పదము
వినుతవైదిక యుద్వాహ విమల క్రతువు –సౌఖ్య శిఖరాదిరోహణ యోగ్య దాయి .
వివాహం
సాప్త పదీనమౌ సఖ్యంబే సత్యమ్ము –చట్ట పట్టలు వట్టి నట్టే నడువ
కొంగు ముడి రాగంపు క్రొమ్ముడి –కేలు కేలును పట్టు టేలు కొరకే
ముత్యాల తలబ్రాలు మురిపాల సాబాలు –వేడ్క పంచు కొనంగ విన్నపాలు
తలుపు దగ్గర పేరు పలుమారు పలికించు –తల పోత తను వంత పులకరింత
బొమ్మ లాటల పేర కొమ్మ లాటలు చూడ బిడియాల బిగువులు సడలు కొరకే
ముంజేత రవళించు మురిపెంపు గాజుల-గల గలల తో మహాలక్ష్మి కనికరాలు .
అంగు ళీయకము వెదకేడి హస్త –చాలనములు భావింప నన్యోన్య కాము దీప
నములు శత శరత్తు లిలను పరము సరణి –ననఘమై సాగ వలెనని ఆర్ష కాంక్ష .
దాంపత్యం
ఆమె మనసున యూహ లతని తలపుల రేగ –ననురూప భావాలు హాయి గొల్పు
ఆమె యూపిరులూద నతని హృదయమ్మూగ-కస్టాల సౌఖ్యాల కలసి మునుగ
పలుక చిలకల కల్కకులుకు నంచల కుల్క –పతి దేవు ననురాగ మతివ గెల్వ
అర్ధాంగి ముచ్చట లనురామున తీర్చి –కను రెప్ప తీరుగా కాచు నతడు
పాణి పట్టిన నాటి పెంపైన యానంద –యేళ్ళు గడచిన గాని యిగుర రాదు
అర లేని దాంపత్య నానందముల కొల్వు -కొరలేని సంపదల కూర్చి పెట్టి
పండిన దాంపత్య ఫలములౌ తనయులు –వంశోన్నతిని పెంచ నుత్సవంబే
ప్రణయ సీమల రాహస్యపార మెరిగి –ఆత్మ బంధంపు పరమార్ధ తత్వ మరసి
కలత లెరుగని సంసార కడలి దాటి –ధన్యు లగుదురు సద్ధర్మ దంపతులును .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-4-14-ఉయ్యూరు

