శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు
వాల్మీకి రామాయణం లో మహర్షి వాల్మీకి శ్రీరామునికి హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .అరణ్య వాసం లో సీతా రామ లక్ష్మణులు పంచవటి లో ప్రశాంతం గా ఉంటున్నారు . శరదృతువు వెళ్లి హేమంతం ప్రవేశించింది .ఒక రోజు సీతా సమేతం గా రామ లక్ష్మణులు గోదావరీ నదీ స్నానం చేసేందుకు బయలు దేరారు .దారిలో లక్ష్మణ స్వామి హేమంత ఋతువు ను గురించి చెబుతూ జల కలశాన్ని చేతి లో ధరించి నడుస్తూ ఉంటాడు .
ఈ సందర్భం లో వాల్మీకి మహర్షి హేమంత శోభను అద్వితీయం గా వర్ణిస్తాడు .హేమంతం సంవత్సారానికి మంచి అలంకారం చేస్తుంది .ఎండ, వాన, చలి ఒక దాని తర్వాత ఒకటి వచ్చి తమ ప్రతాపాన్ని ప్రదర్శించి వెళ్లి పోతాయి .అప్పుడు హేమంతం ప్రవేశిస్తుంది .అన్న శ్రీ రాముని మాటల్లో యెంత ఆప్యాయం ఉందొ అంతటి ఆత్మీయత హేమంతం లో ఉంది అంటాడు అన్న హృదయం తెలిసిన రామానుజుడైన లక్ష్మణుడు .మంచు వలన ప్రక్రుతి అంతా శుష్కం గా ఉన్నట్లు తోస్తోంది .పంట చేలు మాత్రం ఎటు చూసినా కంటికి ఇంపుగా కనుల పండువుగా కని పిస్తున్నాయి .జిల్లు మనే నీళ్ళు తాగాలంటే ఒళ్ళు ఝల్లు మంటోంది.మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా హాయిగా ఉంటుంది .హేమంతం దేవతలను ఆరాధించటానికి అనువైన కాలం .అగ్ని హోత్రం దగ్గర కూర్చుని అనుష్టానం చేసుకోనేంత వరకు నిర్మలం గా నే ఉంటుంది .పల్లెల్లో ఆహార పదార్ధాలు పుష్కలం గా ఉంటాయి .క్షత్రియులు విజయ యాత్రకు బయాల్దేరే మంచి తరుణం హేమంతం .సూర్యుడు దక్షిణ దిశ వైపు ఉండటం వలన ఉత్తర దిక్కు బొట్టు లేని సువాసిని గా బోసిగా కన్పిస్తుంది .అసలే మంచు కొండ అయిన హిమ వంతుడు మరింత హిమ మయమై పేరు సార్ధకం చేసుకొంటాడు .
మధ్యాహ్న సమయం లో ఇంపైన ఎండకు సరదాగా అలా అలా తిరగాలని పిస్తుంది .రవి కిరణాలు పరమ మనోహరం గా ఉంటాయి .నీడకూ, నీటికీ మనసు దూరం అవుతుంది .సూర్యుని మెత్తదనం, చలిగాలి చెలగాటం తో పగలంతా శూన్యం గా ఉంటుంది .పగటి కంటే రాత్రి మరీ నిర్జనం గా ఉంటుంది .ఆరు బయట పడకలు అరుదై పోతాయి .పుష్య నక్షత్ర ప్రభావం వల్ల మంచు, చలి రోజు రోజుకూ పెరిగి పోతుంది .దానితో మూడో జాము రాత్రి ఎన్ని జాములకూ ముగియనట్లు అని పిస్తుంది .చలికి అన్నీ సంకోచిస్తాయి .కాని కాలం మాత్రం వ్యాకోచించి నట్లని పిస్తుంది .ఆవిరితో కప్పేసిన అద్దం లాకనిపించే చంద్రుడి లోని అంద చందాలన్నీ సూర్య బింబం లో ప్రవేశించాయా అన్నట్లు అనిపిస్తుంది .
యెర్రని సూర్య బింబం పొగ మంచు వ్యాపించటం వలన పున్నమి వెన్నెల కూడా సంపూర్ణం గా కని పించదు .ఎండకు వాడిన స్త్రీ ముఖం లా .పున్నమి వెన్నెల మంచుతో మలినమవుతుంది .పడమటి గాలికి చలి ఎక్కువౌతుంది .కనుక చలికాలం లో మరింత చలి వేస్తుంది .దూరం నుంచి చూస్తె సూర్యుడు కూడా చంద్రుడిలా చల్లగా అని పిస్తాడు .ఉదయం మందం గా ,మధ్యాహ్నం మధురం గా ,సాయంత్రం కంది పోయి కొంచెం పాలి పోయినట్లు సూర్య భగవానుడు కని పిస్తాడు .ఉదయం పచ్చికపై విస్తరిల్లిన హిమ బిందువులు చూడ ముచ్చట గా ఉంటాయి .ఏనుగులు చల్లని నీటిని చూసి ఉల్లాసం గా దగ్గరకు వెడతాయే కాని నీటి స్పర్శ సోకగానే వాటి తొండాలు ముడుచుకు పోతాయి .పక్షులు కూడా నీటి పై వాలుతాయే కాని యుద్ధ భూమిని చూసి జంకే పిరికి యోధుల లాగా నీళ్ళు తాగ టానికి భయ పడతాయి .చీకట్లో మంచు పొరల వెనక దాగిన చెట్లు నిద్ర పోతున్నట్లు స్తబ్దు గా ఉంటాయి. సరోవరాలు మంచుమయం అవటం వలన అక్కడ విహరించే కొంగల చప్పుడు వలననే అవి అక్కడున్నట్లు తెలుస్తుంది .కొండమీద ప్రవహించే నీరు కూడా రస వంతంగా ఉంటుంది .దీనికి కారణం తుషారం ,రవి కిరణాలలో మృదుత్వం .కొలను లోని కమలాలు కూడా మంచు వలన మలినం గా అని పిస్తాయి .
ఈ విధం గా హేమంత ఋతువు ను వర్ణించు కొంటూ ఆ ముగ్గురూ గోదావరి తీరం చేరుకొంటారు .తమ సోదరుడు భరతుడు కూడా ఈ సమయం లో తమ లాగే సరయూ నదిలో స్నానం చేయటానికి వెడుతూ ఉంటాడని లక్ష్మణ స్వామికి మనసులో ఒక ఊహ పుడుతుంది .రాజ భోగాలను ఇచ్చాపూర్వాకం గా త్యజించి తమ లాగే తపోవన జీవితాన్ని గడుపుతున్న భరతుడు ధన్య జీవి అనుకొన్నాడు లక్ష్మణుడు .అంత సుమనస్కతకు అలాంటి కర్కోటక కైక ఎలా తల్లి అయిందో నని ఆశ్చర్య పోతాడు .ఈ మాటలకు రాముడు అడ్డు పడి ,పిన తల్లి ని అనవసరం గా తూల నాడ వద్దని హెచ్చరిస్తాడు .
భరతుడి సంగతిని మరికొంచెం చెప్పమని తమ్ముడిని కోరుతాడు రామ భద్రుడు .సుకుమారుడు సుమనస్కుడు ,శ్రీమంతుడు ,ధర్మజ్ఞుడు సత్య వాది ,జితేంద్రియుడు ,వినయ సంపన్నుడు ప్రియ భాషి అంటూ భరతుడి త్యాగాన్ని వెయ్యి విధాల వర్ణిస్తాడు ఆదిశేషా వతారమైన లక్ష్మణ స్వామి .ఇంత విన్నా శ్రీరాముడికి తనివి తీరదు .వనవాస దీక్షలో తాను యెంత పట్టుదల తో ఉన్నా భరతుడు గుర్తుకు వస్తే అయోధ్యకు వెళ్లాలని పిస్తోంది అంటాడు భ్రాత్రు వత్సలుడైన శ్రీరమ చంద్రుడు .అదీ ఆయన మనస్సౌన్దర్యం .భరతుని గురించి విన్నప్పుడల్లా తన మనస్సు పసి పిల్ల వాడి మనస్సు లాగా అవుతుందన్నారు రాముడు .సోదరుడైన భరతుని మృదుమధుర వాక్కులు ,హృద్యమైన ఆలోచనలు ,అమ్రుతోపమాన మైన మాటలు ,మనసును ఆకట్టుకొనే భావనలు మాటి మాటికీ గుర్తుకు తెచ్చుకొని కంట తడి తో పరవశిస్తాడు కౌసల్యా నందనుడు .తాము నలుగురు అన్నదమ్ములు మళ్ళీ అయోధ్యలో ఒక్క చోట ఎప్పుడు కలుసు కొనే అవకాశం వస్తుందో అని ఆ సదయ హృదయుడుశ్రీ రామ చంద్ర మూర్తి ఆవేదన చెందుతాడు .
8-4-14 మంగళ వారం శ్రీరామ నవమి సందర్భం గా శుభా కాంక్షలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-14-ఉయ్యూరు


ప్రసాదు గారు వాల్మీకి మనోవల్మీకమంలో వెచ్చగా దాగున్న భావసరీనృపాలను మాముందు హేమరుచులతో నిలిపారు. వాటి భోగసౌందర్యం మమ్మల్ని ఆనందలోకాలకు తీసుకెళ్ళింది
కృతజ్ఞతలు
LikeLike